ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి
దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది ఓటర్ల పేర్ల తొలగింపునకు నిరసనగా పూడిమడకలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము, మత్స్య కార్మిక సంఘం నాయకుడు చేపల తాతయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకే ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్లు తొలగించారని ఆరోపించారు. పేదలు, కార్మికులు, మైనారిటీలు, వలస కార్మికులు, మహిళలు ఈ తొలగింపుల వల్ల ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 45 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల తొలగింపులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసుపల్లి సతీష్, కాసులు, చిన్నయ్య తాత తదితరులు పాల్గొన్నారు.









