గోడ దూకి మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశం.. వ్యక్తిపై కేసు నమోదు
యలమంచిలి: పురపాలక సంఘం సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అక్టోబర్ 21న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నామినేషన్ల ఉపసంహరణకు నిర్ణయించిన గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన తర్వాత సోమలింగపాలెంకు చెందిన పిలా హరి గోవిందరావు మున్సిపల్ కార్యాలయం వెనుకవైపు ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించినట్లు ఎన్నికల అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విషయంపై సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన నివేదిక మేరకు పోలీసులు స్పందించి సదరు వ్యక్తిని కార్యాలయం నుంచి బయటకు పంపించారు. నిబంధనలను ఉల్లంఘించి కార్యాలయంలోకి ప్రవేశించిన ఘటనపై ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 331(1), 223 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.









