Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #Manthani #Peddapalli

పెద్దపల్లి

వృద్ధుల సేవకు గుర్తింపుగా మెడగోని రాజమౌళి గౌడ్‌కు విశిష్ట పురస్కారం

మంథని, అక్టోబర్ 02: మానవసేవే మాధవసేవ అనే ఆశయంతో ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో నిరంతరం భాగస్వాములవుతూ, వయోవృద్ధులు, పేదలు, నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న మెడగోని రాజమౌళి గౌడ్‌కు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ‘మానవసేవ మాధవసేవ కోఆర్డినేటర్’గా విశిష్ట పురస్కారం లభించింది. సమాజ సేవకు గుర్తింపుగా అందిన ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని రాజమౌళి గౌడ్ పేర్కొన్నారు.వృద్ధుల సంక్షేమం, సామాజిక సేవ, ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములవుతూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న ఆయన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వయోవృద్ధులకు ఆదరణ కల్పించడం, అవసరమైన వారికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.మానవసేవే మాధవసేవ అనే ఉన్నతమైన భావనతో సమాజంలోని అనాథలు, నిరాశ్రయులు, పేదలు, వయోవృద్ధులకు అండగా నిలవడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని రాజమౌళి గౌడ్ తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్నవారికి ఆర్థిక సహాయంతో పాటు ఆత్మీయత, ఆదరణ, గౌరవం అందించడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. కుటుంబ, సామాజిక పరిస్థితుల కారణంగా ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న వృద్ధులకు సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు.వృద్ధుల అనుభవాలు, జీవిత పాఠాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, అలాంటి వారిని గౌరవించడం మన సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.మెడగోని రాజమౌళి గౌడ్ ప్రస్తుతం పలు ధార్మిక, సామాజిక సంస్థల్లో వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సనాతన ధర్మ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర ధార్మిక సేవా సంస్థ సలహాదారుగా సేవలందిస్తున్నారు. అలాగే విశ్వహిందూ పరిషత్ ఆలయాలు–అర్చకుల సంక్షేమ విభాగ బాధ్యుడిగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్‌గా కూడా సేవలందించారు.వివిధ సంస్థల ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ధార్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.తన సేవా ప్రస్థానంలో ఇప్పటికే అనేక పురస్కారాలు, సత్కారాలు అందుకున్నట్లు రాజమౌళి గౌడ్ తెలిపారు. రాష్ట్రపతి పురస్కారం, వైదిక యూనివర్సిటీ డాక్టరేట్, ఆదిశంకరాచార్యుల వారి పురస్కారంతో పాటు మదర్ తెరిసా ఫౌండేషన్, విశ్వగురు స్వామి వివేకానంద ఫౌండేషన్ తదితర సంస్థల నుంచి గౌరవాలు అందుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు 100 వరకు పురస్కారాలు, సత్కారాలు పొందినట్లు తెలిపారు.అయితే, పురస్కారాలు తనకు వ్యక్తిగత గుర్తింపును అందించడంతో పాటు సమాజం పట్ల బాధ్యతను గుర్తుచేస్తాయని ఆయన పేర్కొన్నారు. పురస్కారాలను సేవకు ముగింపుగా కాకుండా, మరింత అంకితభావంతో ముందుకు సాగేందుకు ప్రేరణగా భావిస్తున్నట్లు తెలిపారు.సామాజిక, ధార్మిక సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగడానికి దాతలు, శ్రేయోభిలాషులు, స్వచ్ఛంద కార్యకర్తల సహకారం ఎంతో కీలకమని రాజమౌళి గౌడ్ అన్నారు. సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న దాతలకు, తమ సమయాన్ని, శ్రమను వెచ్చిస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సేవ అనేది ఒక్క వ్యక్తితో సాధ్యమయ్యేది కాదని, అనేకమంది సమష్టి కృషితోనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. తన సేవా ప్రస్థానంలో తోడ్పడుతున్న మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రభుత్వ అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు.తన సేవలను గుర్తించి పురస్కారానికి పేరును ప్రతిపాదించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌కు, పురస్కారాన్ని ప్రకటించిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.సమాజంలో వయోవృద్ధుల పట్ల గౌరవం, ఆదరణ మరింత పెరగాలని, ప్రతి ఒక్కరూ తమ పరిధిలో సామాజిక, ధార్మిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని రాజమౌళి గౌడ్ ఆకాంక్షించారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, నిరాశ్రయులకు అండగా నిలవడం, వృద్ధులకు ఆత్మీయతను పంచడం వంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వీకరించాలని సూచించారు.“అందరూ బాగుండాలి.. అందరికీ మంచి జరగాలి” అనే సంకల్పంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు. తనకు లభించిన ఈ పురస్కారం వ్యక్తిగతంగా తనకు మాత్రమే దక్కిన గౌరవం కాదని, తనతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. సేవే లక్ష్యంగా, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతానని మెడగోని రాజమౌళి గౌడ్ స్పష్టం చేశారు.

