Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #Manthani #Peddapalli

పెద్దపల్లి

మంథని మండలంలో పలు పాఠశాలలు, రహదారి పనులను పరిశీలించిన కలెక్టర్

మంథని, సెప్టెంబర్ 09: పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంథని మండలంలోని ఖాన్‌సాయిపేట ఎంపీపీఎస్ పాఠశాల, భట్టుపల్లి ఎంపీపీఎస్ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, వెంకటాపూర్ ఎంపీపీఎస్ పాఠశాల, మల్లారం ఎంపీపీఎస్ పాఠశాల, ఆరెంద జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, స్వర్ణపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలను బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, విద్యాబోధన, విద్యార్థుల హాజరు, అభ్యసన స్థాయిపై సంబంధిత అధికారులను, ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంథని మండలం వెంకటాపూర్ నుంచి ఆరెంద వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణ పనులు పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న రహదారిపై ఏర్పడిన గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంథని మండలం ఖాన్‌సాయిపేట ఎంపీపీఎస్ పాఠశాలలో కాంపౌండ్ వాల్, పెయింటింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వెంకటాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో మంజూరైన అదనపు తరగతి గది నిర్మాణాన్ని నెల రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలల్లో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్థులు కొత్తగా కల్పించిన సౌకర్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఉపాధ్యాయులు ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి విద్యార్థికి కనీసం చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు ఉండేలా బోధన అందించాలని ఆదేశించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి అభ్యసన స్థాయిని మెరుగుపరిచేందుకు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా శ్రద్ధ చూపాలని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు తక్కువగా ఉన్నట్లయితే సంబంధిత తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదించి, కారణాలను తెలుసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి పాఠశాలలో నెలకోసారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని, విద్యార్థుల హాజరు, విద్యా ప్రగతి, అభ్యసన సామర్థ్యాలపై తల్లిదండ్రులకు వివరించి వారి సహకారం తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి చిన్నారి పట్ల మనం చూపించే శ్రద్ధ మన బోధనలోనూ, విద్యార్థుల అభ్యసనలోనూ స్పష్టంగా కనిపించాలి. ప్రతి విద్యార్థి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయాలి సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చూడాలని అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఎంపీడీవో శ్రీజ రెడ్డి, ఎంపిఓ షబ్బీర్ పాషా, ఏఈ పిఆర్. జగదీశ్,సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

మంథనిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2026

మంథని, సెప్టెంబర్ 09: జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్)-2026లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మంథని పట్టణంలో సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంథని ఆర్డీవో సురేష్, తహశీల్దార్ ఆరిఫోద్దిన్, ఎంపీడీవో శ్రీజ, మున్సిపల్ కమిషనర్ మనోహర్, మేనేజర్ శారదలను కలిసి సర్వేకు సంబంధించిన కరపత్రాలను అందజేసి సర్వే లక్ష్యాలు, ప్రాముఖ్యతను వివరించారు. దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం, స్వయం ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన విశ్వసనీయ గణాంకాలను రూపొందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో కుటుంబాల సాధారణ వివరాలను నమోదు చేసిన అనంతరం, ఎంపికైన కుటుంబాలను మూడు నెలల పాటు ప్రతి నెల ఒకసారి సందర్శించి మొబైల్ ట్యాబ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల విద్యార్హతలు, విద్యాభ్యాసం, వృత్తి విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి, రోజువారీ కూలి పనులు, పని గంటలు, వేతన వివరాలు, మహిళల ఆదాయ వనరులతో పాటు జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఓలా, ఉబెర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేస్తున్న గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికుల వివరాలను కూడా నమోదు చేస్తామని తెలిపారు. సర్వే ద్వారా సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, గణాంకాల రూపకల్పనకు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి సందేహాలకు తావులేకుండా సరైన సమాచారాన్ని అందించి సర్వే విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంథని డివైస్‌ఓ వెంకటేశ్వర్లు, మంథని ఎంపీఎస్‌ఓ సంధ్యారాణి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

మంథనిలో వయోవృద్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అవగాహన కార్యక్రమం

మంథని, సెప్టెంబర్ 09: మంథని పట్టణంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్ నందు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటి బచావో బేటి పడావో’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ దయ అరుణ, జెండర్ స్పెషలిస్ట్ బీ. సంస్కృతి, ఎంటీఎస్ ఇ. స్వర్ణలత పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వయోవృద్ధుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే టోల్ ఫ్రీ నెంబర్ల ప్రాముఖ్యతను, వాటి వినియోగాన్ని వయోవృద్ధులకు వివరంగా తెలియజేశారు. అలాగే జిల్లా సంక్షేమ శాఖ అందిస్తున్న వివిధ సేవలు, ఇతర కార్యక్రమాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అనంతరం వయోవృద్ధుల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మెడగోని రాజమౌళి గౌడ్, ఖాజా మొయినుద్దీన్, దత్త గౌడ్ పాల్గొని వయోవృద్ధులను ఉద్దేశించి సందేశాన్ని ఇచ్చారు.

