జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు పాదయాత్ర ప్రారంభం
సుబ్లేడు, ఆగస్టు 22: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో పాదయాత్రకు శనివారం శ్రీకారం చుట్టారు. తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలోని అమర జర్నలిస్టు షోయబుల్లాఖాన్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం సాధించడమే పాదయాత్ర ప్రధాన లక్ష్యమని TWJF నాయకులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని వివిధ మండల కేంద్రాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. ఆయా ప్రాంతాల్లో జర్నలిస్టులతో కలిసి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్‌కు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు ప్రభుత్వం త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.



