Thursday, 5 March 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

కరోనా వ్యాధి .. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మన ముందున్న ప్రాథమిక కర్తవ్యం.

కరోనా వ్యాధి …..మూడు రోజుల్లో లక్ష మందికి కరోనా అతి భయంకరమైన అంటువ్యాధిగా మారింది.గత డిసెంబర్లో చైనాలో పుట్టింది. మూడు నెలల్లోనే ప్రపంచంలోని దేశాలన్నింటికీ పాకింది. ఈరోజుకి 3,95,564 మందికి సోకింది. 17,233 ప్రాణాలను బలితీసుకుని ప్రపంచ జనాభానంతా గడగడలాడిస్తుంది. 22వ తేదీ మన దేశంలో జరిగిన స్వచ్ఛంద గృహనిర్బంధ కార్యక్రమాన్ని పరిశీలించినట్లయితే ప్రజలు ఎంత భయానికి లోనవుతున్నారో తెలుస్తుంది. ఈ వ్యాధి సోకిన వారి గణాంకాలను పరిశీలిస్తే ప్రజల భయాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. ప్రపంచ వ్యాపితంగా కరోనా సోకిన వారి సంఖ్య లక్షకు చేరుకోవడానికి 67 రోజులు పట్టింది. మరో 11 రోజులలోనే ఈసంఖ్య రెండు లక్షలకు చేరుకుంది. మరో మూడు రోజులలోనే ఈ రెండు లక్షలు సంఖ్య మూడు లక్షలు గా మారింది. 23వ తేదీ ఒక్క రోజే 41,371మందికి సోకింది. ఈ వ్యాప్తి ఇలాగే కొనసాగితే ప్రజల భవిష్యత్తు ఏమిటన్నది పెద్ద ప్రశ్న. సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కారణంగా చైనా తన దేశంలో పుట్టిన ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోగలిగింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే ఇటలీలో మరణ మృదంగం మోగుతుంది. ఈ వ్యాధి ని అదుపు చేయలేక అల్లాడి పోతుంది. ఈ వ్యాధి గురించి భయపడి పోవడం కాదు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మన ముందున్న ప్రాథమిక కర్తవ్యం.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మాస్కులు కరోనా వైరస్ ను అడ్డుకుంటాయా?

