Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #Manthani #Peddapalli

పెద్దపల్లి

కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శిగా ఆరెల్లి కిరణ్‌ గౌడ్‌

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కార్యదర్శిగా ఆరెల్లి కిరణ్‌ గౌడ్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంథని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కిరణ్‌ గౌడ్‌ను శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆశీస్సులతో తనకు ఈ బాధ్యత లభించిందని కిరణ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందనడానికి తన నియామకం ఒక ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. తాను గతంలో డ్రైవర్‌ స్థాయి నుంచి మండల సోషల్‌ మీడియా కార్యకర్తగా, అనంతరం జిల్లా సోషల్‌ మీడియా బాధ్యతల్లో పనిచేసి, ఇప్పుడు రాష్ట్ర సోషల్‌ మీడియా కార్యదర్శిగా నియమితులయ్యానని కిరణ్‌ గౌడ్‌ తెలిపారు. తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన మంత్రి శ్రీధర్‌ బాబు, శ్రీను బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనకు అప్పగించిన నూతన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహిస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విధానాలు, పార్టీ నాయకుల ఆలోచనలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం పనిచేస్తానని కిరణ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కిరణ్‌ గౌడ్‌కు రాష్ట్ర సోషల్‌ మీడియా కార్యదర్శిగా నూతన బాధ్యతలు లభించడంపై మంథని ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

తెలంగాణ పెద్దపల్లి

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి

తెలంగాణ సప్త సంకల్పాలను ప్రభుత్వం అమలు చేయాలి: బీజేపీ మంథని, సెప్టెంబర్ 15: సెప్టెంబర్ 17వ తేదీని ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంథని తహశీల్దార్ ఆరిఫోద్దీన్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని ప్రభుత్వం దృష్టికి తెలంగాణ సప్త సంకల్పాలను తీసుకెళ్లారు.తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. తెలంగాణ ప్రజల పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు._బీజేపీ తెలంగాణ సప్త సంకల్పాలు_సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రతి సంవత్సరం నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. తెలంగాణ విమోచనలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ సేవలకు గుర్తుగా హైదరాబాద్లో భారీ ‘విమోచన తెలంగాణ’ స్మారక విగ్రహం లేదా సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. అదేవిధంగా హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ విమోచన మ్యూజియం ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన ఉద్యమానికి సంబంధించిన అమరవీరులు, స్థానిక పోరాట యోధులు, వారి త్యాగాలు, ఉద్యమ చరిత్రను భద్రపరిచేలా తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన చరిత్రను విద్యార్థులకు అందించేందుకు పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలు, జమీందారీ, జాగీర్దారీ దోపిడీ, ప్రజల పోరాటం, అమరవీరుల త్యాగాలు, గుర్తింపు లభించని పోరాట యోధుల అధికారిక జాబితా, హైదరాబాద్ విమోచనకు దారితీసిన ఆపరేషన్ పోలో తదితర అంశాలను చేర్చాలని కోరారు. రజాకార్ల దాడులు, దౌర్జన్యాలకు గురైన గ్రామాలను గుర్తించి అక్కడ తెలంగాణ విమోచన స్మారక స్థూపాలు నిర్మించాలని, తెలంగాణ విమోచన ఉద్యమానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను కలుపుతూ ప్రత్యేక విమోచన పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.ఈ డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, మంథని మండలంలో కూడా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బోగోజు శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షుడు బుడిద తిరుపతి, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, నారమల్ల కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శులు సామల అశోక్, ఏడ్ల సాగర్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గుడ్ల గురువేష్, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

