Friday, 24 April 2026

Blog

తూర్పు గోదావరి

అయ్యప్ప సేవలో మరో అడుగు – ఊరేగింపుకు ట్రాలీ అందించిన భక్తుడు

తాళ్లపూడి (పున్నమి ప్రతినిధి తూర్పుగోదావరి), మార్చి 31:తాళ్లపూడి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 1న బుధవారం ఉదయం 7 గంటల నుంచి విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు మొదటగా ఉదయం 7 గంటలకు గోదావరి నది వరకు ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి భాగంగా స్వామివారి ఊరేగింపుకు ఉపయోగపడే ట్రాలీని అయ్యప్ప భక్తుల్లో ప్రముఖుడైన లకంసాని వరప్రసాద్ దంపతులు (బేకరీ చిన్న) విరాళంగా అందించడం విశేషం. ఈ ట్రాలీని తాళ్లపూడిలోని ఇతర దేవాలయాలు కూడా అవసరమైతే వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గత రెండు సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి గుడి వెనుకనున్న శ్రీ సొలస సత్యనారాయణ & దమయంతి కళ్యాణ మండపాన్ని సింహాద్రి జనార్ధనరావు మరియు యాజమాన్యం ఉచితంగా అందిస్తూ సేవలో భాగస్వామ్యమవుతున్నారు. అలాగే కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులకు 41 రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాదం ఏర్పాటు చేస్తూ విశేష సేవలు అందిస్తున్నారు. “ఈ అన్నదాన కార్యక్రమంలో రోజూ సుమారు 200 మంది అయ్యప్ప భక్తులతో పాటు భవానీలు, శివస్వాములు పాల్గొని ప్రసాదం స్వీకరిస్తున్నారు. తాళ్లపూడి మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటుండటం విశేషం.” ఈ వేడుకలలో ఆలయ అర్చకులు పరస రత్నాజీ, గ్రామ పెద్దలు సింహాద్రి జనార్ధనరావు, నామన పరమేశ్వరరావు, వుడతా వీరేంద్రతో పాటు అనేక మంది అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి శ్రీ వినాయక స్వామిని ట్రాలీలో ఊరేగిస్తూ “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో శుభారంభం చేశారు.“ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దేవాలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు.”

విశాఖపట్నం

విశాఖ లో టిడ్కో ఇళ్ల పంపిణీ 1393 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల పంపిణీ వైసీపీ నిర్లక్ష్యంపై పల్లా విమర్శలు

విశాఖపట్నం, మార్చి (పున్నమి ప్రతినిధి) పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గాజువాక నియోజకవర్గం తలారువానిపాలెంలో టిడ్కో గృహ సముదాయాలను ఘనంగా ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఇంచార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. గాజువాకలో మొత్తం 1393 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల గృహ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రెండో విడతగా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల టిడ్కో ఇళ్లను అందజేస్తున్నామని తెలిపారు. గతంలో తొలి విడతలో 3 లక్షల ఇళ్లను పంపిణీ చేయగా, మొత్తం 21 నెలల్లోనే 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం ప్రభుత్వ పనితీరు స్పష్టంగా చూపిస్తోందన్నారు.గత వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తయిన ఇళ్లను నిర్లక్ష్యం చేసి, రంగుల పేరుతో కోట్ల రూపాయలు వృథా చేసిందని ఆరోపించారు. మౌలిక వసతులు లేకుండా ఇళ్లను ఖాళీగా ఉంచడం వారి పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. లబ్ధిదారులను ఇళ్ల కోసం నిరీక్షింపజేసి తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని విమర్శించారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెండింగ్ పనులను పూర్తి చేసి గృహాలకు జీవం పోసిందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమం–అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. Uploaded Video:

