బురుజుపల్లిలో ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామి కన్యపూజ.. భారీ అన్నదానం (ఆధ్యాత్మిక శోభతో విలసిల్లిన గ్రామం )
నెల్లిమంద (సోమల), అక్టోబర్ 14 (భాను ప్రసాద్ నాయుడు, పున్నమి న్యూస్ ప్రతినిధి): సోమల మండలంలోని నెల్లిమంద పంచాయతీ పరిధిలో గల బురుజుపల్లి గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి కన్యపూజ మహోత్సవం బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. మండల దీక్షలు చేపట్టిన కన్యస్వాములు, భక్తులు గురుస్వాముల పర్యవేక్షణలో స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా వేదికను రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపాలు, స్వామివారి నామాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పద్దెనిమిది మెట్లతో కూడిన పవిత్ర పడిపీఠాన్ని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పడిపూజ, అష్టోత్తర శతనామార్చనలు, దీపారాధనలు నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు. గురుస్వాముల భజనలు, భక్తుల ‘స్వామియే శరణం అయ్యప్ప’ శరణుఘోషలతో బురుజుపల్లి వీధులన్నీ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. పూజా కార్యక్రమాల అనంతరం గ్రామానికి విచ్చేసిన భక్తులకు, గ్రామస్థులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేసి, విస్తృత ఏర్పాట్లతో భారీ అన్నదాన వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బురుజుపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలు, అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









