Thursday, 5 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల పై అవగాహన

రాపూరు మండల పరిషత్ కార్యాలయం నందు డివిజన్ పంచాయతీ ఆఫీసర్ కృష్ణ మోహన్ రావు మండలంలోని 21 పంచాయతీ కార్యదర్శుల తో సమావేశం నిర్వహించారు S W P C ( చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ) పై అవగాహన కలిగిస్తూ రాపూరు మండలంలో 6 షెడ్లు కంప్లీట్ అయ్యాయి 2 షెడ్లు కంప్లీట్ కావలసి ఉన్నాయని తెలిపారు ఈ షెడ్ల ద్వారా సేంద్రియ ఎరువులు, వర్మి కంపోస్ట్ తయారుచేసి ఆ గ్రామాలలో రైతులకు విక్రయిస్తామని తెలుపుతూ పంచాయతీలకు ఇదివరకే ఇచ్చిన బుష్ కట్టర్, స్ప్రే మిషన్స్ ,మూడు చక్రాల సైకిల్ లు, ట్రాక్టర్లు గురించి అడిగి తెలుసుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని రాబోయే వేసవి కాలంలో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూసుకోవాలని ఇంటి పన్నులు, కొళాయి పన్నుల బకాయిలు 31-3-2020 నాటికి పూర్తిస్థాయిలో వసూలు చేయాలని తెలియజేసి సిద్దవరం గ్రామంలో షెడ్లను తనిఖీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారి వెంట ఈ.ఓ.పి.ఆర్.సి గంగయ్య పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు భక్తి

శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయిన గూడూరు కృష్ణదాసు మఠం

శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయిన గూడూరు కృష్ణదాసు మఠం నిరుపేద యువకుల శ్రమతో జీవంపోసుకున్న మఠం దాతల సహకారంతో అభివృద్ధి కృష్ణదాసు అనబడే వ్యక్తి ఒకప్పుడు గూడూరులోని హుస్సేన్ అనే మహమ్మదీయుడు దగ్గర శిష్యరికం చేసి యోగిగా మారి ఆశ్రమాన్ని స్థాపించి ప్రజలకు నీతి వాఖ్యాలు భోదిస్తూ 1905 వ సంవత్సరంలో గూడూరు రాణిపేట వీధి పరిసరాల్లో మహా సమాధి చెందారు. అప్పటి వీరి శిష్య ప్రముఖులు అయ్యపనేని ఆదెమ్మగారిచే ఇక్కడ రామదాసు మఠం రూపుదిద్దుకొంది. తదనంతరం కృష్ణదాసును అవధూతగా కొలుస్తూ వచ్చి కొన్ని సంవత్సరాలకు ఇక్కడ శివలింగ ప్రతిష్ట జరుపబడి సత్సంగం తదితర ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ వచ్చేవి. కాలక్రమేణా ఈ ఆశ్రమం ఆక్రమణలకు గురి అయి శిథిలావస్థకు చేరుకోవడంతో సరోజనమ్మ, నాగేశ్వర రావు గారిచే తిరిగి సజీవ స్థాయికి చేరుకొంది. మఠం ప్రాంతానికి చెందిన యువకులైన సాయిప్రసాద్, అరుణ్, వెంకటేశ్వర్లు, సుమన్, చంద్ర, రవికుమార్, శీను తదితరులు ఇక్కడ మరికొన్నిపూజా విగ్రహాలు, వసతులు నెలకొల్పి ధార్మిక ఉత్సవాలను జరుపుతున్నారు.వీరంతా కలసికట్టుగా శ్రమదానం చేసి మఠాన్నిమరింత సుందరంగా తీర్చిదిద్దారు. ఉగాది, వినాయక చవితి, దసరా పండుగ, శివరాత్రి ఉత్సవాలను దాతల సహకారంతో అత్యంత భక్తి శ్రద్ధలతో జరపడం ఇక్కడ ఆనవాయితిగా వస్తుంది. శివరాత్రి రోజున మఠంలో ప్రత్యేక పూజలు మరియు భారీ అన్నదానము జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్చందంగా పాల్గొనడం ఇక్కడి విశేషంగా చెప్పవచ్చును

Featured ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీలో టోరె పరిశ్రమను ప్రారంభించిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి 

 రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేందుకు త్వరలో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక పాలసీ తీసుకువస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. శ్రీసిటీలోని జపాన్ కు చెందిన ప్రముఖ టోరే ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ టోరే ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమను శుక్రవారం ఉదయం మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో యుచియమ, టోరే ఇండస్ట్రీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిట్సు ఒహయో, టోరే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ షిగెకజు సునగా, తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్, సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం, సూళూరుపేట శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన పారిశ్రామిక పాలసీలో నైపుణ్య శిక్షణాభివృద్దికి పెద్దపీట వేస్తామని మంత్రి తెలిపారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, దానికి అనుబంధంగా పలు కళాశాలలను ప్రారంభించడం ద్వారా నాణ్యమైన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చాలా ఆసక్తిగా వుందన్నారు. శ్రీసిటీ యాజమాన్యం కోరిక మేరకు శ్రీసిటీ నుంచే ఈ పాలసీని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.  1000 కోట్లతో ఏర్పాటైన టోరె పరిశ్రమ, రాష్ట్రంలో పారిశ్రామిక స్థిరత్వాన్ని సూచిస్తోందన్నారు. ఇంజనీరింగ్ ఫ్యాబ్రిక్స్ మరియు టెక్సటైల్స్ తయారుచేసే ఈ తరహా పరిశ్రమ దేశంలోనే ఇదే మొదటిదని ఆయన తెలిపారు. స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వలన పలు జపనీస్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు, ప్రత్యేకించి శ్రీసిటీకి రావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు.  జపాన్ పరిశ్రమల కోసం ప్రత్యేక సింగిల్ డెస్క్ విధానాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమ కంపెనీ ఏర్పాటుకు రాష్ట్రాన్ని ఎంచుకోవడం పట్ల టోరే యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తామన్నారు. 29 దేశాలకు చెందిన 187 పరిశ్రమలతో 50 వేలకు పైగా ఉపాధి కల్పించి, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్న శ్రీసిటీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. టోరె తన వినూత్న ఉత్పత్తులతో భారత మార్కెట్లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో ఉచియామా అన్నారు. మిత్సువో ఓహ్యా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి ప్లాంట్‌ను ప్రారంభించిన టోరె ఇండస్ట్రీస్‌కు ఇది చారిత్రాత్మక రోజు అన్నారు. యూనిట్  వేగవంతమైన ఆరంభానికి అద్భుతమైన మద్దతు, సహాయ సహకారాలు అందించిన ఏపీ ప్రభుత్వానికి, శ్రీసిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. షిగెకాజు సునాగా మాట్లాడుతూ, 2011 నుండి భారతదేశంలో టోరె కార్యకలాపాలను, అభివృద్ధిని పవర్పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.  టోరె ప్రారంభోత్సవం కోసం శ్రీసిటీకి తొలిసారి విచ్చేసిన మంత్రికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, యువ డైనమిక్ ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి పారిశ్రామిక అభివృద్ధికి చూపుతున్న చొరవను ప్రశంసించారు. పెట్టుబడులు ఆకర్శించేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి వీరు త్వరలో రానున్న నూతన పారిశ్రామిక విధానం అద్భుతమైన ఫలితాలు తెస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన పాలసీని శ్రీసిటీ నుంచే ప్రారంభించాలని మంత్రిని కోరారు.    కాగా, శ్రీసిటీలో 85 ఎకరాలలో, సుమారు రూ.1000 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఫాక్టరీలో రెండు ఉత్పత్తి  కేంద్రాలుంటాయి. ఒక దానిలో వ్యక్తిగతపరిశుభ్రతకు వాడే డైపర్ల తయారీకి అవసరమైన పాలీ ప్రొపిలిన్ ఫైబర్ వస్త్రం (Technical textile) తయారౌతుంది.  రెండవ ఉత్పత్తి కేంద్రంలో ఆటొమొబైల్ రంగంలో ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలకు అవసరమైన ఎలాస్టిక్ రెజిన్ పదార్థాన్ని తయారు చేస్తారు. సుమారు 750 మందికి ఉపాధి లభిస్తుంది. శ్రీసిటీలో ఇప్పటికే 19 జపాన్ పరిశ్రమలు కొలువుతీరి ఉండగా, టోరే 20వ జపాన్ పరిశ్రమ. ఫైబర్ టెక్స్‌టైల్స్, కార్బన్ ఫైబర్, లైఫ్ సైన్స్, రసాయన, పర్యావరణం, ఇంజనీరింగ్ రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ వ్యాపార  సంస్థ టోరేగ్రూప్ 2011లో భారత్‌లో,   టోరే  ఇండస్ట్రీస్ (ఇండియా) పేరుతో అడుగు పెట్టింది. తొలుత గుర్గాంలో తన ప్రధాన కార్యాలయాన్ని, ముంబాయిలోవాణిజ్జ్య కార్యాలయాన్ని స్థాపించిoది. వ్యాపార విస్తరణలో  భాగంగా 2016లో గుజరాత్ లోని వాపి లో మోటర్ వాహనాల్లో వాడే ప్రత్యేక ఫైబర్ వస్త్రంతో చేయబడె ‘ఏయిర్ బ్యాగుల’ ఉత్పత్తి సంస్థను స్థాపించింది.

