Friday, 6 March 2026

Blog

జాతీయ అంతర్జాతీయ

BREAKING: లాక్ డౌన్ మరోసారి పొడిగింపు

  పున్నమి  దేశంలో లాక్ డౌన్ మే 3వ తేదీతో ముగియనుండగా,తజాగా లాక్ డౌన్ ను కేంద్రం మరోసారి పొడిగించింది.రెండు వారాలా పాటు (మే 17 వరకు) లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది.దేశంలో లాక్ డౌన్ పొడిగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.దేశంలో కరోనా కేసులు పేరుగుతుండటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Featured చిత్తూరు

గూడు…పదిలం” గంజాం భ్రమరాంబ తిరుపతి

“గూడు…పదిలం” గంజాం భ్రమరాంబ తిరుపతి ” డాక్టర్ గారూ నమస్తే.మీతో నేరుగా చెప్పలేక మెసేజ్ పంపుతున్నాను ఏమనుకోకండి శ్రీధర్ గారు. మీరు చాలా మంచి డాక్టర్. ఎవరూ కాదనలేరు. వైజాగ్ నుంచి బదిలీమీద ఇక్కడకు వచ్చినప్పటి నుంచీ మా ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. చాలా సంతోషం. మీతో కానీ మీ ఇంటి సభ్యులతో కానీ మాకు ఎటువంటి ఇబ్బందులూ లేవండి. కానీ..కానీ… మీరు రోజూ కరోనా వ్యాధులకు వైద్యం చేసి వస్తున్నారు. ఒక ప్రత్యేక గదిని కేటాయించుకున్నారు లేండి. ఏది ఏమైనా.. మా ఇంట్లో నేనూ, మా ఆవిడా మా అమ్మా ..నాన్నా..చూస్తే ముసలివాళ్ళు.. నా కొడుకు , కోడలూ వాళ్ళ పిల్లలేమో ఇద్దరూ ఐదేండ్ల లోపు వారే. ఎందుకైనా మంచిది. మీరు ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుంది అని మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు… మీరు అన్యధా భావించకుండా ఒక నాలుగు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయగలరా….? ఇట్లు భుజంగరావు.” పేషేంట్స్ అందరినీ పరామర్శించి హాస్పిటల్ అంతా ఒక రౌండ్ వేసి తన సీట్ దగ్గరకి వచ్చిన డా. శ్రీధర్ తనకు భుజంగరావు పంపిన తీపి వార్తవిని “ఛ” ఏమిటో వీళ్ళ మనస్తత్వాలు అని నిట్టూర్పు వదిలాడు. అక్కడే ఉన్న ఇంకొక డాక్టర్ జాన్ తో “ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా… అర్థరాత్రి.. అపరాత్రి అని చూడకుండా డాక్టర్ అని పరిగెత్తుకువస్తారు. కరోనా లాంటి భయంకరమైన వ్యాధితో ప్రాణాలు పణంగా పెట్టి మనమిక్కడ యుద్ధం చేస్తుంటే… మానసిక స్థైర్యాన్ని అందించాల్సిపోయి… ఇల్లు ఖాళీ చేయండి.. అంటూ నివేదనలు పంపుతున్నారు” అన్నాడు ఆవేశంగా. డాక్టర్ జాన్ ” శ్రీధర్ గారూ.. ప్రజలు అంతేనండీ అమాయకులు. ఇదిగో పులి అంటే అదిగో తోక అని అనేస్తారు. మీరేమీ దిగులు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే.. మా మిద్దెపైన ఒక పోర్షన్ ఖాళీగా ఉంది. మా పాపకు పెళ్ళైనాక ఉపయోగపడుతుంది అని అలాగే ఉంచాను. ప్రస్తుతానికి నా రీడింగ్ రూమ్ లా వాడుకుంటున్నాను. మీరు రేపే షిఫ్ట్ అవ్వొచ్చు. మిగతా విషయాలు తరువాత చేసుకుందాం” అని ఓదార్పుగా చెప్పాడు డా.జాన్. ” మొన్నటికి మొన్న కరోనాకి వైద్యం చేస్తున్న పాపానికి డాక్టర్లపై దాడులు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి వెళితే రాళ్ళ దాడులు, చివరికి కరోనా రోగులకు వైద్యం చేస్తూ చనిపోయిన డాక్టర్ ని ఖననం చేయడానికి కూడా అంగీకరించక ధర్నాలకు దిగిన వైనం చూస్తుంటే ఒళ్ళు కోపంతో రగిలిపోతోంది. ఉన్న అరాకొరా వసతులతోనే మనం పోరాడుతుంటే వీళ్ళ ధోరణి అసహనానికి గురి చేస్తోంది. ఎనీ వే… థాంక్యూ జాన్… అవసరానికి మంచి సహాయం చేసావు.రేపే వచ్చేస్తాం. .” అన్నాడు శ్రీధర్. ” నువ్వూ.. మీ ఆవిడ ఇద్దరే కదా! ఫర్నిచర్ కూడా సరిపోతుంది. నువ్వు ఏమీ తీసుకుని రానవసరం లేదు. రెండు మూడు నెలల తరువాత పరిస్థితిని బట్టి మంచి విశాలమైన ఇల్లు చూసి ఒకేసారి ఫర్నిచర్ షిఫ్ట్ చేసుకుందువు గానీ” అని ఆప్యాయంగా చెప్పాడు డా.జాన్. “అవునవును. అదే మంచిది.అంతకు మించి చేసేదేముందిలే..” అని సాలోచనగా అన్నాడు శ్రీధర్. ************ “డాక్టర్… డాక్టర్… ఎలాగైనా మావాడిని కాపాడండి. ముక్కుపచ్చలారని పిల్లలు ఉన్నారు. దయచేసి ఎలాగైనా మీరే కాపాడాలి “అంటూ కాళ్ళమీద పడిన భుజంగరావుని పైకి లేపాడు శ్రీధర్. కరోనా నుండి ప్రొటెక్షన్ సూట్ లో ఉన్న శ్రీధర్ ని గుర్తుపట్టలేదతను. “అసలు ఏమయ్యిందో చెప్పండి” అని అడిగాడు. ” ఇంట్లోనే కూర్చుంటే బోరుగా ఉందని మా వాడు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్ళేవాడు. ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా వినేవాడు కాదు. నిన్న రాండమ్ గా కొన్ని కుటుంబాలకు కొత్తగా ప్రవేశ పెట్టిన కిట్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. మా ఇంట్లో మిగతా అందరికీ నెగటివ్ వచ్చింది. మా అబ్బాయికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. దయచేసి వాడిని కాపాడండి ” అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. సరే సరే… మీరేమీ దిగులు పడకండి. మేమంతా ఉన్నాము కదా.. పాజిటివ్ వచ్చిన ప్రతివారికీ ప్రాణహాని ఉండదు. మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. మేము చూసుకుంటాము బయటకు పంపేసాడు శ్రీధర్. ******* ” సార్..డా. శ్రీధర్ గారు.. నమసే. మా బాబుకు మంచి ట్రీట్‌మెంట్‌ ఇచ్చి కాపాడింది మీరేనని తెలుసుకున్నాను. నేను మీ మనసు నొచ్చుకునే విధంగా ప్రవర్తించినా.. అది మనసులో పెట్టుకోకుండా మీరు మా బాబును కాపాడారు. అందుకే మీలాంటి వైద్యులను దైవంతో పోలుస్తారు. మావాడు వాడి నిర్లక్ష్య ధోరణి వల్ల కరోనాకు గురైతే.. మీర వాడిని మామూలు మనిషిని చేసారు. మీలాంటి ఇంట్లో ఉంటే అనర్థం అనుకున్నాను. కాదు..గొప్ప భరోసా అని మీరు నిరూపించారు. మిమ్మల్ని నేరుగా కలిసి మాట్లాడే ధైర్యం లేక ఈ మెసేజ్ పంపుతున్నాను. ఇక మీదట మీరు మనింటికి వచ్చేయండి‌. మీరు ఈ ఊరిలో పనిచేసినన్నిరోజులూ ఆ పోర్షన్ మీదే. మీ వల్లే మా గూడు పదిలంగా ఉంది. దయచేసి నా తొందరపాటును మన్నించి మనింటికి వస్తారు కదూ!!.. ఇట్లు మీ భుజంగరావు .” ****** శుభం****** గంజాం భ్రమరాంబ తిరుపతి 9949932918

Featured

మూలపేటలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

పున్నమి ప్రతినిథి షేక్ . ఉస్మాన్ అలీ…✍️­­­ నెల్లూరు నగరంలోని మూలపేటలోని శంకర మఠం నందు నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు, కూరగాయలను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాతలుగా శంకర మఠం మేనేజర్ కొర్రపాటి నందకిషోర్ & ఉషా,మాళెం సుధీర్ కుమార్ రెడ్డి ,దూబగుంట గౌరీశంకర్,అమంచెర్ల ప్రభాకర్,పొచాగ్నుల పవన్,స్వరాజు రాజేష్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మహర్షి భగీరధుడికి ఘన నివాళులు

పున్నమి ప్రతినిథి షేక్ . ఉస్మాన్ అలీ…✍️ భగీరథ జయంతి పునస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు గురువారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహర్షి భగీరథ కృషి,పట్టుదల నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

Featured

కరోనా నియంత్రణ చర్యలకు డీఈఏఎఫ్ వితరణ

పున్నమి ప్రతినిథి షేక్ .ఉస్మాన్ అలీ✍️✍️ నెల్లూరు జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలకు తమ వంతు సహాయంగా గురువారం డీఈఏఎఫ్ రూ.86,116 లను అందచేసింది.స్థానికి జిల్లా పరిషత్ కార్యాలయంలోని జిల్లా ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ మేరకు డీఈఏఎఫ్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఈ మేరకు పత్రాన్ని అందజేశారు. కొలెక్టర్ శేషగిరిబాబు మాట్లాడుతూ… కరోన నియంత్రణ చర్యలకు అండగా నిలుస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Featured పిల్లలకు

దేవతా గుర్రాలు-నేటి యువత*….. (పున్నమి ప్రతినిధి:::: చింతా ప్రసాద్ బాబు)

  *దేవతా గుర్రాలు-నేటి యువత అనగనగా రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు. కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత. రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది. అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి పోయి, భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమై పోయింది. కానీ నాదో చిన్న కోరిక అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించిన భగవంతుడు చిరునవ్వు నవ్వి నువ్వు దేవతా గుర్రానివి నీ కోరిక తీర్చుతాను ఏం కావాలో కోరుకో!’ అన్నాడు. నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అవన్నీ సరైపోయి నేను ఇంకా అందంగా ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’ అని వేడుకుంది. సరే! నీలో నీకు ఏ లక్షణాలు లోపాలుగా కనిపిస్తున్నాయో చెప్పు అవన్నీ సరిదిద్దుతాను అని అభయమిచ్చాడు భగవంతుడు. దాంతో ఆ గుర్రం తనలో తనకి లోపాలుగా తోచిన లక్షణాలన్నింటినీ ఏకరవు పెట్టడం మొదలుపెట్టింది. ఈ తల మెడకి అంటుకు పోయినట్లుగా ఉంది. అది ఇంకాస్త పొడవు ఉంటే బాగుంటుంది. ముక్కు కూడా సన్నగా ఉందని నా అనుమానం. ఇక కాళ్లు ఇంకాస్త పొడవుంటే భలే ఉంటుంది. దయచేసి ఇవన్నీ సరిదిద్దుదురూ! అంది గుర్రం. తథాస్తు! రేపు ఉదయం నిద్ర లేచి చూసుకునే సరికి నీవు కోరుకున్న సరికొత్త రూపం నీకు వస్తుంది అన్నాడు భగవంతుడు. సంతోషంగా భగవంతుని దగ్గర సెలవు తీసుకుంది మొదటి గుర్రం. అది అలా వెళ్లిందో లేదో రెండో గుర్రం భగవంతుడి దగ్గరకు చేరుకుంది. హే భగవాన్‌! ఆ గుర్రం తన అందాన్ని పెంచుకోవాలనే కోరికతోనే నీ దగ్గరకి వచ్చిందని నాకు తెలుసు. ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప గుర్రం అనిపించు కోవాలని దాని తపన. దాని అత్యాశని మీరు అణిచి అది తనలోని అందం మెరుగుపడేందుకు ఏ ఏ లక్షణాలనైతే కోరుకొందో… అవి నాలో మరింత ఎక్కువగా ఉండేలా వరం ఇవ్వండి అని వేడుకుంది. అయ్యో అదెంత భాగ్యం, అసలే నువ్వు దేవతా గుర్రానివి కనుక నీ కోరికను తీర్చాల్సిందే, రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునేసరికి లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. తథాస్తు అంటూ నవ్వాడు భగవంతుడు. ఆ రాత్రి రెండు గుర్రాలకు సరిగా నిద్రపట్టనే లేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా… తమ అందాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అన్న ఉద్విగ్నతతో ఆ రాత్రిని గడిపాయి. తెల్లవారాక చూసుకుంటే ఆ రెండు గుర్రాలకీ తమ కోరిక నెరవేరిన విషయం తెలిసిపోయింది. కాకపోతే… మొదటిగుర్రం కోరుకున్న లక్షణాల కారణంగా అది అచ్చు ఒంటెలా మారిపోయింది. మొదటి గుర్రం కోరుకున్న లక్షణాల మోతాదు తనలో మరింతగా ఉండాలని కోరుకోవడంతో రెండో గుర్రం జిరాఫీలా మారిపోయింది. తమ శరీరాల వంక చూసుకున్న గుర్రాలు రెండూ లబోదిబోమంటూ భగవంతుడి దగ్గరకు పరుగులెత్తాయి.. ఆయనను చూస్తూనే ఏమిటీ మాకీ అన్యాయం! అంటూ ఆక్రోశించాయి. మీరు కోరుకున్న వరాన్ని యథాతథంగా తీర్చాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది. ఆగమేఘాల మీద పరుగులు తీసే దేవతాశ్వాలు ఎలా ఉండాలో, మిమ్మల్ని అలా పుట్టించాను. కానీ మీకు మీ శరీరం పట్ల కానీ, దానిని అందించిన నా పట్ల కానీ నమ్మకం లేదు. అదే అసలైన అన్యాయం. మీరు నిజంగా నన్ను ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే… మరింత బలిష్టంగా ఉండాలనో, కోరుకున్న గమ్యాన్ని సమర్థంగా చేరుకోవాలనో అడగాల్సింది. కానీ మీరు పై పై మెరుగులకే ప్రాధాన్యతని ఇచ్చారు. కనుక ఫలితం అనుభవించండి. ఇక నుంచీ మీరు దేవతా అశ్వాలు కాదు. ఒకరేమో ఒంటెలాగా ఎడారుల్లో తిరుగుతూ నానా బరువులూ మోయాల్సి ఉంటుంది. మరొకరేమో చిటారు కొమ్మ మీద దొరికే ఆహారంతో తృప్తిపడుతూ అడవులలో కాలం గడపాల్సి ఉంటుందని అనేశాడు భగవంతుడు. అదీ విషయం!. ఇది కథ మాత్రమే. కానీ దీనిని ఇప్పటి యువకుల జీవితాలకు, విద్యార్థుల చదువులకు అన్వయించి చూస్తే… ఇప్పటికి నేటి యువత వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలకు తృప్తిపడి వాటిని మరింత మెరుగు పెట్టుకోవడం మాని అవసరం లేని దాని కోసం వెంపర్లాడుతూ విలువైన సమయాన్ని, సహజ సిద్ధమైన శక్తియుక్తులను మర్చి పొతున్నారు. విద్యార్థులు జ్ఞాన సముపార్జన కన్నా ర్యాంకులు, మార్కులు తప్ప విషయ పరిజ్ఞానాన్ని పొందలేక జీవితాల్లో చాలా సందర్భాల్లో ఆశించిన దానిని పొందకుండా ఆత్మహత్యల వైపు, అసాంఘిక కార్యకలాపాల వైపు, లేదంటే అనారోగ్యకర అలవాట్ల వైపు వెళ్లి విలువైన జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. నేటి యువతకు, విద్యార్థులకు పై సందేశాన్ని అందించినవారు మురళీ కృష్ణ హోటల్స్ వీరిశెట్టి హజరత్ బాబు.

Featured గూడూరు

గూడూరు పట్టణానికి కరోన సాయం

స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రస్ట్ ద్వారా గూడూరు నియోజకవర్గంలోని గూడూరు పట్టణానికి 1-లక్ష.,గూడూరు రూరల్ మండలానికి 1-లక్ష.,చిల్లకూరు మండలానికి 1-లక్ష రూపాయలచొప్పున కరోన నివారణ సాయం క్రింద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని ఆయా స్థానిక YSRCP నాయకులకు అందజేసిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. గూడూరు పట్టణానికి కరోన సాయం క్రింద తన 5-నెలల జీతం 1-లక్ష రూపాయలను పట్టణ నాయకులకు అందజేసిన నెల్లూరు DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు గారు అందజేశారు.                                      ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు నెల్లూరు పార్లమెంట్ కన్స్టెన్సీ ఇన్చార్జ్ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు మరియు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు వైయస్సార్ సిపి నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Featured

ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు ఈ అయోద్యుడు ..

_నెల్లూరు జిల్లా , 30.04.2020 ( పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️_ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ పేద కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా సహాయం చేస్తూ కష్టకాలంలో కొండంత అండగా  ఆకలితో అలమటిస్తున్న గిరిజనులుకడుపు నింపేందుకు నేనున్నానంటూ ముందుకొచ్చిన కావలి టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ కరోనా వైరస్ అరికట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ తో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు యాచకులకు నిరాశ్రయులకు కావలి టూ టౌన్ కానిస్టేబుల్ అయోధ్య కుమార్ నేనున్నాను అంటూ  ముందుకు వచ్చి ప్రతి రోజూ కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

Featured

వికలాంగుల కాలనీ లో నిత్యావసర సరుకులు పంపిణీ …

 పున్నమి ప్రతినిధి ఉస్మాన్ అలీ✍️ కావలి 16 వార్డు నందు దాతలు జలదంకి పొదుపు లక్ష్మి మహిళా బ్యాంక్ ప్రెసిడెంట్ కండె రమణమ్మ మేనేజర్ వేలమూరి శోభారాణి మరియు జలదంకి రైతు ఉత్పత్తి దారుల సంఘం సీఈవో కృష్ణారెడ్డి సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరుణ మహమ్మారి వలన లాక్ డౌన్ విధించినప్పుడు నుండి పనులు లేక విలవిలలాడుతున్న నిరుపేద గిరిజనులకు మరియు వికలాంగులకు అఖిల భారత్ వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మండవ వెంకట్రావు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేసి దాతృత్వం చాటుకున్నారు

Featured ఆంధ్రప్రదేశ్

కరోనా’ కట్టడికి.. నవ సూత్రాల అమలు తప్పదు మరి!

కరోనా’ కట్టడికి.. నవ సూత్రాల అమలు తప్పదు మరి! కరోనా ను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ అనేది అద్భుతమైన ప్రయోగం. అయితే లాక్ డౌన్ విజయవంతం కావాలంటే దానికి కొన్ని ప్రత్యేక ఉద్దీపన చర్యలు చేపట్టాలి. అప్పుడే మన దేశంలో కరోనాకు శాశ్వతంగా కళ్లెం వేయొచ్చు. ప్రభుత్వ ఉద్దీపన చర్యలు ప్రజలకు నేరుగా చేరిన రోజు నే ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలవుతాయి. కరోనాకు పేద, మధ్యతరగతి, ధనిక బేధాలు ఉండవు. అది అందరినీ కబళించి వేస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఉద్దీపన చర్యలు కాస్త ఉపశమనం కలిగించినా, అది బ్రెయిన్ ట్యూమర్ రోగికి అమృతాంజనం రాసిన చందంగా ఉంది. పేదోడికి పని లేకపోతే పూట గడవదు. మధ్య తరగతికి ఉద్యోగ, ఉపాధి లేకపోతే ఇల్లు జరగదు. ధనికుడికి వ్యాపారం, పరిశ్రమలు నడవకపోతే మనుగడ ఉండదు. అయితే మన ప్రభుత్వాలు చేపట్టే ఉద్దీపన చర్యలు అందరినీ ఆదుకునే పరిస్థితి కనబడటం లేదు. ఈ మూడు వర్గాల్లో ఏ వర్గం దెబ్బతిన్నా, దాని ప్రభావం అన్ని వర్గాలపైనా పడుతుంది. అందరినీ నాశనం చేస్తుంది. అంటే పరిశ్రమకు ప్రోత్సాహం లేకపోతే మూత పడుతుంది. తద్వారా కార్మికులు, ఉద్యోగులను నిరుద్యోగం వెంటాడుతుంది. వ్యాపారాలు దెబ్బతింటే అది పూడ్చు కోవడానికి ధరలు పెంచుతారు. అవన్నీ మళ్లీ సామాన్యుడి నడ్డి విరుస్తాయి. అందుకే ప్రభుత్వ ఉద్దీపన చర్యలు అన్ని వర్గాలను కాపాడే విధంగా ఉండాలి. ప్రస్తుతం చేపట్టిన ఉద్దేపన చర్యలో భాగంగా కేంద్ర ప్రభ్యుత్వం జన్ ధన్ ఖాతాల్లో వేసిన 500 రూపాయల డబ్బులు కోసం జనం మళ్లీ రోడ్లపైకి వచ్చి, బ్యాంకుల వద్ద బారులు తీరి కరోనాకు ఎర్ర తివాచీ పరిచారు. కొందరికి ఏ ఖాతాలో పడ్డాయో కూడా తెలియని పరిస్థితి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఈ కింది సూచించిన విధంగా ఉద్దీపనకు ఉపక్రమిస్తే లాక్ డౌన్ నిబంధనలు ప్రజలు ఖచ్చితంగా పాటిస్తారు. మండలం రోజులు కాదు.. నూరు రోజుల గృహ నిర్బంధంలో నైనా ఉండి కరోనా (కోవిడ్ 19) పై విజయం సాధిస్తారు. 1. ఆకలి చావు లేకుండా అందరికీ నిత్యావసర సరకులు కిట్లు రూపంలో ప్రభుత్వమే నేరుగా ఇంటికి చేర్చాలి. పాలు, గ్యాస్ కూడా ఉచితంగా ఇవ్వాలి. ఎన్ని రోజులు లాక్ డౌన్ ఉంటే దానికి నెల రోజులు అదనంగా పంపిణీ చేయాలి. అప్పుడు ఎవరూ బయటకురారు. 2. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వమే విద్యుత్, కేబుల్, నెట్ చార్జీలు చెల్లించాలి. లేదా మాఫీ చేయాలి. జియో కంపెనీ ఆరు నెలలు ఫ్రీగా ఇస్తే వారికి వచ్చిన నష్టం ఏమీలేదు పైగా కొన్ని కోట్ల వినియోగదారులను కూడగట్టుకోగలిగింది. ఇది ప్రభుత్వ రంగ బిఎస్ ఎన్ ఎల్ ఎందుకు చేయకూడదు. 3. రుణాలపై మారటోరియం కాకుండా, లాక్ డౌన్ సమయం ఉన్నంత కాలం ఆ సమయంలో చెల్లించాల్సిన నెలసరి వాయిదాలు ప్రభుత్వం తరపున చెల్లించడం గానీ, రుణ మాఫీ చేయడం గానీ జరగాలి. ఇది పేద, మధ్య, పారిశ్రామిక, వ్యాపార వర్గాలు అనే తేడా ఉండకూడదు. 4. దీర్ఘకాలిక రోగ గ్రస్థులు, అనారోగ్య పీడితులకు టెలీ మెడిసిన్ సలహాలు అందించి, నేరుగా ఇంటికే ఉచితంగా మందులను పంపాలి. 5. ప్రవేటు ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులకు లాక్ డౌన్ కాలాన్ని హోమ్ సిక్ గా పరిగణించి, ఈ ఎస్ ఐ ద్వారా వేతన భృతిని విడుదల చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ రంగంలో ఉన్న సంస్థలపై భారం పడదు, పైగా కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. 6. సమాచార, ప్రసార మాధ్యమాల్లో పని చేసే వారికి కూడా, వైద్య, రక్షణ రంగాల్లో వారికి ఇచ్చే కోవిడ్-19 పాలసీని అమలు చేసి బీమా సదుపాయం కల్పించాలి. 7. కోవిడ్ కాలంలో ప్రవేటు ఆస్పత్రులు, వైద్యులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఉచిత వైద్య సేవలు అందించాలి. 8. ఎక్కడికక్కడ అష్ట దిగ్బంధనం చేసి, ఎవరినీ ఇంటి నుంచి కదలకుండా చూడాలి. అందుకు దేశ రక్షణ రంగ, ర్యాపిడ్ ఫోర్సులను దించి, కఠిన నిబంధనలు అమలు చేయాలి. కర్ఫ్యూ విధించాలి. సడలింపులకు తావివ్వకూడదు. 9. సామాజిక దూరం అనే పదాన్ని తొలగించి భౌతిక దూరం పాటించేలా, భవిష్యత్తులోనూ అది అన్ని చోట్లా అమలయ్యేలా చూడాలి. పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అన్నట్టు, కరోనా కట్టడికి నవ సూత్రాలు పాటిస్తే భారత్ ప్రజలు భరోసాగా బతుకుతూ, బంగారు భవితకు బాటలు వేసుకోగలరు. ఇన్ని చేయాలంటే ప్రభుత్వానికి ప్రస్తుతం కాస్త కష్టతరమనిపించినా, సుభిక్ష భారత్ కావాలంటే తప్పదు మరి. కార్పొరేట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన ఋణాలకంటే 100 రోజుల ఈ దీక్షకు ప్రజలకు ఖర్చు పెట్టే ఈ మొత్తం పెద్ద భారమేమీ కాదు. డబ్భు దేముంది రేపు లాక్ డౌన్ ఎత్తి వేశాక, దేశ ఆర్థిక పరిపుష్టికి కాస్త ధరలు పెంచినా, దాన్ని ప్రజలు సంతోషంగా స్వీకరిస్తారు. ఎందుకంటే విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన ప్రభుత్వాన్ని పెద్దగా తప్పు పట్టరు. ఇందులో రాజకీయ కోణాలు మానుకొని అందరూ ఏకతాటిపైకి వస్తే దీనిని దిగ్విజయంగా అమలు చేయవచ్చు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సామెతను నిజం చేయవచ్చు. @ వేగోరే (వేణుగోపాల్ రెడ్డి ద్వారం), సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు. 9705388544

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.