కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 3(పున్నమి న్యూస్):
అధికారుల నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్టర్ల అలసత్వం వెరసి ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. కాకినాడ మండలం తూరంగి గ్రామ పరిధిలోని గోపికృష్ణ కాలనీ నుండి బొడ్డు చెరువు వరకు వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. ఇటీవల ఈ మార్గంలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులు మొన్న కురిసిన వర్షాల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే పనుల కోసం తెచ్చిన ఇసుక, కంకర కుప్పలను రోడ్డుపైనే అడ్డదిడ్డంగా వదిలేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.
రోడ్డుపైనే కంకర రాళ్లు, ఇసుక పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడి తీవ్ర గాయాలపాలవుతున్నారు. నిత్యం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం పంచాయతీ కార్యాలయానికి వెళ్లే స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం నీటితో బురద, కంకర కలిసిపోయి నడవడానికి కూడా వీల్లేకుండా తయారైందని స్థానికులు వాపోతున్నారు.
పనులు ఆగిపోయినప్పుడు కనీసం రాకపోకలకు ఆటంకం కలగకుండా సామగ్రిని పక్కకు తొలగించాలనే ఆలోచించే జ్ఞానంకూడా అధికారులకు లేకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, రహదారిపై పేరుకుపోయిన ఇసుక, కంకరను వెంటనే తొలగించి, ప్రమాదాలు జరగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు, కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
*అధికారుల నిర్లక్ష్యం.. రహదారిపైనే కంకర, ఇసుక కుప్పలు!* *తూరంగి గోపికృష్ణ కాలనీ మార్గంలో నిలిచిన డ్రైనేజీ పనులు* *నిత్యం జారిపడుతున్న వాహనదారులు, బాటసారులు*