Featured ఆంధ్రప్రదేశ్

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…..

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం….. మర్రిపాడు :   మండల కేంద్రంలో మండల తహసీల్దారు,డివి సుధాకర్,అగ్రికల్చరల్ ఆఫీసర్ .శ్రీదర్ రెడ్డి మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు వారి సమక్షంలోసోసైటీ కార్యాలయంలో ధాన్యం (వరి) కొనుగోలు కేంద్రాన్ని మాజీ సొసైటీ అధ్యక్షులు చిన్నారెడ్డి చేతులు మీదుగా ప్రారబించడం జరిగింది.ఈ సందర్భంగా సొసైటీ మాజీ అధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మద్ధతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైసిపి పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ధాన్యంకొనుగోలుకేంద్రాలుఏర్పాటుచేస్తున్నారన్నారు. గ్రేడ్‌-ఎ క్వింటా ధాన్యానికి రూ.1835, గ్రేడ్‌-ఎ 80 కిలోలు ధాన్యం బస్తాకు రూ.1468, గ్రేడ్‌-ఎ 40 కిలోలు ధాన్యం బస్తాకు రూ.734 మద్దతు ధర గ్రేడ్ ఏ పుట్టి 15,597.50 రూ.,సాదారణ రకం పుట్టి 15,127.50 గా కల్పించిందన్నారు. దళారులు మాటలు విని మోసపోవద్దని, ధాన్యం బస్తాలను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలన్నారు. ఏవో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సోసైటీ కార్యాలయంలో ధాన్యం (వరి) కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం దళారీ వ్యవస్థను రూపుమాపి రైతులకు మద్దతు ధరలు 0కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యడం జరిగిందని ఆయన తెలిపారు. దళారీల ప్రమేయంతో రైతులు నష్టపోతున్నారని, కావున ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు కార్యక్రమంలో తహసీల్దారు డి.వి.సుధాకర్,ఏవో శ్రీధర్ రెడ్డి,వైస్సార్సీపీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టరీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Featured

అభిమానానికి ప్రతిఫలం లభిస్తుంది : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ

ఎన్నికల్లో మీరు చూపిన అభిమానానికి తప్పకుండా ప్రతిఫలం ఇచ్చి ఋణం తీర్చుకుంటానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు లో శనివారం జరిగిన సన్మాన సభలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి లను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఈ ప్రాంత ప్రజలు తమ పట్ల ఆదరణ అభిమానాన్ని. చూపి గెలిపించారని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేము కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని అభివృద్ధి పనులు చెప్పినట్లుగానే చేసి చూపుతామని తెలిపారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి తన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ, పేట విరామంలో 10 వేల ఆర్థిక సాయం, మత్స్యకారులకు ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారాన్ని 10 లక్షలకు పెంచడం అమలు చేసి వారికి ఎంతో ఉపకారం చేశారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో మత్స్యకారుల బాధలను గమనించి ఇవన్నీ అమలు చేశారని తెలిపారు. రానున్న కాలంలో పెన్షన్ 3000 వేలకు పెంచ నున్నారని పేర్కొన్నారు .పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పట్టుబట్టి అమలు చేయనున్నారని చెప్పారు. స్థానికంగా నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించాలని చెప్పారు. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు .స్థానిక యువనేత కళ్యాణ్ రెడ్డి అడిగిన రోడ్లు మంచినీటి పథకానికి నిధులు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి అధ్యక్షత వహించారు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లను మత్స్యకారులు ఆక్వా రైతులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక నేత కళ్యాణ్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. అంతకుముందు మైపాడు అంతర్గత రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలతో ఎమ్మెల్యే ఎంపీ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి అబూబకర్ చాంద్ భాషా శ్రీనివాసులురెడ్డి , దువ్వూరు రాధాకృష్ణారెడ్డి , గును పాటి రమేష్ రెడ్డి నూనె మల్లికార్జున యాదవ్ షబ్బీర్ బలరాం రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Featured బిజినెస్

