Sunday, 26 April 2026

Blog

తిరుపతి

ప్రజల విశేష స్పందనతో ముగిసిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర- తలపా దామోదరం రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: వైఎస్ షర్మిలా రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతంగా ముగిసిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి తెలిపారు. యాత్ర విషయాలపై ఆయన మాట్లాడుతూ…ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర, నేడు విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా ముగిసిందన్నారు. రాష్ట్రంలోని సుమారు 29 జిల్లాల్లో నిర్వహించిన 48 సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఉపాధి హామీ కూలీలు “కొత్త చట్టం వద్దు – పాత చట్టం ముద్దు” అని కోరుకుంటున్నారని, ఈ యాత్ర ప్రభావంతో కొత్త చట్టం అమలు మరో రెండు నెలలు వాయిదా పడిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతోందని, రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీవేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ యాత్రలో మాజీ కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు.

తిరుపతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి-వివరాలు తెలిస్తే సంప్రదించాలని పోలీసుల విజ్ఞప్తి

శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి (పురుషుడు) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న ఇతనిని 108 అంబులెన్స్ ద్వారా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ప్రాణాలు విడిచారు. మృతుని పేరు, ఊరు, ఇతర వివరాలు తెలియరాలేదు. ఇతని గురించి ఎటువంటి సమాచారం తెలిసినా వెంటనే శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: టూటౌన్ సీఐ (CI): 9440900008, సబ్ ఇన్స్పెక్టర్ (SI): 9154141887 ఈ సమాచారాన్ని ప్రజలు గమనించి, మృతుడిని గుర్తించడంలో సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

తిరుపతి

బలిజ భవన నిర్మాణానికి బసవయ్యపాలెంలో విరాళాల వెల్లువ

శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని తొట్టంబేడు మండలంలో బసవయ్యపాలెం గ్రామంలో బలిజ సమాజ ఐక్యతకు నిదర్శనంగా బలిజ భవన నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. సమాజ అభివృద్ధి, సామూహిక కార్యక్రమాలు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా భవనం నిర్మించాలని గ్రామస్తులు సంకల్పించారు. ఈ క్రమంలో గ్రామ యువత, పెద్దలు కలిసి చురుకుగా విరాళాలు సేకరిస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామ ప్రముఖులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన అనంతరం ఈ భవనం వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి సమిష్టి కృషి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోలా ఆనంద్, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు అంజూరు శ్రీనివాసులు, ముత్యాల పార్థసారథి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కడూరు కమల కుమార్, వేము కోదండ రామయ్య, వల్లం గోపి, వేము మునీంద్ర, కడూరు హరిగోపాల్, కడూరు నాగరాజు, కడూరు ఉదయ్ కుమార్, చొక్కాని నాదముని, చొక్కాని పోలయ్య, చొక్కాని రామూర్తి, కడూరు శామంత్ కుమార్, సూర బిందు కుమార్, సూర దేవేంద్ర కుమార్, నాగలాపురం గోవర్ధన్, చక్రాల మురళి, రవి రాయల్, చందు రాయల్, కడూరు రూపేష్ కుమార్, వేము గోవర్ధన్, వేము పట్టాభి, పేట జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రంజాన్ ఇఫ్తార్ విందు పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ

శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులకు, మత పెద్దలకు బృందమ్మ స్వయంగా వడ్డించి ఆప్యాయంగా పలకరించడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆమె వినయం, స్నేహభావం విందు వాతావరణాన్ని మరింత సౌహార్దంగా మార్చాయి. ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ…రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని, ఉపవాస దీక్షలతో ముస్లిం సోదరులు చూపుతున్న భక్తి ఆదర్శప్రాయమని కొనియాడారు. ఇలాంటి పవిత్ర సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సేవలను ప్రశంసిస్తూ, ముస్లిం సమాజానికి అవసరమైన సదుపాయాల కల్పనలో ఆయన ముందుంటారని తెలిపారు. షాదీ మహల్ అభివృద్ధి, నమాజ్ కోసం విస్తృత స్థలం, భవిష్యత్తులో ఉర్దూ పాఠశాల వంటి కార్యక్రమాలు సమాజ సేవకు నిదర్శనమన్నారు. తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను సుధీర్ రెడ్డి కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదర సోదరీమణులు పాల్గొన్నారు.

తిరుపతి

ఉగాది పర్వదినం సందర్భంగా కోలా ఆనంద్ దంపతులకు ఘన సన్మానం

శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆయన సతీమణి కోలా వైశాలికు ఉగాది పర్వదినం సందర్భంగా బీజేపీ నాయకులు, పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు కోలా ఆనంద్ దంపతులను శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించిన శేషవస్త్రం కప్పి సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ….. నూతన సంవత్సరమైన శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన ఉగాది నుంచి ప్రజల కష్టాలు తొలగిపోయి విజయవంతమైన మార్గంలో ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కోలా వైశాలి మాట్లాడుతూ, శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రజలు అహంకారాన్ని, చెడు ఆలోచనలను పరాభవం చేసి ఆత్మపరిశీలనతో కొత్తగా ముందుకు సాగే సమయమని పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో ప్రతి ఇంటా నూతన ఆశలు చిగురించాలని కోరుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా కార్యదర్శి కొండేటి గోపాల్, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు కునాటి నాగరాజు, బీజేపీ నాయకులు జీవి అమర్నాథ్, పుణ్యం డిల్లీ కుమార్ రెడ్డి, ఆముదాల మునిరాజా, హుకీం సింగ్, చంద్రయ్య, కండాడు సుధాకర్, పరుకూరు మునిబాబు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబుకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆశీస్సులు

శ్రీకాళహస్తి, మార్చి 19 (పున్నమి న్యూస్): ప్రముఖ సినీ నటులు, విద్యావేత్త, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం నాడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆయనను కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్.. మోహన్ బాబుకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి గౌరవించారు. విద్యా రంగంలోనూ, సినీ రంగంలోనూ మోహన్ బాబు చేస్తున్న కృషి అమోఘమని, ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చందు రాయల్, భరత్ నాయుడు, పట్నం ఢిల్లీ కుమార్, రవి రాయల్, గిరిధర్ సాయి తదితరులు పాల్గొని మోహన్ బాబుకు తమ అభినందనలు తెలిపారు.

