Sunday, 8 March 2026

Blog

విశాఖపట్నం

నౌకాదళ విన్యాసాలు..రవాణా ఆంక్షలు ఇవే

విశాఖ ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి): విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష,మిలన్–2026 మహాసమ్మేళనాల సందర్భంగా ఈనెల 16నుంచి 19వరకు ఆర్కే బీచ్ రహదారిలో రవాణా ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు.మధ్యాహ్నం ఒకటిగంట నుంచి రాత్రి తొమ్మిదిగంటల వరకు అనుమతి పత్రాలు లేని వాహనాలకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.భద్రతా కారణాల దృష్ట్యా సముద్రతీర ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. సాధారణ ప్రజలు తమ వాహనాలను ఎంజీఎం గ్రౌండ్స్, ఆంధ్రయూనివర్సిటీ గ్రౌండ్స్ లేదా జిల్లా పరిషత్ ఆఫీస్ వద్ద నిలిపివేసి అక్కడి నుంచి కాలినడకన కార్యక్రమ ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు.భారీ వాహనాల రాకపోకలపై కూడా ప్రత్యేక ఆంక్షలు విధించినట్లు తెలిపారు.ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని,అధికారుల సూచనలు పాటించాలని కోరారు.నగర పోలీసు కమిషనర్ ప్రజలు సహనంతో వ్యవహరించి భద్రతా సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

విశాఖ తీరంలో మోహరించనున్న 90నౌకలు…అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు సిద్ధం

విశాఖ ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి): విశాఖ తీర ప్రాంతం అంతర్జాతీయ నౌకాదళ మహాసమ్మేళనానికి వేదికగా సిద్ధమవుతోంది. ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్న మిలన్ కార్యక్రమం భాగంగా విశాఖలోని నావికాదళ కమాండ్ సాముద్రిక ప్రాంగణంలో మిలన్ విలేజ్‌ను తూర్పు నావికాదళ చీఫ్ సంజయ్ భల్లా ప్రారంభించారు.ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా మొత్తం 90నౌకలు మోహరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇందులో 71దేశీయ నౌకలు,19విదేశీ యుద్ధనౌకలు పాల్గొననున్నాయి.అలాగే 50యుద్ధవిమానాలు ఆకాశంలో విన్యాసాలు చేయనున్నాయి.సముద్రంలో నౌకలను ఆరు వరుసల్లో సక్రమంగా మోహరించి దేశాధ్యక్షుడైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమీక్షించనున్నారు.మిలన్ నౌకాదళ విన్యాసంలో ప్రస్తుతం 65దేశాలు భాగస్వామ్యం అవుతున్నాయి.సముద్ర భద్రత,సహకార సంబంధాలు,వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి.ఈనెల 19న నిర్వహించనున్న సిటీ పరేడ్‌లో 45దేశాల నౌకాదళ కంటెంజెంట్లు పాల్గొని తమ సాంప్రదాయ దుస్తులు,సైనిక క్రమశిక్షణను ప్రదర్శించనున్నాయి.విశాఖ తీరంలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమ్మేళనం నగరానికి ప్రత్యేక గుర్తింపునందించనుండగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో సంగీత విభావరి.. కోటి స్వరార్చనకు భక్తులు పరవశం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పట్టణంలో ఆధ్యాత్మిక శోభను నింపుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి స్థానిక ధూర్జటి కళా ప్రాంగణంలో ప్రముఖ సినీ సంగీత ర్శకులు కోటి, వారి బృందం నిర్వహించిన సంగీత ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఆధ్యాత్మిక సాగరంలో మునిగితేలిన భక్తులు కోటి తన బృందంతో కలిసి ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు, శివతత్వ కీర్తనలు ప్రాంగణమంతా భక్తి పారవశ్యాన్ని నింపాయి. తనదైన శైలిలో హుషారైన, అదే సమయంలో భక్తితో కూడిన సంగీతాలాపనతో ఆయన భక్తులను మైమరిపించారు. కళా ప్రాంగణం కిక్కిరిసిపోగా, భక్తులు చప్పట్లతో సంగీత దర్శకుడిని ఉత్సాహపరిచారు. కార్యక్రమం అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కోటిని ప్రత్యేకంగా గౌరవిస్తు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.

తిరుపతి

ఎమ్మెల్యే దంపతులచే ఐ లవ్ శ్రీకాళహస్తి సెల్ఫీ పాయింట్ ప్రారంభం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శ్రీకాళహస్తి పట్టణానికి సుదూర ప్రాంతల నుండి దర్శనార్థం వచ్చే వేలాది భక్తులకు, పట్టణ ప్రజలకు, ఆహ్లాదకర వాతావరణం కల్పించే ఉద్దేశంతో “ఐ లవ్ శ్రీకాళహస్తి” అనే ప్రత్యేక సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెల్ఫీ పాయింట్‌ను ఆదివారం నాడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి బొజ్జల రిషితా రెడ్డిలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఈ ప్రదేశం గతంలో రెండు బ్రిడ్జీలు కలిసే ప్రాంతంలో చెత్తాచెదారాలతో అద్వానంగా ఉన్న స్థలాన్ని పూర్తిగా మార్పు చేసి, విద్యుత్ అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్ది పచ్చని గడ్డితో పార్క్‌లా అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా రూపొందించమని ఇప్పటి నుంచి శ్రీకాళహస్తి దర్శనానికి వచ్చే భక్తులు, పట్టణ ప్రజలు ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకుంటూ ఆనందించేందుకు అనువుగా మారిందని పట్టణ అందాన్ని పెంచే ఈ కార్యక్రమం ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోందని ఆయన తెలిపారు. కార్యక్రమం అనంతరం “ఐ లవ్ శ్రీకాళహస్తి” బోర్డు వద్ద వారు స్వయంగా సెల్ఫీ తీసుకుని సందేశం ఇచ్చారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరాలయ మొదటి గేటు వద్ద విషాదం- మహిళ హఠాన్మరణం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మొదటి గేటు వద్ద ఆదివారం నాడు ఒక మహిళ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందారు.స్థానిక సమాచారం ప్రకారం, చిట్టమూరు మండలానికి చెందిన మణెమ్మ (45) అనే మహిళ ఆలయ మొదటి గేటు సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు, భక్తులు వెంటనే స్పందించి, ఆమెను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు, ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. గుండెపోటు లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఈ మరణం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. యాత్రికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఆలయ పరిసరాల్లో ఈ ఘటన జరగడంతో భక్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

తిరుపతి

అర్ధనారీశ్వరుని సన్నిధిలో అన్నదాతలుగా మారిన బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పట్టాన సమీపంలో ఉన్న “శ్రీశ్రీశ్రీ అర్ధనారీశ్వర స్వామి” వారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం రాజకీయ హంగూ ఆర్భాటాలు పక్కన పెట్టి, సామాన్య భక్తులతో మమేకమై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి బొజ్జల ఋషిత రెడ్డిలు నారాయణపురం గ్రామ యువత ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహాశివరాత్రి అంటేనే సేవ, భక్తికి ప్రతీక అని, గ్రామ యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. పండుగ వేళ ప్రజా ప్రతినిధులు ఇలా ప్రజల మధ్యకు వచ్చి సేవలో భాగస్వాములు కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామ యువత పాల్గొన్నారు.

తిరుపతి

ఇంద్ర, చప్పర విమానలపై భక్తులకు దర్శనమిచ్చిన గౌరీదేవి శంకరులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి రోజు ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు దేవస్థానం వారు ఇంద్ర విమానం చప్రం వాహన సేవలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు శ్రీ స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కళాకారుల నృత్యాల నడుమ పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్బంగా అలయ పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ… మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి 11 కాలాల్లో అభిషేకాలు చేస్తామని మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి స్వామివారిని దర్శించుకొని జాగారణ చేసి, లింగోద్భవ దర్శనం చేసుకోవడం ద్వారా పార్వతీ, పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని అయన తెలిపారు.

తిరుపతి

మహాశివరాత్రి సందర్బంగా చక్రేశ్వర స్వామికి విశేషపూజలు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శ్రీకాళహస్తి సమీపంలోని నెల్లమాను కండ్రిగ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ చండీకా పరమేశ్వరి సమేత శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశిష్టమైన మహన్యాస పూర్వక రుద్రాభిషేకం వేదోయుక్తంగా నిర్వహించారు. వేద పండితులు సింగరాజు ప్రకాశం పంతులు, సింగరాజు మణికంఠ స్వామి ఆధ్వర్యంలో చక్రేశ్వర స్వామికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని శాస్త్ర యుక్తంగా నిర్వహించారు. అనంతరం బంగారు పూత నాగభరణాలతో విశిష్ట దివ్య అలంకారాలు నిర్వహించారు. శ్రీ చండికా పరమేశ్వరి దేవికి విశిష్ట బంగారు పూత ఆభరణాలతో విశేషాలంకారాలు చేసి ధూప దీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించి భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు.

తిరుపతి

చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన వీరభద్రుడు.

తొట్టంబేడు పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: తొట్టంబేడు మండలంలోని చిన్న సింగమాల గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ వీరభద్ర స్వామి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయార్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారి కుమార్ స్వామి భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

తిరుపతి

భక్తులకు ఇబ్బంది కలగకుండా స్వయంగా క్యూలైన్లను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి భక్తజన సంద్రమైంది. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని స్వామి అమ్మవారి పల్లకి వెంకటసుధీర్రెడ్డి,ఆలయఇ.ఒబాపిరెడ్డి మోయడం జరిగినది. అనంతరం ఎమ్మెల్యే వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడి, ఆలయంలో వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ, వేచి ఉండే గదుల సౌకర్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భక్తులు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. ఆలయంలో చేసిన విద్యుత్ దీపాలంకరణలు, పుష్ప అలంకరణలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా స్వామివారి దర్శనం లభించిందని, క్యూలైన్లలో ఎక్కడా ఇబ్బంది లేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించారని భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్ర సందర్శనకు వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా దర్శనం చేసుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. భక్తుల నుండి వస్తున్న సానుకూల స్పందన తమకు ఎంతో తృప్తినిస్తోందని ఆయన పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.