संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: #Manthani #Peddapalli

పెద్దపల్లి

రాఖీ పౌర్ణమి వేళ మంత్రపురి రాజరాజేశ్వరుడికి ప్రత్యేక పూజలు

పెద్దపల్లి/మంథని, ఆగస్టు 28: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం మంథని పట్టణంలోని శ్రీ మంత్రపురి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి గోముఖం, సౌండ్ సిస్టమ్ అందజేసిన దాతలకు ఈ సందర్భంగా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

పెద్దపల్లి

మంథనిలో ఘనంగా నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం

మంథని, ఆగస్టు 28: మంథని పట్టణంలోని అన్ని వాడల్లోని దేవాలయాల్లో శుక్రవారం నూతన యజ్ఞోపవిత్రధారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తమ్మి చెరువుకట్ట వీధిలో గల శ్రీ హనుమాన్ దేవాలయం లో వేద పండితులు అవధానుల పురుషోత్తం శర్మ, కిషోర్ శర్మ లు హోమగుండం ఏర్పాటుచేసి వేదమంత్రాలతో బ్రాహ్మణులచే నూతన యజ్ఞోపవీతము వేయించారు. ఉపవీతాలు యజ్ఞోపవీతాలు దారం పోగులచే మూడు వరసలుగా చేసి బ్రహ్మముడితో చేయబడినది (జంధ్య ము) యజ్ఞోపవీతం. హిందువులు దారపు పోగులనే ధర్మం కోసం అన్ని కార్యక్రమాల్లోనూ ఉపయోగిస్తారు. స్త్రీలు వ్రత తోరణాలు, మంగళసూత్రం మొదలగు వాటికి దారపు పోగులను ఉపయోగించడం ఉదాత్త భాగంగా పరిగణిస్తారు. అలాగే ఈ రోజున సోదరీ సోదరీమణులు సోదరులకు రక్షాబంధన్ కట్టి ఆశీర్వాదం పొందుతారు.

పెద్దపల్లి

ఆధ్యాత్మిక జీవనమే పరమానందం: మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోడారి మల్లేష్ యాదవ్

పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా మంథని డివిజన్ క్లబ్ దైవ దర్శనాలు మంథని, ఆగస్టు 25: మంథని పట్టణ డివిజన్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పవిత్ర శ్రావణ మాసంలోని మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని, కొండగట్టు శ్రీ అంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రెస్ క్లబ్ సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం: ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోడారి మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ… మనిషికి ఆధ్యాత్మిక జీవనమే పరమానందం అని తెలిపారు. డివిజన్ ప్రెస్ క్లబ్ రోజురోజుకూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. క్లబ్‌లోని సభ్యులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సమాజ శ్రేయస్సు కోసం పాత్రికేయులు చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని స్వామివార్ల పాదాల వద్ద ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే క్లబ్ ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ దైవదర్శనం సభ్యులకు తీవ్ర భక్తి పారవశ్యాన్ని, నూతనోత్తేజాన్ని అందించిందనీ , క్లబ్ సభ్యులందరికీ, ప్రజలకు శుభం జరగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహవాది సతీష్ కుమార్ , మేడగోని రాజమౌళి గౌడ్, ఏగోలపు సంతోష్ గౌడ్, కాచర్ల శంకర్, ఎండి సుభాన్, రామడుగు సాయి శ్రీనివాస్, మాదేశి శ్రావణ్ కుమార్ , మంథని లక్ష్మణ్, కాశీపేట శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్, కావేటి సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివార్ల తీర్థప్రసాదాలు స్వీకరించిన సభ్యులు, ప్రెస్ క్లబ్ భవిష్యత్ కార్యక్రమాలపై కూడా పలు అంశాలను చర్చించారు.