వ్యాపార మర్యాదలు – 2

డైనింగ్ టైం మర్యాద : మీ ఆఫీసు లో కొలీగో, లేక వ్యాపారం లో మిత్రుడో, మీ కంపెనీ వెండరో, మిమ్ములను హోటల్ కి డిన్నర్ కి ఆహ్వానించారు అనుకుందాం . లేదా , మీ పై అధికారి కానీ, కొలీగ్ కానీ,వారి పుట్టిన రోజు, లేదా  ఏదైనా శుభ సమయం సందర్భం గా కొందరు సహోద్యోగులను మీ ఊరిలోని మంచి హోటల్ కి తీసుకు వెళ్ళారు అనుకోండి . డబ్బు చెల్లించేది మీరు కాక పోయినా, ‘ మెనూ ‘ మరియు ధరల పట్టిక చూడండి . అన్నింటికంటే ఖరీదయిన ఐటం ఆర్డర్ చెయ్యకండి ! బాగుండదు ! అన్నింటికన్నా ఉత్తమం ఏమిటంటే , ఎవరైతే పేచేస్తారో , వారినే ఆర్డర్ చెయ్యమని చెప్పండి ! ‘ నువ్వు మా అందరినీ తీసుకు వచ్చావు కాబట్టి, నా వరకూ , నువ్వు ఏది ఆర్డర్ చేసినా నాకు వోకే ! ‘ అని చెప్పండి . మీరు శాకాహారి అయితే , ఆవిషయం చెప్పండి . బిల్లు చెల్లించేది వేరొకరు కాబట్టి , ఖరీదయిన టైగర్ ప్రాన్ లు వగైరాలు ఆర్డర్ చెయ్యకండి . వేరే వారు మీకు డిన్నర్ పార్టీ ఇచ్చేటప్పుడు తిండి విషయం లో మీ సొంత అభిరుచులుపక్కన పెట్టండి . మీకు ఏదైనా ఐటం తినాలి అనిపించినప్పుడు , మీరు మీ కుటుంబాన్ని తీసుకు వెళ్ళినప్పుడు తినండి ! లేదా, మీరు బిల్లు చెల్లించే టప్పుడు, మీ రుచులు అభిరుచులకు చోటుఇవ్వండి . ఇక ఆ డిన్నర్ పార్టీ లో, ‘ అలా కార్టే ( మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వడ్డించడం ) కాకుండా ‘ బఫే సిస్టం ‘ పెడితే, ఇక సమస్యే లేద !! ఒక కుమ్ముడు  కుమ్మెయ్యండి ! మిమ్మల్ని యే శక్తీ ఆప లేదు ! 3 వ్యాపార మర్యాద , వ్యక్తిగత ప్రశ్నలు : మీరొక కొత్త కంపెనీ లో చేరతారు . కొందరు కొలీగ్స్ క్లోజ్ అవుతారు . లేదా మీ కంపెనీ లోకే కొత్త వారు చేరతారు , మీ సెక్షన్ లో నే . కలిసి పని చేసే క్రమం లో క్లోజ్ అవుతారు . వారిని వ్యక్తిగత ప్రశ్నలుఅడిగేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించండి . వ్యాపారం లో , ఉద్యోగం లో క్లోజ్ అయినంత మాత్రాన , చాలా మంది వారి వ్యక్తిగత జీవితాన్ని మనతో పంచుకోవడానికి ఇష్ట పడక పోవచ్చు ! ఈ క్రిందిప్రశ్నలని మనం పూర్తి గా అడగక పోవడం మంచిది !   (1) సార్ / మేడం ! మీకు పిల్లలు ఎంత మంది ? (2) మీకు పెళ్ళి అయిందా ? ఇంకా ఎందుకు కాలేదు ? కుటుంబ బాధ్యతల వల్లనా ? ఎవరూ నచ్చక పోవడం వల్ల నా ? (3) మీరు కాలికి మట్టెలు వేసుకోక పోతే , మీకు పెళ్ళి కాలేదు అనుకున్నాను ! (4) మీకు కారు ఉందా ? (5) ఇప్పటి దాకా మీరు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ? పెళ్ళి అయిన స్త్రీ ఉద్యోగినుల విషయం లో : మీ వారు ఎక్కడ పని చేస్తారు ? ఉద్యోగమా ? వ్యాపారమా ? అవతలి వారు ఇబ్బంది పడ వచ్చు . మనను అధిక ప్రసంగి అనుకోవచ్చు . కాస్త దూరం మెయింటెయిన్ చెయ్య వచ్చు . ఉదాహరణకు పిల్లల విషయం తీసుకుందాం . అవతలి వారు, తనంతట తాను వారి