Thursday, 23 April 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తిలో నందీశ్వర్ గౌడ్ దంపతుల ప్రత్యేక పూజలు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని పటాన్ చెరువు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత టి. నందీశ్వర్ గౌడ్ గురువారం సందర్శించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ముందుగా శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరులను దర్శించుకున్న ఆయన, స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ఆయనకు శేషవస్త్రం కప్పి, వాయులింగేశ్వరుని చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పీఆర్ఓ మహేష్ రెడ్డి, ఆలయ అధికారులు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

తిరుపతి

స్కిమ్స్ కళాశాల విద్యార్థుల ఘన విజయం-ఎంసీఏ ఫలితాల్లో 82 శాతం ఉత్తీర్ణత

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని కాపుగున్నేరి గ్రామ సమీపంలో ఉన్న స్కిమ్స్ కళాశాల విద్యార్థులు ఎంసీఏ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. 2024–26 బ్యాచ్ రెండో సెమిస్టర్ ఫలితాల్లో కళాశాల విద్యార్థులు ఏకంగా 82 శాతం ఉత్తీర్ణత సాధించి విశ్వవిద్యాలయ స్థాయిలో సత్తా చాటారు. ఈ సందర్భంగా గురువారం కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గీతాదేవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించడం గర్వకారణమని ఆమె కొనియాడారు. ఉత్తమ ఫలితాలు సాధించిన టాపర్ల వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతిభ చాటిన విద్యార్థులు ఎ. కవిత: 8.35 గ్రేడ్ పాయింట్లతో ప్రథమ స్థానం. సి. చాందిని: 8.28 గ్రేడ్ పాయింట్లతో ద్వితీయ స్థానం. పి. దివ్య: 8.28 గ్రేడ్ పాయింట్లతో తృతీయ స్థానం. టాపర్లుగా నిలిచిన ఈ విద్యార్థులను, వారికి వెన్నుముకగా నిలిచిన అధ్యాపక బృందాన్ని కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ప్రపంచం దృష్టి ఇప్పుడు రాజమండ్రి వైపు..

సరిత్రాత్మక రాజమండ్రి నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా రూపుదిద్దుకోబోతోంది. ప్రపంచమంతా ఇప్పుడు రాజమహేంద్రవరం వైపు చూడబోతోంది… చైనా పురాతన క్రీడ డ్రాగన్ బోట్ పోటీలు త్వరలోనే రాజమహేంద్రవరంలో జరగబోతున్నాయి. భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్-2026 పోటీలు రాజమండ్రి కేంద్రంగా నిర్వహించనున్నట్లు ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు తెలిపారు. థింక్ అవుట్ సైడ్, ఇండియన్ కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మే 30, 31, జూన్ 1 తేదీల్లో జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాప్ చైర్మన్ అనిమీని రవి నాయుడు ఆవిష్కరించగా, జెర్సీని బలరాం నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బొడ్డు వెంకటరమణ చౌదరి ఆవిష్కరించారు. టీజర్‌ను ఎమ్మెల్సీ సోము వీర్రాజు విడుదల చేశారు. అధికారిక బ్యానర్‌ను నాయకులు విడుదల చేశారు. అలాగే థింక్ ఔట్సైడ్ యోగేష్, శిల్ప, బొడ్డు వెంకటరమణ చౌదరి కలిసి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. సోషల్ మీడియా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.చైనా నుంచి ఆవిర్భవించిన డ్రాగన్ బోట్ క్రీడ :డ్రాగన్ బోట్ క్రీడకు దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. చైనాలో క్వ్ యువాన్ అనే కవి జల సమాధి అయిన తరువాత, ప్రజలు పడవలతో ఆయనను వెతుకుతూ డప్పులు కొడుతూ సాగిన సంప్రదాయం ఈ క్రీడగా మారింది. టీమ్ స్పిరిట్, సమన్వయం, ఏకాగ్రతకు ప్రతీకగా ఈ క్రీడ నిలుస్తుంది.ఈవెంట్ లాంచ్ అనంతరం ప్రజా ప్రతినిధుల ప్రసంగాలు :రాజమండ్రి స్పోర్ట్స్ హబ్‌గా మారే దిశగా అడుగులు : ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిరాజమండ్రి ఇప్పటివరకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఇప్పుడు స్పోర్ట్స్ హబ్‌గా మారబోతోందని ఎంపీ దగ్గుబాటి పురంధ్వేరి అన్నారు. ఈ క్రీడ యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యవంతమైన జీవనశైలికి దారితీస్తుందని పేర్కొన్నారు. మల్టీ పర్పస్ స్టేడియంను మూడు దశల్లో నిర్మిస్తున్నామని వెల్లడించారు.క్రీడా రాజధానిగా రాజమండ్రి : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్రాజమండ్రిని క్రీడా రాజధానిగా తీర్చిదిద్దేందుకు అన్ని అర్హతలు ఉన్నాయ న్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నారాయణపురంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించామని, గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నంలో భాగంగానే రాజమహేంద్రవరాన్ని పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేసే ప్రక్రియ వేగంగా సాగుతోందన్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు నాందిగా ఈ అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ సంబరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ దేశాలకు చెందిన వందలాది మంది క్రీడాకారులు వస్తున్న తరుణంలో నగర ప్రజలు అపూర్వ రీతిలో స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని ఆయన కోరారు. మొత్తంగా ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ -2026 రాజమండ్రి నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే మహత్తర అవకాశమన్నారు. ప్రజల సహకారం ఉంటే భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ క్రీడలను నిర్వహించే సామర్థ్యం రాజమండ్రికి ఉందన్నారు.వాటర్ గేమ్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం : రవి నాయుడురాజమండ్రిని వాటర్ గేమ్స్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శాప్ చైర్మన్ అనిమీని రవి నాయుడు చెప్పారు. ఈ ఈవెంట్‌లో 25 దేశాల అథ్లెట్లు పాల్గొనడం గర్వకారణమని, రూ.53 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. క్రీడల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు.కేంద్రం నుంచి భారీ నిధులు : సోము వీర్రాజుఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి క్రీడా రంగంలో పూర్తి మద్దతు ఇస్తోందని అన్నారు. ఎంపీ పురంధేశ్వరి కృషితో మల్టీ పర్పస్ స్టేడియంకు రూ.54 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. రాజమండ్రి క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ముందుకు సాగడం ఆనందకరమన్నారు.పర్యాటక రంగానికి ఊతం : బొడ్డు వెంకట రమణ చౌదరిరుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ ఈవెంట్ ద్వారా రాజమండ్రి పర్యాటక, క్రీడా రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయని చెప్పారు. పెద్ద సంఖ్యలో పెట్టుబడులు రానున్నాయని, స్థానిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, పిక్కి నాగేంద్ర, అత్తి సత్యనారాయణ, వై శ్రీను, ఉప్పులూరి జానకీ రామయ్య, అధిక సంఖ్యలో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్లు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ABN రాధాకృష్ణ మహిళలంటే ఎంత చులకన భావమా..

ABN రాధాకృష్ణ మహిళలంటే ఎంత చులకన భావమా అని  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు  నిరసిస్తూ రాజమహేంద్రవరం  స్థానిక ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద బుధవారం వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ మీడియా ముసుగులో రాధాకృష్ణ కొత్త పలుకు కాదని, రాష్ట్ర, దేశం మహిళలకు రాధాకృష్ణ బేషరత్ గా క్షమాపణలు చెప్పాలని, రాధాకృష్ణ దుర్మార్గపు వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఈ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, నపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, జక్కంపూడి విజయలక్ష్మి వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని తీవ్ర అబ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గోందేశీ శ్రీనివాస్ రెడ్డి, గిరజాల బాబు, నక్కా రాజబాబు, గుర్రం గౌతం, వాసంశెట్టి గంగాధరరావు, మార్గాని సురేష్, దాసి వెంకటరావు, కాటం రజనీకాంత్, దూలం ప్రసాదరావు, మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, సంకిస భవాని ప్రియ, వట్టికూటి కృష్ణ వేణి, అనురాధ , పార్వతీ, తిరగాటి దుర్గారావు, బిల్డర్ చిన్నా, రొక్కం త్రినాథ్, సప్ప ఆదినారాయణ, అరే చిన్ని, పోలు విజయలక్ష్మి అడపా అనిల్, వార్డ్ ఇంచార్జీ లు, వివిధ విభాగాల అధ్యక్షులు,  ముఖ్య నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

దళితులపై హత్యాయత్నం కేసులు రాజకీయ వేధింపులే : హర్షకుమార్

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో జరిగిన ఘటనలో 57 మంది దళితులపై దేశద్రోహం కేసులు నమోదు చేయడం రాజకీయ వేధింపుల భాగమని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. గురువారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద బెయిల్‌పై విడుదలైన మహిళలకు, పురుషులకు ఆయన పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులు పూర్తిగా అక్రమంగా నమోదు చేసినవేనని, దళితుల్ని లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్ రాఘరామకృష్ణంరాజు తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తూ, నిర్దోషులపై నమోదైన దేశద్రోహం కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై స్పందించాల్సిన ప్రధాన రాజకీయ నాయకులు మౌనం పాటించడం కూడా ప్రశ్నార్థకమని వ్యాఖ్యానించారు.

