Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: బ్రేకింగ్ న్యూస్

ప్రకాశం

పామూరులో నేటి నుంచి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

పామూరు, అక్టోబర్ 11 (పున్నమి ప్రతినిధి): పామూరు గ్రామంలోని శ్రీ మదన వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీ వల్లీ భుజంగేశ్వరస్వామి దేవస్థానాల్లో విజయదశమి సందర్భంగా ఆదివారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉభయదాతలు, భక్తుల సహకారంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.

ప్రకాశం

మంచినీళ్ల కోసం వచ్చి.. బంగారు గొలుసుతో పరార్‌

పామూరు: మంచినీళ్లు అడిగే నెపంతో ఇంట్లోకి వెళ్లి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అపహరించిన యువకుడిని పామూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పామూరు శ్రీనివాస నగర్‌కు చెందిన సామాను గుర్రం నాగమ్మ (70) ఇంటి వద్దకు విరాట్ నగర్ కాలనీకి చెందిన కోనేటి విష్ణు (22) శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో వెళ్లాడు. మంచినీళ్లు కావాలని అడగడంతో నాగమ్మ నీళ్లు ఇచ్చింది. ఆమె బాటిల్‌లో నీళ్లు పోస్తున్న సమయంలో మెడలో ఉన్న సుమారు 20 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్‌ఐ కే. అనూక్ తన సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు పామూరు–కందుకూరు రోడ్డు జంక్షన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి చోరీకి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని, నిందితుడిని కనిగిరి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ప్రకాశం

బీసీ రిజర్వేషన్లపై సమావేశం

ఆదివారం అమరావతి గ్రౌండ్స్‌లో భేటీ పామూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆదివారం సమావేశం నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బీసీ వర్గాల రాజకీయ అభ్యున్నతికి సంబంధించి చేపడుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు టీడీపీ పామూరు మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అమరావతి గ్రౌండ్స్‌లో జరిగే ఈ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి బీసీ సెల్ ముఖ్య నాయకులు, మండల స్థాయి ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని బొల్లా నరసింహారావు కోరారు.

ప్రకాశం

పామూరులో నేడు మదన వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

పామూరు: పామూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో శనివారం (అక్టోబరు 10) సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అష్టోత్తరం, పల్లకీ సేవ, భజన కార్యక్రమాలు, ప్రవచనం నిర్వహించడంతోపాటు చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు, గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తూ, అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ప్రకాశం

పామూరు అభివృద్ధికి నిధులు కేటాయించాలి

మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ సర్పంచి సోమిశెట్టి నారాయణ పామూరు: పామూరు గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడంతోపాటు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పామూరు మాజీ సర్పంచి సోమిశెట్టి నారాయణ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రం అందజేశారు. పామూరు గ్రామంలో కూరగాయల మార్కెట్‌కు మూడు అంతస్తుల భవనం నిర్మించాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్‌కు సొంత భవనం అందుబాటులోకి వస్తే కూరగాయల వ్యాపారులకు, రైతులకు, వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు. అదేవిధంగా ఎర్రజెర్లలో 490 ఇళ్లకు సంబంధించి ఎండోమెంట్స్‌ శాఖ నుంచి అవసరమైన క్లియరెన్స్‌ ఇప్పించి, లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లకు సంబంధించిన సమస్య పరిష్కారమైతే ఎన్నో కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఈ రెండు ప్రధాన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పామూరు ప్రాంత అభివృద్ధితోపాటు, ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారానికి మంత్రి చొరవ తీసుకోవాలని సోమిశెట్టి నారాయణ విజ్ఞప్తి చేశారు.

ప్రకాశం

చిదంబరం నటరాజ స్వామిని దర్శించుకున్న కొత్తపల్లి యువకులు

-ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన యువకులు పామూరు: తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన చిదంబరం శ్రీ నటరాజ స్వామి ఆలయాన్ని మార్కాపురం జిల్లా పామూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకకల్యాణం కోసం ప్రార్థించారు. పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా, ఆకాశ తత్త్వానికి ప్రతీకగా ప్రసిద్ధి చెందిన చిదంబరం నటరాజ స్వామి క్షేత్రం దేశవ్యాప్తంగా విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది. అటువంటి మహిమాన్విత పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం తమకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని యువకులు పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఎక్కంటి మహేంద్రరెడ్డి, కోటపాటి హజరత్‌రెడ్డి, కోటపాటి రామురెడ్డి, కోటపాటి నవీన్‌రెడ్డి, కల్లూరి కృష్ణారెడ్డి పాల్గొని నటరాజ స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తి, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా సంప్రదాయాలు, ధార్మిక విలువల పట్ల తమకున్న నిబద్ధతను యువకులు చాటుకున్నారు.

