Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: రిపోర్టర్ ఆనంద్

అనకాపల్లి

ఏటికొప్పాకలో ఎన్నికల సమరానికి శ్రీకారం.. రెండో వార్డులో తొలి నామినేషన్ దాఖలు!

యలమంచిలి : ఏటికొప్పాక గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏటికొప్పాకలో రాజకీయ సందడి మొదలైంది. రెండో వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు శెన్నంశెట్టి రామనాయుడు తొలి నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలోకి అడుగుపెట్టారు. రెండో వార్డు ప్రజల ఆశీస్సులు, ఆదరణతో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అన్నం వెంకటరావుకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతలపాటి రాజబాబు పాల్గొని అభ్యర్థులకు తన మద్దతు ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులకు ప్రజల ఆశీస్సులు కోరారు. దీంతో ఏటికొప్పాకలో పంచాయతీ ఎన్నికల సందడి మరింత ఊపందుకుంది.

అనకాపల్లి

మూడోసారి ఛైర్‌పర్సన్‌గా పిళ్లా రమాకుమారి ఎన్నిక.. ఏపీటీఎఫ్ అభినందనలు

యలమంచిలి: మూడోసారి యలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన పిళ్లా రమాకుమారిని ఏపీటీఎఫ్ (APTF) యలమంచిలి యూనిట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఉపాధ్యాయ నాయకులు, ఏపీటీఎఫ్ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని, పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ యలమంచిలి యూనిట్ సభ్యులు, ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.

అనకాపల్లి

కార్మిక హక్కుల కోసం డిసెంబర్ 1న చలో ఢిల్లీ.. సీఐటీయూ పిలుపు

కార్మిక సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్త ఉద్యమం జయప్రదం చేయాలి: ఆర్. శంకర్రావు అచ్చుతాపురం: కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డిసెంబర్ 1న నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్రావు పిలుపునిచ్చారు. అచ్చుతాపురంలో మండల కార్యదర్శి కె. సోమునాయుడు అధ్యక్షతన సీఐటీయూ మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయని విమర్శించారు. 12 ఏళ్లుగా కార్మికుల వేతనాలు పెరగకపోగా నిత్యావసర ధరలు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో 15 ఏళ్లుగా వేతనాల జీవోలు సవరించలేదని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని పేర్కొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలపై పోరాటానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఢిల్లీకి తరలిరావాలని కోరారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము, గొర్లి సత్తిబాబు, సత్యనారాయణ, లాలం వాసు, ఎల్. మాధురి, రాజన లక్ష్మి, రమణ, కె. పైడిరాజు, గోవిందరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చిత్రలేఖన పోటీలు

యలమంచిలి పాఠశాలల్లో విద్యార్థుల చిత్రకళా ప్రతిభకు ప్రోత్సాహం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని యలమంచిలి శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో నవంబర్ 17న వివిధ పాఠశాలల్లో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను రంగుల చిత్రాల ద్వారా ప్రదర్శించారు.యలమంచిలి స్టేషన్ రోడ్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సీహెచ్. భవానీ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, కిషోర్ పాల్గొన్నారు. అలాగే కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు జి. మంగపతిరావు ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఉపాధ్యాయులు సీహెచ్. రాజేశ్వరి, రామలక్ష్మి, అల్లూరి సూర్యకళ, భవానీ, తులసి, మల్లిక పాల్గొన్నారు.విద్యార్థుల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికితీసి, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

అనకాపల్లి

పంచాయతీ ఎన్నికల భద్రతపై ఐజీ ప్రత్యేక సమీక్ష..!

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి: విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి యలమంచిలి: విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం యలమంచిలి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కార్యాలయ రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. అనంతరం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఐజీ ఆదేశించారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ సమస్యల నియంత్రణపై దృష్టి సారించాలని, గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పరవాడ డీఎస్పీ బి. మోహనరావు, సీఐ ధనుంజయరావు, ఎస్సైలు ఉపేంద్ర, సావిత్రి, రామకృష్ణ, ప్రసాద్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

యలమంచిలి మండలంలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ!

8 కేంద్రాల్లో నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి.. అభ్యర్థులకు అధికారుల సూచన యలమంచిలి మండల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు సోమవారం అధికారిక ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మండల ఎన్నికల అధికారి, ఇన్‌ఛార్జ్ ఎంపీడీఓ వి. దీపిక, ఇన్‌ఛార్జ్ పంచాయతీ విస్తరణ అధికారి గిరిప్రసాద్ తదితరులు నోటిఫికేషన్‌ను ప్రచురించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ వి. దీపిక మాట్లాడుతూ నవంబర్ 18వ తేదీ బుధవారం నుంచి మండలంలోని ఎనిమిది కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏటికొప్పాక, బయ్యవరం, పులపర్తి, కృష్ణాపురం, పోతిరెడ్డిపాలెం, పురుషోత్తపురం, లైన్ కొత్తూరు, శేఖాలిపాలెం గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో నియమించిన స్టేజ్-1 ఎన్నికల అధికారుల సమక్షంలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలతో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.

