Friday, 24 April 2026

Blog

తిరుపతి

అక్కుర్తి పాఠశాలలో ఎమ్మెల్యే సందర్శన… 90 రోజుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి హామీ

శ్రీకాళహస్తి, మార్చి 26 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతులను స్వయంగా పరిశీలించి, విద్యార్థులతో వారి చదువులు, బోధన విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ‘డొక్కా సీతమ్మ’ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే 90 రోజుల గడువులో పాఠశాలలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆర్.ఓ ప్లాంట్ ఏర్పాటు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.

తిరుపతి

ఊరందూరులో ఉచిత వైద్య శిబిరం… గ్రామీణులకు కార్పొరేట్ స్థాయి సేవలు

శ్రీకాళహస్తి, మార్చి 26 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామ సచివాలయంలో హిందుస్థాన్ కోకా కోలా బెవరేజస్, వై ఫోర్ డి ఫౌండేషన్ సహకారంతో స్థానిక ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేణిగుంట శ్రీ వెంకటేశ్వర క్లినిక్ అధినేత డాక్టర్ తేనేపల్లి జనార్ధన్ హాజరై మాట్లాడారు. ప్రస్తుత కాలంలో కార్పొరేట్ ఆసుపత్రులు వ్యాపార దృక్పథంతో నడుస్తున్నాయని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన వైద్యుల సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్ధాల రవిబాబు మాట్లాడుతూ, గ్రామీణ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న కోకా కోలా కంపెనీ, వై ఫోర్ డి ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఫీజులు చెల్లించలేని అనేక మంది పేదలకు ఉచితంగా పరీక్షలు, మందులు అందించడం గొప్ప సేవ అని అభినందించారు. వై ఫోర్ డి ఫౌండేషన్ ప్రతినిధి ఖలీల్ మాట్లాడుతూ, సంస్థ పరిసర గ్రామాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆరోగ్య సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ శిబిరంలో వివిధ వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

తిరుపతి

జనసైనికుడి కుటుంబానికి జనసేన భరోసా- కార్యకర్తమృతికి సంతాపం, తక్షణ ఆర్థిక సాయం

తోటంబేడు, మార్చి 26 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలం, పెన్నాలపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు (ఉద్యమి సభ్యత్వ దారుడు) వెట్టిచెర్ల సుబ్బరాయులు ఆకస్మిక మరణం పట్ల జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. నిబద్ధత కలిగిన జనసైనికుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన సుబ్బరాయులు మృతి పార్టీకి తీరని లోటని స్థానిక నాయకులు పేర్కొన్నారు. సుబ్బరాయులు మరణవార్త తెలిసిన వెంటనే స్పందించిన జనసేన పార్టీ నాయకులు, పేట సోదరులు తన మిత్రబృందంతో కలసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కష్ట సమయంలో పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ, తక్షణ సహాయం కింద రూ. 5,000 నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను ఒక కుటుంబ సభ్యుడిగా జనసేన గౌరవిస్తుందని సుబ్బరాయులు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని వారి కుటుంబానికి భవిష్యత్తులోనూ పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్థులు పాల్గొని సుబ్బరాయులుకు నివాళులర్పించారు.

తిరుపతి

గ్రామీణ శాస్త్రవేత్తలపై వేధింపుల ఆరోపణలు…రూ.5 కోట్లు బకాయి వివాదం చెలరేగింది

తోటంబేడు, మార్చి 26 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గం తోటంబేడు మండలానికి చెందిన గ్రామీణ శాస్త్రవేత్తలు తయారుచేసిన “జీవామృతం” సరఫరా విషయంలో భారీ ఆర్థిక వివాదం తలెత్తింది. హైదరాబాద్‌కు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి సుమారు రూ.5 కోట్ల విలువైన సరుకు తీసుకుని ఇప్పటికీ చెల్లింపులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని శాస్త్రవేత్తలు ఆరోపించారు. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకపోగా, వివాదాన్ని కోర్టుకు తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. కోర్టు ఆదేశాలతోనే ఫ్యాక్టరీకి రావాలని కోరినా, దుర్గాప్రసాద్ తప్పుడు సమాచారం అందిస్తూ పోలీసులను రంగంలోకి దింపుతున్నారని ఆరోపించారు. ఇటీవల పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని, స్థానిక శాస్త్రవేత్తలపైనే ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారాకొల్లు గ్రామానికి చెందిన శాస్త్రవేత్త చంద్రశేఖర్ నాయుడుపై కూడా బెదిరింపులు జరిగాయని తెలిపారు. ఇంకా, స్థానికులకు డబ్బులు చెల్లించకుండా రాజకీయ, పోలీసు ప్రభావం ఉపయోగించి వివాదాన్ని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామీణ శాస్త్రవేత్తలు విమర్శించారు. పోలీసులు నాన్-లోకల్ వ్యక్తుల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, తమపై చులకనగా ప్రవర్తించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తమ పరిశోధనలను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రశంసించి సన్మానించిన విషయాన్ని గుర్తుచేసిన శాస్త్రవేత్తలు, తమ ప్రయోగాలు ప్రభుత్వ స్థాయిలో గుర్తింపు పొందినవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామీణ శాస్త్రవేత్తలు తెలిపారు.

