Wednesday, 29 April 2026

Blog

తెలంగాణ

స్వల్ప కాలిక పనులు చేసే వారందరూ జీవిత బీమా పొందాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) వాహనాల ద్వారా స్వల్పకాలిక పనులు చేసే వారందరూ జీవిత బీమా సౌకర్యాన్ని కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రజావాణి సమావేశంలో మాట్లాడుతూ ఆమెజాన్, జొమాటో, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల్లో పని చేసేవారు సంవత్సరానికి ₹20 ప్రీమియంతో భీమా పొందవచ్చు అన్నారు. ప్రమాదమరణం జరిగితే రెండు లక్షల రూపాయలు,అంగవైకల్యం కలిగితే ఒక లక్ష రూపాయలు, లభిస్తుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు అవగాహన శిబిరాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరంల మధ్య వయస్సు వారందరూ బీమా చేసుకోవచ్చని తెలిపారు.

తూర్పు గోదావరి

అన్నిహంగులున్న వినోదాత్మక చిత్రం ‘కె – రాంప్’ -కుటుంబాలతో థియేటర్ కి రప్పిస్తుంది : కిరణ్ అబ్బవరం.

రాజమహేంద్రవరం, అక్టోబరు 13: అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా ‘కె – రాంప్’ చిత్రం రూపొందిందని చిత్ర హీరో కిరణ్ అబ్బవరం చెప్పారు. సినిమా ఆద్యంతం స్పీడుగా నడుస్తుందని అందుకే రాంప్ అని పెట్టినట్లు తెలిపారు. హాస్య మూవీస్ పతాకంపై జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ‘కె – రాంప్’ సినిమా ఈనెల 18వ తేదీన దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమండ్రి వచ్చిన కిరణ్ అబ్బవరం స్థానిక హోటల్ షెల్టాన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిందన్నారు. యుక్తి తరేజా, నరేష్, సాయికుమార్, అలీ, వెన్నెల కిషోర్, అజయ్ అనన్య, తదితరులు నటించిన ఈ సినిమా మాస్ కామెడీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని కిరణ్ అబ్బవరం చెప్పారు. బాలయ్య సాంగ్ తో ఎంట్రీ ఉంటుందని, పండగ సీజన్ కావడంతో కుటుంబ సమేతంగా వీక్షించాలనుకునేవాళ్లంతా ఖచ్చితంగా ఈ సినిమాకు వస్తారన్న నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తంచేసారు. సినిమాటోగ్రఫీ సతీష్ రెడ్డి, ఎడిటర్ చోటా కె ప్రసాద్, సంగీతం చైతన్ భరద్వాజ్ సినిమాకు మంచి రెస్పాన్స్ తెచ్చారని తెలిపారు. ఘటోత్కచుడు వంటి పాత్రలతో కూడిన సినిమా చేయాలని ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా కిరణ్ అబ్బవరం తెలిపారు. చెన్నై లవ్, ఉగాది రోజు టైటిల్స్ తో సినిమాలు చేస్తున్నానని మరో మూడు సినిమాలు కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎంత ప్రమోషన్ చేసినా ఈరోజుల్లో ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడానికి ఎంత ప్రయత్నించినా రావడం చాల కష్టంగా మారిందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఓటిటి ఫ్లాట్ ఫారం బాగానే ఉందని చెప్పారు.

విశాఖపట్నం

ప్రజా దర్బార్ కి వచ్చే వినతుల పరిష్కరించటానికి ప్రాధాన్యత ఇవ్వాలి వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్

వి ఎం ఆర్ డి ఎ ప్రజా దర్బార్ కి వచ్చిన వినతులను నిశితంగా పరిశీలించి, వాటిని పరిష్కరించటానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన ఛాంబర్ లో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రజా దర్బార్ కి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా వినతులకు సంబంధిత అధికారులకు అందజేసి, నిర్దేశించిన గడువు లోగా పరిష్కరించాలని ఆదేశించారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలకు వాటిని క్రమబద్ధీకరించుకొనే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిచిందని, ఎల్ ఆర్ ఎస్- 2020 పథకానికి కొనసాగింపు కల్పించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కి మొత్తం 6 వినతులు రాగా, వాటిలో ప్లానింగ్ -3, ఎస్టేట్-2 , ఇంజనీరింగ్- 1 చొప్పున వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కె రమేశ్, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, ఇతర విభాగ అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

