తిరుపతి, అక్టోబర్ 02 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో అక్టోబర్ 3వ తేదీ శనివారం ఉదయం 7:30 గంటలకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘పిండి దీప మహోత్సవానికి’ పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) శ్రీ ప్రభల గోపీనాథ్ అధికారులను ఆదేశించారు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్ట్ మరియు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) సంయుక్త ఆధ్వర్యంలో ఈ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.
ఈ సందర్భంగా టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న పరేడ్ మైదానం నుండి అలిపిరి పాదాల మండపం వరకు శ్రీనివాస గోవింద నామస్మరణతో భారీ పాదయాత్ర కొనసాగనుంది. పిండి దీపంలో నెయ్యితో జ్యోతిని వెలిగించి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఈ కార్యక్రమం యొక్క విశిష్టత అని, అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో పాల్గొనే భక్తులకు మార్గమధ్యంలో తాగునీరు, మజ్జిగ పంపిణీతో పాటు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సనాతన ధర్మ వైభవాన్ని చాటిచెప్పే ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జేఈవో పిలుపునిచ్చారు.
చిత్తూరు
గోవింద నామస్మరణతో ఘనంగా ‘పిండి దీప మహోత్సవం’ (పరేడ్ మైదానం నుంచి అలిపిరి పాదాల మండపం వరకు పాదయాత్ర)