రాహుల్, ప్రియాంక అరెస్టులకు నిరసనగా నిర్మల్‌లో కాంగ్రెస్ నిరాహార దీక్ష
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ నిర్మల్, అక్టోబర్ 8: ఢిల్లీలో ఓట్ల సవరణ ప్రక్రియ (SIR)కు వ్యతిరేకంగా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన న్యాయపోరాటానికి మద్దతుగా నిర్మల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. వారి అరెస్టులను నిరసిస్తూ గురువారం నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన ఈ దీక్షకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు నాయకత్వం వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నిరాహార దీక్ష సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, మాస్‌లైన్‌తో పాటు ఆర్టీసీ అనుబంధ సంఘాలు, తెలంగాణ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్లు సంఘీభావం ప్రకటించి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపడుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని అన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను బేషరతుగా బర్తరఫ్ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నిరాహార దీక్షలో సుమారు 400 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. సాయంత్రం 5 గంటలకు కూచాడి శ్రీహరి రావుకు నిమ్మరసం అందించి నిరాహార దీక్షను విరమింపజేశారు. కార్యక్రమానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు అధ్యక్షత వహించారు.