పిల్లల గురించి చెబితే , వినండి . చెప్పక పోతే , అడగకండి . ఇక మీ పిల్లల గురించి . అవతలి వారు అడిగితే నే చెప్పడం మంచిది. అది కూడా మీకు ఆసక్తి ఉంటేనే సుమా ! మన పిల్లల చిన్న నాటి ముచ్చట లూ, వారి చిలిపి చేష్టలు , లేక స్కూలు / కాలేజీ లోపిల్లలు సాధించిన విషయాలు , చెప్పడం మీకు ఆనందం కావచ్చు కానీ, అవతలి వారికి బోర్ కొట్ట వచ్చు . మనం చెబితే , వారు ‘ అబ్బా ! ‘ అని ఆశ్చర్య పోకుండా, ‘ డబ్బా ! ‘ అని విసుగు చెందవచ్చు ! అయినా, మనకి ఆఫీసు లో ఉద్యోగం ఇచ్చింది కంపెనీ వారు మన పిల్లని చూసి కాదు . మీరు వ్యాపారస్తులు అయితే, మీ దగ్గర సరుకు కొనే వారు , మీ పిల్లల టాలెంటు ని చూసి కొనరు కదా ? ఉద్యోగ / వ్యాపార ప్రపంచం తో , మనకి ఆ వ్యక్తి తో నే సంబంధం, వారి కుటుంబం తో కాదు . వారంతట వారు వివరాలు చెబితే తప్ప . ఉద్యోగ వ్యాపార జీవితం లో, మన సంభాషణలను వాటికే పరిమితం చెయ్యడం మంచిది . మీరు బయట నుంచి ఆఫీస్ లోపలికి వస్తున్నారు . లేదా ఒక క్యాబిన్ నుంచి మరొక క్యాబిన్ లోనికి వెళుతున్నారు . మీ వెనక ఎవరు నిలబడి ఉన్నా, వారు డోరు దాటే దాకా , తలుపు తీసిపట్టుకోండి ! అది మీ పై అధికారికే కానవసరం లేదు ! మీ వెనక నిలబడి ఉన్నది ఎవరన్నది ముఖ్యం కాదు . మీ జూనియర్ కావచ్చు , స్త్రీ ఉద్యోగిని / పురుషుడు కావచ్చు . లేక మీ ఆఫీస్ లో పనిచేసే ఆయా కావచ్చు . మీ వెనక టీ కప్పుల ట్రే తో కుర్రాడు నిలబడి ఉండ వచ్చు . తలుపు తీసి మీరు బయటికి / లోపలికి వెళ్ళాక ,  మీరు ఒక సారి వెనుకకు చూసి , డోరు తీసి పట్టుకున్ని, ఆ టీకప్పుల ట్రే కుర్రాడు కూడా డోరు దాటాక మాత్రమే డోరు  వెయ్యండి . చిన్నవారైనా, ఒకరికి మర్యాద నిస్తే, మన పెద్దతనము ఏమీ తగ్గి పోదు ! నా క్యారీర్ లో గతం లో కొంతమంది పై అధికారులు ఇందుకు విరుద్ధం గా ఉండే వారు . వారి క్రింది వారిని పురుగుల వలె చూసే వారు . నేను కొందరి బాసుల వెనకాల నడుస్తున్నప్పుడు , వారుఆఫిస్ డోరు తీసుకుని వెళుతూ ఉంటే, వారి వెనక నేను . తీసి పట్టుకుంటారేమో నని నేను వడివడి గా వారి వనకే వెళ్ళడం, వారు వెనక్కి తిరిగి కూడా చూడకుండా , సీరియస్ గా మొహం పెట్టుకుని,డోర్ ను లాగి వదిలెయ్యడమూ, అది స్పీడు గా వెనక్కి వచ్చి నా మొహానికో, ముక్కు పచ్చడి అయ్యే రిస్కు  కలగడమూ, నేను సమసస్పూర్తి తో వెనక్కి తగ్గి ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడమూ -జరిగాయి ఎన్నో సార్లు ! ఈ రోజు వరకూ నా ముక్కు టొమాటో చట్నీ కాక్కుండా , ఇలా సేఫ్ గా ఉంది అంటే దానికి నా సమయ స్పూర్తే కారణం ! మీరు అలాంటి రిస్కు ఇతరులకి ఇవ్వకండి . మీరు డోరు తీసి బయటకి వెళుతున్నా, లేక లోపలికి వస్తున్నా, వెనకాల ఎవరు ఉన్నారో ఒక సారి చూసి , వారు దోఋ దాటే దాక తీసి పట్టుకోండి ,కొంచెం స్మైల్ ఇవ్వండి , నష్టం లేదు , డబ్బు ఖర్చు అసలే లేదు !