పెద్దపల్లి

మంథని: మైత్రి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడిగా గడిపెల్లి శ్రీనివాస్

మంథని, అక్టోబర్ 01: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గోదావరి తీరంలో గురువారం మైత్రి ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆటో యూనియన్ అధ్యక్షుడిగా గడిపెల్లి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు.అధ్యక్ష పదవికి ‘గుర్రం’ గుర్తుపై గడిపెల్లి శ్రీనివాస్, ‘ఉంగరం’ గుర్తుపై ఎండి ఎజాజ్ పోటీపడ్డారు. యూనియన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడంతో మొత్తం 237 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపులో గడిపెల్లి శ్రీనివాస్‌కు 146 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి ఎండి ఎజాజ్‌కు 91 ఓట్లు పోలయ్యాయి. దీంతో తన ప్రత్యర్థిపై శ్రీనివాస్ 51 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.ఈ ఎన్నికల ప్రక్రియకు ఎలక్షన్ కమిటీ సభ్యులుగా ఎస్.కె. సలీం, బడికెల శ్యామ్, ఎండి. అక్రమ్ వ్యవహరించగా, ఎలక్షన్ ఏజెంట్లుగా మంథని అశోక్, పోలు కనకరాజులు బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, యూనియన్ సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

పెద్దపల్లి

ఆటో యూనియన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: గడిపెల్లి శ్రీనివాస్

మంథనిలో మైత్రి ఆటో యూనియన్ ఎన్నికలు మంథని, సెప్టెంబర్ 30: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మైత్రి ఆటో యూనియన్ ఎన్నికలు గురువారం జరగనున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లలో ఉత్కంఠ నెలకొంది. యూనియన్ భవిష్యత్ కార్యాచరణ, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు తమకు అందేలా కృషి చేసే నాయకత్వం కోసం సభ్యులు ఎదురుచూస్తున్నారు. గతంలో 2020 నుంచి 2024 వరకు మైత్రి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసిన గడిపెల్లి శ్రీనివాస్ ఈసారి గుర్రం గుర్తుపై పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గత అనుభవంతో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఏగోలపు సమ్మయ్య గౌడ్, తుంగల రాజు పటేల్ మాట్లాడుతూ.. గత పాలనలో తమ సమస్యలకు తగిన స్థాయిలో పరిష్కారం లభించలేదని ఆరోపించారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్న సమస్యలను యూనియన్ నాయకత్వం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో తమ ఆదాయంపై ప్రభావం పడుతోందని పలువురు ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. అయితే మహాలక్ష్మి పథకంలో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పేర్కొంది. “ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. యూనియన్ తరఫున డ్రైవర్ల సమస్యలను బలంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే నాయకత్వం అవసరం. ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం, వృత్తిపరమైన భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి” అని వారు కోరారు. మైత్రి ఆటో యూనియన్ ఎన్నికలు కేవలం అధ్యక్షుడి ఎంపికకే పరిమితం కాకుండా.. ఆటో డ్రైవర్ల సమస్యలను సమష్టిగా పరిష్కరించే దిశగా కొత్త కార్యవర్గం పనిచేయాలనే అభిప్రాయం సభ్యుల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల అనంతరం డ్రైవర్ల ప్రధాన సమస్యలపై కార్యాచరణ రూపొందించి సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లాలని మంథని మైత్రి ఆటో యూనియన్ డ్రైవర్లు కోరుతున్నారు.