తూర్పు గోదావరి

టెక్నికల్ ప్రమాణాలతో రివర్ ఫ్రంట్ నిర్మాణం: ఆదిరెడ్డి

గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణంలో ఎటువంటి రాజీ లేకుండా టెక్నికల్ ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఫిల్లర్లు నాలుగు మీటర్ల లోతులో వేసి, ఫౌండేషన్‌ను లేయర్ బై లేయర్ సాండ్, గ్రావెల్‌తో బలంగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పనులు నాణ్యతతో కొనసాగుతున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభాగాల సమన్వయంతో విస్తృత స్థాయి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రివర్ ఫ్రంట్ పనుల బలాన్ని మరింత నిర్ధారించేందుకు ఇరిగేషన్ శాఖ ద్వారా సర్టిఫికేషన్ తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. గత వరదలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ నియంత్రణకు రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేస్తామని, ప్రతి ఘాట్‌కు సామర్థ్య పరిమితి నిర్ణయించి అవసరమైతే భక్తులను ఇతర ఘాట్లకు మళ్లించే విధానం అమలు చేస్తామని తెలిపారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైందన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా పుష్కరాల రేవులో జారిపడకుండా టైల్‌లపై గ్రూవ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత ఘటనలను పరిగణనలోకి తీసుకుని భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. వర్షాకాలానికి ముందు నగరంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మేజర్ డ్రైన్స్ డీ-సిల్టింగ్‌తో పాటు బాటిల్‌నెక్స్ తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. హైటెక్ బస్ స్టాండ్ వద్ద రూ.3.7 కోట్లతో మేజర్ డ్రైన్ పనులు ప్రారంభిస్తున్నామని, వీటితో ఆ ప్రాంతంలో నీట మునిగే సమస్య పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు. అలాగే విఎల్పురం, తిలక్ రోడ్, డీమార్ట్ వెనుక ప్రాంతాల్లో డ్రైనేజీ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు తీసుకుంటున్నామని, పుష్కరాల కంటే ముందే అన్ని పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. అధికారులతో కలిసి ఫీల్డ్ విజిట్స్ నిర్వహిస్తూ పనులపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, మేజర్, మైనర్ డ్రైనేజీలలో డీ-సిల్టింగ్ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో ఇంజనీరింగ్ మార్పులు, అవసరమైన చోట వెంట్ల విస్తరణ చేపడతామని చెప్పారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే, మే 31లోగా అన్ని పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి డ్రాగన్ బోట్ రేస్ నేపథ్యంలో నగరానికి భారీగా ప్రజలు వచ్చే అవకాశముండటంతో శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం అత్యవసరమన్నారు. నల్లా ఛానల్ వద్ద డబుల్ లైన్ సిస్టమ్ ప్రతిపాదనపై చర్చించి, ప్రస్తుత స్థితి, పనుల పురోగతి ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాటర్ పంపులు సిద్ధం చేయడం, మోటార్ క్లీనింగ్ కోసం అదనపు యంత్రాల కొనుగోలు, ఫీల్డ్ సిబ్బందికి ప్రత్యేక బాధ్యతల కేటాయింపు వంటి చర్యలు చేపడుతున్నామని కమిషనర్ వెల్లడించారు.