పెద్దపల్లి

చందనాపూర్ లో లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం..

లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్ రామగిరి, సెప్టెంబర్ 08: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనపూర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ, రేకుర్తి కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. సర్పంచ్ కొండా మంజుల శ్రీనివాస్ క్లబ్ చైర్మన్ మొల్మురి శ్రీనివాస్ ను సంప్రదించి గ్రామంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరగా, వెంటనే లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్ తెలుపగా వారు రేకుర్తి కంటి ఆసుపత్రి వైస్ చైర్మన్ చిదుర సురేష్‌తో చర్చించి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో డా. శరణ్య యాదవ్, టెక్నీషియన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 28 మందికి కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించి వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించి కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు గ్రామ పాలకవర్గం, గ్రామస్థులు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్‌తో పాటు క్లబ్ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డా. శరణ్య యాదవ్ మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు దాదాపు 650 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి, అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలను ఉచితంగా అందించామని తెలిపారు. భవిష్యత్తులో మండలంలోని అన్ని గ్రామాల్లో ఇటువంటి కంటి వైద్య శిబిరాలను నిర్వహించేందుకు క్లబ్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కంటి ఆపరేషన్ల ద్వారా దృష్టి సమస్యలు తగ్గిపోవడమే కాకుండా, కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా తగ్గుతుందని, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆమె వివరించారు. తమ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం లేదా కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించాలనుకునే వారు లయన్స్ క్లబ్ ప్రతినిధులను సంప్రదించాలని కోరారు. అలాగే ఇట్టి అవకాశం కల్పించిన రేకుర్తి ఆసుపత్రి చైర్మన్ ప్రకాష్ హొల్ల, వైస్ చైర్మన్ చిదుర సురేష్ కు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ మేకల మారుతి యాదవ్, మోలుమూరి శ్రీనివాస్, ఐ విజన్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎలువక ఓదెలు, పరంకుశం శ్రీనివాస్ చారి, గ్రామ కార్యదర్శి సునీల్, ఉప సర్పంచ్ రజిత రాంచందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిన టీఈపీఏ వ్యవస్థాపకులు ధార మధు

తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ధార మధు హైదరాబాద్/పెద్దపల్లి, సెప్టెంబర్ 07: తెలంగాణ ఎడ్యుకేషనల్ పేరెంట్స్ అసోసియేషన్ (టీఈపీఏ) వ్యవస్థాపకులు ధార మధు సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న సమక్షంలో ధార మధు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ధార మధు విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై గతంలో తనదైన రీతిలో కృషి చేస్తూ వచ్చారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు, తల్లిదండ్రుల ఆందోళనలు, విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. ధార మధు టీఆర్పీలో చేరడంతో విద్యా రంగంలో పార్టీ కార్యకలాపాలకు మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించిన సమస్యలపై ఆయనకు ఉన్న అవగాహన పార్టీకి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యా రంగ సమస్యలను కేవలం రాజకీయ అంశంగా కాకుండా సామాజిక సమస్యగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రులపై విద్యా వ్యయ భారం, విద్యా సంస్థల్లో ఎదురవుతున్న సమస్యలు వంటి అంశాలపై ధార మధు అనుభవం పార్టీ కార్యక్రమాలకు దోహదపడుతుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని ప్రజల్లోకి మరింత విస్తరించేందుకు కొత్తగా చేరుతున్న నాయకులు, కార్యకర్తల సహకారం కీలకమని టీఆర్పీ నాయకులు పేర్కొన్నారు. ధార మధు చేరికతో ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా రంగానికి చెందిన వర్గాల్లో పార్టీకి మరింత చేరువ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధార మధుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ విద్యా రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.

పెద్దపల్లి

పండుగల వేళ మంథని పోలీసుల ముందస్తు భద్రత చర్యలు

మంథని పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ లకు కౌన్సెలింగ్ నిర్వహణ మంథని, సెప్టెంబరు 05: రాబోయే వినాయక చవితి (సెప్టెంబరు 14) పండుగను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంథని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లకు సీఐ బి. స్వామి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతు పండుగ వాతావరణానికి విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బలవంతపు చందా వసూళ్లు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గుంపులుగా ఏర్పడటం, పాత విరోధాలతో ఘర్షణలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టేషన్ పరిధి విడిచి వెళ్లాల్సి వస్తే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద కదలికలు ఉన్నా వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. పండుగ సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో గస్తీ (నైట్ రౌండ్స్), బీట్ చెకింగ్‌లు పెంచడంతో పాటు కీలక ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే మంథని పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్సై సందీప్ కుమార్, ఏఎస్సై లు, సిబ్బంది పాల్గొన్నారు.