పెద్దపల్లి

ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎండీ ఏజాజ్

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మైత్రి ఆటో యూనియన్ ఎన్నికలు గురువారం జరగనున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లలో తీవ్ర ఆసక్తి నెలకొంది. యూనియన్ భవిష్యత్ కార్యాచరణ, డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం సభ్యులు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఆశిస్తున్నారు. 2024-2026 కాలానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఎండీ ఏజాజ్ ఈసారి ‘ఉంగరం’ గుర్తుపై పోటీ పడుతున్నారు.బుధవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఏజాజ్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల జీవనోపాధి, వృత్తిపరమైన భద్రత, ఆర్థిక సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు డ్రైవర్లందరికీ అందేలా చూడటమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. ఆటో రంగానికి సంబంధించి డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం మరియు సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం డ్రైవర్ల సంక్షేమం కోసం సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని ఆయన వెల్లడించారు.

పెద్దపల్లి

బ్యాంకింగ్ లావాదేవీల్లో అప్రమత్తత అవసరం: కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ ఉదయ శ్రీ

వెంకటాపూర్‌ లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు మంథని, సెప్టెంబరు 30: బ్యాంకింగ్ డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ కె. ఉదయశ్రీ సూచించారు. బుధవారం మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రమేష్ టీం’ బృందం బుర్రకథ ప్రదర్శన ద్వారా సైబర్ నేరాలు, ఆర్థిక అంశాలపై గ్రామస్థులకు ఆకట్టుకునేలా అవగాహన కల్పించింది.అనంతరం మేనేజర్ ఉదయశ్రీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు ప్రజల ఆశ, భయాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. లోన్ యాప్‌లు, లాటరీలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, పాన్ కార్డ్ అప్‌డేట్, ఆధార్ లింకేజీ పేర్లతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్‌లను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని, గూగుల్‌లో అనధికార లోన్ యాప్‌ల కోసం వెతకవద్దని కోరారు. ఖాతాదారులు తమ కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు బ్యాంకులో సమర్పించాలని తెలిపారు.రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా పంట రుణాలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, ఆయిల్ పామ్, పాలీహౌస్‌లు, ట్రాక్టర్లు, గోల్డ్ లోన్లు, స్వయం సహాయక సంఘాలు, గృహ నిర్మాణం, వ్యాపారం మరియు విదేశీ విద్య కోసం వివిధ రకాల రుణాలు అందిస్తున్నామని వివరించారు.సహకార బ్యాంకు డిపాజిట్లపై అత్యధికంగా 8 శాతం వడ్డీ కల్పిస్తున్నామని, రూ.436తో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, రూ.20తో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సౌకర్యాన్ని పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సర్పంచ్ తోట పోచయ్య, ఉపసర్పంచ్ కీర్తి సాయి, ఫీల్డ్ ఆఫీసర్ సందెబోయిన శ్రీనివాస్, ఎఫ్ ఎల్ సి మోహన్ రావు, బ్యాంకు సిబ్బంది మహేశ్వరి, సహకార సంఘం సిబ్బంది నారామల్ల విద్యాసాగర్, పైడాకుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

ప్రకృతి ప్రేమికుడు గట్టు కృష్ణమూర్తికి బీజేపీ ఘన సన్మానం

‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా సత్కరించిన బీజేపీ మంథని, సెప్టెంబరు 30: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల రోజులుగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా, మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రముఖ పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త గట్టు కృష్ణమూర్తిని బీజేపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ఖర్చులతో పట్టణంలో విస్తృతంగా మొక్కలు నాటుతూ, ప్రమాదకరంగా మారిన రోడ్డు గుంతలను పూడుస్తూ ప్రజా సంక్షేమానికి కృష్ణమూర్తి కృషి చేస్తున్నారన్నారు. అంతేకాకుండా, పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణ ఆవశ్యకతపై చైతన్యం తెస్తూ, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేసిన ఆయన సేవలను నాయకులు కొనియాడారు.సన్మానం అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ భూమిపై ప్రతి జీవి మనుగడకు ప్రకృతి సహకారం ఎంతో అత్యవసరం అన్నారు. మానవ విచక్షణారాహిత్యం వల్ల ప్రకృతి నాశనమైతే అది మానవాళి జీవనానికే ముప్పుగా మారుతుందని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, ‘ఎల్ నినో’ వంటి వాతావరణ మార్పులు, భవిష్యత్తు వైపరీత్యాలను తట్టుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. మంథని ప్రజలందరూ నడుం బిగించి ప్రకృతి పరిరక్షణను ఒక యజ్ఞంలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, నారమల్ల కృష్ణ, బూడిద తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు గుడ్ల గురువేష్, పట్టణ కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దపల్లి

