Featured
ఆంధ్రప్రదేశ్
విద్యాలయాలు విద్యావేత్తలను, వైద్యులను, ఇంజనీర్లను, శాస్త్రజ్ఞులను, న్యాయ వాదులను, న్యాయమూర్తులను, దేశరక్షకులను, నాయకులను అందించి సకల మానవాళిని వున్నత భావిపౌరులుగా తీర్చిదిద్దే కర్మాగారాల వంటి స్థలాలే విద్యాలయాలు. తొలి విద్యాలయాలు వి.ఆర్. కళాశాల విద్యారంగంలో జిల్లా ముందడుగులో వుంది. ప్రధమంగా నెల్లూరులో సి.ఏ.యం. హైస్కూలు, వెంకటగిరి రాజా హైస్కూలు, వేద సంస్కృత పాఠశాల ప్రారంభించబడినవి. వీటిని ఈ ప్రాంతపు మొదటి విద్యాలయాలుగా పేర్కొనాలి. 1875లో సుంకు నారాయణస్వామి శెట్టి అద్దె ఇంటిలో ప్రారంభించిన హిందూ వర్నాకులర్ స్కూలు క్రమంగా హిందూ హైస్కూలుగా పిలువబడేది. 1979లో మహమ్మదు రహంతుల్లా సాహెబ్ (వెంకటగిరి రాజాగారి మాజీ దివాను) భవన స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలకు విరాళమిచ్చారు. వెంకటగిరి రాజా రాజగోపాలకృష్ణ యాచేంద్ర దాతృత్వంతో అభివృద్ధి పరచడంవల్ల 1895లో హిందూ హైస్కూలు పేరు వెంకటగిరి రాజా హైస్కూలుగా మార్చారు. పాఠశాల నిరంతరాయంగా కొనసాగడానికి అవసరమైన భవనాలు నిర్మించారు. 50 వేల రూపాయలు శాశ్వతనిధి సమకూర్చారు. ఆనాడు వి.ఆర్. హైస్కూలుగా మొదలై 1920లో వి.ఆర్ కళాశాల, క్రమంగా పోస్టు గ్రాడ్యుయేషన్, లా కాలేజి, చిల్డ్రన్స్ అకాడమీ, ఈవినింగ్ కాలేజి, అడ్వాన్స్‌డ్ స్టడీస్‌తో నేడు విరాజిల్లుతోంది. కళాశాల సర్వతోముఖాభివృద్ధికి ఆనం కుటుంబీకులు, మేనకూరు ఆదిశేషారెడ్డి, మాడభూషి నరసింహాచారి, వవ్వేటి విశ్వనాథరావు, తూములూరు శివరామయ్య విశేష కృషి చేశారు. ఈ ప్రాంతపు మేధావులు, ప్రముఖులలో ఎక్కువమంది ఇందులో చదివినవారు కావడం విశేషం. వి.ఆర్. కళాశాల మొదటి ప్రిన్సి పాల్‌గా రాయసం వెంకట శివుడు పనిచేశారు. సిఎఎం హైస్కూల్ : మిషనరీస్ ఆధ్వర్యంలో 1837 ప్రాంతాలలో ఏర్ప డిన సి.ఏ.యం. హైస్కూలు విద్యావ్యాప్తికి బాగా తోడ్ప డింది. ఇది నెల్లూరులో స్థాపితమైన మొదటి హైస్కూలు. ప్రప్రథమంగా ఆంగ్లవిద్యను ప్రవేశ పెట్టింది. విశాలమైన ప్రాంగణంలో మంచి భవనాలు నిర్మించారు. ఆటస్థలం ఏర్పాటు చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా వుండేది. దీటైన ఉపాధ్యాయులు ఇందులో పనిచేశారు. అంతటి వున్నత స్థితిలో వుండిన పాఠశాల 175 ఏళ్ళ తర్వాత మూతపడింది. ఆస్తులు పరాధీనమవుతున్నాయి. వేదసంస్కృత పాఠశాల స్థానికంగా వున్న భాషాభిమానుల ప్రోత్సాహంతో 1882లో స్థాపించబడింది. పిల్లలకు సంస్కృతంపై పరిజ్ఞానం, పట్టు, వేద విజ్ఞానాన్ని పెంపొందించడం ప్రధాన వుద్దేశం. వేదాలను, మన సంస్కృతిని మరిచిపోతున్న ఈ రోజుల్లో సాంప్రదాయబద్ధంగా విద్యాలయం సాగుతుంది. చిన్న పాఠశాలగా మొదలై కళాశాలగా రూపుదిద్దుకొంది. వేదం, సంస్కృతం, ఇతిహాసాలు, కావ్యాలు ఇక్కడ విద్యార్థులకు బోధిస్తారు. ఇక్కడ చదివినవారు విద్వాన్, శిరోమణి వంటి విద్యార్హతలు పొందగలిగారు. తెలుగు, సంస్కృత పండితులుగా గౌరవప్రదమైన ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డారు. పురాతన గ్రంథాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు కలిగిన పెద్ద గ్రంథాలయం వుంది. 1900-1915 మధ్య కాలంలో వెంకటగిరిలో ఆర్.వి.యం. హైస్కూలు, నెల్లూరులో ఎబియం గరల్స్ హైస్కూలు, కావలిలో బోర్డు హైస్కూలు ప్రారంభమయ్యాయి. కావలిలో విశ్వోదయ విద్యాసంస్థలు జవహరు భారతి : ఈ విద్యాలయ సంస్థలకు శ్రీకారం చుట్టిన మహ నీయుడు ‘డి.ఆర్.’గా పిలువ బడే దొడ్ల రామచంద్రారెడ్డి. కావలిలో సంపన్నమైన సంస్కా రవంతమైన కుటుంబంలో పుట్టి చిన్న వయస్సులోనే ఎం.ఎ డిగ్రీ పొందిన తర్వాత ఆయనకు కళాశాల స్థాపన ఆలోచన కలి గింది. 1951లో విశ్వోదయ విద్యా సంస్థను స్థాపించారు. కొంతకాలం తర్వాత జవహర్ భారతి కాలేజీగా నామకరణం చేశారు. 1953లో డిగ్రీ కళశాల, 1972లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్, 1978లో ఇంజనీరింగ్ కాలేజి స్థాపించారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటే చీకటిని పారద్రోలి వెలుగులోకి రావడం, అజ్ఞానం నుండి విజ్ఞానంలోకి రావడం అనే భావనతో ప్రారంభమైంది. విద్యారంగంలో వెనుకబడిన కావలి ప్రాంతానికి, ప్రకాశంజిల్లా మెట్ట ప్రాంతాలవారికి విద్యా సముపార్జనకు అవకాశాలు కలుగజేశారు. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించింది. విశ్వోదయ సంస్థ పేరుకు తగ్గట్టే ఆశయాలు, వాటికి తగ్గట్టే సంస్థ ఎంబ్లమ్ రూపొందించారు. దొడ్ల రామచంద్రారెడ్డికి వెన్నుదన్నుగా ఛీఫ్ జస్టిస్ రాజమన్నార్, తిక్కవరపు రామిరెడ్డి, రామానుజ రావు నాయుడు, బెజవాడ రామచంద్రారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, మల్లికార్జునం, భుజంగ రాయ శర్మ వంటి మేధావులున్నారు. ఈ విద్యా సంస్థలో ఎందరో ప్రముఖులు విద్య నభ్యసిం చారు. సి.పి.యం. కార్యదర్శి రాఘవులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెంకట్రామి రెడ్డి, దివంగత ఐ.ఏ.యస్. అధికారి సుబ్రహ్మణ్యం, జూపూడి ప్రభాకరరావు, ఆదాల ప్రభాకరరెడ్డి, వంటేరు వేణుగోపాలరెడ్డి, కంభం విజయరామిరెడ్డి వంటి ప్రముఖులు ఇక్కడ చదువుకున్న వారే. విద్యా సంస్థలకు డి.ఆర్.గారు రెక్టారుగా వ్యవహరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. నీలం సంజీవరెడ్డి, జలగం వెంగళరావు, కామరాజ నాడార్, దేశ్‌ముఖ్ దంపతులు, జాకీర్ హుసేన్ వంటి మహామహులు ఈ విద్యా సంస్థలను సందర్శించారు. విద్యా సంస్థలు 60 సం|| పూర్తి చేసుకొన్న సందర్భంలో 2012లో వజ్రోత్సవం జరుపుకొంది. నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి విద్యాసంస్థలు : స్వాతంత్య్రం రాకపూర్వమే విద్యాలయాలను, హాస్టళ్ళను ప్రారం భించి పాతికేళ్లపాటు అవిరళ కృషిచేసిన మహోన్నతుడు. నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థ లకు కోట, వాకాడు మండ లాలు ప్రసిద్ధి చెందాయి. అప్పట్లో ఈ రెండు మండ లాలు కోట సమితిగా వుండేది. విద్యాదాతగా పేరుపొందిన బాలకృష్ణారెడ్డి గారి కృషివల్ల విద్యాసంస్థలు వెలిశాయి. వీరు నేదురు మల్లి జనార్ధనరెడ్డికి పినతండ్రి గారు. 1965లో కళాశాల స్థాపించారు. క్రమంగా వాటితో ఈ మండలాలకు విద్వత్ వెలుగులు వచ్చాయి. వీటి అభివృద్ధికి నేదురుమల్లి, నల్లపరెడ్లు సయోధ్యగా కృషి చేశారు. వాకాడు మండలం విడిపోయిన తర్వాత నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు చేతులమీదుగా కోటలో జూనియర్ మహిళా కళాశాలను స్థాపించారు. బాలకృష్ణారెడ్డి మరణించిన తర్వాత జనార్దన రెడ్డి, పద్మనాభరెడ్డి సోదరులు బాధ్యత వహించి విద్యాలయాలను అభివృద్ధి చేశారు. వాకాడు విద్యానగర్‌గా మారిపోయింది. బాలకృష్ణారెడ్డి హరిజన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. వారి అభివృద్ధికి సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలను ఇందిరాగాంధీ ఒకసారి దర్శించారు. విద్యానగర్‌లో బాలురకు, బాలికలకు ప్రత్యేక హాస్టళ్ళు నిర్మించారు. ఇక్కడ చదువుకొన్న విద్యార్థులు గొప్ప పదవులలో వున్నారు. ఈ విద్యా సంస్థలు చదువులోనే కాకుండా క్రమశిక్షణకు పేరుపడ్డాయి. వీటికి ఆద్యుడు, స్థాపకుడు, మూలపురుషుడు అనతగిన నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి చిరస్మరణీయుడు. వీరి సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ‘దీన బంధు’ బిరుదుతో, కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించాయి. ఆ మహనీయుడు 1978లో కన్నుమూసినా వారు వెలిగించిన విద్యాజ్యోతి దేదీప్యమానంగా వెలుగుతూనే వుంది. శ్రీ సర్వోదయ కళాశాల : 1972లో నెల్లూరులోని వైశ్య ప్రముఖులు కళాశాలను ప్రారంభించారు. వాకాటి సంజీవిశెట్టి ముఖ్యదాతగా సి.సి. సుబ్బరాయుడు తదితరులతో కలిసి ప్రారంభించారు. యడ్లపల్లి గోవిందుశెట్టి, వొమ్మిన సుబ్రహ్మణ్యం సెక్రటరీలుగా పనిచేశారు. ఆర్.టి.సి. బస్టాండు ప్రాంతంలో ఏడెకరాల స్థలంలో కాలేజి నిర్మితమైంది. ఇక్కడ ఇంటర్మీడియట్, బి.ఏ., బి.యస్‌సి., ఎం.ఏ., ఎం.కామ్., తదితర చదువులున్నాయి. డా|| వి. మాధవరావు, డా|| కాళిదాసు పురుషోత్తం వంటి మేధావులు ఇక్కడ ప్రిన్సిపాల్స్‌గా పనిచేశారు. నిపుణులైన అధ్యాపకులు ఆయాశాఖలలో పనిచేస్తున్నారు. కాలేజి 1996లో ఎండోమెంట్స్ శాఖ పరిధిలోకి వెళ్లింది. కోరా విద్యా సంస్థలు : నెల్లూరుకు చెందిన విద్యావేత్త కోదండ రామయ్య ఆధ్వర్యంలో 1986లో విద్యాలయాలు స్థాపించబడినవి. ఎంసెట్ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సంస్థగా ప్రారంభమై 1995లో జూనియర్ కాలేజిగా రూపుదిద్దుకొంది. ఇటీవల స్వర్గస్తులైన డాక్టరు ఎస్.వి.నరసింహులు (రిటైర్డ్ ప్రిన్సిపాల్ డి.కె.డబ్ల్యూ. కాలేజి) వంటి ప్రముఖ విద్యావేత్తలు సంస్థకు మూలస్థంబాలలో ఒకరుగా వుండేవారు. 2000 మార్చిలో ఈ సంస్థ రత్నం విద్యాసంస్థలలో విలీనమయింది. నారాయణ విద్యా సంస్థలు : ప్రైవేటు విద్యా సంస్థల స్థాపనలో నారాయణ పేరు, నారాయణ విద్యా సంస్థల పేర్లు విననివారు రాష్ట్రంలో వుండరు. 