Thursday, 23 April 2026

Blog

News

బుగ్గారం మండల కేంద్రంలో కాకుండా షేకళ్లలో శిక్షణనా…? ఎటు పోతోంది పరి పాలన – ఏమౌతోంది ప్రజా స్వామ్యం…?? బుగ్గారం కు ఇంకా కూడా అన్యాయమేనా…??? గళమెత్తి గర్జిస్తున్న మహిళా వార్డ్ సభ్యురాలు

బుగ్గారం మండల కేంద్రంలో కాకుండా షేకళ్లలో శిక్షణనా…? ఎటు పోతోంది పరి పాలన – ఏమౌతోంది ప్రజా స్వామ్యం…?? బుగ్గారం కు ఇంకా కూడా అన్యాయమేనా…??? గళమెత్తి గర్జిస్తున్న మహిళా వార్డ్ సభ్యురాలు బుగ్గారం / జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కాకుండా శేఖల్ల గ్రామ రైతు వేదికలో ఈనెల 6 నుండి 10 వరకు ఐదు రోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాల నూతన వార్డ్ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని శనివారం రాత్రి నోటీసులు జారీ చేశారు. షేకళ్లలో శిక్షణనా…? ఇది పూర్తిగా అన్యాయం, పూర్తిగా ఇబ్బంది కరం, అసౌకర్యం కూడా అని బుగ్గారం గ్రామ పంచాయతీ 11 వ వార్డ్ సభ్యురాలు చుక్క లతశ్రీ ఆరోపించారు. అధికారులు, పాలక వర్గం ఆలోచించాలని, పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు పునరాలోచన చేసి ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. మండల కేంద్రంలోనే వార్డ్ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె అభ్యంతరం తెలుపుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయి సంబంధిత అధికారులతో పాటు సాక్షాత్తు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లకు కూడా సోషల్ మీడియా వేదికగా సందేశం పంపించినట్లు తెలిపారు. నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉన్నతాధికారులు సైతం ఇంకా కూడా మండల కేంద్రమైన బుగ్గారం గ్రామానికి తీరని అన్యాయం చేసే కుట్రలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్ర పూరిత చర్యలు ఇలాగే కొనసాగితే తగు న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆమె హెచ్చరించారు.

తిరుపతి

మనిషిని ఆధ్యాత్మికంగా నడిపించే దివ్య సాధనం యోగా-యోగాచార్యులు మార్కండేయులు

నేటి ఆధునిక కాలంలో మానవ సమాజం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, శారీరక సవాళ్లకు యోగాభ్యాసమే సరైన పరిష్కారమని ప్రముఖ యోగాచార్యులు మార్కండేయులు పిలుపునిచ్చారు. స్వర్గీయ శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానంద స్వామివారిచే స్థాపించబడిన పవిత్ర శ్రీ శుకబ్రహ్మాశ్రమం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగ శిక్షణ శిబిరం శనివారంతో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా పరిచయ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు విద్యా వికాస పరిషత్ తరపున సర్టిఫికేట్లను అందజేశారు. ఈ వేడుకలో యోగాచార్యులు మార్కండేయులు మాట్లాడుతూ.. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది మన ప్రాచీన భారతీయ మనో-శారీరక దివ్య సాధన అని పేర్కొన్నారు. శారీరక భంగిమలు (ఆసనాలు), శ్వాస పద్ధతులు (ప్రాణాయామం), ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించవచ్చని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్యకృత్యం చేసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు భాస్కర్ నాయుడు, రాజేశ్వరరావు పాల్గొని శిక్షణార్థులకు పలు సూచనలు చేశారు. సర్టిఫికేట్లు అందుకున్న వారిలో యోగాభ్యాసకులు నివేదిత, రేణుశ్రీ సరస్వతీ, మణిదీప్ తదితరులు ఉన్నారు. ఆశ్రమ భక్తులు, యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

తిరుపతి

రేపటి నుంచే అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ: ఐసీడీఎస్ సీడీపీఓ శాంతిదుర్గ వెల్లడి

శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహాయక (హెల్పర్) పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు శ్రీకాళహస్తి ఐసీడీఎస్ (ICDS) సీడీపీఓ బి. శాంతిదుర్గ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 36 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నియామకాలు జరగనున్నాయని, అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తు తేదీలు: ఈ నెల 6వ తేదీ (సోమవారం) నుండి 15 రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించబడతాయి. వయస్సు: 01.07.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుండి 35 ఏళ్ల లోపు ఉండాలి. నిబంధనలు: ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్లలోని కేంద్రాలకు సంబంధిత సామాజిక వర్గ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తప్పనిసరిగా స్థానికులై ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారాలను పొంది, వాటితో పాటు క్రింది ధృవీకరణ పత్రాలను జతచేయాలి. 1. పదవ తరగతి మార్కుల మెమో. కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC అయితే). 2. నివాస ధృవీకరణ పత్రం. 3. పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం.4. ఆధార్ కార్డు నకలు. 5. వికలాంగులైన పక్షంలో సంబంధిత ధృవీకరణ పత్రం. ప్రభుత్వ జి.ఓ. నెం. 13 (26.06.2019) ప్రకారం, అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 11,500/-, సహాయకులకు (హెల్పర్స్) నెలకు రూ. 7,000/- గౌరవ వేతనం చెల్లించబడుతుందని సీడీపీఓ వివరించారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు నేరుగా శ్రీకాళహస్తిలోని ఐసీడీఎస్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ఆమె సూచించారు.

తిరుపతి

ఏర్పేడు ఐఐటీలో పరిశోధన చేసే సువర్ణావకాశం-జేఆర్ఎఫ్ (JRF) భర్తీకి నోటిఫికేషన్

ఏర్పేడు, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఐఐటీ తిరుపతి (ఏర్పేడు) లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పొందేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న యువతకు ఇది ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి M.Tech (కెమికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్) లేదా M.Sc (కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్) పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగాల్లో ప్రావీణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ తిరుపతి అధికారిక వెబ్‌సైట్ https://www.iittp.ac.in/Project_Positions ను సందర్శించి, ప్రాజెక్ట్ పొజిషన్స్ విభాగంలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వయస్సు, ఎంపిక విధానం, పారితోషికం వంటి పూర్తి సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 15. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

తిరుపతి

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత-ప్రజా సాధికారిక ట్రస్ట్ పిలుపు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలం, వేడం పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో “భూమి హిత” పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాన్ని శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, భూమిహితులకు పర్యావరణ ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా విచ్చలవిడిగా పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ఇంటింటికీ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అవగాహన కల్పించారు. గ్రామీణ స్థాయిలో పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బాలాజీ నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వెంకమ్మ, ఆర్గనైజర్ కళ్యాణి, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పర్యావరణ పరిరక్షణకు తాము సైతం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

తిరుపతి

న్యాయవాది నుంచి జడ్జి వరకు..ఉమా మహేష్ విజయయాత్ర అభినందనీయం!

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల విడుదల చేసిన జూనియర్ సివిల్ జడ్జి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన స్థానిక యువ న్యాయవాది తిరుకాల ఉమా మహేష్ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తన శిష్యుడిని సీనియర్ న్యాయవాది సున్నపు లక్ష్మీపతి రెడ్డి తన కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి రెడ్డి మాట్లాడుతూ.. ఉమా మహేష్ న్యాయవాద వృత్తిని స్వీకరించిన నాటి నుండి ఎంతో క్రమశిక్షణతో మెలిగారని, న్యాయ వ్యవస్థపై ఆయన చేసిన లోతైన అధ్యయనమే నేడు ఈ ఉన్నత స్థానానికి చేర్చిందని ప్రశంసించారు. ఉమా మహేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తిరుకాల మల్లికార్జున గౌడ్, సుమతి, సోదరుడు సోహిత్ పడిన కష్టానికి, ఉమా మహేష్ సాధించిన విజయంతో సరైన ఫలితం లభించిందని కొనియాడారు. ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాదులు బషీర్ అహ్మద్, , మోహన్ బాబు తదితరులు ఉమా మహేష్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆయన విజయ ప్రయాణం తోటి యువ న్యాయవాదులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

తిరుపతి

తృటిలో తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ సిబ్బంది ప్రాణాలు తీయబోయిన ఆకతాయిలు!