కమాన్‌పూర్‌ ఆదివరాహ స్వామి ఆలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల ప్రత్యేక పూజలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్‌ మల్లన్న ఈ నెల 17వ తేదీ నుంచి చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని, ఆయన త్వరలో ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మేరుగు చందర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆదివరాహస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న చేపట్టనున్న పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించాలని, పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు. కమాన్‌పూర్‌ లోని శ్రీ ఆదివరాహ స్వామి ఆలయానికి సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉందని స్థానిక భక్తుల విశ్వాసం. స్వామివారు సాధారణ విగ్రహ రూపంలో కాకుండా పెద్ద బండరాయిపై స్వయంభూ గా వెలిశారని భక్తులు నమ్ముతారు. ఒక మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంలో ఇక్కడ వెలిశారని పురాణ కథనం ఉందని నాయకులు తెలిపారు. బండరాయిపై ఉన్న స్వామివారి ఆకారం కాలక్రమేణా పెరుగుతుందని, రాతిపై వెంట్రుకల ఆకారం కనిపించడం ఆలయ ప్రత్యేకతగా భక్తులు భావిస్తారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా గుడి, గోపురం లేకుండానే ప్రకృతి మధ్యలో స్వామివారు పూజలు అందుకోవడం ఈ క్షేత్రం విశిష్టతగా చెబుతున్నారు. భూ వివాదాలు, రియల్‌ ఎస్టేట్‌ సమస్యలు, ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారు స్వామివారి వద్ద టెంకాయ ముడుపు కడితే తమ సమస్యలు తొలగిపోతాయని భక్తుల్లో విశ్వాసం ఉందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కారణంగా ఆదివరాహ స్వామిని భక్తులు ‘వరాల స్వామి’ గా కొలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మేరుగు చందర్‌ యాదవ్‌, జిల్లా జాయింట్‌ సెక్రటరీ కాంపెల్లి స్వామి, జిల్లా సెక్రటరీ కుమ్మరి పరమేష్‌, పెద్దపల్లి మండల అధ్యక్షుడు వెంగల కృష్ణ, పెద్దపల్లి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్ల ప్రశాంత్‌ తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

మంత్రి శ్రీధర్‌బాబు రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి డిమాండ్

రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతు గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా శనివారం మంథని పట్టణంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద రైతులతో కలిసి బీజేపీ నాయకులు మహాధర్నా నిర్వహించారు. అనంతరం రైతులు, బీజేపీ నాయకులు మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మంథని విద్యుత్‌ శాఖ డీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం కేవలం ఏడు గంటల విద్యుత్‌ కూడా సక్రమంగా అందించలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. విద్యుత్‌ సరఫరా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులకు సాగునీటి అవసరాలకు అనుగుణంగా నిరంతరాయంగా విద్యుత్‌ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సునీల్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే మంత్రి శ్రీధర్‌బాబు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. రైతులకు వెంటనే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మరింత పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అనంతరం విద్యుత్‌ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కొండపాక సత్యప్రకాష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, నియోజకవర్గ కో-కన్వీనర్‌ నంపెళ్లి రమేష్‌, మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్‌, సబ్బాని సంతోష్‌, కొయ్యడ సతీష్‌, పగే రంజిత్‌, కొండ్రు లక్ష్మణ్‌, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు ఎల్క సదానందం, సీనియర్‌ నాయకులు రాపర్తి సంతోష్‌, మట్ట శంకర్‌, దుర్గం తిరుపతి, మల్లారపు అరుణ్‌, చిలువేరు సతీష్‌, మల్లారెడ్డి, కోడారి దేవేందర్‌, ఎల్లవేణి సమ్మయ్య, సేనవేన సునీల్‌, పత్తి మహేందర్‌రెడ్డి, విశ్వతేజ, సామల అశోక్‌, ఎడ్ల సాగర్‌, భానుప్రకాశ్‌, తొట్ల రాజు, శంకర్‌, కసిపేట సాంబయ్య, మణుగు కొమురయ్య, విష్ణు, ప్రకాష్‌, గురువేష్‌, హేమంత్‌, సాయి, స్వరూప, రాజశేఖర్‌, ఆనంద్‌తో పాటు పలువురు రైతులు రమేష్‌, శ్రీనివాస్‌, రాజు, ఓదెలు, వెంకటేష్‌, రామూర్తి, సమ్మయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం

మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. మంథని లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 8న మంథని రూరల్, మంథని అర్బన్, ముత్తారం, రామగిరి ఎస్‌జీఎఫ్ (SGF) జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్‌ను ఘనంగా ప్రారంబించగా, క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన అవకాశాలు కల్పించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. “గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం – క్రీడల ద్వారా ప్రతిభకు ప్రోత్సాహం” అనే లక్ష్యంతో క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఈ పోటీల ద్వారా ప్రతిభను కనబరిచిన క్రీడాకారులు భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, నిర్వాహకులను ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మాచిడి రాజు గౌడ్, ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్, పీఈటి దొమ్మటి రవి, కొమురోజు శ్రీనివాస్, వివిధ పాఠశాలల ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

పోచమ్మ నూతన దేవాలయ నిర్మాణానికి గ్రానైట్, టైల్స్ బహూకరణ

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయానికి పాశం కొమురయ్య, గోవిందుల స్వామి కలిసి సుమారు రూ.లక్ష విలువైన గ్రానైట్, టైల్స్‌ను బహూకరించారు. ఆలయ నిర్మాణ పనులకు అవసరమైన గ్రానైట్, టైల్స్‌ను ఆలయ కమిటీ సభ్యులకు వారు స్వయంగా అందజేశారు.గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం ఎంతో సంతోషంగా ఉందని పాశం కొమురయ్య, గోవిందుల స్వామి తెలిపారు. దేవాలయ నిర్మాణం త్వరగా పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని వారు ఆకాంక్షించారు. గ్రామంలో దేవాలయ నిర్మాణం పూర్తయితే భక్తులకు పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.పోచమ్మ దేవాలయ నిర్మాణానికి గ్రామస్తులు, దాతలు, భక్తులు తమకు తోచిన విధంగా సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. దేవాలయ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందజేసిన పాశం కొమురయ్య, గోవిందుల స్వాములకు కమిటీ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం ఇతర దాతలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాశం కొమురయ్య, గోవిందుల స్వామి పాటు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

ఉత్తమ ఉపాధ్యాయులకు దళిత ప్రజా సంఘాల ఘన సన్మానం

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని దళిత ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఇటీవల సెప్టెంబర్ 5న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న దళిత సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు సీహెచ్. పోచయ్య, బహుత్ కిషోర్ లను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్‌లో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకోవడం గర్వకారణమని, ఉపాధ్యాయులు అందించిన సేవలకు లభించిన గుర్తింపుగా ఈ పురస్కారాలను భావించాలని అన్నారు. అవార్డులతో ఉపాధ్యాయులపై బాధ్యత మరింత పెరుగుతుందని, విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు. విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ఉపాధ్యాయుల నిజమైన విజయమని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తమకు లభించిన అవార్డుతో పాటు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మానం మరింత బాధ్యతను పెంచిందన్నారు. తమ సేవలను గుర్తించి గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ ప్రోత్సాహం విద్యార్థుల కోసం మరింత అంకితభావంతో పనిచేసేందుకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్ పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వేల్పుల గట్టయ్య, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మంథని లక్ష్మణ్, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కపాక సంపత్ కుమార్, తెలంగాణ అంబేద్కర్ సంఘం మంథని మండల అధ్యక్షులు కర్ణ కృష్ణ, దళిత నాయకులు కాసిపేట వెంకటస్వామి, కనుకుట్ల స్వామి, భూమన్న, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

