సేవాభావంతో వైద్య సేవలు అందించాలి జిల్లా గ్రంథాలయ చైర్మన్
ఎంబీబీఎస్లో సీట్లు సాధించిన 30 మంది ముస్లిం విద్యార్థులకు సన్మానం నిర్మల్, అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి): వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ఎంబీబీఎస్లో సీట్లు సాధించిన విద్యార్థులు అభినందనీయులని ముఫ్తీ ఇలియాస్ ఖాస్మి అన్నారు. తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిధిలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన 30 మంది ముస్లిం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ మాట్లాడుతూ, విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. దైవం తర్వాత వైద్యులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందని, వైద్య వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకుని ప్రజలకు అంకితభావంతో వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఎంబీబీఎస్తోనే ఆగిపోకుండా పీజీ విద్యలోనూ ప్రతిభ చాటి, నిష్ణాతులైన వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తమ తల్లిదండ్రులకు, సొంత గ్రామాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. మతీన్, కార్యదర్శి వహీద్ ఖాన్, మొహమ్మద్ ఇంతియాజ్, అబ్దుల్ సాజిద్, ముజాహిద్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.









