మహిళలు, యువతులు తమలోని ప్రతిభను గుర్తించి వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. భైంసా పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వృత్తి నైపుణ్య శిక్షణను పూర్తి చేసుకున్న యువతులకు సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వృత్తి నైపుణ్యాలు యువతకు మంచి భవిష్యత్తును అందించగలవని పేర్కొన్నారు. ఒక రంగంలో పూర్తి స్థాయిలో నైపుణ్యం సాధిస్తే ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి ప్రారంభించే అవకాశం ఉంటుందని తెలిపారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి అండగా నిలవడంతో పాటు సమాజంలో స్వతంత్రంగా తమ స్థానాన్ని ఏర్పరుచుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే అర్హులైన మహిళలకు ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన వారికి కుట్టు మిషన్లు అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
యువతులకు ఉపాధి దిశగా అవసరమైన శిక్షణ అందిస్తున్న శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. శిక్షణలో పొందిన నైపుణ్యాలను కేవలం సర్టిఫికెట్కే పరిమితం చేయకుండా వాటిని ఉపాధి మార్గంగా మలుచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, ఎస్ఆర్టీ, ఆర్ఐ చైర్మన్ కిషోర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్
నైపుణ్య శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు