జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కేటాయింపుపై టీడీపీ–బీజేపీ నేతల చర్చలు
కాకినాడ, అక్టోబరు 21 (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కేటాయింపుపై టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య చర్చలు జరిగాయి. కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల కాకినాడ జిల్లా టీడీపీ పరిశీలకులు, మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. బీజేపీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల కాకినాడ జిల్లా పరిశీలకులు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు సమావేశానికి హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను బీజేపీకి కేటాయించే అంశంపై ఇరు పార్టీల నాయకులు చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మానికి అనుగుణంగా స్థానాల సర్దుబాటుపై ఈ సమావేశం నిర్వహించారు.