శ్రీజ దమ్ముకు ఘనంగా స్వాగతం

బిగ్ బాస్ లో శివంగిగా ప్రత్యేక గుర్తింపు తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు నగరానికి చెందిన దమ్ము శ్రీజకు సోమవారం విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది.. ఈ మేరకు శ్రీజ తల్లిదండ్రులు దమ్ము శ్రీనివాసరావు లావణ్య దంపతులతో పాటు కుటుంబ సభ్యులు,, స్నేహితులు సన్నిహితులు..పెద్ద ఎత్తున హాజరై విమానాశ్రయంలో ఘనంగా శ్రీజ ను స్వాగతించారు.. అలాగే వీరంతా శ్రీజను ఘనంగా సత్కరించారు.. కేకు కత్తిరించి శుభాకాంక్షలు తెలియజేశారు.. అగ్నిపరీక్షతోపాటు కామనర్ గా బిగ్ బాస్ లోకి ప్రవేశించిన శ్రీజ ఐదు వారాలపాటు అవలీలగా అనేక టాస్కుల్లో ముందు వరుసలో నిలిచారు.. అలాగే బిగ్ బాస్ శివంగిగా కూడా శ్రీజ పేరు సంపాదించారు.. ఇక ఓట్లు విషయంలో కూడా శ్రీజకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లభించింది.. తనకు అభిమానంతో ఓటు వేసి ఆదరించిన వారందరికీ శ్రీజ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మద్దతు అందజేయాలని శ్రీజ కోరారు.. శ్రీజను స్వాగతించిన వారిలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి డాక్ యార్డ్ కేటీబి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తోపాటు పెద్ద ఎత్తున పలువురు పాల్గొనీ శ్రీజకు అభినందనలు తెలియజేశారు

అనకాపల్లి

ప్రజా ఫిర్యాదుల వేదికలో 55 ఫిర్యాదుల స్వీకరణ – సత్వర పరిష్కారానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్., ఆదేశాలు

అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మొత్తం 55 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూ తగాదాలు – 28, కుటుంబ కలహాలు – 6, ఇతర విభాగాలకు చెందినవి – 21 గా గుర్తించబడ్డాయి. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా సంబంధిత అధికారులకు ఆదేశిస్తూ, “ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి వాస్తవాలు నిర్ధారించగానే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 7 రోజుల లోపు విచారణ పూర్తిచేసి తగిన పరిష్కారం చూపాలి. చేపట్టిన చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి సమర్పించాలి,” అని సూచించారు. ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ “ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యం. ప్రజా సమస్యలను న్యాయపరంగా పరిష్కరించడంలో అనకాపల్లి జిల్లా పోలీసులు పూర్తి కట్టుబాటుతో పని చేస్తున్నారని తెలిపారు.” ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్ తో పాటు ఎస్సై శిరీష ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

4.5 లక్షల విలువైన 5,900 నిషేధిత కోల్డ్/కఫ్ సిరప్స్ స్వాధీనం

తయారీదారు బజాజ్ ఫార్ములేషన్స్ (ఉత్తరాఖండ్) పై కేసు నమోదు 4 సంవత్సరాల లోపు పిల్లలకు వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా కోల్డ్/కఫ్ సిరప్స్ విక్రయించరాదు నిషేధిత మిశ్రమాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి ఔషధ నియంత్రణ పరిపాలన డైరెక్టర్ జనరల్ గిరిషా, ఐఏఎస్ ఆదేశాల మేరకు, డ్రగ్స్ కంట్రోల్ విభాగం, విశాఖపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. విజయ్‌కుమార్ పర్యవేక్షణలో, సుమారు రూ. 4.5 లక్షల విలువైన 5,900 “రివికోల్డ్” కోల్డ్/కఫ్ సిరప్స్ సోమవారం మర్రిపాలెం, విశాఖపట్నంలోని కిర్బి లైఫ్ సైన్సెస్ అనే మెడికల్ ఏజెన్సీ వద్ద డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాస్‌రావు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిరప్స్‌లో క్లోర్‌ఫెనిరమైన్ మాలియేట్ + ఫెనైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ మిశ్రమం ఉంది. వీటిని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బజాజ్ ఫార్ములేషన్స్, భగవాన్‌పూర్, రూర్కీ, హరిద్వార్ వద్ద తయారు చేశారు. ఈ సిరప్ బాటిళ్లపై తప్పనిసరిగా ఉండవలసిన హెచ్చరిక — “నాలుగేళ్ల లోపు పిల్లలకు వాడరాదు” — లేబుల్‌పై ముద్రించలేదు. దీని వలన చిన్న పిల్లలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ తెలిపారు. దీన్ని ఉల్లంఘించడం వల్ల డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం సెక్షన్ 26A ప్రకారం తయారీదారు సంస్థ బజాజ్ ఫార్ములేషన్స్ పై కేసు నమోదు చేయబడింది. స్వాధీనం చేసిన సిరప్స్‌ను తదుపరి చర్యల కొరకు గౌరవ న్యాయస్థానానికి అప్పగించబడతాయి. ఇటీవల మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో కలుషిత కఫ్ సిరప్స్ వలన చిన్నారుల మరణాలు చోటుచేసుకున్న నేపథ్యంలో, అన్ని లైసెన్సుదారులు నిషేధిత మిశ్రమాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే అర్హత కలిగిన వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా పిల్లలకు ఏ కోల్డ్/కఫ్ సిరప్ ఇవ్వరాదు అని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. ఈ చర్యల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాస్‌రావు, పోలీసులు డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

అంబేద్కర్ విగ్రహం ధ్వంసానికి పురమాయించిన ఆర్డీవో శ్రీలేఖపైన, అందుకు పూనుకున్న ఎమ్మార్వో పైన, రెవెన్యూ సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలి

పి జె ఆర్ ఎస్ లో ప్రజా, దళిత సంఘాల నేతలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు పెందుర్తి మండలం, చిన ముషిడి వాడ అంబేడ్కర్ నగర్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బంది, ఆదేశాలిచ్చిన ఆర్డీవో శ్రీలేఖ, ఎమ్మార్వోలపై చర్యలు తీసుకోవాలని ప్రజా దళిత మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు వినతిపత్రం ద్వారా ఫిర్యాదు చేశారు. అనంతరం పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మీ మీడియాతో మాట్లాడుతూ 20ఏళ్ల క్రితం నుండి అంబేద్కర్ విగ్రహం ఉందని, అక్కడ ప్రభుత్వం బోరింగు కూడా ఏర్పాటు చేసిందని అంబేద్కర్ విగ్రహం బోరింగ్ ఉన్న స్థలాన్ని వి.ఎం.ఆర్.డి.ఏ అమ్మితే దానిని కొనుగోలు చేశారని, కానీ ఇప్పుడు కొత్తగా విగ్రహం పెట్టారని అవాస్తవాలతో చందక సాయి కృష్ణ కోర్టులో పిటిషన్ వేశారన్నారు. ఆ పిటిషన్ పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేయమని విశాఖ జిల్లా కలెక్టర్ కి 2021లో కోర్టు డైరెక్షన్ ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఇది కోర్టులో పెండింగ్లో ఉందని, కానీ విగ్రహం తొలగించమని ఆదేశాలు ఇచ్చినట్టు పిటిషన్ దారుడు చందక సాయి కృష్ణ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆమె చెప్పారు. వాస్తవానికి అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2021 లోనే పెందుర్తి తాసిల్దార్ రామారావు విచారణ జరిపి ఆ స్థలంలో అప్పటికే 15 సంవత్సరాల క్రితం నుండి అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉందని, అక్కడ ప్రభుత్వ నిధులతోనే బోరింగ్ కూడా ఏర్పాటు చేయబడిందని ఆ సందర్భంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ స్థలము తమదని క్లైమ్ చేయలేదని జిల్లా కలెక్టర్కు గ్రౌండ్ రిపోర్టు ద్వారా తెలియజేశారని ఆమె వివరించారు. కానీ ఆర్డీవో శ్రీలేఖ ఈ విషయాలు ఏమీ పరిగణలోకి తీసుకోకుండా, తమ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న ఫైలుని కనీసం చూడకుండా పెందుర్తి ఎంఆర్ఓని అక్కడున్న సిబ్బందిని తన తప్పుడు ఆదేశాలతో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి పురమాయించిందని తెలిపారు. దీనిపై తాము జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఆర్డీవో శ్రీలేఖ పైన రెవెన్యూ సిబ్బందిపైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు ఆమె వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో లక్ష్మీ తో పాటు, దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సుర్ల వెంకటరమణ, పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి ఇందిర, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బి రామకృష్ణ, భారత నాస్తిక సమాజం వై నూకరాజు, ఐ యఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రావు, మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం పూర్వ అధ్యక్షులు కే రవి నగర కన్వీనర్ ఈసర లక్ష్మి, కో కన్వీనర్ రూప, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కే నిర్మల, దళిత విముక్తి నాయకులు బంకపల్లి అప్పారావు సన్యాసమ్మ తదితరులు ఉన్నారు.

విశాఖపట్నం

మద్యంలో “మిథనాల్” పాయిజన్ ప్రాణాలు పోగొట్టుకుంటున్న.. పవన్ కళ్యాణ్ కి కనపడదు..

కల్తీ మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణ జరగాలి కల్తీ మద్యం.. బెల్ట్ షాపులు తక్షణమే అరికట్టాలి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వాసుపల్లి గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని హడావిడి చేసిన కూటమి నేతలు ఇప్పుడు బయట పడిన కల్తీ మద్యం స్కాం గురించి ఏమి సమాధానం చెబుతారని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ప్రశ్నించారు. నకిలీ మద్యం ప్రాణాలతో చెలగాటమా? కల్తీ మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలని కోరుతూ దక్షిణ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ వైయస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యేలు ఒక బెల్ట్ షాప్ ఏర్పాటి కోసం 9 లక్షలు వంతున వసూలు చేస్తున్నారనీ.. అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు అన్నారు. మద్యంలో మిథనాల్ 7 శాతం వుంటుంది. ఫలితంగా మందు బాబుల్లో చూపు పోవడం, లంగ్స్ దెబ్బ తినడం జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దమ్ముంటే కల్తీ మద్యం కుంభకోణం మీద సీబీఐ విచారణకు ఆదేశించాలి అని డిమాండ్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ దేనికైనా వంద రోజుల సమయం కావాలి అంటారు అని ఎద్దేవా చేశారు. మందు బాబుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారని వందేళ్లు బతకాల్సిన యూత్ 20 నుంచి 25 కే ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. మిథనాల్ అనే పదార్థం రాష్ట్రంలో ఎక్కడ వచ్చిన సరే యుద్ధ పర్మిట్ ప్రభుత్వ అనుమతులు ఉండాలి. ఏపీ ఐసీసీ ద్వారా ఇండస్ట్రియల్ అథారిటీ కి వెళ్ళాలి..లిక్కరో కలిపిదే ఈ బాటిల్ లో 40 శాతం ఇథనాల్ ఉంటాది. అదే మిథానాల్లో కలపాలంటే . పాయింట్ 7% తక్కువ సరిపోతుంది. దీనిలో చచ్చిపోయిన తేళ్ళు కలుపుతారు. దానికున్న పవర్ తాగిన వాళ్ళు పాయిజన్ తీసుకోవడంతో సమానమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 40 వేల బెల్ట్ షాపులను మూయించారు అని గుర్తు చేశారు. ప్రభుత్వ మద్యం విక్రయాల కారణంగా మద్యం నియంత్రణలో ఉండేదన్నారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులు పుట్ట గొడుగుల్లా వెలిశాయి అని మండి పడ్డారు . మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు బాగా పారిపోయాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం కారణంగా మందు బాబుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత వారి కుటుంబాలకు దిక్కెవరని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, , కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు

సోమవారం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ వివిధ వార్డుల పరిధిలో పలు అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 31వ వార్డు – ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జైల్ రోడ్డులోని ఇంటర్‌ కళాశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ ఏర్పాటులో సహకరించిన వేదాంత కంపెనీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు పౌష్టిక ఆహారం అందించేందుకు కృషి చేస్తోందని ఆయన తెలిపారు. విద్యార్థులతో మాట్లాడుతూ, వారి సమస్యలను తెలుసుకున్నారు. కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ రూప, టిడిపి సీనియర్ నాయకురాలు గాయత్రి, జనసేన నాయకులు రాజేష్, వార్డు ఇన్‌చార్జ్ డాక్టర్ మర్రిమేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 33వ వార్డు – 8వ రాష్ట్రీయ పోషణ మాసం ఉత్సవాలు పోషణ మాసం సందర్భంగా కుమ్మరి వీధి సామాజిక భవనంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోషణ మాసం ప్రాముఖ్యత, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషక పదార్థాలను పరిశీలించి, శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిడిపిఓ నీలిమ, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, స్థానిక నేతలు చక్రవర్తి, జీకే, వెంకటప్పారావు, మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. 35వ వార్డు – దుర్గామాతా నవరాత్రి అన్నదాన కార్యక్రమం దుర్గామాతా నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా వేలంపేటలో ఘనంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అమ్మవారి దర్శనం అనంతరం అన్నప్రసాదం కౌంటర్‌ను ప్రారంభించి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు. 30వ వార్డు – శ్రీ శ్రీ శ్రీ మరిడిమాంబ జెండా పండుగ శ్రీ శ్రీ శ్రీ మరిడిమాంబ మహోత్సవాల సందర్భంగా కోడిపందాల వీధిలో జెండా పండుగ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకొని, 70 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి పండుగలో పాల్గొనడం సంతోషంగా ఉందని, యువత పలు సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షురాలు యజ్ఞశ్రీ, 37వ వార్డు అధ్యక్షుడు రవి, భాను తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

275 కిలోల గంజాయి స్వాధీనం అక్రమ రవాణా లో పాల్గొన్న ముగ్గురిని అరెస్ట్ చేసిన చోడవరం పోలీసులు

₹13.75 లక్షల విలువ గల 275 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాలో పాల్గొన్న ముగ్గురిని చోడవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో సీఐ అప్పలరాజు, ఎస్ఐలు నాగ కార్తీక్, జోగారావు బృందం విజయవంతంగా నిర్వహించింది. ముంచంగిపుట్టు నుంచి రాజస్థాన్‌కు తరలించేందుకు ప్రయత్నించిన 275 కిలోల గంజాయి, టాటా కరువి కార్, రెండు బైక్‌లు, ఐదు మొబైల్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ డ్రగ్స్‌ రవాణా, వాడకం పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. ప్రజలు సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలి” అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.