నేడు అత్యంత పవిత్రమైన అంగారక చతుర్థి

మంథని రూరల్,సెప్టెంబర్ 28: భాద్రపద మాసంలో వచ్చే అంగారక సంకష్టహర చతుర్థికి ఎంతో విశిష్టమైన ప్రాధాన్యం ఉందని భక్తులు విశ్వసిస్తారు. మంగళవారం చతుర్థి తిథి రావడంతో ఈ రోజును అంగారక చతుర్థిగా పిలుస్తారు. శ్రీ గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్ష చేపడితే జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు, సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం అంగారక చతుర్థి రావడం విశేషంగా భావిస్తున్నారు. ఈ రోజున కొత్తగా గణపతి దీక్ష చేపట్టడంతో పాటు ఇప్పటికే దీక్షలో ఉన్న వారు ఉద్యాపన చేసుకోవడం శుభప్రదమని పండితులు పేర్కొంటారు.అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ విఘ్నేశ్వరుడిని ప్రత్యేకంగా పూజించి ఆలయంలో 21 ప్రదక్షిణలు చేసి మోదకాలు, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే గణనాథుని కరుణాకటాక్షాలతో అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.మంథని పట్టణంలోని శ్రీ మహాగణపతి దేవాలయంలో సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువుదీరిన గణనాథుడికి అంగారక సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ప్రతి నెల పౌర్ణమి అనంతరం వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష చేపట్టి, రాత్రి చంద్రోదయం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున గణనాథుడిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

పెద్దపల్లి

రెడ్ క్రాస్ పెద్దపల్లి జిల్లా శాఖకు నూతన కార్యవర్గం ఎన్నిక

పెద్దపల్లి, సెప్టెంబర్ 26:ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా శాఖకు నూతన కార్యవర్గం కొలువుదీరింది. శనివారం నిర్వహించిన ఎన్నికల్లో వివిధ హోదాలకు సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలను సెప్టెంబర్ 26న ఎన్నికల కార్యాలయం ప్రకటించింది. నూతన కార్యవర్గంలో చైర్మన్‌గా ఎరబటి వెంకటేశ్వర రావు, వైస్ చైర్మన్‌గా సాధుల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా పంపటి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా కావేటి రాజగోపాల్ ఎన్నికైనట్లు ప్రకటించారు. జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఉప్పు రాజ్‌కుమార్, గంట్ల రామచంద్ర రెడ్డి, మహమ్మద్ అబ్దుల్ మోయీద్, మెడగోని వెంకటేష్, అల్పూరి సంపత్ రావు, వేల్పుల రమేష్, గూళ్ల అంజన్ కుమార్, దుడం వెంకట సాంబమూర్తి ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల ప్రకారం నూతనంగా ఏర్పడిన కమిటీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా శాఖ కార్యకలాపాలను కొనసాగించనుంది. ప్రజలకు సేవలు అందించడం, విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టడం వంటి రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల్లో నూతన కార్యవర్గం కీలక పాత్ర పోషించనుంది. ఎన్నికల కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం కమిటీ, కార్యనిర్వాహకుల పదవీకాలం ఎన్నిక జరిగిన తేదీ నుంచి మూడు సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ మేరకు ప్రస్తుత కమిటీ పదవీకాలం 05 అక్టోబర్ 2029తో ముగియనుంది. ఎన్నికల వివరాలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి/సీఈఓకు సమాచారం కోసం కాపీగా సమర్పించినట్లు ఎన్నికల కార్యాలయం పేర్కొంది.