విశాఖపట్నం

విశాఖలో సంచలనం.. ప్రియురాలి హత్య కేసులో వీడిన మిస్టరీ

విశాఖపట్నం, మార్చి (పున్నమి ప్రతినిధి): విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వివరాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని ఎల్వీనగర్‌లో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటనలో నేవీ టెక్నీషియన్ రవీంద్ర(35) తన ప్రియురాలు మౌనిక(29)ను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన విషయం తీవ్ర కలకలం రేపుతోందన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, 2021లో ఒక డేటింగ్ యాప్ ద్వారా రవీంద్రకు మౌనికతో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి ప్రేమ సంబంధంగా మారిందని తెలిపారు. అయితే 2024లో రవీంద్రకు వివాహం జరిగినప్పటికీ, మౌనికతో సంబంధాన్ని కొనసాగించినట్లు చెప్పారు. ఇటీవల రవీంద్ర భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన నేపథ్యంలో, ఆదివారం రాత్రి మౌనికను తన ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడని, ఈ సమయంలో ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలపై వాగ్వాదం చోటుచేసుకుందని వెల్లడించారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ముందుగానే ప్రణాళిక ప్రకారం రవీంద్ర మౌనికను ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలిపారు. హత్య అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచినట్లు విచారణలో తేలిందని, అనంతరం ఆధారాలను చెరిపివేయాలనే ఉద్దేశంతో శరీర భాగాలను వివిధ ప్రాంతాల్లో పడేయాలని యత్నించినట్లు చెప్పారు. కాగా, మౌనిక శరీర భాగాల్లో తల కనిపించకపోవడం కేసుకు మరింత మిస్టరీగా మారిందన్నారు. మరోవైపు నేరభారం తట్టుకోలేక రవీంద్ర స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన పోలీసులు, మిగిలిన శరీర భాగాల కోసం గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. విచారణలో కీలక ఆధారాలు సేకరించి మొత్తం ఘటనకు సంబంధించిన వివరాలను బయటపెట్టినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న మౌనిక తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాసరావు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. విశాఖలో చోటుచేసుకున్న ఈ దారుణ హత్య ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేపుతోందని, పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. Uploaded Video:

గూడూరు

గూడ్స్ ట్యాంకర్ రైలు పట్టాలు తప్పింది – కొమ్మరపూడి జంక్షన్‌లో ఘటన

– మనుబోలు మధ్యలో ఉన్న కొమ్మరపూడి జంక్షన్ వద్ద గూడ్స్ ట్యాంకర్ రైలు పట్టాలు తప్పిన ఘటన ఆందోళన కలిగించింది. ఈ ప్రమాదం కారణంగా రైల్వే మార్గంలో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి రైల్వే అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

నారాయణపేట

“ఉపాధ్యాయ వృత్తి… పవిత్రమైన వృత్తి”

*మరికల్‌లో ఘనంగా* *ఉపాధ్యాయుడు శ్రీ చెన్నయ్య పదవీ విరమణ మహోత్సవం* *ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శానమోని నర్సింహులు* *పున్నమి ప్రతినిధి నారాయణపేట తేదీ ::31/0 3/ 2026* స్థానిక మండల కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్‌లో సోమవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం)లో సుదీర్ఘ కాలం సేవలందించిన శ్రీ చెన్నయ్య గారి ఉద్యోగ విరమణ వీడ్కోలు సభ అత్యంత వైభవంగా జరిగింది. విద్యా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న చెన్నయ్య గారిని మరియు వారి ధర్మపత్నిని సహచర ఉపాధ్యాయులు, సంఘ నాయకులు మరియు అధికారులు ఘనంగా సన్మానించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకం: శానమోని నరసింహులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (RUPP) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శానమోని నరసింహులు మాట్లాడుతూ.. సమాజ గమనాన్ని మార్చగలిగే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికే ఉందని అన్నారు. శ్రీ చెన్నయ్య గారు తన వృత్తి పట్ల చూపిన నిబద్ధత, క్రమశిక్షణ ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శకమని కొనియాడారు. ఆయన శేష జీవితం సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా గడవాలని ఆకాంక్షించారు. హాజరైన ప్రముఖులు: ఈ కార్యక్రమంలో RUPP సంఘం రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి శ్రీనివాస్ గారు, జిల్లా సంఘ బాధ్యులు రుద్రసముద్రం రాములు గారు, మరికల్ శ్రీనివాస్ గారు, భీంరెడ్డి గారు, రజిని గారు, ప్రముఖ కవి బాలస్వామి గారు, మునెమ్మ గారు, శ్రీనివాస్ గారు, శ్రీ కృష్ణయ్య గారు, నర్సింహులు గారు (ధన్వాడ), రాజు గారు తదితరులు పాల్గొన్నారు. వక్తలు తమ ప్రసంగాలలో చెన్నయ్య గారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. ఉపాధ్యాయులు, మిత్రులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

గుంటూరు

అమరవీరుడు భగత్ సింగ్ కి ఘన నివాళి

మార్చి 29 @ గుంటూరు భగత్ సింగ్ 95వ వర్థంతి సందర్భంగా గుంటూరు అన్నదాన సమాజం ఆవరణంలోని దేశభక్త శ్రీ కొండా వెంకటప్పయ్య ఆడిటోరియం లో ఆదివారం రాత్రి మందారావు మరియు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభాకార్యక్రమాన్ని నిర్వహించారు. దేశభక్తి సినీ గేయాలాపన తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరంలో అత్యంత పిన్న వయస్సులో ప్రాణాలర్పించి, యువతలో దేశభక్తిని రగిలించిన విప్లవ వీరుడు భగత్ సింగ్‌ అని,1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల బలిదానాన్ని స్మరించుకుంటూ, వారి తెగింపు, త్యాగనిరతిని దేశం గుర్తుచేసుకుంటుందని ఆ మహనీయుడి త్యాగాలు సదా స్ఫూర్తిదాయకం అని, భగత్ సింగ్ కేవలం 23 ఏళ్ల వయసులో దేశం కోసం ఉరితాడును ముద్దాడిన సాహస యోధుడని, బ్రిటిష్ పాలనను ఎదిరించి, తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వారి త్యాగాలు నేటి తరానికి ఆదర్శం అని, జరిగిన చారిత్రక సంఘటనలను నేటి తరానికి వివరించి దేశభక్తిని మానవ విలువలను పెంపొందించాలని, ఇటువంటి కార్యక్రమాలు దేశంలోని అన్ని ప్రాంతాలలో నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అతిధులను జ్ఞాపిక శాలువాతో నిర్వహకులు సత్కరించారు. అనంతరం భగత్ సింగ్ పై ప్రదర్శించిన డాక్యుమెంటరీ చిత్రం ప్రేక్షకులు అందర్నీ ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో శ్రీ గుంటూరు అన్నదాన సమాజం కార్యనిర్వహణాధికారి గుణ్ణం శ్రీనివాసరావు, నటనాలయ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మందారావు, హృదయరాజ్, గుంటూరు స్పెషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. శ్రీహరిరావు, గుంటూరు ప్రజా నాట్యమండలి జాతీయ కార్యదర్శి గని, డా. తూములూరి రాజేంద్ర ప్రసాద్, కాళంగి వంశీకృష్ణ, డా. బద్రి పీర్ కుమార్, భైరా శివపోతురాజు, బర్రె సత్యనారాయణ, నుసుము నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తూర్పుదూబగుంటలో విషాదం – వర్దినేని శ్రీనివాసులు అకాల మరణం

తూర్పుదూబగుంటలో విషాదం – వర్దినేని శ్రీనివాసులు అకాల మరణం కలిగిరి మండలం తూర్పుదూబగుంట గ్రామానికి చెందిన వర్దినేని శ్రీనివాసులు గారి అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన వారు, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చుతూ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వర్దినేని శ్రీనివాసులు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఈ దుఃఖాన్ని భరించే శక్తిని కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నివాళులు అర్పించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అబ్దుల్ అజీజ్ కుటుంబాన్ని పరామర్శించిన మేకపాటి దంపతులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి మాతృమూర్తి అన్వర్ జాన్ మరణవార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన సతీమణి మేకపాటి శాంతి కుమారి నెల్లూరులోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అజీజ్ తో పాటు కుటుంబ సభ్యులను ధైర్యం చెబుతూ ఈ క్లిష్ట సమయంలో తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. మృతురాలి సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా పోలీసుల ప్రజా ఫిర్యాదుల వేదిక – 126 ఫిర్యాదులు స్వీకరణ

నెల్లూరు జిల్లా పోలీసుల ప్రజా ఫిర్యాదుల వేదిక – 126 ఫిర్యాదులు స్వీకరణ నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (Public Grievance Redressal System) కార్యక్రమంలో మొత్తం 126 ఫిర్యాదులు స్వీకరించబడినట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులపై ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం చూపకూడదని ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని, చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అలాగే, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం పోలీసు శాఖ ముఖ్య బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్య ఫిర్యాదుల వివరాలు: రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి న్యాయం చేయాలంటూ వేంకటాచల సత్రం పోలీస్ స్టేషన్ పరిధి నుండి ఫిర్యాదు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.3.75 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసు – వరికుంటపాడు కుటుంబ వేధింపులపై మహిళ ఫిర్యాదు – నవాబుపేట ప్రేమ పేరుతో వేధింపులు, దాడి ఘటన – బిట్రగుంట భర్త వివాహేతర సంబంధం, గృహ హింస – బుచ్చిరెడ్డిపాలెం కుమారుడు చెడు అలవాట్లతో వేధిస్తున్నాడని తల్లి ఫిర్యాదు – కొడవలూరు వచ్చిన అన్ని ఫిర్యాదులపై చట్టప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి సౌజన్య, డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు సుబ్బారావు, భాక్తవత్సల్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా గండవరం జంట హత్య కేసు – 12 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

నెల్లూరు జిల్లా రూరల్ సబ్‌డివిజన్ పరిధిలోని కొడవలూరు పోలీస్ స్టేషన్ హద్దుల్లో గండవరం గ్రామ పొలాల్లో జరిగిన జంట హత్యల ఘటనపై జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించి, కేసును కేవలం 12 గంటల్లోనే ఛేదించింది. ఘటన అనంతరం పరారీలోకి వెళ్లిన నిందితులను గుర్తించేందుకు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయగా, సాంకేతిక ఆధారాలు మరియు మానవ వనరుల సమన్వయంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు ముఖ్యాంశాలు: 12 గంటల్లో కేసు ఛేదన 5 ప్రత్యేక బృందాల సమన్వయం సాంకేతిక & మానవ వనరుల సమర్థ వినియోగం వేగవంతమైన దర్యాప్తు ఘటన స్థలాన్ని వెంటనే సందర్శించిన జిల్లా ఎస్పీ మృతుల కుటుంబాలకు భరోసా పోలీసుల వేగవంతమైన చర్యలు: ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, IPS గారు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి చి. సౌజన్య గారు, రూరల్ డీఎస్పీ శ్రీ ఘట్టమనేని శ్రీనివాసరావు గారు, ఎస్బీ డీఎస్పీ శ్రీ ఏ. శ్రీనివాసరావు గార్లతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో శాస్త్రీయ ఆధారాలు సేకరించి, క్రైమ్ సీన్‌ను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతులు: కుందుర్తి వెంకటేష్ (29), పెద్దపుత్తేడు గ్రామం కొప్పల బాలవెంకయ్య (26), కాగులపాడు గ్రామం (ప్రస్తుతం వెంకారెడ్డి పాలెం నివాసం) కేసు నమోదు: ఫిర్యాదుదారు కుందుర్తి బాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 21/2026గా U/s 103(1), r/w 3(5) BNS కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు వివరాలు: ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్యలకు వివాహేతర సంబంధాలు మరియు వాటి వల్ల ఏర్పడిన వ్యక్తిగత గొడవలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న జిల్లా ఎస్పీ గారు, కొడవలూరు ఇన్స్పెక్టర్ దుగ్గాప్రసాద్ ఆధ్వర్యంలో, వివిధ సర్కిల్ ఇన్స్పెక్టర్లతో కలిసి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల ఆచూకీ కోసం విస్తృత శోధన చేపట్టారు. ముగ్గురు ప్రధాన అనుమానితులు పరారీలోకి వెళ్లినప్పటికీ, కేవలం 12 గంటల్లోనే వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు విజయవంతమయ్యారు. అభినందనలు: ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) చి. సౌజన్య గారు, SDPO రూరల్ ఘట్టమనేని శ్రీనివాసరావు గారు, బృంద సభ్యులు మరియు టెక్నికల్ అనాలిసిస్ టీమ్‌ను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో మీడియాకు వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.