జనసేనకు రాజీనామా.. వైఎస్సార్సీపీలో చేరిన ఆడారి శ్రీకాంత్ దంపతులు
యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలానికి చెందిన ఆడారి శ్రీకాంత్, కమల ప్రియ దంపతులు జనసేన పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునగపాక మాజీ జడ్పీటీసీ, సర్పంచ్ ఆడారి సరోజినీ సత్యనారాయణ దంపతుల కుమారుడైన శ్రీకాంత్ తన భార్య కమల ప్రియతో కలిసి వైఎస్సార్సీపీలో చేరడం స్థానికంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.వైఎస్సార్సీపీ మాజీ ప్రభుత్వ విప్, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్లు ఆడారి శ్రీకాంత్, కమల ప్రియ దంపతులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.