అనకాపల్లి

యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం

జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వాగ్దేవి కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమావేశంతో పాటు గీతాంజలి, వాగ్దేవి కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. సోమేశ్వరరావు, రిటైర్డ్ అధ్యాపకులు ఆడారి పూరి జగన్నాథం, ప్రముఖ న్యాయవాది కూనిశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి భద్రత, వృత్తి గౌరవం, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గొల్లవిల్లి చిన్నాజి, కార్యదర్శి ధర్మిరెడ్డి అప్పలనాయుడు, సింహాచలం, అప్పికొండ గణేష్, నానేపల్లి సన్యాసిరావు, కిషోర్, గుమ్మెళ్ల గోవిందరావు, టీవీఎస్ ప్రకాష్, గిన్నె ఆదిరెడ్డి, ఆర్.ఎస్. నాయుడు, పల్లా రాజబాబు, కే. ఆనంద్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

అనకాపల్లి

భాష్యం స్కూల్‌లో ఘనంగా కరాటే బెల్ట్ గ్రేడింగ్..!

ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరం : మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రామకుమారి యలమంచిలిలోని ఎన్.వి.ఆర్. సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భాష్యం స్కూల్‌లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లా రామకుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఆత్మరక్షణ విద్య అవసరమని, మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు.ఈ గ్రేడింగ్ పరీక్షల్లో మొత్తం 32 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్లో బెల్ట్‌కు 11 మంది, గ్రీన్ బెల్ట్‌కు 12 మంది, ఆరెంజ్ బెల్ట్‌కు ముగ్గురు, బ్రౌన్ బెల్ట్‌కు ఆరుగురు పరీక్షలు రాశారు. బ్రౌన్ బెల్ట్ విభాగంలో ఎస్.కె. ఆఫ్రీన్, కే. హైతీ, బి. వైష్ణవి, పి. వర్షిణి, ఎస్.కె. ఆయేషా, ఎస్. జయసూర్య ప్రతిభ కనబరిచారు. రామచంద్రాపురానికి చెందిన బి.కె. రత్నం ఎగ్జామినర్‌గా వ్యవహరించారు.అకాడమీ నిర్వాహకులు శిహాన్ నక్కా వెంకట్రామన్ మాట్లాడుతూ కరాటే సాధన విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక బలాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ దాడి రమేష్, ప్రిన్సిపాల్ అనిమిరెడ్డి దేముడు బాబు, నక్కా శివశంకర్ రావు, టీవీఎస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

యలమంచిలిలో విగ్రహాల తయారీ షెడ్‌లో భారీ చోరీ

రూ.3 లక్షల విలువైన యంత్రాలు, సామగ్రి అపహరణ.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. యలమంచిలి నుంచి సైతారుపేట వెళ్లే ప్రధాన రహదారిలో పెంజెరువు ఎదురుగా ఉన్న విగ్రహాల తయారీ షెడ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. షాప్ వెనుక ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి సుమారు రూ.2 నుంచి 3 లక్షల విలువైన మోటార్లు, విగ్రహాల తయారీ అచ్చులు, యంత్రాలు, క్యాష్ టేబుల్‌తో పాటు ఇతర సామగ్రిని వ్యాన్‌లో తరలించినట్లు బాధితుడు డి. లోవరాజు తెలిపారు.తన జీవనాధారమైన వ్యాపారానికి సంబంధించిన సామగ్రి చోరీ కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. షాప్ పరిసరాల్లో గంజాయి సేవించడం, మద్యం సేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటంపై గతంలో పలుమార్లు అభ్యంతరం తెలిపితే బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనపై యలమంచిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు, దొంగలను గుర్తించి సామగ్రిని తిరిగి ఇప్పించాలని కోరారు. పెంజెరువు పరిసరాల్లో పోలీసుల నిఘా పెంచి రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అనకాపల్లి

కొక్కిరాపల్లిలో పచ్చదనం.. పరిశుభ్రతే లక్ష్యంగా గ్రామ జ్యోతి యువత శ్రమదానం!

యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు కొక్కిరాపల్లి గ్రామంలో గ్రామ పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గ్రామ జ్యోతి యువత ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం రెండు గంటల పాటు శ్రమదానం నిర్వహిస్తూ గ్రామాభివృద్ధిలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో గ్రామ ప్రధాన రహదారిపై సీతా రాజు ఇంటి నుంచి ఆర్.కె. లేఔట్ వరకు రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ రహదారులు పరిశుభ్రంగా ఉంటే విషపురుగులు, ప్రమాదకర జీవుల సంచారాన్ని అరికట్టవచ్చని, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల భూమి కలుషితం కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఒక్కరి బాధ్యత కాదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించి శ్రమదాన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ జ్యోతి యువత సభ్యులు దేవి ప్రసాద్, నాగేష్, లక్ష్మి, శ్రావణి, ధరిణి, ఓంకార్, యశ్వంత్, యువరాజ్, జయరాజ్, గోపేష్‌తో పాటు పలువురు చిన్నారులు పాల్గొన్నారు.