Friday, 6 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

మన పనిలో పరమార్ధం కనుక్కోవడం

(పున్నమి ప్రతినిధి) : ఇప్పుడున్న కరోనా కష్ట కాలంలో, పనిలో ఉత్సాహం తెచ్చుకోవడం చాలా కష్టం అయి పోయింది! ఉద్యోగంలో ఉన్న వారికి (అది ప్రభుత్వోద్యోగం అయితే తప్ప!) అది ఎంత కాలం ఉంటుందో తెలియదు. వ్యాపారం నడిపే వాళ్ళ పరిస్థితీ, అంతకు మెరుగ్గా ఏమీ లేదు! కనుగోలు దారులు తగ్గి పోయారు. సరుకు నిలవలు పెరిగి పోయాయి. సరుకు తీసుకున్న వాళ్ళు సమయానికి డబ్బు చెల్లించడం లేదు. మార్కెట్‌ ‌లో డబ్బులు లేవు. వ్యాపారం లాభ సాటిగా సాగినా సాగక పోయినా, జి ఎస్టి 18 శాతం కట్టక తప్పదు.ఇలా! ఇలాంటి సమయంలో మన దైనందిక జీవితంలో ఉత్సా హం కొని తెచ్చుకుని పని చేయటం కష్టమే కానీ, అవసరం! మన పనిలో నాణ్యత తగ్గినా, మన ఉత్పాదక శక్తి తగ్గినా, దాని వల్ల మనకి కలిగే రిస్కు అధికం! మనని ఉత్సాహపరిచే పరిస్థితులు బయట లేనప్పుడు, మనకి మనం మోటివేట్‌ ‌చేసుకోవడంలో చిన్న చిట్కాలు, ఈ వారం చూద్దాం. చాలా మందిని అడిగాము . ‘‘మీ పనిలో ఏమి చూసి మోటివేట్‌ అవుతారు ? ‘‘ అని . ‘‘ ఆర్ధిక అవసరాలు, కుటుంబం నడుపుకోవడం కోసం, ఖర్చులు, అప్పులు, ఇఎమ్మైలు ‘‘ ఇలా చెప్పుకొచ్చారు . ఇవి అవసరాలే కానీ, ఇవి మనిషి కి ఉత్సాహం కలిగించ లేవు ! ఎలా కలగజేసుకోవాలో చూద్దాం . ప్రపంచంలో ఎన్నో పనులు ఉండగా, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఎందుకు ఎంచుకున్నారో ( కొన్ని సంవత్సరాల క్రిందట ) గుర్తు తెచ్చుకోండి! మరియు, మీరు చేసే పని చక్కగా చేయ గలిగితే, దాని వల్ల, మీరే కాక, ఇంకా ఎవరెవరు లాభపడతారో ఆలోచించండి. ఒక వేళ మీరు సేల్స్‌లో ఉంటే, మీరు చేసే సేల్స్ ‌వల్ల కంపెనీ లాభాల బాట పట్ట వచ్చు . కొన్ని ఉద్యోగాలు, జీతాలూ, జీవితాలూ నిలబడవచ్చు. ఇదే విధంగా మీరు కష్టమర్‌ ‌సర్వీసులలో ఉన్నా, అకౌంటింగ్‌లో ఉన్నా, మీ పని చక్కగా కరెక్టుగా జరిగితే, దాని వల్ల ఎవరెవరికి లాభమో ఆలోచించండి ! ‘‘ ఓహ్‌! ‌మన పని ఇంత ముఖ్యమా? ఇంతమందికి ఉపయోగమా అనిపించి, మన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. మీరు గత 15 ఏళ్ళుగా పని చేస్తూ, రిపీట్‌గా అదే పని చేస్తూ కొంత ఆసక్తి సన్నగిల్లుతోంది అనుకోండి. మీ సంస్థలో చేరిన కొంత మంది జూనియర్‌లకి కోచింగ్‌ ఇవ్వండి . వారి పనిలో పూనుకుని సహాయం చెయ్యండి . మీ అనుభవాలు పంచుకోండి. ఆ రోజు చిన్న తప్పు చేసి బాస్‌తో తిట్లు తిని మనసు చిన్న బుచ్చుకున్న జూనియర్‌ ‌సహోద్యోగిని టీకి తీసుకు వెళ్ళి ఉత్సాహ పరచండి, ఓదార్చండి . కెరీర్‌లో ఎవరైనా, తమ పై అధికారితో అక్షింతలు వేయించుకోని ఉగ్యోగి (ని) అసలు ఉండరని చెప్పండి. ఇది అంతా కామన్‌ అని చెప్పండి. పనిలో వారి నైపుణ్యం పెంచడంలో సీనియర్‌గా మీ వంతు పాత్ర నిర్వహించండి. కెరీర్‌ ‌మొదటి లొ మనకి పని నేర్పించిన వారిని మనము మరిచి పోలేము! ఇతరులకు సహాయం చెయ్యడం వల్ల మనకి పనిలో పరమార్ధం కనిపిస్తుంది. ప్రపంచంతో కనెక్ట్ ‌కాకుండా ఉండ లేము. కానీ, మనం చూసే, చదివే వార్తలు, సోషల్‌ ‌మీడియాలో చదివే పాక్షిక వాస్తవాలు, అర్ధ సత్యాలు, అనవసర వాగ్యుద్ధాలు, ఇవన్నీ మన మనసు మీద నెగెటివ్‌ ‌ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడండి. మీ పనికి సంబంధిన కొత్త కొత్త కోర్సులు, సర్టిఫికేషన్‌ ‌లు ఏమైనా చేయగలరేమో ఆలోచించండి. ఇప్పుడు యూడెమీ, అప్‌ ‌గ్రాడ్‌లాంటి సైట్‌ల వల్ల, వారం, 2 వారాల కోర్సులు కూడా లభ్యం . ఈ మధ్యనే నా పనికి అనగా ఉద్యోగుల ట్రెయినింగ్‌కి , సంబంధించి యూడెమీలో ఒక వారం కోర్సు తీసుకున్నాను . రూ 800 మాత్రమే కట్టి . ఆ కోర్సులో నాకు సగం తెలిసిన విషయాలే అయినా, మరొక సగం పూర్తిగా కొత్త విషయాలు ! మీకు వీలున్న సమయంలోనే అధ్యయనం చేసేలా ఆన్‌ ‌లైన్‌ ‌కోర్సులను డిజైన్‌ ‌చేస్తున్నారు. మరియు, మీ కంపెనీ మీటింగు లలో చురుకుగా పాల్గొనండి. మీ అనుభవాన్ని ఉపయోగించి, మీ కంపెనీలో ఆదాయం మరికొంత ఎలా పెంచాలో, ఖర్చు మరి కొంత ఎలా తగ్గించాలో, కష్టమర్‌లని మరింతగా శాటిస్‌ ‌చేయడానికి ఇంకా ఏమేమి చేయ వచ్చో మీ యాజమాన్యానికి సూచించండి. ఇలా, నాకు తట్టని మరెన్నో ఆలోచనలు మీకు కూడా తట్ట వచ్చు . ఆలోచించండి. ఇప్పుడున్న కష్ట కాలంలో, దైనందిక పని జీవితం లో ఉతాహంగా పని చేయడం, మన పనిలో పరమార్ధం చూడడం, మన అందరికీ అవసరం.