1977లో పి. నారాయణ ఒక కాలేజీలో స్టాటిస్టిక్స్ లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఎందు కనో ఆయన అందులో కొనసాగ లేదు. కొనసాగి వుంటే ఆయనలోని ప్రజ్ఞ, ప్రతిభా పాటవాలు బయల్పడేవి కావు. 1983 నుండి విద్యాసంస్థలను ఒకటొకటిగా ప్రారంభించడం మొదలు పెట్టారు. నెల్లూరు సమీపంలోని చింతారెడ్డిపాళెం విద్యలకు కేంద్ర బిందువయింది. అక్కడనుండి విద్యాలయాలు విస్తరించాయి. క్రమంగా జిల్లా, రాష్ట్ర పరిధులు దాటింది. నేడు దేశంలో పలుచోట్ల నారాయణ విద్యాసంస్థలు (దాదాపు 300) నెలకొని వున్నాయి. ఇందులో ఐదారువేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఆయన స్వతంత్రంగా, స్వయంకృషితో ఎదిగారు. పట్టుదల, కార్యదీక్ష, మృదుస్వభావం ఆయన సహజ లక్షణాలు. ప్రస్తుతం నారాయణ సంస్థలలో ప్రీప్రైమరీ స్కూలునుండి పోస్టు గ్రాడ్యుయేట్ వరకు విద్యాలయాలున్నాయి. ఒలింపియాడ్ స్కూల్స్, కాన్సెప్ట్ స్కూల్స్, టెక్నో స్కూల్స్, జూనియర్ కాలేజీలు, మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజి, బి.ఫార్మసి, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంటు, యోగ & నేచురోపతి కాలేజి, బి.ఇడి. కాలేజి వున్నాయి. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఇటీవల ఐ.ఎ.ఎస్. అకాడమి ప్రారంభించారు. 30 సం||ల కాలంలో (1983-2012) నారాయణ విద్యాసంస్థలు అగ్రగామిగా నిలిచాయి. ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా వున్న నారాయణ 2014 జూన్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రత్నం విద్యా సంస్థలు : నెల్లూరు జిల్లాలో 1984లో ప్రారంభమైన రత్నం సంస్థలకు ప్రత్యేక స్థానం వుంది. కె.వి. రత్నం, వారి శ్రీమతి పద్మావతి రత్నం సంస్థ వ్యవస్థాపకులుగా వున్నారు. ప్రస్తుతం కె. వేణుగోపాల్ , డా|| కె. కృష్ణకిషోర్ సారధ్యంలో నడుస్తున్నాయి. రత్నం రెసిడెన్షియల్ స్కూలు, ఫార్మసి ఇన్‌స్టిట్యూట్, కంప్యూ టర్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్లు నెల్లూరు సమీపంలోని పిడతా పోలూరులో, రత్నం పబ్లిక్ స్కూలు ధనలక్ష్మీపురంలో నిర్మించారు. రత్నం డిగ్రీ కళాశాలను హరనాథ పురంలో స్థాపించారు. నెల్లూరు నగర పరిధిలో రత్నం ఒలింపియాడ్ అకాడమి క్యాంపస్ స్కూలు దర్గామిట్టలో, గ్లోబల్ స్కూలు మాగుంట లే అవుట్‌లో స్థాపించారు. వ్యాపార దృష్టితో కాకుండా విద్యాసంస్థలను ఎంతగానో అభివృద్ధి చేశారు. ప్రియదర్శిని విద్యాసంస్థలు : నెల్లూరు జిల్లా, సూళ్ళూరుపేటలో 2001-02 సం||లో ఇంజనీరింగ్ కాలేజి ప్రారంభించారు. 2005-06లో నెల్లూరు పట్టణ పరిధిలో మరొక ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించారు. ఇక్కడ యం.సి.ఏ., యం.బి.ఏ. కోర్సులు కూడ వున్నాయి. సూళ్ళూరుపేటలో ఇంజ నీరింగ్ కోర్సులోని పలు బ్రాంచీలను ఏర్పాటు చేశారు.