Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

సంపతిపురం జంక్షన్‌లో గంజాయి పట్టివేత

అనకాపల్లి రూరల్ పోలీసుల వాహన తనిఖీల్లో రెండు కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు, అక్రమ రవాణాకు ఉపయోగించిన స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మండలంలోని సంపతిపురం జంక్షన్ వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. అనకాపల్లి రూరల్ ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంపతిపురం జంక్షన్ వద్ద పోలీసులు సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా,అనుమానాస్పదంగా వస్తున్న ఏపీ 40 ఎల్‌డబ్ల్యూ 8558 నంబరు గల స్కూటీని ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రెండు కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. విచారణలో నిందితుడిని చేపల ఉప్పాడ ప్రాంతానికి చెందిన దాసరి మధుసూదన్‌గా గుర్తించారు.ఒడిశా రాష్ట్రంలోని పాడువ సంత నుంచి గంజాయిని కొనుగోలు చేసి చేపల ఉప్పాడకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఏజెంట్‌గా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు, గంజాయిని కొనుగోలు చేసి వినియోగించడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై గతంలోనూ గంజాయి కేసు ఉన్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. నిందితుడి నుంచి రెండు కిలోల గంజాయితో పాటు, రవాణాకు ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ రవికుమార్ వెల్లడించారు.

అనకాపల్లి

పోలింగ్ కేంద్రాల తనిఖీ.. ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

రాంబిల్లి మండల పరిధిలోని కొత్తపట్నం, వడనర్సాపురం, పి.కె.పల్లి గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. ఆర్డీవో, రాంబిల్లి తహసీల్దార్ (ఎంఆర్ఓ), ఎంపీడీవో కలిసి ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర మౌలిక వసతులపై ఆరా తీశారు. ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా కేంద్రాలు ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులను కూడా సమీక్షించి, ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలింగ్ సమయంలో ఓటర్లు ఇబ్బందులు పడకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

అనకాపల్లి

ఎస్.రాయవరం బాలికల ఫుట్‌బాల్‌ దూకుడు.. రాష్ట్ర జట్టుకు ఇద్దరు విద్యార్థినులు!

ఎస్.రాయవరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌-14 ఫుట్‌బాల్ సెలక్షన్ పోటీల్లో పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు మహ్మద్ హాలీ మున్నిసా, టి.హారిక ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో చోటు సంపాదించారు. కోటవురట్ల ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో వీరు తమ ఆటతీరుతో సత్తా చాటారు. విద్యార్థినులు రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీసం ప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందం, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ స్వాతి, వైస్ చైర్మన్ లక్ష్మి విద్యార్థినులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అనకాపల్లి

ఓవర్‌లోడ్‌ లారీలపై ట్రాఫిక్ పోలీసుల కొరడా.. రూ.40,070 జరిమానా

ట్రాఫిక్ ఎస్‌ఐ రామకృష్ణ పరవాడ నుంచి కాకినాడ వెళ్తున్న రెండు ఓవర్‌లోడ్‌ లారీలను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకొని జరిమానా విధించారు. ఫ్లై యాష్‌ లోడ్‌తో వెళ్తున్న ఈ లారీలు అధిక లోడుతో పాటు రోడ్డుపై దుమ్ము పడేలా ప్రయాణిస్తుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో లారీకి రూ.20,035 చొప్పున మొత్తం రూ.40,070 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. రహదారులపై ఓవర్‌లోడ్‌ వాహనాల రాకపోకల వల్ల ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రవాణా వాహనాల యజమానులు, డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. వాహనాల్లో నిర్ణీత పరిమితికి మించి సరుకులు రవాణా చేయకూడదని, ఫ్లై యాష్‌ వంటి సరుకులు రోడ్డుపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ఎస్‌ఐ రామకృష్ణ స్పష్టం చేశారు.