ప్రకాశం

శ్రీ మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో ఘనంగా వరుణయాగం

సీఎస్‌పురం: మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం సీఎస్‌పురం మండలం కోయిలంపాడు గ్రామంలోని శ్రీ మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో వరుణయాగం, వరుణజపం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. Uploaded Video:

ప్రకాశం

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో దద్దాల కీలక భేటీ

కనిగిరి : మార్కాపురం జిల్లా లో రానున్న కనిగిరి మున్సిపల్ ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తాడేపల్లిలోని తన నివాసంలో విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ తో కలిసి మున్సిపల్ ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి కమిటీల బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై 30 నిముషాలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కనిగిరి మున్సిపాలిటీలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి జరిగిన మేలును ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారన్నారు.కనిగిరి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా వైఎస్సార్సీపీ ఖాతాలో వేయాలని, అందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు.అనంతరం దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, జగన్మే ఆదేశాలరకు కనిగిరి మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సంబందించి ఇప్పటికే కార్యకర్తల సమావేశాలు పూర్తి చేశామని, చైర్మన్ పీఠాన్ని వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేసి వై.ఎస్.జగన్ కి హామీ ఇవ్వడం జరిగిందని దద్దాల నారాయణ యాదవ్ వెల్లడించారు. అదేవిదంగా 2024 పార్టీ ఓటమి తరువాత పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న మరియు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాబోయే స్థానిక ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించినట్లు ఆయన తెలిపారు..

ప్రకాశం

స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి – కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం, ఎస్‌ఐఆర్ అంశాలపై న్యాయపరమైన పరిణామాలు కొనసాగుతున్నప్పటికీ, ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చన్న అంచనాతో పార్టీ ముందస్తు సిద్ధత కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడు జగన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సూచించారని కనిగిరి నియోజకవర్గం వైయస్‌ఆర్‌సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ బుధవారం పార్టీ కార్యాలయం నుండి పత్రికా ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీలు, పన్నులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని చెప్పారు.అభ్యర్థులు గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేయాలని, దరఖాస్తులు స్వీకరించకపోతే లేదా సర్వర్ పనిచేయకపోతే ఆ పరిస్థితిని వీడియో రూపంలో నమోదు చేయాలని సూచించారు.జిల్లా పార్టీ నేతలతో జిల్లా కలెక్టర్ గారిని కలిసి సమస్యపై వినతిపత్రాలు అందజేద్దామన్నారు.కావున రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రకాశం

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

-ఎస్సై అనూక్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ స్ట్రీట్‌లో అవగాహన కార్యక్రమం పామూరు, అక్టోబర్ 3 ( పున్నమి ప్రతినిధి ): ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అనూక్‌ సూచించారు. పామూరు పట్టణంలోని కందుకూరు రోడ్డులో భగత్‌సింగ్‌ స్ట్రీట్‌లో శనివారం ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అనూక్‌ మాట్లాడుతూ సైబర్‌ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ శాఖల పేర్లతో ఫోన్‌ చేసి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీ, పిన్‌ నంబర్లు అడిగే వ్యక్తులను నమ్మవద్దని ఎస్సై అనూక్‌ తెలిపారు. బ్యాంకు అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌ వంటి రహస్య వివరాలను ఫోన్‌లో అడగరని చెప్పారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయవద్దని ఎస్సై అనూక్‌ సూచించారు. గుర్తుతెలియని యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దన్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే పెట్టుబడి పథకాలు, ఉద్యోగాల పేరుతో వచ్చే సందేశాలు, బహుమతులు గెలుచుకున్నారంటూ వచ్చే ఫోన్‌కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌, బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపుల సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్సై అనూక్‌ సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే సమీప పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు ఆన్‌లైన్‌ మోసాలకు గురికాకుండా ముందుగానే అవగాహన కల్పించాలని ఎస్సై అనూక్‌ కోరారు. అప్రమత్తతతోనే సైబర్‌ నేరాలను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.