పెద్దపల్లి

సామాజిక సేవతో కూడిన పుట్టినరోజు వేడుకలు ఆదర్శనీయం: మంథని సీఐ బుద్దే స్వామి

మంథని, సెప్టెంబర్ 26 పుట్టినరోజు వేడుకలను కేక్‌ కటింగ్‌లు, ఆర్భాటాలకు పరిమితం చేయకుండా నిరుపేదలకు అండగా నిలిచేలా నిర్వహించడం అభినందనీయమని మంథని సీఐ బుద్దే స్వామి అన్నారు. మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన తాటి విజయ్ కుమార స్వామి–నిహారిక దంపతులు తమ కుమారుడు తాటి సాయివర్ధన్ (టిల్లు) పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.తాటి సాయివర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన ఐదు నిరుపేద కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో పంపిణీ చేశారు. మంథని సీఐ బుద్దే స్వామి, ఎస్‌ఐ సందీప్ కుమార్ తమ చేతుల మీదుగా లబ్ధిదారులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా సీఐ బుద్దే స్వామి, ఎస్‌ఐ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సమాజానికి మంచి సందేశం అందుతుందని పేర్కొన్నారు. సాయివర్ధన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సాయివర్ధన్ తండ్రి తాటి విజయ్ కుమార స్వామి మాట్లాడుతూ.. తమ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు సహాయం చేయడం ద్వారా లభించే తృప్తి ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత మేర పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.*సామాజిక సేవలో ముందుండే విజయ్ కుమార స్వామి*తాటి విజయ్ కుమార స్వామి మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తూ తన వంతుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యువతకు, సమాజానికి ఉపయోగపడే సందేశాలను అందించే విధంగా వివిధ రకాల సామాజిక అవగాహన రీల్స్ రూపొందిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. సామాజిక ప్రయోజనంతో కూడిన ఆయన రీల్స్‌కు పలువురు అభిమానులు, యువత నుంచి అభినందనలు లభిస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో తన కుమారుడి పుట్టినరోజును కూడా సేవా కార్యక్రమంగా నిర్వహించడం పలువురి ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమంలో యువకులు, పోలీసు సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొని సాయివర్ధన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన తాటి విజయ్ కుమార స్వామి–నిహారిక దంపతులను అభినందించారు.

పెద్దపల్లి

బిట్టుపల్లిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రారంభం

_ప్రజలు సహకరించాలి: గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్_ మంథని, సెప్టెంబర్ 24: జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే2026” లో భాగంగా మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నట్లు జాతీయ గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంథని ఆర్డీవో సురేష్, తహశీల్దార్ ఆరిఫొద్దీన్, ఎంపీడీవో కంకణాల శ్రీజ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసి సర్వే కరపత్రాలను అందజేసి, ఈ కార్యక్రమ లక్ష్యాలను వివరించారు. దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం, స్వయం ఉపాధి, వేతనాలపై ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సర్వే అధికారి మాట్లాడుతూ మొదటి దశలో కుటుంబాల వివరాలు నమోదు చేసి, అనంతరం ఎంపిక చేసిన కుటుంబాలను ప్రతి నెల మొబైల్ ట్యాబ్ ద్వారా పరిశీలిస్తామని తెలిపారు. అలాగే విద్యాభ్యాసం, వృత్తి విద్య, రోజువారీ కూలి, పనిచేసిన గంటలు, మహిళల ఆదాయ వనరుల సమాచారాన్ని నమోదు చేస్తామని తెలియజేశారు. జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఓలా, ఉబెర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేసే గిగ్, ప్లాట్‌ ఫారమ్ కార్మికుల వివరాలను కూడా ఈ సర్వే ద్వారా సేకరిస్తామని అధికారులు తెలిపారు. సర్వే ద్వారా సేకరించిన ప్రతి వివరమూ పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, ప్రజలు ఎలాంటి భయం లేకుండా సరైన సమాచారం అందించి సర్వేను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంథని డివిజనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఎంపీఎస్ఓ సంధ్యారాణి, సర్పంచ్ పోగుల లావణ్య మహేందర్, పంచాయతీ కార్యదర్శి మర్రిపల్లి విజయ్, గువ్వల రాజమల్లు, అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్, కారోబార్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.