కరువు మండలంగా అచ్యుతాపురాన్ని ప్రకటించాలి
అచ్యుతాపురం: ఎల్-నినో ప్రభావంతో వర్షాలు సక్రమంగా కురవక పంటలు దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకునేందుకు అచ్యుతాపురం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అచ్యుతాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ (డీటీ)కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. మండలంలో వరి, అపరాలు, జీడి పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని, పంటల నష్టాలతో రైతులు అప్పుల భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి అచ్యుతాపురం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం అందించాలని, రైతు రుణాల వాయిదాలను పొడిగించి వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రీ అప్పారావు, సీఐటీయూ మండల కన్వీనర్ కె. సోమునాయుడు, నిర్వాసితుల సంఘం నాయకులు బుద్ధ రంగారావు, పంచదారల అప్పలరాజు, రెడ్డి అప్పారావు, ఈగల గంగరాజు తదితరులు పాల్గొన్నారు.