Featured ఆంధ్రప్రదేశ్

NPR, NRC నల్ల చట్టాలను ఉపసంహరించుకొవాలి

కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ గూడూరులోని పెద్ద మసీదు వద్ద రిలే నిరాహారదీక్షలు ప్రారంభమైనాయి. ఈ నిరసన కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మాజీ పురపాలక అధ్యక్షురాలు దేవసేన పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ దీక్షలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ముస్లిం హక్కుల ప్రతినిధి అన్వర్ ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో దాయిన్ ,కబీర్ , నాగులు, ఉమర్ పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ సక్సెస్ స్టోరీస్

‘స్వరాజ్య’ ఎడిటర్‌  ఖాసా సుబ్బారావుకు విలువలే ఊపిరి 

గూడూరు, పున్నమి విలేఖరి ( షేక్‌ రసూల్‌ అహ్మద్‌) గాంధేయవాది నిష్కళంక దేశభక్తుడు విలువలే ప్రాధాన్యంగా జీవించిన పత్రికా సంపాదకుడు ఖాసా సుబ్బారావు నెల్లూరు నెల్లూరు జిల్లా కావలిలో 1896 జనవరి 23వ తేదీన జన్మించారు. సర్వేపల్లి రాధాక ష్ణన్‌ పని చేస్తున్న మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో తత్వశాస్త్రం అభ్యసించి పట్టభద్రుడై నారు. తర్వాత కొంతకాలం ఉపాధ్యాయుడుగా, ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు. ఆ తర్వాత పల్లెపాడు లోని ఆశ్రమంలో ఉంటూ మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ స్వాతంత్ర సమరంలో పాల్గొని అనేకసార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు.శాసనోల్లంఘన ఉద్యమంలో పోలీసులు లాఠీలతో దారుణంగా కొట్టిన సందర్భంలో ఆయన స్ప హ తప్పి పడిపోవడం జరిగింది. ఈ అంశం తీవ్ర దుమారం రేపి చివరకు బ్రిటీష్‌ పార్లమెంటు లో ప్రస్తావనకు వచ్చి ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖాసా సుబ్బారావును కలిసి పోలీసు దుర్మార్గపు చర్యలను ఖండిస్తూ ఒక నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఫలితంగా అప్పటివరకు లాఠీలకు ఉండే లోహపు పిడిలను మొదటిసారిగా తొలగించడం జరిగింది. ఇలా స్వరాజ్య పోరాటంలో సుబ్బారావు పాల్గొంటూ ఓసారి జాతీయ భావాల ప్రచార కార్యక్రమంలో భాగంగా మద్రాసులోని స్వరాజ్య పత్రిక కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఖాసా సుబ్బారావు గారి లోని దేశభక్తిని గమనించి తన బదులు స్వరాజ్య పత్రికలో సంపాదకీయం రాయడానికి సుబ్బారావును కోరారు.అది మొదలు సుబ్బారావు గారు పత్రికా లోకంలో తన వైభవాన్ని విశేషంగా చాటుకున్నారు. భాష, భావవ్యక్తీకరణ, స్పష్టత, నిర్భీతి ఇలాంటి సుగుణాల వల్ల సుబ్బారావును పాఠక లోకం విశేషంగా అభిమానించింది. ఇలా ఖాసా సుబ్బారావు చివరకు జర్నలిజం లోనే స్థిరపడిపోయారు. చక్రవర్తి రాజగోపాలచారితో సహా అనేకమంది ఆయన కలం పోటుకు గురి అయినా ఆయన్ని అభిమానించడంలో ముందుండేవారు.స్వరాజ్య పత్రికకు సహాయ సంపాదకుడిగా 1924 నుంచి 1936 దాకా పని చేశారు. కోల్కతా నుంచి వెలువడే ఇండియన్‌ ఫైనాన్స్‌ మరియు ముంబై నుంచి వచ్చే ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌ కు సహాయ సంపాదకులుగా పని చేశారు.1940 లో ఇండియన్‌ ఎక్స్ప్రెస్‌ పత్రిక లో జాయింట్‌ ఎడిటర్‌ గా తర్వాత మెయిన్‌ ఎడిటర్‌ గా పని చేయడం జరిగింది. తెలుగులో ఆంధ్రప్రభ కు వీరు తొలి సంపాదకులుగా పనిచేశారు. 1946లో స్వతంత్ర వార పత్రిక ప్రారంభించారు. మధ్యలో ఆగిపోయిన స్వరాజ్య పత్రికను తిరిగి ప్రారంభించి మూడేళ్లు నడిపి తర్వాత వేరొకరికి అప్పగించారు. ఇలా తన సంపాదకీయాలతో పాఠకలోకాన్ని విశేషంగా ఆకట్టు కొనడమే కాకుండా ఆలోచనాత్మకమైన విశ్లేషణలతో ఖాసా సుబ్బారావు గారు రాసిన ”సైడ్‌ లైట్స్‌” అనే శీర్షిక ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. తన జీవిత చరమాంకం వరకు నైతిక విలువలతో జీవించిన ఖాసా సుబ్బారావు గారు 1961 జూన్‌ 16 వ తేదీన మరణించారు.

