Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

కరువు మండలంగా అచ్యుతాపురాన్ని ప్రకటించాలి

అచ్యుతాపురం: ఎల్‌-నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా కురవక పంటలు దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకునేందుకు అచ్యుతాపురం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అచ్యుతాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ)కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. మండలంలో వరి, అపరాలు, జీడి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని, పంటల నష్టాలతో రైతులు అప్పుల భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి అచ్యుతాపురం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం అందించాలని, రైతు రుణాల వాయిదాలను పొడిగించి వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రీ అప్పారావు, సీఐటీయూ మండల కన్వీనర్ కె. సోమునాయుడు, నిర్వాసితుల సంఘం నాయకులు బుద్ధ రంగారావు, పంచదారల అప్పలరాజు, రెడ్డి అప్పారావు, ఈగల గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఏటికొప్పాక దుర్గామాత ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు

ఏటికొప్పాక గ్రామంలోని డైలీ మార్కెట్ వద్ద కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ దుర్గామాత అమ్మవారి సన్నిధిలో శుక్రవారం ప్రత్యేక కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహాత్మా యూత్, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం శుక్రవారం సాయంత్రం పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక సరస్వతీ పూజలు నిర్వహించారు. విద్యార్థులు విద్యలో రాణించాలని, మంచి జ్ఞానాన్ని సంపాదించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పరీక్షల్లో విజయాలు సాధించి ఉజ్వల భవిష్యత్తును పొందాలని అమ్మవారిని ప్రార్థించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, ఏకాగ్రత, జ్ఞానాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో సరస్వతీ పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమాలు భక్తులను, విద్యార్థులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు, గ్రామ ప్రజలకు మహాత్మా యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అనకాపల్లి

ఆపరేషన్ త్రిశూల్‌.. ఎలమంచిలిలో డ్రగ్ టెస్టులు.. 10 మందికి నెగిటివ్‌!

ఎలమంచిలి: మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా గురువారం ఎలమంచిలి పట్టణంలో పోలీసులు ఆకస్మిక డ్రగ్ టెస్టులు నిర్వహించారు. పట్టణంలోని లాడ్జిలు, డ్రగ్స్ వినియోగానికి అనుమానాస్పదంగా గుర్తించిన హాట్‌స్పాట్‌ల వద్ద తనిఖీలు చేపట్టారు.EAGLE ఐజీపీ ఆకె రవి కృష్ణ, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ బి. మోహనరావు ఆదేశాల మేరకు ఎలమంచిలి టౌన్ ఎస్‌ఐ సావిత్రి, EAGLE ఇన్‌స్పెక్టర్ ఎస్. నారాయణరావు తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. Bio-Check డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా 10 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా, అందరికీ నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని ఎస్‌ఐ సావిత్రి పేర్కొన్నారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినవారి విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైన వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స, కౌన్సెలింగ్ అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని అధికారులు కోరారు.

అనకాపల్లి

ప్రకృతి వ్యవసాయంతోనే తక్కువ ఖర్చు, ఎక్కువ దిగుబడి..

ఎలమంచిలి మండలం కృష్ణాపురం గ్రామంలో బయో రిసోర్స్ సెంటర్స్ (BRC) పై రైతులకు అవగాహన ర్యాలీ, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌ఏ జ్యోతిర్మయి మాట్లాడుతూ.. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను వినియోగించాలని, భూమిని ఖాళీగా ఉంచకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని తెలిపారు. వాతావరణ అసమతుల్యత కారణంగా ప్రస్తుతం పంటలు ఎర్రగా మారి, తెగుళ్లు, పురుగుల ఉధృతి ఎక్కువగా ఉందని, వీటి నివారణకు రసాయనాల జోలికి పోకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సిద్ధం చేసే కషాయాలు, ద్రావణాలు, గ్రోత్ ప్రమోటర్లను మాత్రమే పిచికారీ చేసుకుని తక్కువ ఖర్చుతో పంటలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని వివరించారు. డెమో రూపంలో రైతులకు అన్ని కషాయాలు, ద్రావణాలను చూపించి, ఏ కషాయం ఏ తెగులు, పురుగుకు పనిచేస్తుందో తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయం అమలవుతున్న గ్రామాల్లోని BRC కేంద్రాల వద్ద అందుబాటులో ఉండే కషాయాలు, ద్రావణాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

అనకాపల్లి

నాయకులు అక్రమ అరెస్టులు ఖండిస్తూ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నిరసన.

రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు మాట్లాడుతూ నక్కపల్లిలో అక్టోబర్ 15న జరగనున్న మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణకు వెళుతున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ప్రజల పక్షాన నిర్వాసితులు పక్షాన నిలబడతాం ప్రజల ఓట్లతోటి అధికారం వచ్చాక పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకి అండగా ఉండడం చాలా దుర్మార్గమని చర్య ప్రజలే బుద్ధి చెప్తారు అన్నారు సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణలను ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డు లో పోలీసులు అరెస్టు చేసి ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు తెల్లవారి నుంచి సిపిఎం రాయవరం మండల కార్యదర్శి ఎం సత్యనారాయణ, నక్కపల్లి మండల కార్యదర్శి ఎం రాజేష్, రాజయ్యపేట సిపిఎం శాఖ కార్యదర్శి మైలపల్లి మహేష్ బాబులను గృహ నిర్బంధించడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి రైతు సంఘం జిల్లా కార్యదర్శి, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. అప్పలరాజును 3 రోజులుగా గృహనిర్బంధంలో ప్రజాస్వామిక చర్య. అరెస్టు చేసిన వారిని, గృహనిర్బంధంలో ఉన్న వారిని భేషరతుగా విడుదల చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి . ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు, జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డేడ రామ్ కుమార్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కాండ్రేగుల రామసదాశివ, ఎస్ కన్నుం నాయుడు బి రాము తదితరులు పాల్గొన్నారు

అనకాపల్లి

స్థానిక ఎన్నికల వేళ పోలీసుల నిఘా.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు!

