Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Mumcipility

నంద్యాల

20వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శేషన్న పర్యటన

నంద్యాల:పట్టణంలోని 20వ వార్డు లలితనగర్‌లో మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న గురువారం పర్యటించి పారిశుద్ధ్యం, మౌలిక వసతులను పరిశీలించారు. ప్రధానంగా స్థానిక పార్కును సందర్శించి అక్కడి వసతులు, పరిశుభ్రతను పరిశీలించి, స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.ప్రజలు తెలిపిన సమస్యలపై వెంటనే స్పందించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పార్కుల నిర్వహణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అధికారులకు స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతర క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, శానిటేషన్ సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

టిడ్కో గృహాల వద్ద మొక్కలు నాటిన మంత్రి, కలెక్టర్

నంద్యాల: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు.‘సేవా మేరా యోగ్‌దాన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నంద్యాల ఎస్.ఆర్.బి.సి. కాలనీలోని టిడ్కో గృహాల ప్రాంగణంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడంతో పాటు నాటిన మొక్కలను సంరక్షించడంపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. కాలనీ పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.కార్యక్రమంలో ట్రైనీ సబ్ కలెక్టర్ ప్రియాంక, ఆర్డీఓ విశ్వనాథ్, తహశీల్దార్లు శ్రీనివాసులు, శ్రీవాణి, మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న, ఎమ్ ఈ నాగభూషణం రెడ్డి. డీఈలు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విక్రమ్. అధికారులు, ప్రజాప్రతినిధులు, టిడ్కో అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

నంద్యాల

వార్డులు పెంచారు.. వసతులు లేవు సమస్యలు పరిష్కరించాలి: సీపీఐ

నంద్యాల పట్టణంలో వార్డుల సంఖ్యను 42 నుంచి 52కు పెంచినా మౌలిక వసతులు మాత్రం మెరుగుపడలేదని సీపీఐ పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్ విమర్శించారు. సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలువల్లో పూడిక తొలగించక మురుగునీరు రోడ్లపైకి వస్తోందని, దోమలు, వీధి కుక్కల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. పైపులైన్ల కోసం రోడ్లు తవ్వి తిరిగి మరమ్మతులు చేయకపోవడంతో గుంతలు ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.వార్డుల్లో మౌలిక వసతులు కల్పించి సమస్యలను పరిష్కరించాలని సీపీఐ పట్టణ సమితి డిమాండ్ చేసింది. సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జి. నాగరాముడు, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు డి. శ్రీనివాసులు, మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ పాల్గొన్నారు.

నంద్యాల

తుది ఓటర్ల జాబితా విడుదల మున్సిపల్ కమిషనర్ శేషన్న

నంద్యాల పురపాలక సంఘ పరిధిలోని 52 ఎన్నికల వార్డులకు సంబంధించిన ఎస్టీ, ఎస్సీ, మహిళా ఓటర్ల తుది జాబితాతో పాటు బీసీ ఓటర్ల తుది జాబితాను ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.01.10.2026 నుంచి నంద్యాల మున్సిపల్ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, నంద్యాల తహసీల్దార్ కార్యాలయం (అర్బన్), నంద్యాల కార్యాలయాల నోటీసు బోర్డులపై తుది ఓటర్ల జాబితాలను ఉంచినట్లు కమిషనర్ పేర్కొన్నారు. సంబంధిత ఓటర్లు జాబితాలను పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.