Featured ఆంధ్రప్రదేశ్

సంతాప సమావేశం

నెల్లూరు, జనవరి 16, 2020 (పున్నమి విలేఖరి) : ప్రముఖ రైల్వే కార్మికోద్యమ నాయకుడు, కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్‌ వెంకటరత్నం అనారోగ్యంతో 16-01-2020 ఉదయం 6-50 గంటలకు నెల్లూరులో మరణించారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. ఆయన పార్థివ దేహాన్ని పొదలకూరు రోడ్డు, ఎస్‌బిఐ కాలనీలోని ఆయన స్వగృహం వద్ద అభిమానుల దర్శనార్ధం వుంచారు. యుసిసిఆర్‌ఐ (యంఎల్‌) నాయకులు కా.సి.భాస్కర్‌ దివంగత నాయకుని పార్థివ దేహం పై ఎర్రజెండా కప్పి ఘనమైన నివాళులర్పించారు. తన జీవితం చివరి క్షణం వరకు దేశంలో పీడిత ప్రజల రాజ్యం కోసం కృషి చేసిన గొప్ప కమ్యూనిస్టు విప్లవకారుడని, కా.తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులు రూపొందించిన విప్లవ పంథాను దృఢంగా నమ్మి ఆ బాటలో కృషి చేసిన కార్మికోద్యమ నేత ఆయన అని కా.భాస్కర్‌ అమరులైన నేతకు నివాళులర్పించారు. ఓపిడిఆర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కా.కె.సుబ్బారెడ్డి మాట్లాడుతూ కా.రత్నం రైల్వే కార్మికోద్యమానికి, సమసమాజ స్థాపనకు అందించిన సేవలను వివరిస్తూ ఆయన ఆశయాల పరిపూర్తికి కృషి సల్పటమే ఆయనకు నిజమైన నివాళలని అన్నారు. ఏపిటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.వెంకటేశ్వరరావు దివంగత కార్మికోద్యమనాయకుడు రత్నం పీడిత ప్రజలకు, విచక్షణకు గురైన ప్రజలకు అందించిన సేవలను, చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. జోహార్‌ కా.రత్నం, అమర్‌ హై కా.రత్నం అన్న నినాదాలతో పార్థివ దేహాన్ని దివంగత నాయకుని కోరిక మేరకు స్థానిక మెడికల్‌ కాలేజీకి దానం చేశారు. పై సంతాప కార్యక్రమంలో బంధుమిత్రులు పాల్గొన్నారు. దివంగత నాయకునికి తన జీవితం చివరి రోజుల్లో అనేక విధాలుగా సేవలందించి సహకరించిన బంధువులను వక్తలు కొనియాడారు.

Featured

దొంగే దొంగా… దొంగా అంటే ఎలా?