తూర్పు గోదావరి

న్యాయవాదుల భద్రతపై ఆందోళన

అన్నమయ్య జిల్లాకు చెందిన యువ న్యాయవాది పూజారి ఎల్లయ్య తన న్యాయవాది విధులను నిర్వర్తిస్తుండగా దుండగులు దారుణంగా హత్య చేయడం న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ అమానుష ఘటనను రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ, న్యాయవాదుల భద్రతపై గంభీర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు నిరసనగా బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం కోర్టు విధులను బహిష్కరించి, తమ నిరసనను వ్యక్తం చేశారు. న్యాయవాది ఎల్లయ్య హత్యను నిరసిస్తూ జిల్లా కోర్టు ప్రాంగణం వెలుపల పెద్ద ఎత్తున మానవహారం ఏర్పాటు చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.వి. ప్రసాద్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు సురక్షితంగా పనిచేసే పరిస్థితులు లేకపోవడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. పూజారి ఎల్లయ్య హత్య ఘటన న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిదర్శనమని పేర్కొన్నారు. న్యాయవాదుల భద్రతను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక “న్యాయవాదుల రక్షణ చట్టం”ను అమలు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదులపై దాడి చేసిన వారికి నిర్దాక్షిణ్యంగా శిక్షలు విధించాలని కోరారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి పెళ్ళూరి రమేష్ మాట్లాడుతూ, న్యాయవాదులు న్యాయవ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. కోశాధికారి దాసరి అమ్ములు మాట్లాడుతూ, న్యాయవాదులపై దాడులు పెరుగుతుండటం వల్ల వృత్తి పట్ల భయం నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి గేడి రాజేశ్వరి మాట్లాడుతూ, మహిళా న్యాయవాదుల పరిస్థితి మరింత సంక్షోభంగా మారుతోందని పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావడం ద్వారా మాత్రమే ఈ దాడులను అరికట్టవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక ఇతర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కూడా న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తంగా, పూజారి ఎల్లయ్య హత్య ఘటన న్యాయవాదుల భద్రతపై పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ చట్టంపై చర్చ మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. న్యాయవాదులు భయాందోళనలు లేకుండా తమ విధులను నిర్వర్తించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా కోరుతున్నట్లు తెలియజేశారు.

తూర్పు గోదావరి

ABN రాధాకృష్ణ మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి.

ABN రాధాకృష్ణ మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల తిరుపతిరావు (అను) మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి గౌరవప్రదమైన జర్నలిజం లో ఉంటూ సభ్య సమాజం తొలగించుకునేలా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల భార్యలపై సిగ్గులేని వ్యాఖ్యలు చేశారని అందుకు రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే మావిగన్ రాజధాని వైయస్ జగన్ ప్రతిపాదించాలని దీనిని అందరూ సహకరిస్తున్నారని అన్నారు దీనిపై ప్రభుత్వ తన అనుకూల మీడియాతో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయిస్తుందని రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలకు పార్టీ నేతలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై దాడి చేయడం సిగ్గు సిగ్గు అని మహిళలను దేవతలగా పూజించే తరుణంలో రాధాకృష్ణ వ్యాఖ్యలు దురదృష్టకరమైన సంఘటన అని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి తద్యమని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఒకరే అని అన్నారు.

విశాఖపట్నం

స్టీల్ ఐఎన్టియుసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మోహన్

ఉక్కు కర్మాగారం సి.ఎమ్.ఇ. డిపార్ట్మెంట్ లో సీనియర్ జనరల్ ఫోర్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న.. ఉక్కు ఐఎన్టియుసి లో సీనియర్ నాయకులు అయిన *దిండు మోహన్* నీ.. ఉక్కు ఐఎన్టియుసి *వర్కింగ్ ప్రెసిడెంట్* గా నియమిస్తున్నట్లు… ఐఎన్టియుసి జాతీయ నాయకులు, ఉక్కు ఐఎన్టియుసి ఛీఫ్ ప్యాట్రన్ శ్రీ మంత్రి రాజశేఖర్ గారు ప్రకటించారు. ఉక్కు ఐఎన్టియుసి కార్యాలయం లో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశం మంత్రి రాజశేఖర్ గారు పాల్గొని మాట్లాడుతూ… దిండు మోహన్ యూనియన్ లో క్రమశిక్షణ కలిగిన నాయకుడనీ, త్వరలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కార్యకర్తలను సన్నద్ధం చేయాలనీ సూచించారు. నూతన వర్క్ంగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మోహన్ గారు మాట్లాడుతూ… తన పనితీరును గుర్తించి ఈ పదవి ని కట్టబెట్టిన అధినాయకులు మంత్రి రాజశేఖర్ గారికి, ప్రెసిడెంట్ రమణమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఉక్కు ఐఎన్టియుసి ప్రెసిడెంట్ పి.వి. రమణమూర్తి, జనరల్ సెక్రటరీ రాజు, ఎస్.ఎ. నాయుడు, కారు. రమణ, ఈశ్వరరావు, కుమార్, శ్రీనివాస్, అప్పారావు, సింహాచలం, సాహు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ఐదు ఎకరాల వరికి అష్టదిగ్బంధనం – పంటకు దారి మూసివేత