నంద్యాల

నమో వనం పథకం కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్థల పరిశీలన చేసిన జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్

నంద్యాల: నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నమో వనం (NAMO VANAM) పథకం అమలుకు ప్రతిపాదించిన స్థలాన్ని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ DFO మల్లీశ్వరి, RDO విశ్వనాథం, urban తహసీల్దార్ శ్రీనివాసులు తో కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నమో వనం పథకం కోసం గుర్తించిన స్థలాన్ని పరిశీలించారు. పథకం అమలుకు అవసరమైన స్థల పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, మొక్కల పెంపకం మరియు సంబంధిత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నమో వనం పథకం ద్వారా పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల్లో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

నంద్యాల

రాయలసీమను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు

రాయలసీమ ప్రాంతాన్ని వ్యవసాయ-ఉద్యాన రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసి, ప్రపంచస్థాయి ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ -రాయలసీమ రైజింగ్’ కార్యక్రమానికి నంద్యాల జిల్లాలో విస్తృత ప్రచారం కల్పించారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని పిజిఆర్‌ఎస్‌ హాల్‌ నుంచి ఇండోర్‌ స్టేడియం వరకు నిర్వహించిన భారీ ట్రాక్టర్‌ ప్రచార ర్యాలీని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ లు ప్రారంభించారు.కలెక్టరేట్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ నూనెపల్లె, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, టెక్కె మార్కెట్‌ యార్డు మీదుగా ఇండోర్‌ స్టేడియానికి చేరుకుంది. ర్యాలీలో జిల్లా కలెక్టర్‌ శ్రీమతి జి. రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ ట్రాక్టర్లపై ప్రయాణిస్తూ “హార్టికల్చర్‌ హబ్‌-రాయలసీమ రైజింగ్‌” నినాదాలతో ఉత్సాహాన్ని నింపారు. ‘గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌-రాయలసీమ రైజింగ్‌’ లక్ష్యాలు, ఉద్యాన రంగ అభివృద్ధి ద్వారా రైతులకు లభించే అవకాశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారు.రాయలసీమ భవిష్యత్ రూపురేఖలను ఆవిష్కరించిన డ్రోన్‌ షో అనంతరం ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన భారీ డ్రోన్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాయలసీమలోని కరవు పరిస్థితులను అధిగమిస్తూ, వ్యవసాయ-ఉద్యాన రంగాల అభివృద్ధితో భవిష్యత్తులో ప్రాంతం ఏ విధంగా రూపాంతరం చెందనుందో రంగురంగుల డ్రోన్‌ కాంతుల విన్యాసాల ద్వారా ఆకాశంలో అద్భుతంగా ఆవిష్కరించారు. రాయలసీమ ఉద్యాన సంపద, ఆధునిక సాగు విధానాలు, ఉద్యాన ఉత్పత్తుల అభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధి, ప్రపంచస్థాయి హార్టికల్చర్‌ హబ్‌గా ప్రాంతం రూపుదిద్దుకునే భవిష్యత్‌ దృశ్యాలను ప్రతిబింబించేలా డ్రోన్‌ షోను రూపొందించారు. ఈ ప్రదర్శనను మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ ఆద్యంతం వీక్షించి అభినందించారు.ఉద్యాన పంటలతో రైతులకు మరింత లాభదాయకమైన అవకాశాలు: మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఈ సందర్భంగా మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతాన్ని, ముఖ్యంగా మదనపల్లె పరిసర ప్రాంతాలను ఉద్యానవన హబ్‌గా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. సాధారణ వ్యవసాయంతో పోలిస్తే ఉద్యాన పంటల ద్వారా రైతులకు మెరుగైన ఆదాయ అవకాశాలు లభించే అవకాశం ఉన్నందున ఉద్యాన రంగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమలోని 10 జిల్లాల్లో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఉద్యాన రంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. మామిడి, డ్రాగన్‌ ఫ్రూట్‌, జామ, సపోటా తదితర వివిధ రకాల పండ్ల తోటల సాగుకు ఈ ప్రాంతంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కాలువల ద్వారా నీటిని అందించడం, భూగర్భ జలాలను పెంపొందించేందుకు బోర్‌ బావుల రీచార్జ్‌ చర్యలు చేపట్టడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. రానున్న వేసవి కాలంలో ఎండల తీవ్రత, నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని, పండ్ల తోటలకు మరియు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.రాయలసీమను అంతర్జాతీయ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: కలెక్టర్‌ జి. రాజకుమారి జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి మాట్లాడుతూ, ఉద్యాన రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి రైతులకు మెరుగైన ఆదాయ అవకాశాలు కల్పించడంతో పాటు రాయలసీమను అంతర్జాతీయ స్థాయి ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దడమే ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్-రాయలసీమ రైజింగ్’ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంపై నంద్యాల జిల్లాలో గత వారం రోజులుగా విస్తృత ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యవసాయ-ఉద్యాన రంగ నిపుణులు, వివిధ వర్గాల భాగస్వామ్యంతో ఆధునిక సాగు విధానాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్‌, ఎగుమతులు తదితర అంశాలపై అవగాహన కల్పించినట్లు వివరించారు.

