రోడ్డు భద్రత, మహిళల రక్షణపై అవగాహన
లైనకొత్తూరు గ్రామంలో సోమవారం వీవోఏలు (VOAs), ఎంఎంఎస్ సభ్యులకు రోడ్డు భద్రత, మహిళలపై జరిగే నేరాల నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర, ట్రాఫిక్ ఎస్‌ఐ రామకృష్ణతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే మహిళలపై జరిగే వేధింపులు, ఇతర నేరాలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు మహిళల రక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర, ట్రాఫిక్ ఎస్‌ఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది పేర్కొన్నారు.