Featured

అనంతసాగరం తాసిల్దార్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అనంతసాగరం మండలం: అనంతసాగరం మండల తాసిల్దార్ ఎ.పద్మావతి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొనిస్థానిక తాసిల్దార్ కార్యాలయం నందు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరిపారు. మహిళలు మహిళలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీలను దేవతలుగా పూజించడం కాదు స్త్రీలను గౌరవించాలని,స్త్రీలను పురుషులతో సమానంగా చూస్తున్నాం అనేది మాటల్లో కాకుండా కార్యరూపం దాల్చే లా చేయాలని మహిళలు ఆర్థికంగా సామాజికంగా పురోగతి చెందేలా పాటుపడాలని, మహిళల అభివృద్ధికి తోడ్పడాలని, అదే మహిళలకు ఇచ్చే నిజమైన గౌరవం అని తెలిపారు. స్త్రీని ఒక వస్తువుల ఒక యంత్రంలా చూడకుండా వాళ్లు కూడా సమాజంలో భాగమేనని గుర్తించాలి. చాలామంది మహిళలను వారికి నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ ఉంటారు మహిళలను కించపరిచేలా మాట్లాడటం మానుకోవాలని,ఈ సమాజం మహిళకు ఇచ్చే గౌరవం ఎలా ఉందంటే ఒక వ్యక్తి చేతకాని పని చేస్తుంటే ఆ వ్యక్తి పసుపు రాసుకుని గాజులు తొడుక్కొని చీర కట్టుకోమని నిందిస్తారు అంటే మహిళలు అంత చేతకాని వారిలా వాళ్లు చూడడం చూపించడం సరికాదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే ఇటువంటి మహిళా దినోత్సవాలకు వీలువ ఉంటుందని తెలిపారు. ఇకనైనా మహిళలకు తగిన గౌరవం స్వేచ్ఛ ఇవ్వాలని తెలిపారు.

