Thursday, 23 April 2026

Blog

తిరుపతి

అడ్వకేట్ల సంక్షేమంపై దృష్టి – ఏపీ బార్ కౌన్సిల్ సత్తు అంకయ్య స్పష్టం

శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని మంగళవారం నాడు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సత్తు అంకయ్య సందర్శించారు. ఈ యనకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరంభాకం ముని ప్రసాద్ నేతృత్వంలో న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సత్తు అంకయ్య మాట్లాడుతూ, న్యాయవాదుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానన్నారు. న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం, వెల్ఫేర్ ఫండ్ బలోపేతం, ఆరోగ్య బీమా, మరణానంతర లాభాలు, వాలంటరీ రిటైర్మెంట్ వంటి కీలక అంశాలపై సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. న్యాయవాదులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. తనను ఎప్పుడైనా కలిసేందుకు అందుబాటులో ఉంటానని, న్యాయవాదులు తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తనకు అఖండ విజయం అందించిన న్యాయవాదులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశం అనంతరం శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్తు అంకయ్యకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి

ఆడుకుంటూ అనంతలోకాలకు.. జేసీబీ గుంతలో పడి చిన్నారి మృతి

ఏర్పేడు, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటూ వెళ్లిన ఆ చిన్నారిని మృత్యువు జేసీబీ గుంత రూపంలో కబళించింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లా సౌత్ అమలూరుకు చెందిన శంకరయ్య, విజయ దంపతులు రెండేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం చిందేపల్లికి వలస వచ్చారు. శంకరయ్య స్థానిక వెంచర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ, చిందేపల్లి ఎస్టీ కాలనీలో నివాసముంటున్నారు. వీరి కుమార్తె ఎండ్ల సుస్మిత (6) స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు ఒక అంత్యక్రియల నిమిత్తం వేరే ఊరికి వెళ్లగా, పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన సుస్మిత మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి చెరువు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో చెరువులో అన్వేషణ చేస్తూ ప్రమాదవశాత్తూ కాలుజారి లోతుగా ఉన్న జేసీబీ గుంతలో పడిపోయింది. తోటి పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చి సుస్మితను బయటకు తీశారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెంది ఉండటంతో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. కళ్లముందే ఆడుకున్న చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.

తిరుపతి

సరోజమ్మ మృతి తీరని లోటు-మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిపట్టణంలోని 34వ వార్డు బీపీ అగ్రహారానికి చెందిన చిట్టుమూరి సరోజమ్మ అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం సరోజమ్మ నివాసానికి చేరుకున్న ఆయన, ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సరోజమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిలో ధైర్యం నింపారు. ఈ కష్ట సమయంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారని ఆయన భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో న్యాయవాది సున్నపు లక్ష్మీపతి రెడ్డి, ఆర్కాడు శంకర్, వైకాపా పట్టణ యువజన అధ్యక్షుడు మల్లెంబాక ముని కృష్ణారెడ్డి, జయకృష్ణ రెడ్డి, రాజశేఖర్ ఆది, మురళి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

అపరిశుభ్రంగా ఆయిల్ ప్యాకింగ్-మిల్లు నిర్వాహకులకు అధికారుల హెచ్చరిక

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని ఏ.ఎం. పుత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఒక ఆయిల్ మిల్లుపై మంగళవారం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మరియు మునిసిపల్ కమిషనర్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆర్.డి. శ్రీధర్ కుమారుడు ఆర్.డి. యోగానంద్ నిర్వహిస్తున్న ఈ మిల్లులో తనిఖీలు చేసిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. కనీస శుచి, శుభ్రత లేని అపరిశుభ్ర వాతావరణంలో ఆయిల్ ప్యాకింగ్ చేస్తూ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ఈ మిల్లు నిర్వహణకు మునిసిపాలిటీ నుండి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ గాని, భవన నిర్మాణ అనుమతులు గాని లేవని తనిఖీల్లో తేలింది. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్కడ నిబంధనలకు విరుద్ధంగా పామాయిల్‌ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి, అపరిశుభ్ర వాతావరణంలో మిల్లు నడుపుతున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లైసెన్సులు లేని వ్యాపారాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వారు తెలిపారు.

తిరుపతి

డ్రగ్స్‌ వ్యతిరేక యాత్రకు ఘన వీడ్కోలు – యువతకు అవగాహన సందేశం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీ కాళహస్తిపట్టణంలో నిర్వహిస్తున్న “మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ యాత్ర”కు భాగంగా జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు, అధికారులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని హెచ్చరించారు. యువత పూర్తిగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇవి వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. యువత తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా యాత్రను చేపట్టిన విజయ్ కలాం కు ఘనంగా వీడ్కోలు పలికారు. విద్యార్థులు, యువత కలిసి మాదకద్రవ్యాల వ్యతిరేక నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ యాత్ర యువతలో చైతన్యం పెంపొందించి సమాజంలో సానుకూల మార్పుకు దోహదం చేస్తుందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం ముగింపులో యాత్రకు శుభాకాంక్షలు తెలిపారు.

తిరుపతి

ఏబీఎన్ దాడి యత్నం హేయమైన చర్య.. రాష్ట్రంలో ‘సాక్షి’ చిరునామా లేకుండా చేస్తాం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి ప్రయత్నించడాన్ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం పట్టణంలోని పంచాయతీరాజ్ భవనంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛను హరించేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. “తమ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క ఆదేశం ఇస్తే చాలు.. రాష్ట్రంలో ‘సాక్షి’ పత్రిక కార్యాలయాలు లేకుండా చేసే సత్తా మాకు ఉంది. కానీ మా నాయకుడు ప్రజాస్వామ్యవాది, విలువలతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తి కాబట్టి మేము సంయమనం పాటిస్తున్నామనీ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు తమ తీరు మార్చుకోవాలని, పత్రికా విలేకరులను అణిచివేయాలని చూస్తే కూటమి శ్రేణుల తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. గత ఐదేళ్ల అరాచక పాలన పోయిందని, ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. మీడియాపై దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఏబీఎన్ కార్యాలయంపై దాడి యత్నాన్ని ముక్తకంఠంతో ఖండించారు.

తిరుపతి

అమరావతి గర్జన-శ్రీకాళహస్తి వీధుల్లో జన ప్రభంజనం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): రాజధాని అమరావతి పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో “అమరావతి విజయోత్సవ” భారీ బహిరంగ ర్యాలీ అట్టహాసంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వేలాది మంది కార్యకర్తలు, అమరావతి పరిరక్షణ సమితి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పట్టణం పండగ వాతావరణాన్ని తలపించింది. పట్టణంలోని ఏపీ సీడ్స్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ, వందలాది బైక్‌లు మరియు వేలాది మంది ప్రజల భాగస్వామ్యంతో అత్యంత ఉత్సాహంగా సాగింది. నాలుగు మాడ వీధుల గుండా ప్రయాణించిన ఈ ప్రదర్శనలో అమరావతికి మద్దతుగా నినాదాలు మిన్నంటాయి. మన రాజధాని కోసం నిలబడిన ప్రతి ఒక్కరి గొంతుక ఈ ర్యాలీలో ప్రతిధ్వనించిందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విజయవంతమైన కార్యక్రమంపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి భవిష్యత్తు కోసం ఇంతటి భారీ మద్దతు తెలిపిన కూటమి శ్రేణులకు, నా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మన రాజధానిని కాపాడుకుంటూ, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే వరకు మన పోరాటం, మన ఉత్సాహం ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

అమరావతి విజయోత్సవాలు- ఎమ్మెల్యే నివాసంలో పండుగ వాతావరణం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి సమీపంలోని ఊరంధూరులో ఎమ్మెల్యే నివాసంలో అమరావతి రాజధాని హోదా సందర్భంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. టీడీపీ మహిళా కార్యకర్తలు ముగ్గులు వేయడంతో పాటు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి అమరావతిపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. అమరావతి తిరిగి రాజధానిగా గుర్తింపు పొందడం రాష్ట్ర ప్రజలందరికీ ఆనందకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విజయాన్ని ప్రజల సమిష్టి సాధనగా అభివర్ణిస్తూ, అమరావతిని అత్యుత్తమ రాజధానిగా అభివృద్ధి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని, గతంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు బాధాకరమని పేర్కొన్నారు. ఆ సమయంలో రైతులకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. విజయోత్సవాల నేపథ్యంలో అమరావతి రైతులు శ్రీకాళహస్తిని సందర్శించగా, వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడంతో పాటు ఎమ్మెల్యే నివాసంలో ఆత్మీయ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలను సన్మానిస్తూ చీరలు అందజేశారు. ఈ వేడుకల్లో మహిళా కార్యకర్తలు సాంప్రదాయ ముగ్గులు, దీపాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

తిరుపతి

ప్రజా సేవకుడిగా అండగా ఉంటా-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): పదవి అనేది కేవలం హోదా మాత్రమే కాదని, ప్రజలకు సేవకుడిగా అండగా నిలవడానికి దక్కిన ఒక గొప్ప అవకాశమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు పట్టణంలోని పీఆర్ గెస్ట్ హౌస్‌లో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS) కార్యక్రమంలో ఆయన పాల్గొని నియోజకవర్గ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపడమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విన్నపాలను ఆయన వ్యక్తిగతంగా పరిశీలించారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు ఇతర వ్యక్తిగత సమస్యలపై అందిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు బదిలీ చేస్తూ, వాటిని అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. “మీ సమస్య ఏదైనా, మీకు తోడుగా ఉండటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని ఎమ్మెల్యే ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

తిరుపతి

అమరావతికి చట్టబద్ధత – కొత్త దిశలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా లభించడంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయని నాయకులు అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో అనిశ్చితిలో నిలిచిన అమరావతి భవిష్యత్‌ ఇక ప్రకాశవంతంగా మారబోతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026’కు లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదం తెలపగా, అనంతరం రాష్ట్రపతి సంతకం చేయడంతో కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా గుర్తించినట్లు వెల్లడైంది. అలాగే సీఆర్‌డీఏ పరిధిలోని ప్రాంతమంతా రాజధాని పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్తరాశివారి పాలెంలో ఉన్న శ్రీ కరిమారియమ్మ దేవస్థానంలో నోటిఫికేషన్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమరావతి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ డా. జి. దశరథాచారి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి మాట్లాడుతూ, అమరావతికి చట్టబద్ధ రక్షణ కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష నెరవేరిందన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశయాన్ని సాకారం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సలహా మండలి సభ్యులు యం. సుబ్బయ్య, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఉమేష్ రావు, సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి. నారాయణ, పట్టణ నాయకులు వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, చిల్లకూరు మణి, చంద్రకళ, కృష్ణమూర్తి, శివారెడ్డి, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.