Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: తెలంగాణ పోలీస్ సైబర్ క్రైమ్ జనగామ జిల్లా

జనగాం

జనగామ జిల్లాలో సీఈఐఆర్ పోర్టల్‌తో 67 మొబైల్స్ రికవరీ: డీసీపీ రాజమహేంద్ర నాయక్

జనగామ జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న వివిధ కంపెనీలకు చెందిన 67 మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ వెల్లడించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ప్రజలు ఎవరూ ఆందోళన చెందకుండా, ధైర్యం కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సీఈఐఆర్ (Central Equipment Identity Register) పోర్టల్‌లో వెంటనే వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ​పోగొట్టుకున్న ఫోన్లను బ్లాక్ చేయడానికి మరియు తిరిగి ట్రేస్ చేయడానికి ఈ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అయితే, సామాన్య ప్రజలకు లేదా కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ ఒక ప్రత్యేక పోలీసు అధికారిని CEIR బాధ్యతాధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే జనగామ వెస్ట్ జోన్ CEIR పోర్టల్ ఇంచార్జ్‌గా పాలకుర్తి సీఐ భరత్ సుమన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాధితులు తమ సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి, అక్కడ ఉన్న బాధ్యతాధికారి ద్వారా వివరాలు నమోదు చేయించుకోవచ్చని తెలిపారు. ​ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ల రికవరీలో ప్రత్యేక చొరవ చూపిన ప్రతి పోలీస్ స్టేషన్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. ప్రజలు ఎవరూ కూడా సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. సెలవుల సమయంలో లేదా బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ సైబర్ క్రైమ్‌కు గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.