లేఖ్య ప్రతిభకు జేజేలు.. ఆనందపురం కేజీబీవీలో సంబరాలు
ఆనందపురం, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి) ::
లోడగనివానిపాలెం పంచాయతీ పరిధిలోని నేల్తేరు గ్రామంలో ఉన్న **ఆనందపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)**కు చెందిన 10వ తరగతి విద్యార్థిని బెల్లాన లేఖ్య జాతీయ స్థాయి సైన్స్ సెమినార్కు ఎంపికై పాఠశాలకు, ఆనందపురానికి, విశాఖ జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ అపూర్వ విజయాన్ని పురస్కరించుకుని శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో లేఖ్యకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
“INDIAN ENERGY BASKET–2047” అంశంపై నిర్వహించిన జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ పోటీలలో లేఖ్య తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ప్రథమ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ విజయంతో జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించి తన ప్రతిభకు మరో మైలురాయిని చేర్చుకుంది.
లేఖ్య సాధించిన ఘనతను అభినందిస్తూ విద్యాశాఖ అధికారులు, ప్రముఖులు ఆమెను, తల్లిదండ్రులను, మార్గనిర్దేశకురాలైన సైన్స్ టీచర్ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ జె. చంద్రశేఖర్, జీసీడీఓ జి. శ్రీదేవి, ఎస్ఎంసి చైర్మన్ కొప్పల పావని , నామినేటెడ్ సభ్యులు అక్కిరెడ్డి దేవుడు బాబు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొని లేఖ్య ప్రతిభను అభినందించారు. జాతీయ స్థాయిలోనూ ప్రథమ స్థానాన్ని సాధించి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
విద్యార్థిని విజయానికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడైంది. పాఠశాల ప్రిన్సిపాల్ దొండా చంద్రకళ, సైన్స్ టీచర్ పి.టి.ఎస్. ప్రసాది లేఖ్యను అభినందిస్తూ, ఆమె విజయం ఇతర విద్యార్థినులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
లేఖ్యకు విద్యాదాత సుభాష్ చంద్రబోస్ ప్రోత్సాహం
లేఖ్య సాధించిన అసాధారణ విజయాన్ని ప్రముఖ విద్యాదాత,కేజీబీవీ దత్తత ప్రదాత ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు మరింత ఉత్సాహంతో సిద్ధం కావాలని ప్రోత్సహిస్తూ రూ.5,016 నగదు బహుమతిని అందజేశారు.
“ఒక చిన్నారి కలకు ప్రోత్సాహం లభిస్తే… ఆ కలే రేపటి విజయానికి బాట వేస్తుంది” అన్నట్లుగా లేఖ్యకు అందుతున్న అభినందనలు, ప్రోత్సాహం ఆమె భవిష్యత్ విజయాలకు బలమైన పునాదిగా నిలుస్తున్నాయి.
తమ కుమార్తె సాధించిన ఘన విజయంతో పాటు అధికారులు, ప్రముఖులు అందించిన సన్మానం పట్ల లేఖ్య తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు..