Featured

చిన్న పెద్ద తేడా లేకుండా itda లో మహిళా దినోత్సవం: దీప్తిమణికుమార్

ఈరోజు ఉదయం నెల్లూరు ITDA కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా గౌరవ ప్రాజెక్టు అధికారి శ్రీ C.A మణికుమార్ గారు వారి సతీమణి దీప్తిమణికుమార్ గారు పాల్గొన్నారు. మరియు DTWO Y. రోశిరెడ్డి గారు APO ( lands) రాజ్యలక్షి గారుఈ సదస్సు కు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సదస్సుకు అధ్యక్షుడు గా APO ( మానిటరింగ్) పులి చెంచయ్య వ్యవహరించారు.ఈ సదస్సు లో ముఖ్య వక్తగా ప్రాజెక్టు అధికారి శ్రీ C.A మణికుమార్ గారు భారాతీయ సమాజంలో స్త్రీల ఔన్నత్యాన్ని కొనియాడారు. దీప్తిమణికుమార్ గారు మాట్లాడుతూ ఈరోజే కాకుండా ప్రతిరోజూ స్త్రీల ను ఇదే విధంగా గౌరవించాలి అని తెలిపారు. ఈ సదస్సులో ITDA జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న మహిళ ఉద్యోగులు 15 మందిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ITDA సిబ్బంది JAO S.V.వాసుకీ FO రమేష్ ఇబ్బంది మొత్తం పాల్గొన్నారు.

Featured

నెల్లూరులో APGEA మహిళావిభాగంచే అంతర్జాతీయ మహిళా దినోత్సవం* తమిదుల సౌందర్య

ఈరోజు *తేదీ 08.03.2021 నెల్లూరు నగరంలో శ్రీ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన్ భవన్ సమావేశం మందిరం* నందు APGEA నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ వై. రమణారెడ్డి, కార్యదర్శి శ్రీ మల్లికార్జున గారి నేతృత్వంలో APGEA నెల్లూరు జిల్లా మహిళావిభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమము జరిగింది. HDC కో ఆర్డినేటర్ శ్రీమతి కాకుటూరు సునంద, RMO శ్రీమతి V. కళారాణి గారు , జిల్లా పంచాయతీ అధికారిణి శ్రీమతి D. ధనలక్ష్మి గారు అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమం APGEA నెల్లూరు జిల్లా మహిళా విభాగం చైర్ పర్సన్ తమిదుల సౌందర్య గారి అధ్యక్షత జరిగింది. APGEA జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీమతి A. విజయనిర్మల, మహిళా విభాగం కన్వీనర్ GSL. సౌజన్య, ఉపాధ్యక్షురాలు K. రాజేశ్వరి, GGH&ACSR యూనిట్ APGEA కార్యవర్గ సభ్యులు ఉమారాణి, కుమారి, శిరీష, శ్రీలత, కనకవల్లి తదితరుల నిర్వహణలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. అతిథులతో పాటు, నెల్లూరు జిల్లా GGH & ACSR, APGEA యూనిట్ అధ్యక్షకార్యదర్శి లు డాక్టర్ కాలీషా, డాక్టర్ కనకాద్రిలు, తదితరులు ప్రసంగించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పై APGEA జిల్లా కోశాధికారి శ్రీ PVST రాంప్రసాద్, ASO, కోవూరు ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. తదుపరి అతిధులకు, పలు సేవలు అందించిన మహిళా ఉద్యోగులను సన్మానించారు. మహిళా ఉద్యోగులకు క్రీడలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఇంకా పై కార్యక్రమంలో APGEA జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి P. మునెయ్య, సంయుక్త కార్యదర్శి KV. శ్రీకాంత్ రావ్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి సుజాత బాయ్, నెల్లూరు పట్టణ అధ్యక్షకార్యదర్శి లు సతీష్, నాగరాజు, నెల్లూరు రూరల్ అధ్యక్షుడు శ్రీ మస్తానయ్య, ఉపాధ్యక్షులు కిరణ్, కొవూరు యూనిట్ అధ్యక్షులు శ్రీ B. సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Featured