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని స్థానిక దక్షిణ కైలాస్ నగర్ కాలనీలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ సిబ్బంది ప్రాణాలు ఆకతాయిల నిర్వాకం వల్ల గాల్లో దీపాల్లా మారాయి. అమరావతి వీధిలో లో-వోల్టేజ్ సమస్యతో వృద్ధులు, చిన్నపిల్లలు పడుతున్న ఇబ్బందులను గమనించిన విద్యుత్ సిబ్బంది, సమాచారం అందిన వెంటనే స్పందించి మరమ్మతులకు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేసి (ఆఫ్ చేసి), ఇద్దరు లైన్ మెన్లు పోల్ ఎక్కి వైర్లను సరిచేస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఇతర ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో అక్కడికి వచ్చి, సిబ్బంది పోల్‌పై ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా మొండిగా ట్రాన్స్‌ఫార్మర్ ఆన్ చేశారు. దీంతో ఒక్కసారిగా లైన్లోకి విద్యుత్ ప్రవహించింది. అప్రమత్తంగా ఉన్న లైన్ మెన్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. మద్యం మత్తులో ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడిన ఆ ఇద్దరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య పనులు పునరావృతం కాకుండా పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

తిరుపతి

జనసేన కార్యకర్త కుటుంబానికి రూ. 5 లక్షల ప్రమాద బీమా

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాళహస్తి నియోజకవర్గం,పట్టణంలోని గోపాల వనం వీధికి చెందిన జనసేన కార్యకర్త బుర్ర ప్రియాంక కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. పార్టీ తరపున మంజూరైన రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం అందజేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఈ చెక్కును ప్రియాంక భర్త బుర్ర చైతన్యకాంత్‌కు అందజేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జనసేన యువ నాయకుడు పసుపులేటి నవీన్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అధినేత పవన్ కల్యాణ్ గారు దూరదృష్టితో ప్రవేశపెట్టిన ‘క్రియాశీలక సభ్యత్వ’ పథకం నేడు బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోందని అన్నారు. శ్రీకాళహస్తిలో ఈ బీమా ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించిన నవీన్ కుమార్‌కు మృతురాలి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆనంతరం తాళ్లూరి రామ్ మాట్లాడుతూ..ప్రాణాలు కోల్పోయిన ప్రతి జనసైనికుడి కుటుంబం రోడ్డున పడకూడదన్నదే పార్టీ ఆశయమని, సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవలి ఘటనలు సభ్యత్వం యొక్క ప్రాముఖ్యతను చాటి చెబుతున్నాయని, యువత అధిక సంఖ్యలో సభ్యత్వం పొంది ఈ భరోసాను వినియోగించుకోవాలని నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దండి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య – ముస్తాబాద్‌లో విషాదం

ముస్తాబాద్ /ఏప్రిల్/ పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ డబుల్ బెడ్రూం కాలనీ సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న పద్మశాలి సంఘానికి చెందిన మారెళ్ళి శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ అప్పుల బాధను తట్టుకోలేక ఈ రోజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల ఒత్తిడితో తీవ్ర మనస్థాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం వారి కుటుంబ పరిస్థితి చాలా ధీన స్థితిలో ఉంది. అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. దయచేసి మానవతా దృక్పథంతో దాతలు, మంచి మనసున్న వారు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సహాయం చేయవలసిన ఫోన్ పే / గూగుల్ పే నంబర్: 9603115524 – మారెళ్ళి స్వరూప

ఆంధ్రప్రదేశ్

*లౌకికవాదం విషయంలో రాజీపడం* *కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌*

తిరువనంతపురం: ఏ దశలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా లౌకికవాదం విషయంలో ఎల్డీఎఫ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పునరుద్ఘాటించారు. తిరువనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్డీఎఫ్‌ అనుసరిస్తున్న దఢమైన మతతత్వ వ్యతిరేక వైఖరి కారణంగానే గత పదేండ్లుగా కేరళలో మత ఘర్షణలు, హింసకు తావు లేకుండా ప్రశాంతత నెలకొని ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎస్‌డీపీఐ మద్దతును ఎల్డీఎఫ్‌ కోరిందన్న ఆరోపణలను ముఖ్యమంత్రి పూర్తిగా తిరస్కరించారు. నెమోం నియోజకవర్గంలో ఎస్‌డీపీఐ సహాయాన్ని ఎల్డీఎఫ్‌ కోరలేదని స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గంలోని ప్రత్యేక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. 2016లో నెమోంలో బీజేపీ గెలవడానికి కాంగ్రెస్‌ పరోక్షంగా మార్గం సుగమం చేసిందని, అయితే 2021లో ఎల్డీఎఫ్‌ మాత్రం బీజేపీ ఖాతాను మూసివేసిందని ఆయన గుర్తుచేశారు. కేరళలోనూ, దేశవ్యాప్తంగానూ బీజేపీ గెలవకూడదని కోరుకునే శక్తులు అనేకం ఉన్నాయని, బీజేపీని ఓడించడానికి అత్యంత విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం ఎల్డీఎఫ్‌ మాత్రమేనని గుర్తించి ప్రజలు దానికి ఓటు వేస్తున్నారని ఆయన తెలిపారు. రాజకీయంగా ఎల్డీఎఫ్‌తో అన్ని విషయాల్లో ఏకీభవించని వారు కూడా బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడం కోసమే దానికి ఓటు వేశారని, ఇది ఏ రహస్య ఒప్పందం లేదా బేరసారాల ఫలితం కాదని ఆయన స్పష్టం చేశారు. కేరళ అభివృద్ధికి సంబంధించిన చర్చను ఎదుర్కోలేని వారే ఇలాంటి ‘కృత్రిమ ఆరోపణల తెర’ను సృష్టించాల్సిన అవసరం ఏర్పడుతోందని పినరయి విజయన్‌ అన్నారు. ”ఎటువంటి ఆరోపణల తెర మమ్మల్ని ప్రభావితం చేయలేదు. ఏ మతతత్వ శక్తిపైనా ఆధారపడాల్సిన అవసరం మాకు లేదు. అటువంటి ఆరోపణలను మాపై మోపగలమని ఎవరూ భ్రమపడకూడదు.” అని స్పష్టం చేశారు. వామపక్షాలు ఎల్లప్పుడూ మతతత్వానికి వ్యతిరేకంగానే నిలిచాయని, మతతత్వ శక్తులతో ఎప్పుడూ ఏ ఒప్పందంలోనూ భాగస్వామ్యం కాలేదని ఆయన అంతే దృఢంగా స్పష్టం చేశారు. ”చరిత్రను పరిశీలించండి. ఆ ప్రశ్నకు అదే సమాధానం చెబుతుంది,” అని ఆయన సూటిగా వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్‌, బీజేపీలకు అనుకూలంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ చరిత్ర అందరికీ తెలిసిందేనని, కాంగ్రెస్‌ నేటికీ తన పాత ‘మృదు హిందుత్వ’ విధానాన్నే కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మాయమాటల ప్రచారాలు ఎల్‌డీఎఫ్‌పై ఎలాంటి ప్రభావం చూపలేవని ఆయన నొక్కిచెప్పారు.వామపక్షంపై తప్పుడు చిత్రాన్ని గీయడానికి మితవాద వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, అటువంటి ప్రచారం వారిని ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. తాము కోరుకున్న సమాధానాలు లభించకపోవడంతో మీడియాలో నెలకొన్న నిరాశ కూడా స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్‌డీఎఫ్‌ మతతత్వ శక్తుల ఓట్లను కోరుకోవడం లేదని పునరుద్ఘాటిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఈ రాష్ట్రం ఎదుర్కొన్న అత్యంత తీవ్రమైన ముప్పు అయిన మెజారిటీ మతతత్వాన్ని వామపక్షాలు తమ చరిత్ర పొడవునా స్థిరంగా వ్యతిరేకించాయని, మైనారిటీలను రక్షించడానికి పటిష్టమైన చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. రాజకీయ లబ్ది కోసం ఎల్‌డీఎఫ్‌ మెజారిటీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తోందని చిత్రీకరించే ఏ ప్రయత్నమూ సఫలం కాదని ఆయన అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.