Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు మేయర్ స్థానం అన్‌రిజర్వ్‌డ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు మేయర్ స్థానం అన్‌రిజర్వ్‌డ్

వార్త ముఖ్యాంశాలు

  • -రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాల రిజర్వేషన్లు ప్రకటన -నెల్లూరు స్థానాన్ని బీజేపీకి కేటాయించే అవకాశం -తెరవెనుక చక్రం తిప్పిన బీజేపీ , టీడీపీ ముఖ్య నేతలు?
  • రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద నగరమైన నెల్లూరు మేయర్ స్థానాన్ని ప్రభుత్వం అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించింది.
  • సోమవారం రాష్ట్రంలోని 17 మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాల రిజర్వేషన్లను ప్రకటించగా, అందులో తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మేయర్ స్థానాలను అన్‌రిజర్వ్‌డ్‌గా కేటాయించింది.

-రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాల రిజర్వేషన్లు ప్రకటన
-నెల్లూరు స్థానాన్ని బీజేపీకి కేటాయించే అవకాశం
-తెరవెనుక చక్రం తిప్పిన బీజేపీ , టీడీపీ ముఖ్య నేతలు?
రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద నగరమైన నెల్లూరు మేయర్ స్థానాన్ని ప్రభుత్వం అన్‌రిజర్వ్‌డ్‌గా ప్రకటించింది. సోమవారం రాష్ట్రంలోని 17 మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాల రిజర్వేషన్లను ప్రకటించగా, అందులో తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మేయర్ స్థానాలను అన్‌రిజర్వ్‌డ్‌గా కేటాయించింది.
నెల్లూరు మేయర్ స్థానాన్ని కూటమి బీజేపీకి కేటాయించే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ స్థానాన్ని బీజేపీకి దక్కించుకోవడంలో ఆ పార్టీ ముఖ్య నేతలు టీడీపీ లోని కొందరు నేతలతో కలసి తెరవెనుక చక్రం తిప్పినట్లు సమాచారం.
తొలుత ఈ స్థానం బీసీలకు రిజర్వ్‌ అవుతుందా, జనరల్‌ కేటగిరీలో ఉంటుందా అన్న అంశంపై విస్తృత చర్చ జరిగింది. ఏ కేటగిరీలో ఉన్నా కూటమి నుంచి ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా ఉన్న పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్ అభ్యర్థి అవుతారని పలువురు భావించారు. ప్రారంభంలో వార్తలు కూడా అదే విధంగా వినిపించాయి.
అయితే, నెల్లూరు మేయర్ స్థానం అన్‌రిజర్వ్‌డ్‌ కానుందనే విషయాన్ని ముందుగానే పసిగట్టిన బీజేపీ నేతలు, కూటమి పెద్దలతో చర్చించి ఈ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించేలా ఒప్పించడంలో సఫలమయ్యారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు మేయర్ అభ్యర్థిత్వాన్ని కూటమి బీజేపీకి కేటాయిస్తే అభ్యర్థి ఎవరన్న అంశంపై మరోసారి చర్చ మొదలైంది. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుటుంబం నుంచి అభ్యర్థి ఉంటారా? లేక జిల్లాకు చెందిన బీజేపీ నేతల్లో ఎవరైనా బరిలో ఉంటారా? అన్న ఊహాగానాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.
ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఆనం విజయకుమార్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు, గత కొద్ది రోజులుగా కూటమి అభ్యర్థి ఎవరన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. రిజర్వేషన్ల ప్రకటన వెలువడటంతో ఈ విషయంపై క్రమంగా స్పష్టత వస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ కు చెందిన సొంత నగరపాలక సంస్థ నెల్లూరు మేయర్ స్థానాన్ని బీజేపీకి కేటాయించే అవకాశం ఉండటం కూడా కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్‌కు టీడీపీ అభ్యర్థిత్వం దక్కుతుందని తొలుత వార్తలు రావడంతో టీడీపీ పార్టీలోని కొందరిలో అసంతృప్తి మొదలైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలతో నగరంలోని కొందరు టీడీపీ నేతలు కూడా కలిసి చక్రం తిప్పినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ, టీడీపీ ముఖ్య నేతల పరస్పర సహకారంతో టీడీపీ, జనసేన అధిష్ఠానాలు కూడా ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సోమవారం విడుదలైన రిజర్వేషన్ల సమాచారం ప్రకారం, మంగళగిరి–తాడేపల్లి మేయర్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు, కర్నూలును ఎస్సీ మహిళకు, రాజమహేంద్రవరాన్ని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. కాకినాడ, మచిలీపట్నం స్థానాలను బీసీ మహిళలకు కేటాయించగా, ఏలూరు, అనంతపురం, చిత్తూరు స్థానాలను బీసీ జనరల్‌కు కేటాయించారు.
విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, గ్రేటర్ విశాఖపట్నం మేయర్ స్థానాలను జనరల్ మహిళలకు కేటాయించారు. తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మేయర్ స్థానాలను అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీలో ఉంచారు.
అన్‌రిజర్వ్‌డ్‌ స్థానాల్లో కులం, మతం, వర్గం, లింగ బేధం తో సంబంధం లేకుండా అర్హత కలిగిన అభ్యర్థులు పోటీ చేయవచ్చు. మొత్తం ప్రకటించిన 17 స్థానాల్లో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు ఐదు, జనరల్ మహిళలకు ఐదు, అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీకి నాలుగు స్థానాలను కేటాయించారు.
నెల్లూరులో ఎన్నికల వేడి.. ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు
టికెట్ల కోసం ఆయా పార్టీల అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు
రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేయగలరా అంటూ ప్రశ్నలు వస్తున్నట్లు ప్రచారం
నెల్లూరు నగర మేయర్ స్థానం అన్‌రిజర్వ్‌డ్‌ అయిందని తెలియగానే నగరంలో ఎన్నికల వేడి మొదలైంది. కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆయా పార్టీల టికెట్ల కోసం ఆశావహులు అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు.
అయితే, టికెట్‌, బీ–ఫారం అంత సులువుగా దొరకవని, రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేయగల ఆర్థిక సామర్థ్యం ఉంటేనే టికెట్లు ఇస్తామని కొందరు నేతలు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు ఆశావహుల ఆశలు అడియాసలవుతున్నాయి. ఖర్చు చేయబోయే డబ్బును ముందుగానే చూపించాలనే షరతులు కూడా పెడుతున్నట్లు అక్కడక్కడా ప్రచారం వినిపిస్తోంది.
ప్రజల్లో మంచి పేరు ఉండాలని, గతంలో ప్రజలకు ఎంతో కొంత సేవ చేసి ఉండాలని, డివిజన్ పరిధిలోని ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని ఆయా పార్టీల నేతలు సూచిస్తున్నారు. డివిజన్‌లోని బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం. అవినీతి, అక్రమాల ఆరోపణలు లేనివారికే అవకాశమిస్తామని పేర్కొంటున్నారు.
ఇలాంటి షరతులు కొందరికి నచ్చకపోయినా, టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తమకు అవకాశం ఇస్తే తప్పకుండా గెలుస్తామంటూ ఆయా పార్టీల అగ్రనేతల వద్ద ఆశావహులు తమ బలాబలాలను వివరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *