Thursday, 16 April 2026

Blog

విశాఖపట్నం

మంత తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి –

*“మంత తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – సమన్వయంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కోండి” – డీఐజీ శ్రీ గోపీనాథ్‌ జట్టి ఐపీఎస్* *విశాఖపట్నం,అక్టోబర్ పున్నమి ప్రతినిధి:* విశాఖపట్నం రేంజ్‌ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ శ్రీ గోపీనాథ్‌ జట్టి ఐపీఎస్ గారు విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల ఆల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లా ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేంజ్ పరిధిలో గల వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ గారు పలు కీలక సూచనలు చేశారు: “మంతా” తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి, అందుబాటులో ఉండాలని, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన పరికరాలు, వనరులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తీరప్రాంత గ్రామాలన్నింటినీ సందర్శించి, మత్స్యకారులు మరియు గ్రామస్థులకు తగిన హెచ్చరికలు ఇవ్వాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24/7 కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి, తగిన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, రోడ్లను ముందుగానే గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌ కేసులపై సమీక్ష నిర్వహించి, పాతనేరస్తులు మరియు అంతర్రాష్ట్ర గ్యాంగుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాత్రిపూట గస్తీ పెంచి, వ్యూహాత్మక ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో నిందితులను గుర్తించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు ఫ్రీజ్‌ అయిన డబ్బు తిరిగి అందేలా చూడాలని సూచించారు. డిజిటల్‌ అరెస్ట్‌, ఫైనాన్షియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్ వంటి మోసాలను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సోషల్‌ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తరచుగా అభ్యంతరకర పోస్టులు చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేందుకు రవాణా మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించి, చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గంజాయి కేసుల్లో పట్టుబడి పోలీస్‌ స్టేషన్లలో ఉన్న వాహనాలను త్వరితగతిన డిస్పోజల్‌ చేయాలని సూచించారు. రేంజ్‌ పరిధిలో శాంతి భద్రతలపై చర్చించి, పోలీస్‌ అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, మీటింగ్‌లు నిర్వహించరాదని హెచ్చరించారు.

విశాఖపట్నం

నగర వాసులతో కిటకిటలాడిన వి ఎం ఆర్ డి ఎ పార్కులు

నగర వాసులతో కిటకిటలాడిన వి ఎం ఆర్ డి ఎ పార్కులు * ఉచిత ప్రవేశం కల్పించిన చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారికి ప్రశంసలు *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* నాగులచవితి సందర్భంగా నగరంలోని వి ఎం ఆర్ డి ఎ కు చెందిన పార్క్ లు నగరవాసులతో కిటకిటలాడాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ జనసందోహం తో పార్కుల్లో సందడి వాతావరణం కనిపించింది. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వచ్చే కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా వి ఎం ఆర్ డి ఎ కి చెందిన పార్క్ ల్లో ఉచిత ప్రవేశం కల్పించినట్లు VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ప్రకటించారు. దీంతో విశాఖ చుట్టుపక్కల సమీప ప్రాంతాల ప్రజలు కైలాసగిరి, తెన్నేటి పార్కు, బీచ్ రోడ్డులో ఉన్న వుడా పార్కు, సెంట్రల్ పార్కుల వద్ద బారులు తీరారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పుట్టల్లో పాలు పోసి, నాగదేవతకు భక్తితో కొలిచి, ప్రసాదాలు పెట్టి, మొక్కులు తీర్చుకున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ఆయా పార్కుల్లో పూజలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒకేసారిగా పెద్ద సంఖ్య లో నగరవాసులు పార్కుల వద్ద చేరుకోవటంతో పార్క్ ల పరిసరాల్లో కొద్ది సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం పూజలు, బాణసంచా వెలిగించడం, అల్పాహారం తీసుకోవడంతో పాటు మధ్యాహ్నం భోజనాలు (పిక్నిక్) కూడా చేసి ఆనందంగా గడిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నాగుల చవితి పురస్కరించుకొని వి ఎం ఆర్ డి ఎ కు చెందిన పార్క్ ల్లో ఉచిత ప్రవేశం కల్పించిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారికి నగర వాసులు ప్రశంసించారు. తామెప్పుడూ ఇంతగా ఆనందం గడపలేదని, బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా సంబరాలు చేసుకోలేదని సందర్శకులు పేర్కొన్నారు. ఇదంతా ఆయా పార్కుల్లో తమకు ఉచిత ప్రవేశం కల్పించడం వలనే అంటూ వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారి సేవల్ని కొనియాడారు. శనివారం నాగుల చవితి పూజలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి రోజంతా పార్కుల్లోసరదాగా గడిపేందుకు అవకాశం కల్పించటం కోసం ఈ ఉచిత ప్రవేశం నిర్ణయం తీసుకున్నామని VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు పెద్ద ఎత్తిన ఉపయోగించుకున్నారని తెలిపారు. నగర ప్రజల సంతోషంగా ఆనందంగా గడిపేందుకు వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

విశాఖపట్నం

నాగుల చవితి భారతీయ సంస్కృతికి ప్రతీక — డాక్టర్ కందుల నాగరాజు

నాగుల చవితి భారతీయ సంస్కృతికి ప్రతీక — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* నాగుల చవితి భారతీయ సంస్కృతికి ప్రతీక అని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. నాగుల చవితి పండుగ సందర్భంగా పుట్టలో పాలు వేసి, పూజలు చేసి అందరూ బాగుండాలని ఆయన ప్రార్థించారు. ప్రకృతిని ఆరాధించడం, జీవవైవిధ్యాన్ని గౌరవించడమని చెప్పారు. వ్యవసాయానికి సర్పాల సహాయాన్ని గుర్తించడాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ పండుగలో నాగులను నాగ దేవతలుగా, నాగరాజులుగా పూజించడం ద్వారా ప్రకృతిలోని ప్రతి అంగాన్ని, జీవులను దైవంగా చూసే హిందూ సంస్కృతిలోని లోతైన భావనను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, ప్రకృతితో మమేకమై జీవించే సంస్కృతిలో భాగమని తెలిపారు. ప్రకృతిని దైవంగా భావించే భారతీయ సంస్కృతిలో భాగంగా చెట్టు, పుట్ట, నది, పర్వతం వంటి వాటిని పూజిస్తారని వెల్లడించారు. నాగులు పంటలను నాశనం చేసే కీటకాలను తిని, రైతులకు పరోక్షంగా సహాయపడతాయన్నారు. ఈ విధంగా, ప్రకృతికి, వ్యవసాయానికి సర్పాల సహకారాన్ని గుర్తించి, కృతజ్ఞత తెలియజేసే సంస్కృతిని ఇది సూచిస్తుందని అన్నారు. నాగులను దైవంగా పూజించడం ద్వారా, మానవులతో పాటు జీవకోటిలో ప్రతి ప్రాణికి ఒక ప్రత్యేక స్థానం ఉందని, వాటిని గౌరవించాలని ఈ పండుగ తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కందుల నలినీ దేవి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

క్షణం క్షణం టెన్షన్ ఏమయ్యాడు మా వాడు ఆదుకోండి ప్రభుత్వం వారు

పేదవాళ్తేర్ పెదజాలారిపేటకు సంబందించిన రామోలు ఎల్లాజీ (వయస్సు-28) సంప్రదాయ మత్స్యకారుడు నిన్న (24-10-2025) ఉదయం సుమారుగా నాలుగు గంటలకు చేపలవేటకు వెళ్లి ఇప్పటికి తిరిగిరాలేదు. భయందోళనలో కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ అధికారాలకు వేడుకొలు. పెదజాలారిపేటకు సంబందించిన రామోలు ఎల్లాజీ (వయస్సు-28) అనే సంప్రదాయ మత్స్యకారుడు ఊర్లో అందరిలాగే నిన్న (24-10-2025) ఉదయం సుమారుగా నాలుగు గంటలకు ఒక్కడే పైబర్ బోటు మీద సూరలు (ట్యూనా) చేపలవేటకు వెళ్లడం జరిగింది. తీరం నుండి సుమారుగా 30 నాటికల్ మైల్ దూరం వెళ్ళినట్లు తోటి మత్స్యకారులు చెబుతున్నారు. తిరిగివచ్చే సమయంలో వాతావరణం అనుకుంలించిగా మరియు గమ్యాన్ని గుర్తించే పరికరాలు (GPS) లాంటివి లేనుందున ఒడ్డుకు రాలేకపోయాడు అని తెలుస్తుంది. ఇతనను వెతకడానికి ఈరోజు ఉదయం ఇక్కడ నుండి ఎనిమిది బోట్లులలో తోటి మత్స్యకారులు వెళ్లడం జరిగింది. అయన ఇప్పటికి ఆ తప్పిపోయన మత్స్యకారుడు ఆచూకీ లభ్యంకాలేదు. వెతకడానికి వెళ్లిన కొన్ని బోట్లు తీరంనకు తిరిగివచ్చేయడం జరిగింది. మిగిలిన బోట్లు ఆ మత్స్యకారుడు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇదే విషయం పైన మత్స్యశాఖకు సంబందించిన జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్ రావు ఉదయం ఇక్కడకు వచ్చి సంఘటనకు సంబందించిన వివరాలును అడిగి తెలికొని వెళ్లడం జరిగింది.* ఇతను ఆచూకీ తెలిసికోవడానికి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

విశాఖపట్నం

పోలీస్ అధికార్లతో కమీషనర్ శంకభ్రత బ్యాగచి

*ఈ రోజు నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఏడీసీపీలు నుండి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ఈ నెల రివ్యూ మీటింగ్ లో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ల పనితీరును పరిశీలించారు.* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* నగరంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్టీవ్ గా ఉన్న రౌడీ షీటర్లు,వారిపై పెడుతున్న నిఘా చర్యలను ఆరా తీశారు, నిన్నటి వరకూ నమోదు చేసిన NDPS కేసు వివరాలను సమీక్షించి, నగరం గుండా ఏటువంటి NDPS రవాణా జరగకుండా పూర్తిగా నిరోధించాలని తెలిపారు. ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్ లకు నిర్వహించిన ఈ నెల రివ్యూ మీటింగ్ నందు ఆయా విభాగాల పనితీరును సీపీ గారు పూర్తిగా సమీక్షించారు. నగరంలో పోలీస్ స్టేషన్లో లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసులు యొక్క వివరాలు, కేసు పెండింగ్ ఉండడానికి గల కారణాలు తెలుసుకొని సదరు పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించివలసిందిగా ఆదేశించారు, కోర్టు తీర్పు వెలువరించిన కేసుల వివరాలు తెలుసుకున్నారు. సిపి గారి ఇచ్చిన నంబరు కు వచ్చిన ఫిర్యాదులు ఆధారముగా పలు సమస్యాత్మక ప్రాంతాలను సిపి గారు తెలియజేసి, ఆయా ప్రాంతాలకు సంబంధించిన స్టేషన్ ఎస్.హెచ్.ఓ లతో ఆయా సమస్యలకు పూర్తి అడ్డుకట్ట వేసేలా నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ స్టేషన్ పరిధిలో యెటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, ఆయా స్టేషన్ పరిధిలో గల నిర్మానుష్యప్రాంతాలను, సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తూ విజిబుల్ పోలీసింగ్, పీకేట్, అవసరం మేరకు డికొయ్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉండాలనీ, గంజాయి ఎక్కడా ఉండరాదని, ఈవ్ టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ వంటి ఏ స్టేషన్ పరిధిలోనూ చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, అందుకు అదనంగా వెహికల్, మెన్ ఇతర అవసరాలు ఏమైనా ఉన్నచో తనకు తెలియజేయాలని తెలిపారు. నగరంలో అన్ని పోలీస్ స్టేషన్ల లో కేసులు నమోదు చేస్తున్న తీరు, అధికారులు ఫిర్యాదుదారులతో ప్రవర్తిస్తున్న తీరు పై ఆరా తీసి, తగు ఆదేశాలు జారీ చేశారు. పొక్సో కేసుల పైన ఆరా తీశారు, నగరంలో క్రైమ్ రేటు తగ్గు ముఖం పట్టేలా రాత్రి పూట నిఘా మరింత పటిష్టం చేయాలనీ తెలిపారు. VMS(విజిటర్స్ మానిటరింగ్ సిస్టమ్) ను పూర్తిగా లా & ఆర్డర్ మరియు క్రైమ్ సిబ్బంది అందరూ వినియోగిస్తూ నిందితులను మరింత వేగముగా గుర్తించాలని తెలిపారు. సైబర్ క్రైమ్ పై మరింత బలోపేతం చేసే చర్యలపై చర్చించారు, ప్రజలకు పూర్తి అవగాహన అయ్యేలా మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు, పలు కొత్త సాఫ్ట్ వేర్ లను తీసుకొని వినియోగించాలని సూచించారు. ఉమెన్ సేఫ్టీ కు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళల పైన వేదింపులు, మహిళ మిస్సింగ్ సంబంధిత కేసులలో జాప్యం లేకుండా తక్షణమే స్పందించి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో వారితో వ్యవహరించాలన్నారు,పొక్సో కేసుల పైన ఆరా తీశారు. కోర్టు నందు కేసులు ఎటువంటి జాప్యం లేకుండా, కన్విక్షన్ పడే కేసులు సంఖ్య పెరిగే విధముగా చేయుటకు, అధికారులు మరియు సిబ్బంది సందేహలను నివృత్తి చేసేందుకు లోక్ ఆధాలత్ నందు గతంలో కంటే మరిన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆహ్వానించి పలు న్యాయ సంబంధిత అంశాలపై పరస్పరం చర్చించి, పోలీసు అధికారులు పలు న్యాయ సంబంధిత అంశాలలో తమ సందేహాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ను అడిగి నివృత్తి చేసుకున్నారు. వచ్చే నెల నిర్వహించబోవు రివ్యూ మీటింగ్ నందు ప్రతి పోలీస్ స్టేషన్ గత నెల కంటే మెరుగ్గా, క్రైమ్ తగ్గు ముఖం పట్టే విధముగా పోలీసింగ్ ఉండాలని తెలిపారు. నగర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పూర్తి పారదర్శకముగా తమ విధులు నిర్వర్తించాలని, విధులలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, అవినీతికి పాల్పడినా తక్షణమే వారిపై కఠిన చర్యలు ఉంటాయనీ తెలిపారు. ఈ సమావేశంలో డి.సి.పి-02(ఎల్& ఓ) డి.మేరీ ప్రశాంతి, ఐ.పి.ఎస్., గారు, డి.సి.పి(క్రైమ్స్) శ్రీమతి లతా మాధురి,ఐ.పి.ఎస్., గారు, నగర ఏ.డి.సి.పి లు, ఏ.సి.పి లు, స్టేషన్ ఎస్.హెచ్.ఓ లు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

విశాఖపట్నం

బ్లింకిట్‌ బ్యాగ్‌లో గంజాయి రవాణా – ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* బ్లింకిట్‌ బ్యాగ్‌లో గంజాయి రవాణా – ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ తేదీ 25-10-2025 ఉదయం సుమారు 09:30 గంటల సమయంలో, పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన WSI శ్రీమతి ఎన్‌. సునీత గారికి విశ్వసనీయ సమాచారం అందడంతో, సిబ్బందితో కలిసి కమ్మాది ప్రాంతంలో దాడి చేశారు. దాడి సమయంలో ఇద్దరు వ్యక్తులు బ్లింకిట్‌ డెలివరీ బ్యాగ్‌లో గంజాయి తీసుకెళ్తూ ఉన్నట్లు గుర్తించబడగా, వారిని వెంటాడి పట్టుకున్నారు. విచారణలో వారిని నల్లబిల్లి గణేష్‌ (32 సంవ.) మరియు హోరో సంజయ్‌కుమార్‌ (29 సంవ.) గా గుర్తించారు. వీరి వద్ద నుండి మొత్తం 2 కిలోల గంజాయి స్వాధీనం చేసి, క్రైమ్ నెం. 622/2025 U/s 20(b)(ii) NDPS యాక్ట్ 1985 r/w 187 BNSS 2023 కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు పంపించారు. ఈ కేసు దర్యాప్తు సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ కే. భాస్కరరావు గారి పర్యవేక్షణలో జరుగుతోంది. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ జి. బాలకృష్ణ గారి సూచనలు: ఇలాంటి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (గంజాయి) అక్రమ రవాణా, నిల్వ, విక్రయం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాన్య ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్ (ఫోన్: 9440796060) కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్

ఈ నెల 27 న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

అక్టోబర్ 27వ తేదీ సోమవారం తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం లేదని శనివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అర్జీదారులు తమ సమ స్యలను. టోల్‌ ఫ్రీ నంబర్ 1100 లేదా వెబ్‌సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చునన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులు లేదా అభ్యర్థనలు సమర్పించేందుకు జిల్లా కేంద్రానికి స్వయంగా రావాల్సిన అవసరం లేదని, దీనికి బదులుగా టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చని లేదా మీ కోసమే వెబ్‌ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సమస్యలు నమోదు చేసిన తర్వాత సంబంధిత శాఖాధికారులు వాటిని క్షేత్రస్థా యిలో విచారించి తగిన పరిష్కార చర్యలు తీసు కుంటారని, అర్జీదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలకు అనుగుణంగా తీర ప్రాంతంలో మరియు శిథిలావస్థకు చేరిన పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని డిఈఓను ఆదేశించారు.

విశాఖపట్నం

నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయండి.

సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు కార్యక్రమం దగ్గర పడుతోంది. *నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయండి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ . *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* విశాఖ వేదికగా జరుగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు కు తక్కువ కాలం ఉన్నందున సంబంధిత నగర సుందరీకరణ , సంబంధిత అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జోన్ 3, 4, 5, 8 లోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్, తాటిచెట్లపాలెం, ఊర్వసి జంక్షన్, ఎన్ఏడి ఫ్లై ఓవర్, ఎయిర్పోర్ట్ వరకు, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు ప్రధాన వేదిక ప్రాంతం, అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు కొరకు చేపడుతున్న అభివృద్ధి, నగర సుందరీకరణ పనులను జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అర్బన్ కార్పొరేషన్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ నవంబర్ నెలలో విశాఖ వేదికగా జరుగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు కాలం తక్కువగా ఉన్నందున నగర సుందరీకరణతో పాటు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కింద చేపడుతున్న సుందరీకరణ పనులతో పాటు రైల్వే న్యూ కాలనీ రోడ్డు ,తాటిచెట్లపాలెం, ఊర్వసి , ఎన్.ఎ.డి ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్ హైవే వరకు చేపడుతున్న రోడ్ డివైడర్స్, సెంటర్ మీడియన్, ఐలాండ్స్ , ఫుట్ పాతులు, రోడ్డు మరమ్మతులు, లైటింగ్,పెయింటింగ్ పనుల నాణ్యతను పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే సెంటర్ మీడియన్ లలో మొక్కలను యూనిఫామ్ గా ఆకర్షణీయంగా ట్రిమ్మింగ్ చేయాలని, పెద్ద చెట్లు యొక్క బ్రాంచెస్ కటింగ్ చేయడంతో పాటు సెంటర్ మీడియన్ లలో పాడుబడిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని ఆదేశించారు. అనంతరం అంతర్జాతీయ వేదిక జరిగే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ హెలిప్యాడ్ ను పరిశీలించి అక్కడ చేపడుతున్న పెయింటింగు, సుందరీకరణ పనులను పరిశీలించి పనులలో నాణ్యతా ప్రమాణాలను తప్పకుండా పాటించి త్వరగా పూర్తిచేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజనీరు కె.శ్రీనివాసరావు,కార్యనిర్వహక ఇంజనీరు తారా ప్రసన్న, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుపాను సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు – మీ భద్రత మీ చేతుల్లోనే!