పెద్దపల్లి

జాతీయ కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల ప్రతిభ

9 బంగారు, 21 వెండి పతకాలు సాధించిన షిటోరియు సికోకాయి కరాటే విద్యార్థులు మంథని, జనవరి 05:హనుమకొండ జిల్లా పరకాలలోని మయూరి గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన జాతీయ కరాటే పోటీల్లో జపాన్ షిటోరియు సికో కాయి కరాటే ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన మంథని విద్యార్థులు అలాగే దర్యాప్తూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో పాల్గొన్న విద్యార్థులు సబ్ జూనియర్స్, క్యాడేట్స్ కతా, కుమితే విభాగాల్లో 9 బంగారు, 21 వెండి పతకాలు సాధించారు. వీరిలో జోగుల అభిరామ్, మాచర్ల శివ, వాసంశెట్టి ఉదయ్ కుమార్, ఎలివేణి నిషిత్, జడగాల మనస్వి, శాన్వి, అరణ్య, సహస్ర, అక్షిత బంగారు పతకాలను, అదే విధంగా కేసరి సహస్ర, అంజలి, వైష్ణవి, బి. సహస్ర వెండి పతకాలు సాధించారు. పతకాలు సాధించిన విద్యార్థులను షిటోరియు షికో కాయి కరాటే, కియో ఇండియా అధ్యక్షులు పి. భరత్ శర్మ, తెలంగాణ ప్రతినిధి పాలకుర్తి పాపయ్య, కార్యనిర్వాహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, చీఫ్ ఆర్గనైజర్ మాడ సంపత్, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మల్యాల రామస్వామి, కోశాధికారి మల్లికార్జున గౌడ్, దర్యాప్తూర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కేసరి సంతోష్, శిక్షకులు, ఇన్‌స్ట్రక్టర్లు అభినందించారు.

పెద్దపల్లి

విహార యాత్రలతో విద్యార్థులకు విజ్ఞానం

మంథని మండల విద్యాధికారి దాసరి లక్ష్మీ మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ): పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం బుధవారం హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక, విజ్ఞాన కేంద్రాలను విజ్ఞాన విహార యాత్రలో భాగంగా సందర్శించారు. ఈ యాత్రలో విద్యార్థులు గోల్కొండ కోట, చార్మినార్, బిర్లా సైన్స్ మ్యూజియం, నెహ్రూ జూ పార్క్‌లను సందర్శించి ఆయా ప్రాంతాల చరిత్ర, ప్రాధాన్యతలను తెలుసుకున్నారు.గోల్కొండ కోట, చార్మినార్‌లను సందర్శించిన సందర్భంగా వాటి నిర్మాణ శైలి, చారిత్రక నేపథ్యంపై అవగాహన పొందిన విద్యార్థులు ఆసక్తి వ్యక్తం చేశారు. నెహ్రూ జూ పార్క్‌లో వివిధ జంతువులు, పక్షులను పరిశీలిస్తూ వాటి జీవన విధానాలపై అవగాహన పెంచుకున్నారు. బిర్లా సైన్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ ప్రదర్శనలు, ప్రయోగాలు, డైనోసార్ నిజ అస్థిపంజరం, వృక్ష శిలాజాలను చూసి విద్యార్థులు ఎంతో ఉత్సాహం కనబరిచారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మంథని మండల విద్యాధికారి దాసరి లక్ష్మి మాట్లాడుతూ.. ఇలాంటి విజ్ఞాన విహార యాత్రల ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం చేకూరుతుందని, అనుభవపూర్వకంగా నేర్చుకున్న విషయాలు జీవితాంతం గుర్తుండిపోతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాసం శివలీల, కర్రు సురేష్, కాసిపేట భూమయ్య, వడ్లకొండ స్వామి, రవీందర్, దాసరి నరేందర్, మూడెత్తుల సమ్మయ్య, సుప్రజ, విద్యార్థులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

ఖమ్మంపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

క్రైస్తవ సోదర సోదరీమణులకు సర్పంచ్ నక్క రాజేశ్వరి రాజయ్య దంపతుల శుభాకాంక్షలు మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో క్రైస్తవ సోదర సోదరీమణులు క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రత్యేక ప్రార్థనలు, వేడుకలు నిర్వహించగా గ్రామ సర్పంచ్ నక్క రాజేశ్వరి – రాజయ్య దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ వెస్లీ (ఫేత్ బాప్టిస్ట్ చర్చ్), సాముల జీసస్ (ప్రేయర్ చర్చ్) ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను సర్పంచ్ దంపతులు ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నక్క రాజేశ్వరి మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. గ్రామంలో అన్ని మతాల ప్రజలు సోదరభావంతో కలిసి పండుగలు జరుపుకోవడం ఆనందకరమని అన్నారు. క్రైస్తవులందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రైస్తవ సంఘ నాయకులు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

