వృద్ధురాలి బంగారు గొలుసు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. మహిళ అరెస్ట్!
సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితురాలి గుర్తింపు.. చోరీ సొత్తు స్వాధీనం యలమంచిలి: పట్టణంలో సంచలనం సృష్టించిన 80 ఏళ్ల వృద్ధురాలిపై కారం చల్లి, మూడున్నర తులాల బంగారు గొలుసును దోచుకెళ్లిన కేసును యలమంచిలి పట్టణ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళను అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ ధనుంజయరావు కేసు వివరాలను వెల్లడించారు. సీసీ కెమెరాల ఫుటేజ్తో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితురాలిని గుర్తించినట్లు తెలిపారు. ఆమె స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న మహిళగా గుర్తించినట్లు వివరించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని, అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ఈ కేసును ఛేదించడంలో పట్టణ పోలీసులు సమర్థంగా వ్యవహరించారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ సావిత్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.









