కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద బుధవారం ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం.
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది – కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారితో కలిసి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. ఉదయం 7.30 గంటలకు పరేడ్ ప్రారంభమై, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. నరసింహమూర్తి పరేడ్ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ రాక సందర్భంగా, అనంతరం ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాక సందర్భంగా స్మృతి పరేడ్ బృందం గౌరవ వందనం సమర్పించింది. అమరవీరుల స్మరణార్థం పరేడ్ కమాండర్ ఆదేశాల మేరకు “షహీద్ పుస్తక్ తోలి” నిర్వహించిననంతరం జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి త్యాగాలు పోలీసు సిబ్బందితో పాటు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి అమరులైన పోలీసు వీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. అనంతరం అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ అమరవీరుల పేర్లతో కూడిన రోల్ ఆఫ్ హానర్ ను చదివి వినిపించారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 154 మంది పోలీసులు వివిధ ఆపరేషన్స్ లో ప్రాణత్యాగం చేసి అమరులైనట్లు, వారిలో ఒకరు మన ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నారని పేర్కొన్నారు. అమరవీరులకు గౌరవ సూచకంగా అందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తదుపరి అధికారులు, ఆహ్వానితులు, అమరవీరుల కుటుంబ సభ్యులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. పరేడ్ ముగిసిన అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేసి, వారితో ఆత్మీయంగా మాట్లాడి పండ్లు, నగదు సహాయం అందించారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతిబింబించేలా దేవిన సిస్టర్స్ దేవిన సోహిత, దేవిన ధన్యత రూపొందించిన సైకత శిల్పం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.