జిల్లాలో త్వరలో జరగనున్న పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గురువారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లపై బైండోవర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్‌ నాన్‌ బెయిలబుల్‌ వారంట్లను అమలు చేయడంతో పాటు లైసెన్స్‌ ఆయుధాలను పోలీస్‌ స్టేషన్లలో డిపాజిట్‌ చేయించాలని సూచించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా తనిఖీలు విస్తృతం చేసి, పోలీసుల గస్తీని పెంచాలన్నారు. సభలు, ర్యాలీలు, రోడ్‌షోలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని, ప్రచార వాహనాలకు అనుమతి పాస్‌ ఉండాలని స్పష్టం చేశారు. మద్యం, నగదు, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టడం, సోషల్‌ మీడియాలో కులమత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకుపైగా నగదు తరలిస్తే తనిఖీల్లో స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా బాధ్యులపై చట్టప్రకారం నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఓటర్లు ఎలాంటి భయాలు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, నగదు, మద్యం పంపిణీ, ఓటర్ల బెదిరింపులపై ప్రజలు 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

అనకాపల్లి

ఆత్మ వారి సౌజన్యం తో అంతర్జాతీయ మహిళా రైతు దివాస్ ప్రోగ్రాం..

ఎలమంచిలి వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయం లో ఆత్మ వారి సౌజన్యం తో మహిళా కిసాన్ దివాస్ ప్రోగ్రాం అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం ప్రోగ్రాం మహిళా రైతులను ఉద్దేశించి జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సహాయకులు శ్రీధర్ మాట్లాడుతూ మహిళలు మగవాళ్ళకు దీటుగా అన్ని రంగాలలో సాధించుకోస్తున్నారని ఇదే పురోగతి ప్రతి సంవత్సరం వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలలో దీటుగా నిలవాలని తెలియజేశారు మరియు వ్యవసాయ రంగంలో ప్రధానమైన పంటలు వరి పంట కాకుండా ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉలవలు రాగులు, కొర్రలు మొదలగు చిరుధాన్యాల పంటల వైపు కూడా మొగ్గు చూపాలని తెలియజేశారు అభ్యుదయ మహిళా రైతులకు పురస్కరించుకొని ఉత్తమ మహిళా రైతులుగా ఎలమంచిలి రాంబిల్లి మరియు అచ్యుతాపురం మండలంలో ఒక్కొక్కరికి సర్టిఫికెట్స్ జారీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎలమంచిలి వ్యవసాయ సహాయకులు సుమంతా వ్యవసాయ అధికారులు మోహన్ రావు సౌజన్య శంకర్ గోవింద తోపాటు అభ్యుదయ రైతులు శాంతమ్మ ,రత్నం, కుమారి మరియు ప్రకృతి సిబ్బంది వ్యవసాయ విస్తరణ అధికారులు దేవుడు నూకరాజు ప్రియాంక పాల్గొన్నారు

అనకాపల్లి

అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

అనకాపల్లి సబ్‌ డివిజన్ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్‌లో విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్‌తో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను అనుసంధానించే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు.స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రతా ప్రణాళికలు రూపొందించాలి ఆపరేషన్ త్రిశూల్‌ను పటిష్టంగా అమలు చేయాలి: విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి,సీసీటీవీ కెమెరాలు నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, ట్రాఫిక్ నిర్వహణలో మూడో నేత్రంలా పనిచేస్తాయని ఐజీ గోపీనాథ్ జట్టి పేర్కొన్నారు. వ్యాపార సముదాయాలు, వీధుల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక గ్రామాలు, వార్డులను ముందుగానే గుర్తించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఐజీ ఆదేశించారు. గత ఎన్నికల పరిస్థితులు, ప్రస్తుత క్షేత్రస్థాయి నివేదికలను పరిగణనలోకి తీసుకుని భద్రతా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి, పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

అనకాపల్లి

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా విద్యార్థులకు పోటీలు

ఉప్పరాపల్లి: భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని గురువారం ఉప్పరాపల్లి గ్రామంలోని శ్రీ అబ్దుల్ కలాం విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. గ్రామ ఉద్యోగుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను, ఆలోచనా శక్తిని, ప్రసంగ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహకంగా పార్టిసిపేషన్ బహుమతులు అందించడంతో పాటు, ఆయా పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నారు. విద్యార్థుల్లో విద్యాపరమైన ఆసక్తిని పెంపొందిస్తూ, అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా చిన్నారులను భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

అనకాపల్లి

వృద్ధురాలి బంగారు గొలుసు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. మహిళ అరెస్ట్!

సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితురాలి గుర్తింపు.. చోరీ సొత్తు స్వాధీనం యలమంచిలి: పట్టణంలో సంచలనం సృష్టించిన 80 ఏళ్ల వృద్ధురాలిపై కారం చల్లి, మూడున్నర తులాల బంగారు గొలుసును దోచుకెళ్లిన కేసును యలమంచిలి పట్టణ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళను అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ ధనుంజయరావు కేసు వివరాలను వెల్లడించారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌తో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితురాలిని గుర్తించినట్లు తెలిపారు. ఆమె స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న మహిళగా గుర్తించినట్లు వివరించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని, అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ఈ కేసును ఛేదించడంలో పట్టణ పోలీసులు సమర్థంగా వ్యవహరించారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్‌ఐ సావిత్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.