తిరుపతి

దవనం తడికల వైభవంలో భక్తులకు దర్శనమిచ్చిన నల్ల గంగమ్మ తల్లి

శ్రీకాళహస్తి, మార్చి 19 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్ పేటలో కొలువై ఉన్న శ్రీ శ్రీ నల్ల గంగమ్మ తల్లి దేవస్థానంలో ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దవనం తడికలతో చంద్ర అలంకరణలో అత్యంత నయనమనోహరంగా తీర్చిదిద్దారు. దేవస్థానం చైర్మన్ కంటా రమేష్ ఆధ్వర్యంలో ఉదయం నుంచే అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక అలంకరణలు శాస్త్రోక్తంగా జరిగాయి. చల్లని వెన్నెల కురిపించే చంద్రుడి రూపంలో దవనం తడికల అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఈ విశేష అలంకారాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. దర్శనం అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రదీప్, అనిల్, రాజశేఖర్, నారాయణ, సుబ్రహ్మణ్యం, రాజేంద్ర, కపిల్, యాదగిరిలతో పాటు ఆలయ అర్చకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

వాయులింగేశ్వర సన్నిధిలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 19 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వరా స్వామీ, అమ్మవార్ల దర్శనార్దం కేంద్ర ప్రభుత్వ బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నాడు ఆలయానికి విచ్చేశారు. మంత్రిని ఆలయ కార్యనిర్వాహణాధికారి వెంకటేశులు, బీజేపీ నాయకులు కోలా ఆనంద్ దగ్గరుండి స్వాగతం పలికిన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం అనంతరం మృతంజయ స్వామి సన్నిధిలో వేదపండితుల ఆశీర్వాదం పొందడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. లోక కళ్యాణార్థం కోసం, దేశ ప్రజల కోసం, ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మన దేశాన్ని సుభిక్షంగా కాపాడే నరేంద్ర మోదీ కోసం శ్రీకాళహస్తీశ్వరా స్వామీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరడమైనదని, తెలుగు ప్రజలకు శ్రీపరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, పాలకమండలి సభ్యురాలు కోలా వైశాలి, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, కార్యదర్శి కొండేటి గోపాల్, బీజేపీ సీనియర్ నేతలు కండ్రిగ ఉమా, జీవి అమర్నాథ్, ఆలయ అధికారులు విద్యా సాగర్ రెడ్డి, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

టీడీపీ శ్రేణుల్లో విషాదం-పార్టీ సీనియర్ నేతల మృతి పట్ల బొజ్జల బృందమ్మ తీవ్ర సంతాపం

శ్రీకాళహస్తి,తొట్టంబేడు, (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీకి ఎంతో కాలంగా సేవలందించిన సీనియర్ నాయకులు కన్నుమూయడంతో నియోజకవర్గ నాయకురాలు బొజ్జల బృందమ్మ వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన సీనియర్ నేత చెత్తమ నాయుడు మృతి చెందడంతో, బృందమ్మ ఆయన భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెత్తమ నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. పార్టీకి ఒక అంకితభావం గల నేతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా, శ్రీకాళహస్తి పట్టణంలోని కంట వీధికి చెందిన కొట్టే సురేష్ అకాల మరణం పట్ల కూడా ఆమె సంతాపం ప్రకటించారు. సురేష్ నివాసానికి చేరుకున్న బృందమ్మ, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, తమ కుటుంబం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతులకు ఘన నివాళులర్పించారు.

తిరుపతి

దక్షిణ కాశీలో పరాభవ నామ సంవత్సర వేడుకలు-కన్నప్పకు పట్టువస్త్రాల సమర్పణ

శ్రీకాళహస్తి, మార్చి 19, టెంపుల్ పున్నమి న్యూస్: లోకపావని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం నుంచే స్వామి, అమ్మవార్ల ఆలయాల్లోని ఉప దేవతామూర్తులకు వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మరియు మంగళ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా వేద మంత్రోచ్ఛారణలతో మారుమోగింది. శ్రీకాళహస్తీశ్వరుని తొలి భక్తుడిగా ప్రసిద్ధి గాంచిన భక్త కన్నప్ప స్వామి వారికి దేవస్థానం తరపున నూతన వస్త్రాలను సమర్పించడం ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టంగా నిలిచింది. స్థానిక తెరువీధిలో కొలువై ఉన్న భక్త కన్నప్ప సన్నిధికి ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాల నడుమ చేరుకుని పట్టువస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పరిపాలనా బాధ్యతలు చూస్తున్న కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు దంపతులు, పాలకమండలి సభ్యులు గుర్రప్ప శెట్టి దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, కరుణాకరన్ గురుకుల్, డీఈవో కృష్ణారెడ్డి దంపతులు, ఆలయ పర్యవేక్షక అధికారి నాగభూషణం, ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభఘడియల్లో స్వామివారి ఆశీస్సులు భక్తులందరికీ కలగాలని అధికారులు ఆకాంక్షించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.