-ప్రభుత్వ భూమిపైనా అడ్డంకులు – రైతుకు రాకపోకల నిషేధం -విన్నపాలు వినిపించని రెవెన్యూ యంత్రాంగం – కాలయాపనతో నష్టం -“పైరు వదిలేయాలా..? ప్రాణం తీసుకోవాలా..?” రైతు కన్నీటి గాథ వ్యవసాయం చేసి పంట పండించడం ఒక పెద్ద కష్టమైతే… పండించిన పంటను ఇంటికి తీసుకెళ్లడం మరింత కష్టంగా మారిన ఘటన చిట్వేలి మండలంలో వెలుగుచూసింది. ఈడిగపల్లె గ్రామానికి చెందిన రైతు మీసాల శ్రీనివాసులు ఐదు ఎకరాల్లో వరి పంట పండించినా, దానిని ఇంటికి తరలించే దారిని అడ్డుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సుమారు రూ.1.50 లక్షల వ్యయంతో మాలే మార్పురం చెరువు కింద ఉన్న తన మాగాణిలో వరి సాగు చేసిన ఈ రైతు, మంచి దిగుబడి రావడంతో కొంత ఊరట పొందాడు. కానీ కోత ప్రారంభించిన సమయంలోనే అనూహ్యంగా సమస్యలు ఎదురయ్యాయి. పంటను నూర్పించి ఇంటికి తరలించేందుకు యంత్రాన్ని తీసుకురాగానే, అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారిని అడ్డుకుని ‘ఈ దారిలో రాకపోకలు చేయరాదు’ అంటూ అడ్డుకోవడం పరిస్థితిని క్లిష్టతరం చేసింది. -విన్నపాలు వినిపించని అధికార యంత్రాంగం సమస్య పరిష్కారం కోసం రైతు స్థానిక తహసీల్దార్‌ను ఆశ్రయించినప్పటికీ, స్పందన లేకపోవడం బాధాకరం. ఫిర్యాదు చేసినా, అది కేవలం విఆర్ఓకి బదిలీ చేయడానికే పరిమితమైందని రైతు ఆరోపిస్తున్నాడు. విఆర్ఓ ఒకసారి సర్వే చేస్తానని, మరోసారి వేరే సూచనలు ఇస్తూ కాలయాపన చేస్తున్నాడని వాపోతున్నాడు.ఇంతలో, పొలంలో ఉన్న వరి పంట క్రమంగా నేలకూలిపోతోంది. వర్షం పడితే పూర్తిగా నష్టం కలిగే ప్రమాదం ఉంది. రైతు కళ్లముందే తన శ్రమ వృథా అవుతుండగా, అధికారుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -ప్రభుత్వ భూమిపైనా ‘అడ్డంకుల రాజ్యం’ పొలానికి వెళ్లే దారి రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత హక్కుల పేరుతో అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. చెరువు ఆయకట్టు పరిధిలోని ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణలు పెరిగి, ఇతర రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.శ్రీనివాసులు తన పంటను తరలించేందుకు ప్రయత్నించగా, అదే దారిలో రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం గమనార్హం. ఇది కేవలం ఒక రైతు సమస్య మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న భూవివాదాలకు ప్రతీకగా మారింది. -“పైరు వదిలేయాలా..? ప్రాణం తీసుకోవాలా..?” ఈ ఘటనపై రైతు మీసాల శ్రీనివాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ,“నేను చిన్న రైతును. వ్యవసాయం తప్ప మరో జీవన మార్గం లేదు. అప్పులు చేసి వరి సాగు చేశాను. పంట పండింది. కానీ దాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కూడా అడ్డంకులు వస్తున్నాయి. ప్రభుత్వ భూమిలో కూడా వెళ్లొద్దంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో నేను పంట వదిలేయాలా..? లేక ప్రాణం తీసుకోవాలా..?” అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.అతను ఇంకా మాట్లాడుతూ, “తహసీల్దార్ స్పందించడం లేదు. విఆర్ఓ గ్రామంలో రాజకీయాలు చేస్తున్నాడు. పై అధికారులు వెంటనే జోక్యం చేసుకోకపోతే రైతుగా నేను బతకలేను” అని వేదన వ్యక్తం చేశాడు. -వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం పదేపదే సూచనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. పండించిన పంటను ఇంటికి తెచ్చుకునే హక్కు కూడా లేకుండా రైతు ఇబ్బందులు పడటం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా మారింది.ఈ సమస్యపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రైతుకు న్యాయం చేయాలని స్థానికులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఇలాంటి సంఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.