అనకాపల్లి

ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి

దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది ఓటర్ల పేర్ల తొలగింపునకు నిరసనగా పూడిమడకలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము, మత్స్య కార్మిక సంఘం నాయకుడు చేపల తాతయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకే ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్లు తొలగించారని ఆరోపించారు. పేదలు, కార్మికులు, మైనారిటీలు, వలస కార్మికులు, మహిళలు ఈ తొలగింపుల వల్ల ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 45 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల తొలగింపులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసుపల్లి సతీష్, కాసులు, చిన్నయ్య తాత తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఆటో డ్రైవర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ

పెద్దపల్లి దిమిలి ఆటో స్టాండ్ సభ్యులకు సూచనలు పెద్దపల్లి దిమిలి ఆటో స్టాండ్ సభ్యులతో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఆటోలను ప్రవేశపెట్టరాదని, ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రామకృష్ణ సూచించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, రికార్డులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటో స్టాండ్ సభ్యులందరూ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.

అనకాపల్లి

జంపాపాలెంలో పల్లె నిద్ర.. శాంతిభద్రతలపై అవగాహన కల్పించిన రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర

జంపాపాలెం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు, అధికారులకు సహకరించాలని ఎస్‌ఐ ఉపేంద్ర సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, అనవసర వివాదాలు సృష్టించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేందుకు గ్రామస్తులు, రాజకీయ నాయకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర కోరారు.

అనకాపల్లి

మరిడిమాంబ అమ్మవారిని దర్శించుకున్న నేతలు

యలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండగ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ గొంతిన వెంకట హరీష్ గారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు యలమంచిలి మండల పార్టీ అధ్యక్షులు ఇత్తంశెట్టి నాయుడు గారు, గ్రామ సర్పంచ్ శిల్పరశెట్టి నాయుడు గారు, కర్రీ అప్పన్న గారు, కర్రీ శ్రీను గారు, శిల్పరశెట్టి రామచంద్ర గారు, దాడి లోకేష్ గారు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పండగ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయ పరిసరాల్లో భక్తులతో సందడి నెలకొంది. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

అనకాపల్లి

సేవలకు వీడ్కోలు.. సత్యనారాయణకు ఘన సత్కారం

మునగపాకలో ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం మునగపాక: యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం మునగపాక గ్రామంలో గురువారం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు గారి భర్త ఆడారి సత్యనారాయణ గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుదీర్ఘకాలం విధుల్లో బాధ్యతాయుతంగా సేవలందించిన సత్యనారాయణ గారిని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు. మాజీ శాసనసభ్యులు శ్రీ పప్పల చలపతిరావు గారు, గొంతిన వెంకట హరీష్ గారు తదితరులు కార్యక్రమానికి హాజరై సత్యనారాయణ గారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో ఆనందంగా గడుపుతూ సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

టీబీపై పోరులో లైనకొత్తూరు విజయం.. ‘టీబీ ఫ్రీ’ బ్లాక్‌గా ఎంపిక

యలమంచిలి మండలంలోని లైనకొత్తూరు గ్రామపంచాయతీ టీబీ రహిత ప్రాంతంగా (TB Free Block) ఎంపికైంది. 2030 నాటికి దేశంలో టీబీని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా లైనకొత్తూరుకు ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా యలమంచిలి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీవో, రేగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి, ఏఓ శ్రీనివాసరావు చేతుల మీదుగా టీబీ ఫ్రీ అవార్డును అందజేశారు. గ్రామస్థాయిలో టీబీ కేసులను ముందుగానే గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, బాధితులకు నిరంతరం చికిత్స అందించడం వంటి చర్యలతో ఈ గుర్తింపు సాధ్యమైందని అధికారులు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీని టీబీ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీవై ఎంపీడీవో అనంతనాగు, పంచాయతీ కార్యదర్శి గిరిప్రసాద్, టీబీ సూపర్‌వైజర్ సత్యనారాయణ, రాధిక, ఎంఎల్‌హెచ్‌పీ ఝాన్సీరాణి, ఏఎన్‌ఎం కుమారి, ఆశా కార్యకర్తలు లక్ష్మీ, రమణకుమారి పాల్గొన్నారు.