తిరుపతి

మీ ఇంటికి – మీ డాక్టర్” ప్రారంభం… తిరుపతిలో రెడ్ క్రాస్ సేవలకు కొత్త దిశ

శ్రీకాళహస్తి, మార్చి 26 (పున్నమి న్యూస్): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన “మీ ఇంటికి – మీ డాక్టర్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపికైన వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్ నూతనంగా ఏర్పాటు చేసిన రక్త నిల్వ కేంద్రాన్ని సందర్శించి, రెడ్ క్రాస్ నూతన కార్యవర్గాన్ని ప్రశంసించారు. అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్యవర్గం ప్రజా సేవల్లో చురుకుదనం చూపుతూ అనేక ప్రయోజనకర కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలను విస్తరించి ప్రతి గ్రామానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ….సమిష్టి కృషితోనే ఇటువంటి సేవా కార్యక్రమాలు సాధ్యమయ్యాయని, సభ్యులందరి సహకారంతో బ్లడ్ బ్యాంక్, “మీ ఇంటికి – మీ డాక్టర్” వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ డి. శ్రీహరి రావు, సెక్రటరీ ప్రతీత్, ట్రెజరర్ జి.వి. సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఆపదలో ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. రక్షణ చర్యలపై విద్యార్థులకు ఎస్డీఆర్ఎఫ్ శిక్షణ

శ్రీకాళహస్తి, మార్చి 26 (పున్నమి న్యూస్): విపత్తుల సమయంలో ప్రాణనష్టాన్ని ఎలా నివారించాలో, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో విద్యార్థులకు అవగాహన ఉండాలని 9వ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ అధికారులు అన్నారు. గురువారం నాడు పల్లంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల భద్రతపై అవగాహన కార్యక్రమంతో పాటు భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. 9వ బెటాలియన్ కమాండెంట్ సాయి ప్రసాద్ మార్గదర్శకత్వంతో అసిస్టెంట్ కమాండెంట్ ఆనంద్ కన్నా పర్యవేక్షణలో ఈ శిక్షణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రాక్టికల్‌గా వివరించారు. ప్రమాద సమయంలో భవనాల నుంచి సురక్షితంగా బయటకు రావడం, క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించడం వంటి అంశాలపై సిబ్బంది చేసిన ప్రదర్శనలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొని రక్షణ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ధైర్యం, అప్రమత్తత పెరుగుతాయని పేర్కొంటూ ఎస్డీఆర్ఎఫ్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

ఏప్రిల్ 1 నుంచి ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఇసుక సరఫరా – అక్రమ రవాణాపై కఠిన చర్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా మార్చి పున్నమి ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి ‘మన ఇసుక వాహనం’ ద్వారా నిర్మాణ పనులకు ఇసుక సరఫరా ప్రారంభమవుతుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఇందుకోసం ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఐడీఓసీలో జరిగిన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి కలెక్టర్ ఈ నిర్ణయాలు వెల్లడించారు. కేవలం అనుమతించిన ఇసుక రీచ్‌ల నుంచే సరఫరా జరగాలని, మండల నుంచి జిల్లా స్థాయి వరకు టాస్క్‌ఫోర్స్ టీంలు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు చేయాలని సూచించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటుక బట్టీలు కూడా నిబంధనల ప్రకారం అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ, అక్రమ రవాణాపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

E-పేపర్ News తెలంగాణ మహబూబాబాద్

బాధితురాలు ఇంటి వద్దే FIR నమోదు చేసిన :కురవి ఎస్ఐ

*బాధితురాలి ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కురవి పోలీసులు..!! వేగంగా స్పందించిన తీరుకు ప్రశంసలు..👌*మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని రాజోలు గ్రామంలో జరిగిన గొడవ సంఘటనలో కురవి పోలీసులు తక్షణమే స్పందించి *బాధితురాలి ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్ నమోదు* చేసి తమ నిబద్ధతను చాటుకున్నారు. పోలీసుల వేగవంతమైన చర్యలను స్థానిక ప్రజలు ప్రశంసించారు. *రాజోలు గ్రామానికి చెందిన కొమ్మరాజుల వీరభద్రమ్మ* కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు 6.00 గంటల సమయంలో ఆమె ఇంటి ముందు ఆటో నిలిపే విషయంలో పొరుగువారైన *గుంజ రాజు, గుంజ యశోద మరియు వారి కుమారుడు సురేష్‌తో వివాదం చోటుచేసుకుంది.* ఈ గొడవ క్రమంలో ముగ్గురు కలిసి ఆమెపై చేతులతో, కర్రతో దాడి చేయగా, *వీరభద్రమ్మ కుడి చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి.* ఈ ఘటనపై *సమాచారం అందుకున్న వెంటనే కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్,* పోలీస్ సిబ్బంది ఆలస్యం చేయకుండా బాధితురాలి ఇంటికే చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. *అక్కడే బాధితురాలి నుండి పిర్యాదు స్వీకరించి, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.*

తిరుపతి

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వాహన తనిఖీలు

పున్నమి ప్రతినిధి 26 మార్చి 2026. తిరుపతి రోడ్డు ప్రమాదాల నివారణకు జాయింట్ ఆపరేషన్. టోల్ ప్లాజాల వద్ద విస్తృత వాహన తనిఖీలు భద్రతపై ప్రత్యేక దృష్టి. పోలీస్, ట్రాన్స్పోర్ట్, అగ్నిమాపక శాఖల సంయుక్త చర్యలు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారి నేతృత్వంలో పోలీస్ శాఖ, ట్రాన్స్పోర్ట్ మరియు అగ్నిమాపక శాఖలు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈరోజు మార్కాపురంలో జరిగిన విషాద ఘటనను దృష్టిలో ఉంచుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చెన్నై–విజయవాడ, తిరుపతి–చెన్నై, తిరుపతి–విజయవాడ జాతీయ రహదారుల ఏర్పేడు టోల్ ప్లాజా, వడమాలపేట టోల్ ప్లాజా ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ట్రావెల్స్ బస్సులు మరియు సుదూర ప్రయాణ వాహనాలు లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో అధికారులు వాహన భద్రతా ప్రమాణాలు డ్రైవర్ల పనితీరు అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా లేదా, బస్సుల్లో ఏమైనా ప్రమాదకర వస్తువులు ఉన్నాయా, ఏదైనా అనుకోని ఘటనలు జరిగితే తగిన ఏర్పాట్లు ఉన్నాయా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే అవసరమైన సూచనలు ఇచ్చి, ప్రజల భద్రతకు చర్యలు చేపట్టారు. అలాగే, జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఇటువంటి తనిఖీలు నిరంతరం నిర్వహించాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్ గారు వెల్లడించారు. పోలీస్ శాఖ సూచన: రోడ్డు భద్రత పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి, నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ, ట్రాన్స్పోర్ట్ శాఖ మరియు అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.

E-పేపర్

తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ మార్చ్ 26 *ఇబ్రహీంపట్నం మార్చ్ 26 ()*:-తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికలు గురువారం ఘనంగా నిర్వహించబడగా,అన్ని పదవులకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులుగా కోరే సాయిరాం నియమితులయ్యారు.సంస్థ సాంస్కృతిక సారథి అధ్యక్షులుగా బుల్లెట్ వెంకన్న,మహిళా అధ్యక్షురాలిగా కూరాకుల భారతక్క బాధ్యతలు స్వీకరించారు.గౌరవ సలహాదారుగా తెల్లగా మల్ల లింగయ్య నియమితులయ్యారు.ప్రధాన కార్యదర్శిగా సింగర్ బోయిన లింగన్న ఎంపిక కాగా,సహాయ కార్యదర్శులుగా రామసాని పుల్లయ్య,పూలక్క,భూతం రవి,పెరమండ్ల సంజీవ ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుల నియామకం కూడా ఏకగ్రీవంగా పూర్తయింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాధించేందుకు సమితి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా సంస్థను మరింత బలోపేతం చేసి,ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.