Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పై వైఎస్సార్సీపీ కుట్ర: పెంకే శ్రీనివాస్ బాబా కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 3 (పున్నమి న్యూస్):
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి కుదిస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ వెనుక ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కుట్ర ఉందని కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు.
​బీసీలకు రాజకీయ జన్మనిచ్చింది టీడీపీయే..
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పార్టీ స్థాపించిన నాటి నుంచి రాజకీయంగా ఎలాంటి గుర్తింపు లేని బీసీలకు పెద్దపీట వేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా అవకాశాలు కల్పించారని శ్రీనివాస్ బాబా గుర్తుచేశారు. 1987లో స్థానిక సంస్థల్లో బీసీలకు ఎన్టీఆర్ తొలిసారిగా 20శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, ఆ తర్వాత 1995లో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఆ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచి అమలు చేశారని వివరించారు.
​కోర్టు కేసులతో అడ్డుకున్న వైఎస్సార్సీపీ..
1992లో సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని తీర్పు ఇచ్చినప్పటికీ, అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను అడ్డుకోలేదని ఆయన తెలిపారు. కానీ 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఉద్దేశపూర్వకంగానే తమ అనుకూల వ్యక్తులతో కోర్టులో కేసులు వేయించి బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని ఆరోపించారు. గత ప్రభుత్వం వలంటీర్ల ద్వారా సీక్రెట్‌గా కులాల సర్వే చేయించి, ఆ డేటాను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందే తప్ప కోర్టులో బీసీల పక్షాన నిలబడలేదని విమర్శించారు. అలాగే, ‘ఆదరణ 2’ పథకం కింద బీసీలకు పనిముట్లు పంపిణీ చేయకుండా వందల కోట్లు వృథా చేశారని, గోదాముల్లో ఆ వస్తువులన్నీ తుప్పు పట్టిపోయాయని మండిపడ్డారు.
​త్వరలో 90% సబ్సిడీతో ‘ఆదరణ 3’..
ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీసీల హక్కుల సాధన కోసం రాజీవ్ మిశ్రా నేతృత్వంలో ఒక కమిటీని వేసిందని తెలిపారు. ఫ్యామిలీ సర్వే ద్వారా రాష్ట్రంలో బీసీల జనాభా 50.42% ఉందని తేల్చి ఆ వివరాలను కోర్టులకు సమర్పించిందని వెల్లడించారు. రాబోయే రెండు మూడు నెలల్లోనే బీసీల కోసం 90% సబ్సిడీతో ‘ఆదరణ 3’ పథకాన్ని భారీ బడ్జెట్‌‌తో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు.
​బీసీలను మోసం చేసిన గత ప్రభుత్వం: వనపర్తి బద్రి
ఈ సమావేశం రాష్ట్ర పెరిక కార్పొరేషన్ అధ్యక్షుడు వనపర్తి బద్రి మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుందని, కోర్టు కేసుల పేరుతో వారి హక్కులను కాలరాసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
​ఈ విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ గుత్తుల బుల్లిరాజు, కరప మండలం టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి సంఘాని బాల మహేశ్వరరావు, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ అధ్యక్షుడు వనపర్తి బద్రి, మాజీ సర్పంచ్ గెదెల సత్తిబాబు, కాకినాడ రూరల్ మండల ట్రేడ్ యూనిట్ అధ్యక్షులు కొప్పిశెట్టి నాగబాబు, కాకినాడ రూరల్ బీసీ సెల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన ప్రకాష్, టీడీపీ సీనియర్ నాయకులు గొమ్మిడి తాతారావు,గొంతు గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *