Sunday, 26 April 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తిలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి–విగ్రహ ప్రతిష్ఠకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సోమవారం నాడు స్థానిక శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటగా ఆయన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ…తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారని ఆయన చేసిన త్యాగం ఫలితంగానే దేశంలో భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వచ్చే ఏడాది జయంతి నాటికి శ్రీకాళహస్తి పట్టణంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సగర్వంగా ప్రకటించారు. ఆయన ఆశయాలు, త్యాగస్ఫూర్తి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా మనమందరం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, కూటమి నాయకులు, పలువురు అధికారులు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకున్నారు.

సాహితీ

ఆంధ్ర రాష్ట్ర పితామహుడు స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు – డాక్టర్ బద్రి పీర్ కుమార్

1901 మార్చి 16న మద్రాసులో జన్మించి మద్రాసు ప్రెసిడెన్సీ నుండి తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి డిసెంబర్15, 1952న ప్రాణాలర్పించి ‘ఆంధ్ర రాష్ట్ర పితామహుడు’ గా కీర్తించబడిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన బలిదానం తర్వాతే 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇది దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికింది. ఆయన స్మృత్యర్థం 2008లో నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ప్రభుత్వం పేరు మార్చింది. తన 125వ జయంతి రోజు అమరావతిలో ఆయన గౌరవార్థం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అనే పేరుతో ఒక భారీ విగ్రహాన్ని మరియు స్మృతి వనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఈ కవిత *అ* అందరి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రము కావాలని *మ* మద్రాస్ ప్రెసిడెన్సీలో మార్పులు రావాలని *ర* రణముచేయని రాజీపడని స్వాతంత్ర్య సమరయోధుడు *జీ* జీవం తెలుగు రాష్ట్రం కోసం అన్న దీక్షపరుడు *వి* విశ్వాసాన్ని ఊపిరిగా చేసుకున్న త్యాగధనుడు *శ్రీ* శ్రీకారం తెలుగుజాతి ఆకారంగా మలచగ *పొ* పొదిగి ఒదిగి ఎదిగిన దేశభక్తి నాయకత్వం *ట్టి* ఏట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగెయ్యని భావతత్వం *శ్రీ* శ్రీరస్తుగ గాంధేయ మార్గంలో ప్రయాణించగ *రా* రాజ్యాధినేతలను ఆలోచింపజేయగ *ము* ముదావహమైన త్యాగస్పూర్తితో అమరుడై *లు* లుప్తశరీరము నేడు 58 అడుగుల విగ్రహమై (అమరావతిలో) *జ* జనం మదిలో నూతన ఆంధ్రావతరణ ప్రకాశమై *యం* యంత్రాంగపాలన సత్సంగ జనతరంగమై *తి* తిరుగులేని మహాత్ముని ఆత్మీయ అమరజీవి ఆంధ్రుల నిత్య ఆరాధ్య సంజీవి తెలుగు ప్రజల మనోఫలకం చెక్కిన చిరంజీవి

తిరుపతి

ఎర్పేడు, మేర్లపాకలో అస్తవ్యస్తంగా రేషన్ పంపిణీ –నిరాశతో వెనుతిరుగుతున్న లబ్ధిదారులు

ఏర్పేడు, మార్చి 16 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండల పరిధిలోని మేర్లపాక గ్రామాల్లో నిరుపేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు తమ సమస్యలను బయటపెట్టేందుకు రోడ్డెక్కుతున్నారు. సాధారణంగా ప్రతి నెలా 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ జరగాల్సి ఉండగా, కేవలం రెండు మూడు రోజుల్లోనే ‘స్టాక్ అయిపోయింది’ అంటూ డీలర్లు చేతులెత్తేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో రేషన్ కోసం వచ్చిన వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రత మధ్య క్యూలలో వేచి ఉండలేక కొందరు స్పృహ తప్పి పడిపోయి ఆస్పత్రి పాలైన సంఘటనలు కూడా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. 16వ తేదీ వచ్చినా బియ్యం పంపిణీ జరగలేదని, అడిగితే సరైన సమాధానాలు ఇవ్వడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. రేషన్ కోసం ఆశగా వచ్చిన లబ్ధిదారులు చివరకు ఖాళీ సంచులతోనే వెనుతిరుగుతున్న దుస్థితి నెలకొంది. మా బియ్యం మాకు ఎందుకు సక్రమంగా ఇవ్వడం లేదంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మేర్లపాక గ్రామ ప్రజలు మాట్లాడుతూ, తమ గ్రామాల్లో రేషన్ బియ్యం సక్రమంగా అందేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేదల ఆకలితో చెలగాటం ఆడవద్దని, ఇప్పటికైనా యంత్రాంగం మేల్కొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.

తిరుపతి

సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం – పాటలు, నాటికలతో గ్రామస్తుల్లో చైతన్యం

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తొట్టంబేడు మండలంలోని దిగువసంబాయిపాలెం, గుమ్మడిగుంట గ్రామాలు, శాస్త్రి గిరిజన కాలనీలో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయ వాహిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో, టాటా ట్రస్ట్స్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఆరోగ్యకర జీవన విధానం గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా శరీరానికి అవసరమైన పోషకాహారం, విటమిన్ల ప్రాముఖ్యత, అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం, అలాగే పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా లభించే పోషకాల గురించి వివరంగా తెలియజేశారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమని నిపుణులు వివరించారు. అదేవిధంగా బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలు, చిన్న వయసులో గర్భధారణ వల్ల తల్లి-శిశువులకు కలిగే ఆరోగ్య సమస్యలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ అంశాలను మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరవేసేందుకు జయరావు కళాబృందం పాటలు, నాటికల రూపంలో ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ప్రదర్శనలు గ్రామస్తులను ఆకట్టుకోవడంతో పాటు సామాజిక సమస్యలపై చైతన్యం పెంచాయి. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మరియమ్మ, విజయ వాహిని ఫౌండేషన్ ప్రోగ్రాం అసోసియేట్ వి. లక్ష్మి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామస్తులు, అంగన్వాడి సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు.

తిరుపతి

ప్రజల సమస్యల పరిష్కారమే టిడిపి లక్ష్యం – ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ‘ప్రజా వినతుల స్వీకరణ’ కార్యక్రమాన్ని నిర్వహించి నియోజకవర్గ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించగా, ఆయన ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా పాలనను ప్రజల ముంగిటకే తీసుకువస్తోందన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన పలువురు వినతులపై వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారం దిశగా అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన రాజకీయ ప్రయాణానికి ప్రధాన ఉద్దేశ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

తిరుపతి

తొట్టంబేడు మండలంలో ట్రాన్స్ఫార్మర్ చోరీలు….పంటలకు నీరు లేక రైతుల ఆవేదన

తొట్టంబేడు, మార్చి 16 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలంలోని పెద్ద కనపర్తి, దయనేడు, చిట్టత్తూరు గ్రామాల్లో గత మూడు రోజులుగా వరుసగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురవుతున్న ఘటనలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించడంతో వరి పైరుకు చివరి తడి నీళ్లు కూడా వేయలేక రైతులు గుండెలు బాదుకుంటున్నారు. రాత్రింబవళ్లు కష్టపడి పంటలు పండించిన రైతులు, అప్పు సప్పు చేసి మోటార్లు కొనుగోలు చేసి సాగు చేసినా ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ చోరీలతో పంటకు నీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనపర్తి గ్రామానికి చెందిన నెలవల గురవయ్య, రాఘవయ్య, రామ్మూర్తి, దయనేడు గ్రామానికి చెందిన జగదీష్, చిట్టత్తూరు గ్రామానికి చెందిన వి.సుబ్రహ్మణ్యం, పి.ప్రకాశ్ రెడ్డి, జై చిరంజీవి రెడ్డి లకు చెందిన ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించబడినట్లు రైతులు తెలిపారు. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా ఎస్ఐ బాలకృష్ణ మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్లు చోరీకి గురైన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

తిరుపతి

గ్రామాలన్నింటికి శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రచార రథం- దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ప్రచార రథాన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలకు పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గంలోని మొత్తం 135 గ్రామ పంచాయతీల్లో ఈ ప్రచార రథం తిరుగుతూ ఆలయ ప్రాశస్త్యం, పూజలు, సేవలు, ఉత్సవాల వివరాలను భక్తులకు తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రచార రథం ద్వారా ఆలయంలో భక్తులకు అందిస్తున్న సదుపాయాలు, పూజా టిక్కెట్ల వివరాలు, వివిధ సేవలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే దేవస్థానం అద్దె గదుల్లో బస చేసే భక్తులకు అన్నప్రసాదం అందించే చర్యలు తీసుకున్నట్లు కొత్త ఈఓ బీకే వెంకటేశులును ఆయన అభినందించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్ నుంచి దేవస్థానం వరకు ఉచిత బస్సులు నడిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. చైర్మన్ ఛాంబర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు పై వస్తున్న విమర్శలను ఖండించిన ఆయన, ఆలయంలో అవినీతి మరియు అక్రమాలను అరికట్టేందుకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు. ట్రస్ట్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రచార రథాన్ని ప్రతి గ్రామానికి పంపేలా అనుమతి తీసుకుంటామని తెలిపారు.

తిరుపతి

తొట్టంబేడు ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగాఅమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

తొట్టంబేడు, మార్చి 16 (పున్నమి న్యూస్): ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా తొట్టంబేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నాడు ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పి. సురేంద్రనాథ్, డిప్యూటీ ఎంపీడీఓ (ఎస్‌జి‌ఎస్‌డబ్ల్యూ) భార్గవ సత్యం, కార్యాలయ సిబ్బంది పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించాలనే లక్ష్యంతో పొట్టి శ్రీరాములు చేపట్టిన నిరాహార దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన త్యాగం ఫలితంగానే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అమరజీవి పొట్టి శ్రీరాములు చూపిన త్యాగస్ఫూర్తి, సేవాభావం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఆయన సేవలను స్మరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు.

తిరుపతి

పరీక్షల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం – డా. బాలు సూచనలు

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని శ్రీకాళహస్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ప్రధాన వైద్యాధికారి డా. బాలు సూచించారు. సరైన ఆహారపు అలవాట్లు, విశ్రాంతి పాటిస్తే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పరీక్షల సమయంలో విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అధిక ఉప్పు, కొవ్వు, తీపి పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కడుపు మంట, జీర్ణ సమస్యలు, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇవి విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఇంట్లో తయారుచేసే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదని, ముఖ్యంగా ఆకుకూరలు, కాయగూరలు వంటి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అలాగే శరీరానికి శక్తినిచ్చే ద్రాక్ష, బత్తాయి, ఆపిల్ వంటి పండ్లరసాలు తీసుకోవాలని చెప్పారు. పరీక్షల సమయంలో రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం ద్వారా శరీరం, మనసు ప్రశాంతంగా ఉండి చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉండటంతో అలసట, నీరసం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు కనిపించినా వెంటనే సమీప వైద్యుడిని సంప్రదించాలని విద్యార్థులకు డా. బాలు సూచించారు.

తిరుపతి

9వ తరగతి విద్యార్థి అదృశ్యం – పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

కేవీబీపురం మండలంలోని రాగిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ 9వ తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం మేరకు, కేవీబీపురం మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన చెంచయ్య పెద్ద కుమారుడు బి. చందు (14) రాగిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14వ తేదీ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చందు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మొదట బడికి వెళ్లి ఉంటాడని భావించిన తల్లిదండ్రులు సాయంత్రం వరకు వేచి చూశారు. అయితే రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలు, సమీప గ్రామాలు, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి తండ్రి చెంచయ్య ఆదివారం రాత్రి కేవీబీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ఓబయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. విద్యార్థి గురించి సమాచారం తెలిసిన వారు ఎస్ఐ సెల్ నంబర్ 9491074520 లేదా తండ్రి చెంచయ్య సెల్ నంబర్ 8639332033 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.