నిర్మల్‌లో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
నిర్మల్: ఆర్టీఐ అమలు దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు సీహెచ్. వినోద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం అమలు, పనితీరు, నిబంధనలపై చర్చించారు. అనంతరం కమిటీ సభ్యులకు ఆర్టీఐ చట్ట పుస్తకాలను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాదిక్, జిల్లా జనరల్ సెక్రటరీ మొహమ్మద్ ముసెబ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ ముసెబ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ఆర్టీఐ చట్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకుని చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.