దొంగే దొంగా… దొంగా అంటే ఎలా? చర్చా వేదికలో వక్తల ఆవేదన నెల్లూరు, జనవరి 4, (పున్నమి ప్రతినిధి) : తెలుగు భాషను కూనీ చేసేందుకు అహర్నిశలు శ్రమించిన పాలకులు దొంగే… దొంగా దొంగా అని అరిచినట్లు తెలుగు భాషపై చవితి ప్రేమ చూపిస్తున్నారని పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నెల్లూరు నగరంలోని పున్నమి తెలుగు దినపత్రిక కార్యాలయంలో రాష్ట్రంలో తెలుగు మాధ్యమం రద్దు – ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం పై చర్చా వేదిక నిర్వహించారు. ఈ చర్చా వేదికలో తెలుగు భాషను కూనీ చేసేందుకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పలు జీవోలను ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డి వివరించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పటి ఉపరాష్ట్రపతి, ఒకప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలుగు భాషను కనుమరుగు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారని ఆయన వివరించారు. అయితే ఇప్పుడు తెలుగు భాషకు నష్టం జరుగుతుందని వారే గొంతెత్తి అరవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. తాము అధికారంలో వున్నప్పుడు రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియాను ప్రవేశపెట్టింది చంద్రబాబు ప్రభుత్వమే తీసుకొచ్చారని, అయితే ఇప్పుడు తెలుగు భాషకు ఏదో నష్టం జరిగిపోతుందని గగ్గోలు పెట్టడంలో ఆయన కూడా వుండడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో తెలుగు భాషను కాపాడుకునేందుకు పలువురు మేధావులు, ప్రజాసంఘాలు ఎంతో చిత్తశుద్దితో ఉద్యమాన్ని చేస్తున్నా చంద్రబాబునాయుడు లాంటి వారు కూడా భాష పరిరక్షణ పై మాట్లాడడం రాజకీయ రంగు పులుముకుంటుందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఒకప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు కూడా తెలుగు మాధ్యమాన్ని ఒక పద్ధతి ప్రకారం కూనీ చేస్తున్నారన్నారు. వీరిద్దరూ రెండు పార్టీలకు చెందిన నాయకులే అయినప్పటికి ఏ ఒక్కరూ కూడా చిత్తశుద్ది లేనివారేనని, అలాంటి వారి మాయమాటలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. దేశంలోనేగాక, ప్రపంచంలోనే మాతృభాషకు ఎంతో ప్రాధాన్యత వుందని, మాతృభాషలోనే భావిభారత పౌరుల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కేవలం ఆంగ్లంతోనే అభివృద్ధి అని చెప్పడం మూర్ఖత్వమన్నారు. ప్రాధమిక విద్య మొత్తం మాతృభాషలోనే జరగాలని, ఆంగ్ల భాషను బలవంతంగా రుద్దడం సరియైనదని కాదన్నారు. పున్నమి మాసపత్రిక గౌరవ సంపాదకులు డాక్టర్‌ గంగిశెట్టి శివకుమార్‌ మాట్లాడుతూ విదేశాలలో కూడా తమ మాతృభాషను గౌరవించే సంస్కృతి ఉందన్నారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్‌లో మాతృభాషను కనుమరుగు చేసేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారన్నారు. దేశవిదేశాలకు వెళ్లాలంటే ఆంగ్లం తప్పనిసరి అని వాదించే వారు ఎంత మంది విదేశాలకు వెళుతున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అయిదుకోట్ల జనాభావుంటే కనీసం పది శాతం మంది కుటుంబీకులు కూడా విదేశాలకు వెళ్లే అవకాశం వుండదని, అలాంటి పరిస్థితుల్లో అందరి పై బలవంతంగా ఆంగ్ల భాషను రుద్దడం బాధాకరమన్నారు. ఖచ్చితంగా పదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన వుండాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పున్నమి పత్రిక సంపాదకులు సర్వేపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ పల్లెల్లో నేటికి ఎందరో ఉన్నత విద్యకు దూరంగా వున్నారని అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం వుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలతో పాటు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థల అధిపతులు ప్రభుత్వపాలకులుగా చెలామణి అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వపాఠశాలలు కనుమరుగై ప్రైవేటు విద్య విలయతాండవం చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద వర్గాలకు ఉన్నత విద్యను అందించాల్సిన అవసరం వుందన్నారు. ఈ చర్చా వేదికలో ఓపిడిఆర్‌ జిల్లా కార్యదర్శి ఆర్‌.శివశంకర్‌, పలు సంఘాల నాయకులు బొగ్గరపు రాధాకృష్ణమూర్తి, కల్పం రమేష్‌, ఏ.శ్రీనివాసులు, టి.లక్ష్మీనారాయణ, సి.హెచ్‌.ప్రసాద్‌ బాబు, వి.బ్రహ్మయ్య, తోట సులోచనలతో పాటు ఏపీటిఎఫ్‌, యుటిఎఫ్‌, జనవిజ్ఞాన వేదిక, తెలుగు భాషోద్యమ సమితి, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు. చర్చా వేదికలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికి తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని ఎక్కువ మంది స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.