అనంతసాగరం గ్రంథాలయంలో ఘనంగా అంతర్జాతీయ య మహిళా దినోత్సవం

అనంతసాగరం మండలం: అనంతసాగరం శాఖ గ్రంథాలయంలో ఈరోజు జరిగిన చదవడం ఇష్టం ఈ కార్యక్రమంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగినది. స్థానిక జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు మహబూబ్బాషా తో కలిసి గ్రంథ భాండా గారి నారాయణ రావు గారు ప్రసిద్ధ సమాజ సేవకురాలు, అనాధలఅమ్మ మదర్ తెరిస్సా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రపంచ మహిళా దినోత్సవం ఆవిర్భావావం ఎందుకు ఎప్పుడు ఎలా మొదలైందో విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా మదర్ తెరిస్సా జీవిత విశేషాలు ఆమె సమాజ సేవ గురించి వివరంగా తెలియజేశారు. అనంతరం విద్యార్థులచే తెలుగు ఆంగ్ల కథల పుస్తకాలు పఠనం చేయించడం జరిగింది పదాల ఉచ్చారణ దోషాలను గుర్తించి వారికి చదవడంలో మెలకువలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వకృత్వ పోటీ నిర్వహించి విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది.

Featured

అనంతసాగరం మండలంలోప్రతి ఇంటికి నీటి సరఫరా: ఎంపీడీవో మధుసూదన్ రావు

ప్రతి ఇంటికి నీటి సరఫరా… ఎంపీడీఓ ఏ. మధుసూదన్ రావు. అనంతసాగరం మండలం లోని కేంద్ర ప్రభుత్వం నిధులతో జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీటిని అందించనున్నట్లు ఎంపీడీఓ ఏ.మధుసూదన్ రావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన అనంతసాగరం లోని మండల అభివృద్ధి కార్యాలయంలో శనివారం మండల స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా త్రాగునీటి ఎద్దడి నివారించేందుకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని పంచాయతి కార్యదర్శిలకు ఆయన సూచించారు.పాత బోర్లు మరమ్మతులు ఉంటే చేయించుకోవాలన్నారు.RWSజె.ఈ. సుదర్శన్ బాబు మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు.జల జీవన్ మిషన్ 100 రోజుల ప్రచార కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన అన్నారు.మండలం లోని ఇనగళూరు, గార్లదిన్నె పాడు ,మంగుపల్లి, లింగంగుంట గ్రామాలకు నీటి కుళాయిలు లేని ఇండ్లకు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ.ఓ.పి.ఆర్.డి.శ్రీనివాసరావు, పంచాయితీ కార్యదర్శిలు ,ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ,v.w.s.c.సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