మంథని ‘చదరంగం’ ఛాంపియన్ రామడుగు ప్రభాకర్ కన్నుమూత

మంథని ప్రాంతంలో చదరంగం ఆటకు జీవం పోసిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు రామడుగు ప్రభాకర్ (90) గురువారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, క్రీడాభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చదరంగంపై అపారమైన ఆసక్తి, పట్టుతో ఎందరో యువతకు ప్రభాకర్ స్ఫూర్తిగా నిలిచారు. మంథనిలో చదరంగాన్ని ప్రోత్సహించడంతో పాటు పలువురిలో ఆటపై ఆసక్తిని పెంచారు. ఆయన ప్రావీణ్యాన్ని గుర్తించి ఆ కాలంలో పలువురు ప్రేమతో ‘గ్రాండ్ మాస్టర్’ అని పిలిచేవారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి పదవీ విరమణ అనంతరం ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లారు. మంథనిలోని హరే రామ హరే కృష్ణ ఆశ్రమం స్థాపకుడిగా కొనసాగుతూ ప్రతినిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. నిరాడంబర జీవనశైలితో అందరితో ఆప్యాయంగా మెలిగారు. ప్రభాకర్‌కు భార్య రాధామణి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ మంచిర్యాల సాయిబాబా ఆలయంలో 35 సంవత్సరాలు పూజారిగా సేవలందించి, ప్రస్తుతం మంథనిలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో అర్చకులుగా కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు ఖతర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. చదరంగ ప్రోత్సాహకుడిగా, ఉపాధ్యాయుడిగా, ఆధ్యాత్మిక సాధకుడిగా ప్రభాకర్ అందించిన సేవలు మంథని ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు పేర్కొన్నారు. ఆయన మృతి మంథని ప్రాంతానికి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు.

పెద్దపల్లి

శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి

మంథని సీఐ బి. స్వామి రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2026 గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంథని పోలీసు స్టేషన్‌లో గురువారం సీఐ బి. స్వామి, ఎస్ఐ సందీప్ కుమార్ ల ఆధ్వర్యంలో మంథని పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహశీల్దార్ ఆరిఫోద్దీన్, మంథని మున్సిపల్ ఛైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, విద్యుత్ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని అధికారుల సమక్షంలో నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి బహిరంగ మండపం, శోభాయాత్ర వివరాలను policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. మండపం లోపల రెండు బాక్స్ రకం స్పీకర్లకు మాత్రమే అనుమతి ఉందనీ, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు వాడకూడదనీ, కేవలం భజనలకు మాత్రమే పరిమితం చేయాలనీ స్పష్టం చేశారు. రాజకీయ నినాదాలు, మద్యం వినియోగం, లక్కీ డిప్‌లు, బలవంతపు విరాళాల సేకరణ పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా కనీసం ముగ్గురు వాలంటీర్లను ఏర్పాటు చేసి వారి పేర్లను రిజిస్టర్‌లో నమోదు చేయాలనీ, పవర్ బ్యాకప్‌తో కూడిన సీసీటీవీ కెమెరాలను అమర్చాలనీ అన్నారు. ప్రభుత్వం గుర్తించిన స్థానిక చెరువుల్లోనే నిమజ్జనం చేయాలనీ, విగ్రహానికి ఒక వాహనం మాత్రమే ఉపయోగించాలనీ, నిమజ్జన వాహనాలపై డిజేలు లేదా స్పీకర్లకు అనుమతి లేదని తెలియజేశారు. అలాగే విద్యుత్ శాఖ నుంచి అనుమతి పొందిన కనెక్షన్లు మాత్రమే వాడాలనీ, విద్యుత్ వైర్ల హుకింగ్ చేయకూడదనీ, మండపాల వద్ద అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పెద్దపల్లి

మంథనిలో క్రైస్తవ కమ్యూనిటీ భవనానికి స్థలం కేటాయించాలని తహశీల్దార్‌కు వినతి

మంథని, సెప్టెంబర్ 10: మంథని పట్టణంలో క్రైస్తవ కమ్యూనిటీ భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మంథని డివిజన్ పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం స్థానిక తహశీల్దార్‌ ఆరిఫోద్దీన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు పాస్టర్ శ్రీనివాస్ పాల్ మాట్లాడుతూ.. భవన నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రూ. 50 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు. అయితే అనువైన స్థలం లభించక పనులు ప్రారంభం కాలేదని, వెంటనే భూమిని గుర్తించి కేటాయించాలని కోరారు. స్పందించిన తహశీల్దార్.. క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఎ. జోసెఫ్, ఎం. రామయ్య తదితరులు పాల్గొన్నారు.