పెద్దపల్లి

పర్యావరణ పరిరక్షణతోనే భావితరాలకు బంగారు భవిష్యత్తు

మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ మంథని, సెప్టెంబర్ 04: భావితరాలకు స్వచ్ఛమైన, పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ శ్రీ మహాలక్ష్మి దేవాలయం వద్ద స్థానిక కౌన్సిలర్ మారుపాక నిహారికతో కలిసి శుక్రవారం భక్తులకు, స్థానిక ప్రజలకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… పెరుగుతున్న కాలుష్య నివారణకు చెట్లు నాటడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, అవి మహా వృక్షాలుగా మారే వరకు సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని కోరారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి పౌరుడు తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు నూకల కమల్, జంభోజు శ్రీమతి, పెంటరి రాజు, జంభోజ్ సమ్మయ్య, దుద్దిల్ల గణపతిలతో పాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పెద్దపల్లి

బోయినపేట విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలి

6 వ వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి మంథని, సెప్టెంబర్ 04: మంథని మున్సిపాలిటీ ఆరో వార్డు పరిధిలోని బోయినపేటలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని స్థానిక కౌన్సిలర్‌ పోతరవేని శ్రీలతక్రాంతి డిమాండ్‌ చేశారు. బోయినపేటకు వెళ్లే ప్రధాన రహదారి అయిన పాత కట్టపై విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో రహదారి మొత్తం చీకటిగా మారుతోందని కౌన్సిలర్ తెలిపారు. ఈ మార్గంలో నిత్యం అనేక మంది ప్రజలు ప్రయాణిస్తుంటారని, సరైన వెలుతురు లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బోయినపేటలో విద్యుత్ సమస్యలు ఒక్కరోజులో ఏర్పడినవి కాదని, చాలా కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శ్రీలతక్రాంతి అన్నారు. సమస్యలను పలుమార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో అధికారులు ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడి తక్షణమే చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బోయినపేట ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రజలను సమీకరించి విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పోతరవేని శ్రీలతక్రాంతి హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు కలిగే పరిస్థితులు ఏర్పడిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆమె కోరారు. బోయినపేటలోని అన్ని వాడలను క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యుత్ స్తంభాలు, తీగలు, వీధి దీపాలు, మీటర్ కనెక్షన్లకు సంబంధించిన సమస్యలను గుర్తించి సమగ్రంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

పెద్దపల్లి

గంగాపురి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

మంథని, సెప్టెంబర్ 03: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికలు, సత్యభామల వేషధారణలతో అలరించారు. చిన్నారుల ఆటపాటలు, రంగురంగుల వేషధారణలతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు స్వరూప రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జన్మదిన విశిష్టతను విద్యార్థులకు వివరించారు. చిన్నారులు కృష్ణుడి వేషధారణతో పాటు గోపికలు, సత్యభామల వేషధారణలో పాల్గొని ఎంతో ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకున్నారని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంతో పాటు వారిలో సృజనాత్మకతను వెలికితీస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని కృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేశారు.

పెద్దపల్లి

మంథనిలో 2 వేల లీటర్ల గుడుంబా డంప్ పై పోలీసుల దాడి

మంథని, సెప్టెంబర్‌ 03: మంథని పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో గుడుంబాను పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంథని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బీ. స్వామి ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన దాడుల్లో సుమారు 2 వేల లీటర్ల గుడుంబా బయటపడింది. ప్లాస్టిక్‌ డబ్బాలు, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన ఈ అక్రమ మద్యాన్ని నిబంధనల ప్రకారం మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంథని పట్టణ శివారులోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పెద్ద మొత్తంలో గుడుంబా నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం మేరకు సదరు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా ప్లాస్టిక్‌ డబ్బాలు, డ్రమ్ముల్లో నిల్వ చేసిన గుడుంబా కనిపించింది. వాటిని పరిశీలించగా సుమారు 2,000 లీటర్ల అక్రమ మద్యం ఉన్నట్లు గుర్తించారు. భారీ మొత్తంలో గుడుంబా నిల్వ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అది మార్కెట్‌లోకి చేరకుండా చర్యలు చేపట్టారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనల ప్రకారం మధ్యవర్తుల సమక్షంలో గుడుంబాను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అక్రమ మద్యం చలామణిని అడ్డుకునేందుకు పోలీసు శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోందని మంథని సీఐ బి. స్వామి పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో గుడుంబాను ఎవరు తయారు చేశారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికి సరఫరా చేయడానికి అక్కడ నిల్వ ఉంచారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుడుంబా తయారీ, నిల్వ, రవాణా, విక్రయాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధ్యులను గుర్తించిన అనంతరం వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు. గుడుంబా ఆరోగ్యానికి తీవ్ర హానికరమని, కల్తీ మద్యం సేవించడం వల్ల అనారోగ్యంతో పాటు ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు గుడుంబాకు దూరంగా ఉండాలని సూచించారు. మంథని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎక్కడైనా గుడుంబా తయారీ, నిల్వ, రవాణా లేదా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. మంథని పట్టణ శివారులో ఒకేసారి 2 వేల లీటర్ల గుడుంబా పట్టుబడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.