బాస్‌లతో సత్సంబంధాలు 2 వ భాగం

‌క్రితం వారం ఆర్టికల్‌ ‘‘ ‌మన పై అధికారులతో సత్సంబంధాలుకి కొనసాగింపు. మన పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించాలి అంటే, ఇంకా మనం ఏమేమి చేయాలో ఈ వారం చూద్దాం. (1) మీ దైనందిన పని తాలూకు గోల్స్, ‌ధ్యేయాలు, మీ పై అధికారుల నమూనాతో సరిపోతాయో లేదో చెక్‌ ‌చేసుకుంటూ ఉం డండి. ఉదాహరణకి మార్కెట్‌లో కష్టమర్‌లు మీకు ఉన్న బాకీల వసూ ళ్ళు మీ పై వారి వారాంతపు గోల్‌ అనుకోండి, మనం సేల్స్ ‌మీద ఫోకస్‌ ‌సారిస్తే, బండిని వారు ఒక వైపు, మీరు ఒక వైపు లాగుతున్నట్లు ఉంటుంది. వారం మొదట్లోనే, ఆ వారం మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో, మీ వీక్లీ ప్లాను, మీ పై అధికారి(ణి)కి చెబితే మంచిది. ఏమైనా మార్పులు కావాలి అంటే వారు సూచిస్తారు. (2) మీ బాస్‌ ‌మీకు పని చెప్పినప్పుడు, పని ‘ఎప్పటి లోగ, ఏ విధంగా, ఏ నాణ్యతతో కావాలి అనేది ముందే నిర్ణయించుకుని , పని ఆ డేటులోగా పూర్తి చేయండి. ఒకవేళ అయ్యేలా లేక పోతే, మరో 2 రోజులు పట్టేలా ఉంటే అది 2 రోజుల ముందే మీ పై అధికారికి చెప్పేసెయ్యండి! వారు విసుక్కున్నా సరే! ఆ పని అనుకున్న తేదీ లోగా పూర్తి కావడానికి మరో ఇద్దరు మనుషులని కేటాయించడం అవసరం అనుకుంటే, వారు ఆ పని చేస్తారు! చివరి నిముషం దాకా ఆ విషయం మీ బాసు దగ్గర దాయకండి. ఈ ‘వర్క్ ‌ఫ్రం హోం కల్చర్‌ ‌మొదలయ్యాక మన సహోద్యోగులతో కమ్యూనికేషన్‌, ‌క్రమం తప్పకుండా, దైనందికంగా ఉండడం చాలా అవసరం! ఎందుకంటే, కరోనా ముందరి జమానాలో లాగా వారు మన టేబిల్‌ ‌దగ్గరికి వచ్చి ‘ఏమోయ్‌! ఎం‌త దాకా వచ్చింది నేను చెప్పిన పని? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ‘అని అడగడం, కాఫీ / టీ బ్రేకు / లంచ్‌ ‌టైంలో పరామర్శించడం లాంటి అవకాశాలు ఇప్పుడు లేవు! కమ్యూనికేషన్‌ ‌తప్పనిసరి! పని స్టేటస్‌ ‌తెలియ జేయడం చాలా ముఖ్యం. ఉదాహరణకి మీ పై అధికారి, ఒక సోమవారం నాడు ‘శనివారం కల్లా పని అయి పోవాలి’ అని డెడ్‌ ‌లైను ఇచ్చి పని అప్పగించారు అనుకోండి. అది ఆ తేదీ లోపు అవుతుందా లేదా, గురువారం సాయంత్రమే మీ పై అధికారికి తెలియ జేయండి. దీని వల్ల వారు ప్రత్యామ్నాయాలు ఆలోచించ గలరు, పనిలో పనిగా మీకునాలుగు అక్షింతలు వేసినా ! చెప్పిన దానిని బట్టి చెప్పనిది అర్ధం చేసుకుని పని చెయ్యండి. పై వారు నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన పూర్తి సమాచారం ఇవ్వండి ఇనీషియేటివ్‌ (‌చొరవ)కి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను.మేము ఒక కంపెనీ సేల్స్ ‌మీటింగ్‌లో కూర్చున్నాం, కన్సల్టంటుగా టార్గెట్‌లు కావడం లేదు. అమ్మకాలు పెరగడం లేదు. ఆ కంపెనీ హెడాఫీసు నుంచి వచ్చిన జనరల్‌ ‌మేనేజర్‌తో మొర పెట్టుకున్నారు సేల్స్ ఆఫీసర్‌లు. ‘మహాప్రభో! మా బైకులు అన్నీ తుప్పు పట్టి పోయాయి. రిపేర్‌లు వస్తున్నాయి. సర్వీసు బిల్లు మన వాళ్ళు పాస్‌ ‌చెయ్యడం లేదు. తిరగ లేక పోతున్నాము. జేబులో నుంచి డబ్బులు పెట్టుకుంటున్నాం!’’అని. ‘‘ ఇదేదో చూడవోయ్‌’’ అని వారి లాజిస్టిక్స్ ‌మేనేజర్‌తో అన్నాడు ఆ జి.ఎం. అని ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఈయన ఒక వారంలో మొత్తం ఆంధ్రా తెలంగాణాలో కంపెనీకి ఎన్ని బైకులు ఉన్నాయి, అవి కొన్న సంవత్సరం, తిరిగిన మైలేజి, ఇప్పటి పరిస్థితి, తుక్కు కండిషన్‌లో ఎన్ని ఉన్నాయి? కొత్తవి కొంటే ఎంత ఖర్చు అవుతుంది? కానీ, రిపేరు, మైలేజిల ఖర్చుల్లో ఎంత మిగల్చవచ్చు? వీటిని అమ్మి పారేస్తే ఎంత వస్తుంది? సేల్స్ ‌వుమెన్‌ ఎం‌తమంది? స్కూటీలు ఎంతమంది వాడుతున్నారు? ఎలక్ట్రికల్‌ ‌స్కూటర్‌లు కొంటే, నెలసరి పెట్రోలు ఖర్చు ఎంత మిగల్చవచ్చు? ఇదంతా చెయ్యడం వల్ల సుమారుగా అమ్మకాలు, డబ్బుల కలెక్షన్‌లు కంపెనీకి ఎంత పెరగవచ్చు? మొత్తం మీద ఎంత లాభం? ఎంత నష్టం? ఎంత ఖర్చు? ఎలా మిగులు? ఈ మొత్తం వివరాలతో పూర్తి రిపోర్టు ఢిల్లీకి పంపాడు ఆ లాజిస్టిక్స్ ‌మేనేజరు! జనరల్‌ ‌మేనేజరు పని సులభం అయింది ! యాజమాన్యం దగ్గర ఈ రిపోర్టు పెట్టి ‘‘అయ్యా ! ఇవీ వివరాలు ! ఇక మీ కంపెనీ, మీ ఇష్టం!’’ అని వచ్చేశాడు. వారం రోజుల్లో, దాదాపు 40 శాతం ‘తుక్కు’ బైకులు అమ్మేసి కొత్తవి కొన్నారు. అసలే పెట్రోలు 130 రూపాయలు అవచ్చని అంచనా! ఇప్పుడు కాదు, వచ్చే 5 సంవత్సరాలలో కంపెనీకి ఎంత ఆదా అవుతుందని లెక్క కట్టారు. కొత్త బైకు పొందిన ప్రతి సేల్స్ ఆఫీసరూ, ఆ లాజిస్టిక్స్ ‌మేనేజరుకి మిఠాయి తినిపించారు! స్థూలంగా చెప్పేది ఏమిటంటే, మన పై అధికారులకి, మన సమస్య గురించి పూర్తి వివరాలు అందించి ‘లాభం, నష్టం ‘భాషలో మాట్లాడితే, వారు త్వరగా సరియైన నిర్ణయాలు తీసుకోగలరు. బాసులతో సత్సంబంధాలకి ఇదో మార్గం !

