వాడ నరసాపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ
రాంబిల్లి: మండలంలోని వాడ నరసాపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ముఖ్యఅతిథిగా హాజరై కార్యకర్తలకు స్వయంగా గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ, దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డు కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు గుర్తింపు కల్పించడంలో ఈ కార్డులు కీలకమని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో కార్యకర్తలందరూ చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ధూళి నాగరాజు, మాజీ ఎంపీపీ శ్రీనుబాబు, నియోజకవర్గ నాయకుడు అప్పలసూరి మాస్టర్, ప్రచార కమిటీ అధ్యక్షుడు కోవిరి రామకృష్ణ, గ్రామ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









