ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయపంటల సాగుకు రైతులు ప్రాధాన్యత నివ్వాలి -జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ———————————————————— *రబీ సీజన్లో వరి, మొక్కజొన్న వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండాలి* *తక్కువ నీటితో పండే పంటలు, ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సూచించారు. బుధవారం, జిల్లాలోని పాలకుర్తి మండలంలోని ముత్తారం గ్రామంలో గల రైతు వేదికలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF) కింద ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రానున్న జూన్ నెల వరకు ఈ ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రబీ సీజన్లో వరి, మొక్కజొన్న వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయకుండా, తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. *వర్షపాతం తగ్గే అవకాశం.. నీటి వినియోగంలో అప్రమత్తత అవసరం* జిల్లాలో సాధారణంగా సంవత్సరానికి సుమారు 900 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు సుమారు 529 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని తెలిపారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాతావరణ అంచనాలను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలని, కేవలం సంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు సాగు చేయకుండా, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచించారు. *తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలి* వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. కంది, పెసర, వేరుశనగ వంటి పంటలతో పాటు తక్కువ నీటితో సాగు చేయగల ఇతర ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పంటల సాగు విధానాలను రైతులు పాటించాలని, శిక్షణ కార్యక్రమాల్లో అందించిన సూచనలను ఆచరణలో పెట్టాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. *ఉద్యానవన పంటలు, ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యత* నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపాలని, అయితే ఆయిల్ పామ్ తోటల్లో తప్పనిసరిగా డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఉద్యానవన పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న రైతులు తమ పేర్లను ఉద్యానవన శాఖ అధికారులకు నమోదు చేసుకోవాలని, సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. *రైతులకు గ్రామాల్లోనే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండాలి* రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు గ్రామాల్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు లభించేలా చూడాలన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల విక్రయానికి సంబంధించిన లైసెన్సులు కలిగిన దుకాణదారులు తమ వద్ద అందుబాటులో ఉన్న ఉత్పాదకాలను నిబంధనల ప్రకారం విక్రయించాలని సూచించారు. *భూగర్భ జలాల పరిరక్షణ అందరి బాధ్యత* ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోయే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, నీటి సంరక్షణ చర్యలను ప్రోత్సహించాలని తెలిపారు. *రైతులు నష్టపోకుండా ముందస్తు ప్రణాళికతో సాగు చేయాలి* వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు నష్టాల నుంచి బయటపడవచ్చని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు అందించే సలహాలను రైతులు పాటించాలని సూచించారు. రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత శాఖల అధికారులను సంప్రదించాలని, అవసరమైన సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులు ఆందోళన చెందకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. *వీబీ–జీ రామ్ జీ పథకం కింద పనులు చేపట్టాలి* గ్రామాల్లో భూగర్భ జలమట్టాల పెంపు, నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వీబీ–జీ రామ్ జీ పథకం కింద అవసరమైన పనులను గుర్తించి, చేపట్టాలని సూచించారు. చెక్ డ్యామ్ల నిర్మాణం, మరమ్మతులు, ఇతర నీటి సంరక్షణ పనులకు సంబంధించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు పీఎండీడీకేవై కింద *మామ్నూర్ కేవీకే శాస్త్రవేత్త సౌమ్య* ఎల్నీనో నేపథ్యంలో విత్తన శుద్ధి, పంట మార్పిడి, నీరు తక్కువగా పండే పంటలు, తదితరాలపై రైతులకు శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, ఉద్యానవన శాఖ అధికారి నర్సయ్య, ఎంపీడీవో వేదవతి, ఏడీఏ అపర్ణ, ఎంపీఓ మల్లిఖార్జున, ఆత్మా ఛైర్మన్ రాఘవ రెడ్డి, సర్పంచి అనిత, ఎంఏఓ విద్యాసాగర్, ఏఈఓ మహేష్, ఇతర సంబంధిత అధికారులు, అధిక సంఖ్యలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.