నంద్యాల

సకాలంలో గ్యాస్ డెలివరీ చేయాలి

నంద్యాల: గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు సకాలంలో, నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గ్యాస్ ఏజెన్సీ డీలర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సివిల్ సప్లైస్ అధికారి రవిబాబు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని, ఐవిఆర్ఎస్ కాల్స్‌లో ప్రతికూల స్పందనకు తావులేకుండా చూడాలని సూచించారు. డెలివరీ సిబ్బంది వినియోగదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సమస్యలను వెంటనే పరిష్కరించేలా ఏజెన్సీలు పర్యవేక్షించాలని ఆదేశించారు. సేవల నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.

నంద్యాల

ప్రారంభోత్సవం ఘనం.. డివైడర్లు అసంపూర్తి

నంద్యాల పద్మావతి నగర్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేస్తున్న ఇనుప డివైడర్ల పనులు అసంపూర్తిగా వదిలేయడంతో వాహనదారులు, పాదచారులకు ప్రమాద ముప్పు ఏర్పడుతోందని ఎస్‌డీపీఐ నంద్యాల అసెంబ్లీ కమిటీ సభ్యుడు వి. హనీఫ్ తెలిపారు.కొంత దూరం వరకు డివైడర్లు ఏర్పాటు చేసినా రంగులు వేయకపోవడంతో తుప్పు పడుతున్నాయని, మరికొన్ని చోట్ల కేవలం ఇనుప పైపులు ఏర్పాటు చేసి పనులు నిలిపివేశారని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో ఇవి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు.రోడ్డు ప్రారంభోత్సవంతో పాటు డివైడర్ల పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి, రంగులు, భద్రతా సూచికలు ఏర్పాటు చేయాలని ఎస్‌డీపీఐ డిమాండ్ చేసింది. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వి. హనీఫ్ కోరారు.

నంద్యాల

ప్లాస్టిక్‌పై కమిషనర్ తనిఖీలు

నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న సోమవారం పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్ల నిల్వ, వినియోగాన్ని పరిశీలించి, నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యాపారులు నిబంధనలు పాటించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. తనిఖీల్లో మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు విక్రమ్, శానిటేషన్ సూపర్‌వైజర్లు లక్ష్మీనారాయణ, శివప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

52 వార్డులకు 217 తుది పోలింగ్ కేంద్రాలు పోస్టర్ విడుదల చేసిన కమిషనర్ బి. శేషన్న

నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని 52 వార్డులకు సంబంధించి 217 తుది పోలింగ్ కేంద్రాల జాబితాను మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పోస్టర్ రూపంలో విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు జాబితాను ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.పోలింగ్ కేంద్రాల వివరాలు మున్సిపల్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, జిల్లా కోర్టు, మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు, ప్రధాన తపాలా కార్యాలయం, రైల్వే స్టేషన్ ఉప తపాలా కార్యాలయం, పోలీస్ కార్యాలయం, పబ్లిక్ గ్రంథాలయాలు, లీడ్ బ్యాంక్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించినట్లు కమిషనర్ తెలిపారు.