ఓవర్‌లోడ్ లారీలపై ట్రాఫిక్ పోలీసుల కొరడా.. రూ.40,070 జరిమానా
ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ పరవాడ నుంచి కాకినాడ వెళ్తున్న రెండు ఓవర్‌లోడ్ లారీలను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకొని జరిమానా విధించారు. ఫ్లై యాష్ లోడ్‌తో వెళ్తున్న ఈ లారీలు అధిక లోడుతో పాటు రోడ్డుపై దుమ్ము పడేలా ప్రయాణిస్తుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో లారీకి రూ.20,035 చొప్పున మొత్తం రూ.40,070 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకల వల్ల ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రవాణా వాహనాల యజమానులు, డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. వాహనాల్లో నిర్ణీత పరిమితికి మించి సరుకులు రవాణా చేయకూడదని, ఫ్లై యాష్ వంటి సరుకులు రోడ్డుపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ఎస్‌ఐ రామకృష్ణ స్పష్టం చేశారు.