పెద్దపల్లి

ఐదుతరాల అపురూప సమ్మేళనం

ఒక్క వేదికపై 200 మంది కుటుంబ సభ్యులు హైదరాబాద్/మంథని, డిసెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి ): ఉమ్మడి కుటుంబాలు క్రమంగా కనుమరుగవుతూ, కుటుంబ విలువలు ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత కాలంలో ఐదు తరాల వారసులు ఒకే వేదికపై కలుసుకున్న అపురూప ఘట్టం అందరినీ ఆకట్టుకుంది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కొంతం కిష్టయ్య కుటుంబ వారసులు గురువారం హైదరాబాద్ కొండాపూర్‌లోని అపర్ణా సెరేన్ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన కుటుంబ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 200 మంది సభ్యులు ఒక్కచోట చేరి ఆనందోత్సాహాలతో వేడుక జరుపుకున్నారు. ఈ సమ్మేళనంలో 80 ఏళ్ల వృద్ధులు మొదలుకొని ఆరు నెలల శిశువుల వరకు అయిదు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొనడం విశేషంగా నిలిచింది. సామాన్య నేపథ్యం నుంచి జీవితం ప్రారంభించిన ఈ కుటుంబం, చదువునే ఆయుధంగా మలుచుకుని తరం తరంగా ఎదిగి, నేడు వివిధ రంగాల్లో నాయకత్వ స్థానాలకు చేరుకోవడం అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. వేడుక సందర్భంగా కుటుంబ సభ్యులు తమ పూర్వీకులు ఎదుర్కొన్న కష్టాలను స్మరించుకుంటూ, నేటి తరాల విజయాలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. మూలాలను మరువకుండా, విద్య ద్వారా జీవితాన్ని మలుచుకోవచ్చని ఈ కుటుంబం మరోసారి నిరూపించిందని పలువురు వ్యాఖ్యానించారు. పెద్దల ఆశీస్సులు, చిన్నారుల చలాకితనం కలగలసిన ఈ కార్యక్రమం ఒక మధుర అనుభూతిగా నిలిచింది. ఈ సందర్భంగా కొంతం కిష్టయ్య కుటుంబ వంశవృక్షాన్ని చిత్రరూపంలో ప్రదర్శించారు. అనంతరం ప్రతి కుటుంబ శాఖకు చెందిన సభ్యులు తమ పరిచయాలను చేసుకున్నారు. చిన్నారుల కళా ప్రదర్శనలు, ఆటపాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంథని ఫ్యామిలీ గ్రూప్ వాట్సాప్ బృందం ఈ సమ్మేళనానికి రూపకల్పన చేసి విజయవంతంగా నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి, అలాగే విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చలిని, ప్రయాణ వ్యయప్రయాసలను లెక్కచేయకుండా కుటుంబ సభ్యులంతా ఉత్సాహంగా హాజరయ్యారు. కుటుంబ పెద్దల విలువలు, సభ్యుల ఫొటోలు, పరిచయాలతో కూడిన ప్రత్యేక స్మారక పుస్తకాన్ని ప్రచురించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇలాంటి కుటుంబ సమ్మేళనాలు నేటి సమాజానికి అత్యంత అవసరమని, తరతరాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

పెద్దపల్లి

ఉద్యమకారుల హామీలపై అసెంబ్లీ సమావేశాలలో ప్రకటన చేయాలి: పోతు జ్యోతి రెడ్డి

మంథని, ఆగస్టు 29: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నేటి నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోతు జ్యోతి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల స్థలం, అలాగే ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నవిధంగా పింఛన్, గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు, రైలు ప్రయాణం హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం పార్టీల పెద్దలు సైతం ఉద్యమకారుల హామీల అమలుపై అసెంబ్లీలో గొంతెత్తి ఉద్యమకారులకు అండగా ఉంటామని ప్రకటించాలని జ్యోతి రెడ్డి ఆయా పార్టీలను కోరారు.