Featured ఆంధ్రప్రదేశ్

తాటిపర్తిపాలెంలో ‘పొలంబడి’

తాటిపర్తిపాలెంలో ‘పొలంబడి’ వెంకటాచలం, ఫిబ్రవరి 27 (పున్నమి విలేకరి): మండలంలోని ఇసకపాలెం ఆర్బికే పరిధిలోగల తాటిపర్తిపాలెంలో శనివారం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి జి వెంకటేశ్వర్ రావు (డిడిఎ), సురేష్ (ఏవో), నెల్లూరు సంయుక్త వ్యవసాయ సహాయకులు కార్యాలయం నుంచి నర్సోజి(ఎడిఎ) హాజరయ్యారు. పొలంబడి విధివిధానాలు, వాటి అమలు గురించి రైతులతో చర్చించారు. వారికి తగిన సూచనలు, సలహాలు అందజేశారు. అధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడరాదన్నారు. ఎక్కువ రసాయన క్రిమిసంహారకాలు వాడటం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మంజుల, వ్యవసాయ సహాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

గౌరవరం వద్ద బోల్తా పడ్డ లారీ త్రుటిలో తప్పిన ప్రమాదం

అనంతసాగరం మండలం: గౌరవరం గ్రామం ఎస్సీ కాలనీ వద్ద అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ కేతి గుంట క్వారీ నుండి తారు మిక్సర్ లోడుతో ఉప్పలపాడు హైవే రోడ్డు పనులకు తీసుకువెళ్లే లారీ గౌరవరం ఎస్సీ కాలనీ వద్ద బోల్తా పడడం జరిగింది. స్వల్ప గాయాలతో డ్రైవర్ తప్పించుకో గలిగాడు కానీ ఈ ప్రమాదం జరిగిన పది నిమిషాల ముందు అదే ప్రాంతంలో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఈ విషయం గురించి ఆ ప్రదేశం నుండి గ్రామస్తు లను అడగగా కేతిగుంట నుంచి ఉప్పలపాడు వెళ్లే టిప్పర్లు మితిమీరిన వేగంతో వెళుతున్నాయని మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, ఇప్పటికే చాలా సార్లు టిప్పర్ డ్రైవర్లకు వాటి యజమానులకు కూడా చెప్పడం జరిగిందని కాని వారు ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదని మితిమీరిన వేగంతో నడపడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా కూడా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి ఎటువంటి ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు

Featured ఆంధ్రప్రదేశ్ బిజినెస్

బాస్‌లతో సత్సంబంధాలు

(‌పున్నమి ప్రతినిధి) : ఈ ఆర్టికల్‌ ‌ముఖ్యంగా 25 ఏళ్ళలోపు, యువతీ యువకులకు చాలా ఉపయోగం! మరియు ఒక 10 ఏళ్ళ అనుభవం ఉండి, కొందరు మంచి అధికారులతోనూ, కొందరు చండ శాసనులైన – పై అధికారుల (‘బాస్‌’అం‌దాము) తోనూ, పని చేసి వేగిన వారికి కూడా, కొంత ‘‘ఇంటర్‌ ‌పర్సనల్‌ ‌స్కిల్స్’’ ‌పెంపొందించుకునే విషయంలో ఉపయోగపడుతుంది. ఇక, మిడిల్‌ ‌మేనేజిమెంటు, ఆ పైన ఉండి, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలలో పని చేస్తున్న అధికారులకు కూడా ఉపయోగం. ఈ వారం మన టాపిక్‌, ‘‌బాసులతో సత్సంబంధాలు’. మన జీవితంలో మనశ్శాంతిని రెండు సంబంధాలు ప్రభావితం చేస్తాయి. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు, ఒక 25 శాతం. మీ పై అధికారి (ణి)తో సత్సంబంధాలు మరొక 25 శాతం. నేను సొంత కంపెనీ ప్రారంభించక ముందు, వివిధ కంపెనీ లలో పని చేసి, మిడిల్‌ ‌మేనేజిమెంటు వరకూ వెళ్ళి బయటికి వచ్చిన అనుభవాన్ని, ఈ శీర్షిక ద్వారా మీతో పంచుకుందాము అని ఉద్దేశ్యము. ఈ అవకాశం నాకు ఇచ్చి, వెన్ను తట్టి ప్రోత్సహించిన సర్వేపల్లి కోటేశ్వరరావుకి నా ధన్యవాదాలు! సో, మిడిల్‌ ‌మేనేజిమెంటు దాకా పోయిన నాకు, పైన కూడా రిపోర్టు చేసే బాసులు చాలా మంది ఉండే వారు. క్రింద కూడా నాకు రిపోర్టు చేసే వారు చాలా మంది ఉండే వారు. నా ర్యాంకులోనే టీం మేట్స్ ఉం‌డే వారు. వీరందరినీ సమన్వయం చేసుకునే క్రమంలో – నేను తప్పులు చేశానా? అంటే ఓ! చాలానే చేశాను! శిశుపాలుడి కంటే ఎక్కువ సంఖ్యలోనే. చాలా ఎదురు దెబ్బలు కూడా తిన్నాను, నిలదొక్కుకున్నాను అది వేరే కధ. అదే విధంగా, ‘మనం యవ్వనంలో, అంత అవగాహన , పరిపక్వత లేని రోజుల్లో చేసిన తప్పులు ఇప్పటి యువత చెయ్యకూడదు కదా? చెయ్యక పోతే, వారు ఉద్యోగ సోపానంలో నా కంటే త్వరగా పైకి ఎదుగుతారు కదా (ఎదగాలి కూడా!) అన్న ఉద్దేశ్యం కూడా, నేను ఇచ్చే ట్రెయినింగ్స్‌లోనూ, రాసే ఆర్టికల్స్‌లోనూ కనిపిస్తోంది. ఇవి పాటిస్తే మీరు మీ ఉద్యోగ వ్యాపారా స్వయం ఉపాధిలో మరింత స్పీడుగా ముందుకు పోగలరు! ఇప్పుడు మళ్ళీ అసలు టాపిక్‌కి వద్దాం. ‘బాస్‌లతో సత్సంబంధాలు’ ఈయన ఏంటీ? చెంచా గిరీ / చెక్క భజన చెయ్యమంటున్నాడా ఏమిటి? అని అనుకోవద్దు! ఇప్పుడొక చిన్న డిస్‌క్లెయిమర్‌! ‌బాస్‌తో సత్సంబంధాలు అంటే ఏవేవి కావు? ఏవి వాటిలోకి రావు? పై అధికారి(ణి)తో మంచి రిలేషన్‌ అం‌టే, వారి పిల్ల చీమిడి ముక్కుతుడవడం కాదు. ‘ఆహాహా ఓహోహో!’ అని వారు చెప్పే ప్రతిదానికీ ‘ఓ బ్రిలియంట్‌’ అనడం కాదు! చిడతలు వాయించడం కాదు. నిజానికి మీ పై అధికారి అభిప్రాయాల్తో మీరు విభేదించ వచ్చు కూడా! మీదైన అభిప్రాయాన్ని వినిపించ వచ్చు కూడా. అలా చేసి వారి మన్ననలను పొంద వచ్చు కూడా! అయితే, అది సగౌరవంగా, మర్యాదగా, మీటింగులలో పబ్లిక్‌గా కాక్కుండా వ్యక్తి గతంగా చేయాలి. ఒక టీం మేట్‌గా, ఒక సబార్డినేట్‌గా, మీ ఆత్మ గౌరవం నిలుపు కుంటూనే, అధికారం అనేది కొన్ని విభజన రేఖలు గీచి తీరుతుంది కాబట్టి ఆ లైను మనం దాటకుండా, అవతలి వారిని దాట నీయకుండా, మనం సత్సంబంధాలు నెరపవచ్చు. అది ముఖ్యం కూడా! అది ఎలానో చూద్దాం. ఇప్పుడు కోవిడ్‌ ‌వచ్చి, ఇంటి నుంచి పని చేసే వర్క్ ‌ఫ్రం హోం కల్చర్‌ ‌కంపెనీలలో అలవాటు అయినాక, మనం కొలీగ్స్‌ని కానీ, బాసులని కానీ వ్యక్తిగతంగా కలిసే అవకాశాలు సన్నగిల్లాయి . ముఖాముఖి ఎన్నో విషయాలు వ్యక్తం చేసే వారము, ఇప్పుడా పరిస్థితి లేదు. అయినా, పై అధికారులందరితోనూ సత్సంబంధాలు తప్పని సరి! దానికోసం (అ) వారి పని చేసే తీరుకి అనుగుణంగా మనని మనం కొంత అడ్జస్ట్ ‌చేసుకోవడం (మనకి సౌకర్యంగా లేక పోయినా!) (ఆ) క్రమం తప్పకుండా, నైపుణ్యంతో కమ్యూనికేట్‌ ‌చేస్తూ ఉండడం, (ఇ) ఇచ్చిన పని సమయానికి పూర్తి చేస్తూ వారి నమ్మకాన్ని పొందడం, మనం మొదటగా చేయాల్సినవి. మన బాసులకూ, పైన వారి బాసులు ఉంటారు కదా? వారి పై అధికారులు, మన బాసుల నుంచి ఏమి ఆశిస్తున్నారు? మన పై అధికారి పైన ఉన్న టార్గెట్‌లు ఏమిటి? వాటిని ఆమె / ఆయన పూర్తి చేయడంలో మనం ఎంతవరకు సహాయ పడగలము? ఇది అర్ధం చేసుకోవడం ద్వారా కూడా, మీరు మీ పై అధికారి నమ్మకాన్ని సంపాదించగలరు. మరిన్ని మార్గాల కోసం వచ్చే వారం ఇదే శీర్షికలో కలుద్దాం, శెలవు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.