జనగాం
*ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలి* *కొనుగోలు కేంద్రాలపై కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు* *రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు* —*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* వానాకాలం (ఖరీఫ్) 2026-27 సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులను పకడ్బందీగా కల్పించాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, డీఆర్డీఓ, తూనికలు కొలతలు, రవాణా, తదితర శాఖల అధికారులతో *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 202 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వివరాలు, రైతులకు అందాల్సిన సేవలు, ధాన్యం నాణ్యతా ప్రమాణాలపై పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే పరిష్కరించేందుకు కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయగా, 1800-425-6605 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. ధాన్యం రవాణా చేసే వాహనాలు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాలని, అన్ని వాహనాలకు జీపీఎస్ (లేదా) వాహన స్థాన నిర్ధారణ వ్యవస్థ ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ధాన్యం నాణ్యతకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలపై రైతులు, కొనుగోలు కేంద్రాల సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్యాడీ క్లీనర్లను సక్రమంగా వినియోగించి, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం నిబంధనల మేరకు ధాన్యాన్ని ఆరబెట్టి నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ట్రక్ షీట్ నిర్వహణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. లారీలో లోడ్ చేసిన ధాన్యం బస్తాల సంఖ్య, బరువు, తదితర వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల్లో కాకుండా సురక్షిత ప్రదేశాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు తాగునీరు, నీడ, విద్యుత్, తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని, అవసరమైన రిజిస్టర్లను నిర్వహించాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, తగినన్ని గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ముందస్తుగా టోకెన్లు జారీ చేయాలని, రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని, రైతులు పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అంతకుముందే అన్ని సన్నాహాలను పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ట్రక్కుల్లో లోడింగ్, అన్లోడింగ్ చేసేందుకు ఎలాంటి కూలీల సమస్యలు తలెత్తకుండా అవసరమైన సంఖ్యలో కూలీలను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ధాన్యం నిల్వ, రవాణాకు సంబంధించి ముందస్తుగా క్షేత్రస్థాయిలో పర్యటించి గోదాములను పరిశీలించాలని, వాటి సామర్థ్యాన్ని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ భాస్కర్, జిల్లా సివిల్ సప్లై అధికారి సురేష్ రెడ్డి, డీఎం సివిల్ సప్లై హతీరామ్, డీసీఓ కరుణ, ఎల్డీఎం ప్రతిభ, తూనికలు కొలతల శాఖ అధికారి ఝాన్సీ, రవాణా, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.