పెద్దపల్లి

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల ప్రతిభ

*జపాన్ షెటోరియో షికోకాయ్ కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య* మంథని, ఆగస్టు 12; న్యూఢిల్లీలోని తాల్కటోర ఇండోర్ స్టేడియంలో ఈనెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించిన 19 వ ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కప్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో ఉచిత కరాటే శిక్షణ ద్వారా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన జపాన్ షెటోరియో షికొకాయ్ కరాటే విద్యార్థిని విద్యార్థులు అండర్ 17 అండర్ 14 కథ, కుమితే విభాగాలలో అత్యంత ప్రతిభ కనబరిచి వెండి, కాంస్య పథకాలు సాధించారు. మంథని పట్టణానికి చెందిన విద్యార్థులు అండర్ 17 కుమితే విభాగంలో ఎండీ. తహసిన్ తైభ వెండి పతకం, ఇదే క్రమంలో కథ విభాగంలో కాంస్య పథకం, అండర్ 14 కుమితే విభాగంలో పోగుల శివ సాకేత్ కాంస్య పథకం, బండారి మణికంఠ కథ విభాగంలో కాంస్య పథకం, మారేడుకొండ రిషి కథ విభాగంలో కాంస్య పథకం సాధించినట్లు శిక్షకులు కావేటి సమ్మయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిక్షకులు కావేటి సమ్మయ్య మాట్లాడుతూ గత 25 ఏళ్ల నుండి మంథని పట్టణంలో ఉచిత కరాటే శిక్షణ ఇస్తూ, అంతర్జాతీయ, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు. మలేషియాలో బంగారు, వెండి పథకం, హర్యానాలో బంగారు పతకం, మధ్యప్రదేశ్లో బంగారు పతకం, గోవాలో బంగారు పతకం, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో మంథని విద్యార్థులు సాధించడానికి ఎంతో మంది విద్యార్థినీ, విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఉచిత కరాటే శిక్షణ ఇవ్వడమే కాకుండా, పేద విద్యార్థులకు పోటీలకు వెళ్లేటప్పుడు అయ్యే ఖర్చును కూడా తానే భరిస్తున్నట్లు సమ్మయ్య పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రోత్సహించి, దాతలు సహకరిస్తే, ఇంకా ఎంతో మంది విద్యార్థులను తయారు చేస్తానని సమ్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ఉచిత కరాటే శిక్షణ కోసం ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులు మంథని పట్టణంలోని ఓపెన్ జిమ్ దగ్గర లేదా సమ్మయ్య నివాసం దగ్గర ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 5 గంటలకు, లేదా 9848503412 నంబర్ ను సంప్రదించాలని కావేటి సమ్మయ్య కోరారు. ఈ పథకాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను షిటోరియు షికొకాయ్ ఇండియా అధ్యక్షులు, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఢిల్లీ భరత్ శర్మ, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ శిఖోకాయి రిప్రెజెన్టివ్ పాలకుర్తి పాపయ్య, తెలంగాణ కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, మల్యాల రామస్వామి, ఇన్స్ట్రక్టర్స్ నాగలి రాకేష్, జడగల శివాని, కాబట్టి శివ గణేష్, మెట్టు హాసిని, కే శ్వేత, నందన, టి హర్షిని, పి హర్షవర్ధన్ లు అభినందించారు.

పెద్దపల్లి

గుంజపడుగు: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఆగస్టు 11, పున్నమి ప్రతినిధి: రైతులను బలోపేతం చేసే దిశగా సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. సోమవారం మంథని ప్రాంతంలో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, కరీంనగర్ డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు లతో కలిసి మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దాదాపు 7 కోట్ల రూపాయలతో 5 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న రెండు గోదాములకు, గుంజపడుగు గ్రామంలో 2 కోట్ల 90 లక్షల రూపాయలతో పీఎం కుసుమ్ ద్వారా ప్యాక్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని ఆధ్వర్యంలో గుంజపడుగు శివారులో పి.ఎం కుసుమ్ క్రింద 3.5 కోట్ల రూపాయలతో 1 మెగా వాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో నంది మేడారం, కాల్వ శ్రీరాంపూర్, అప్పన్న పేట, మంథని ప్రాంతాలలో 1 మెగా వాట్ చోప్పున ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 4 నెలల కాలంలో ఈ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, గ్రిడ్ కనెక్షన్ పనులు పూర్తి చేయాలని అన్నారు. చిల్లపల్లి గ్రామంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాము లను 7 కోట్ల రూపాయలతో చేపట్టామని అన్నారు. గుంజపడుగు ప్రాంతంలో సహకార బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆర్.బి.ఐ కు పంపాలని మంత్రి సూచించారు. సహకార శాఖ లో 20 సంవత్సరాల కాలంగా తన వంతు కృషి చేస్తున్న కరీంనగర్ డిసిసిబి చైర్మన్ కు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతు సోదరులకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనుబంధ రంగాలైన గోదాముల నిర్మాణం, పి.ఏ.సి.ఎస్ ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు లాంటి కార్యక్రమాల వల్ల రైతులను బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ గౌడ్, మంథని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఆర్డిఓ సురేష్, సహకార సంఘ అధ్యక్షులు శ్రీనివాస్, తహశీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.