తుపాను సమీపిస్తున్నప్పుడు ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తగా, ప్రశాంతంగా ఉండటం అత్యంత అవసరం. తప్పుడు వార్తలు, పుకార్లను నమ్మవద్దు. ప్రభుత్వ అధికారుల సూచనలను మాత్రమే నమ్మి వాటిని పాటించండి. మొదటగా, మొబైల్ ఫోన్లను పూర్తిగా ఛార్జ్‌ చేసి ఉంచండి. వాతావరణ హెచ్చరికలు, ఎమర్జెన్సీ సందేశాలను SMS ద్వారా గమనించండి. అత్యవసర వస్తు సామగ్రి – టార్చ్, బ్యాటరీలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, త్రాగునీరు, పొడి ఆహారం, అవసరమైన మందులు మొదలైనవాటిని సిద్ధం చేసుకోండి. మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుపాను ప్రారంభం కాకముందే సమీపంలోని ప్రభుత్వ ఆశ్రయ కేంద్రం లేదా సురక్షిత ప్రదేశానికి వెళ్లండి. బయటకు వెళ్లేటప్పుడు పిల్లలు, వృద్ధులు, మహిళలు సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. పత్రాలు, సర్టిఫికెట్లు, విలువైన వస్తువులు వాటర్‌ప్రూఫ్ కవర్లలో ఉంచండి. ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయండి, అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్యాస్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేయండి. తలుపులు, కిటికీలు బిగిగా మూసి ఉంచండి. తుపాను సమయంలో పాత భవనాలు, పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడవద్దు. విద్యుత్ తీగలు తెగిపడినట్లయితే వాటికి దూరంగా ఉండండి. పశువులు, పెంపుడు జంతువులను బంధించి ఉంచవద్దు – వాటిని వదిలి సురక్షిత ప్రదేశానికి తరలించండి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు; సముద్రతీర ప్రాంతాల వద్దకు వెళ్లడం ప్రమాదకరం. తుపాను సమయంలో ప్రశాంతంగా ఉండటం, ముందస్తు సిద్ధతతో వ్యవహరించడం ద్వారా ప్రాణాలు, ఆస్తులను కాపాడుకోవచ్చు. మీ భద్రత, మీ కుటుంబ భద్రత మీ చేతుల్లోనే ఉంది – జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి.

విశాఖపట్నం

మొంథా (Montha) తుఫాను హెచ్చరిక ల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.

మొంథా (Montha) తుఫాను హెచ్చరిక ల నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. కలెక్టర్ హరేందిర ప్రసాద్. *విశాఖపట్నం,అక్టోబర్ పున్నమి ప్రతినిధి*: మంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ ఆదేశించారు.శనివారం జిల్లా, మండల,జోనల్ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో అల్పపీడనం (తుఫాన్) కారణంగా రాబోయే 72 గంటలు (3 రోజులు) అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.ఆస్తి, ప్రాణ, పశు , పంట నష్టం జరగ కుండా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల ,గ్రామ స్థాయి అధికార యంత్రాంగం అంతా పనిచేసే ప్రదేశాల్లోనే (హెడ్ క్వార్టర్స్ లో) ఉండాలని, హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్ళ రాదని అన్నారు.ఉద్యోగులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయరాదని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఇప్పటికే ఎవరైనా సముద్రంలోకి వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాను వల్ల భారీ వర్షాలు , పెనుగాలులు వచ్చే అవకాశం ఉన్నందున నది ఒడ్డులో, కొండ వాలులలో, నీటిమంపుకు గురయ్యే పల్లపు ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పల్లపు ప్రాంతాల్లో నీరు చేరితే వెంటనే నీటి తొలగింపునకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అధికారులు రిలీఫ్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని. చెట్లు పడిపోతే వెంటనే తొలగించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,విద్యుత్ కి అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలన్నారు. జనరేటర్లు, డీజిల్ అందుబాటు లో సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. PHC లలో డాక్టర్లు,వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్. టీమ్ లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో 0891-2590102, 0891- 2590100 నెంబర్లతో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి, షిఫ్ట్ ల వారీగా సిబ్బందిని నియమించామని, తుఫాను సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.