అధిక లోడుతో వెళ్తున్న భారీ వాహనాలు
అధిక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు ప్రమాదాల పాలు అవుతున్న ప్రజలు ఏన్కూరు మండల గ్రామ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై అధిక లోడుతో వెళ్తున్న కంకర్, బూడిద ట్రాక్టర్లు ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఆదివారం ఉదయం తీసిన ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా, ట్రాక్టర్‌లో భారీగా కంకర్ లోడ్ వేసి నిర్లక్ష్యంగా రోడ్డుపై వెళ్తోంది. గ్రామీణ ప్రాంతాల రోడ్లు సన్నగా ఉండటంతో, ఇలాంటి భారీ వాహనాలు దూసుకెళ్తే ద్విచక్ర వాహనదారులు ప్రాణాలతో బతకడం కష్టంగా మారుతోంది. గ్రామ ప్రజలు చెబుతున్న వివరాల ప్రకారం, ఇటీవల ఈ మార్గంలో కంకర్ ట్రాక్టర్లు అధిక లోడుతో వెళ్ళడం వలన పలుమార్లు చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వర్షాకాలం కావడంతో రోడ్లు తడిగా ఉండటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ట్రాక్టర్ వెనుక భాగంలో సురక్షిత కవరింగ్ లేకపోవడం వలన కంకర్ తునకలు ఎగిరి వెనుక వెళ్తున్న వాహనదారులపై పడుతున్నాయని వారు తెలిపారు. స్థానికుల ఆవేదన ప్రకారం, అధికారులు ఈ సమస్యపై ఏ చర్యలు తీసుకోవడం లేదని, గ్రామ రహదారులపై రాత్రిపూట కూడా ట్రాక్టర్లు నిర్లక్ష్యంగా నడుస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. లైసెన్స్ లేకుండా రోడ్లపై దూసుకుపోతున్నారని, ఇది చట్టపరమైన నిబంధనలకు విరుద్ధమని గ్రామస్తులు పేర్కొన్నారు. వీటిపై ట్రాఫిక్ పోలీసులు, మైనింగ్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని, అధిక లోడుతో వెళ్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేయకపోతే, ఎప్పుడైనా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్థులు హెచ్చరించారు.