పత్రికలు, టీవీలు, ఫేస్ బుక్ లు, వాట్సాప్ లలో విపరీతంగా చర్చ జరుగుతున్న అంశం ‘ కరోనా‘. ప్రస్తుతం ప్రతి నోట వినిపిస్తున్న మాట కూడా ‘కరోనా‘. కరోనా  దెబ్బకి ప్రపంచమంతా అట్టుడికి పోతోంది.  ఈ వ్యాది నివారణకు ప్రభుత్వాలు పాఠశాలలకు,సినిమాహాళ్ళకు మూతలు వేస్తుంటే ప్రజలు తమ మూతికి మాస్కులు  వేసుకుంటున్నారు. మూతికి మా స్కూలు కట్టుకోవడం ప్రారంభంకాగానే వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  మూడు రూపాయలకు అమ్మే మాస్కు 60 రూపాయలకు కూడా దొరకడం లేదంటే మాస్కుల డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ మాస్కులు కరోనా వ్యాదిని నివారించ గలవా?.మాస్కులను కట్టుకోవడం అవసరమా? మాస్కు ల వల్ల ప్రయోజనం ఉందా? లేదా?.ఎవరు వాడాలి?ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? అనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా మన ముందుకు వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ మరియు భారతీయ వైద్య పరిశోధనా మండలి జారీ చేసిన సూచనల ప్రకారం కరోనా నివారణ కొరకు దేశంలోని ప్రజలందరూ మూతికి మాస్కులు కట్టుకోనవసరం లేదు. వాటిని కట్టుకోవడం ద్వారా ఈ వ్యాది నుండి రక్షించుకోవచ్చు అనే అభిప్రాయంతో లక్షలాది మంది మూతికి మాస్కులు కట్టుకుంటూ అనేక రకాల వైరస్ లను కూడా తెచ్చు కుంటారు. అది ఎలా అని అనుకుంటున్నారా? ఒకసారి   మాస్క్ కట్టుకున్న తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో ఆ మాస్క్ ను తాకరాదు.  మాట్లాడేటప్పుడు చేతితో  మాస్కును కిందికి పైకి లాగడం చేస్తుంటారు.దీని వలన  చేతికి అంటుకుని వున్న రకరకాల క్రిములను, వైరస్ లను మాస్కులకు అంటించుకుంటారు. ఇలా మాస్కులకు  అంటుకున్న వైరస్ నోరు, ముక్కుల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు. ఒక్కసారి కట్టుకున్న మాస్క్ ఆరు గంటలు మాత్రమే పని చేస్తుంది. ఆ తర్వాత దాన్ని  తీసివేసి వేరే మాస్కును వాడుకోవాలి కానీ సాధారణ ప్రజలు ఓకే మాస్కును రోజుల తరబడి వాడుతున్నారు . ప్రమాదాలను పెంచుకుంటున్నారు.ఇలా ప్రతి 6 గంటలకు ఒక మాస్క్ ను మార్చుకోవడం సాధారణ ప్రజానీకానికి వారి వృత్తి  మరియు ఆర్థిక పరిస్థితి  రీత్యా సాధ్యం కాదు.వ్యయ ప్రయాసలకు ఓర్చి కట్టుకున్నా రక్షణ ఉండదు.వీటికంటే తరచుగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. కరోనా రోగికి వైద్యం చేసే డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, కరోనా వ్యాదిగ్రస్తుల శుభ్రతకు ఉపయోగపడే శానిటరీ సిబ్బందికి, దగ్గరుండి చూసుకునే సహాయకులకు కరోనా వ్యాది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారిని హైరిస్క్ గ్రూపు అంటారు. వీరు మాత్రం ఈ మాస్కులను  తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే పేషెంట్ నుండి ఆ వైరస్ వీరికి సోకకుండా ఉండడానికి. *పేషెంట్ కు సహాయకులుగా ఉండేవారు, పేషెంట్ ని పరామర్శించుటకు వచ్చే వారు కూడా మాస్క్ కట్టుకోవాలి.కరోనాతో బాధపడుతున్న రోగి తప్పకుండా మాస్క్ వాడాలి. రోగి మాస్కు కట్టుకోవడం వల్ల రోగికి ఉపయోగం ఏమీ లేదు కానీ అది సమాజానికి ఉపయోగపడుతుంది.తన నోరు మరియు ముక్కు నుంచి వెలువడే వైరస్ ను ఇతరులకు వ్యాపించకుండా ఈ మాస్క్ పనిచేస్తుంది. సర్జికల్ మాస్కులని, రెండు లేయర్ల మాస్కులని, మూడు లేయర్ల మాస్కులని, N95 మాస్కులని అనేక రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. N95 మాస్క్ ఎక్కువ ఉపయోగం. కానీ వాటి ఖరీదు ఎక్కువ. మాస్కులను వాడిన తరువాత తీసివేసే  ఉత్తమ పద్ధతులను కొన్నింటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అవి ఏమంటే:- మాస్కును కట్టుకునే ముందు చేతులను సబ్బుతో గాని ఆల్కహాల్ తో కూడిన స్టెరిలైజర్ తో గాని 40 సెకండ్లపాటు శుభ్రం చేసుకోవాలి. మాస్కును కట్టుకున్న తర్వాత దానిని ఎట్టి పరిస్థితులలోనూ చేతులతో పైకి కిందకి లాగడం, మాస్కును సర్దుకోవడం లాంటివి చేయకూడదు. మాస్కును ఎట్టి పరిస్థితిలో కూడా చేతితో తాకరాదు.ఏదయినాఅవసరమై మాస్కులను తాక వలసి వస్తే చేతులను తప్పనిసరిగా సబ్బుతో శుభ్రం చేసుకున్న తర్వాతే తాకాలి.చేతులు శుభ్రం చేసుకోకుండా తాకితే ఆ మాస్కును తీసివేయాలి. అలా జరగకపోతే చేతికున్న క్రిములు మాస్కుకు అనవసరంగా  పాకవచ్చు. దీని వల్ల వ్యాది సోకవచ్చు. .మాస్కులు తీసేటప్పుడు దానిని వెనక నుండి తీసివేయాలి. మాస్కులు తీసివేసిన  తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. వాడి తీసివేసిన మాస్కును ఎక్కడంటే అక్కడ  వేయరాదు.దానిని ప్రత్యేకమైన వేస్ట్ బుట్టలో వేయాలి. తగలబెట్టడం కానీ భూమిలో  పూడ్చిబెట్టడం కానీ చేయాలి. అలా చేయకపోతే ఈ మాస్కుల  కారణంగా కరోనా వ్యాది మరికొందరికి వచ్చే అవకాశం ఉంది. కరోనా నివారణకు ప్రజలందరూ మాస్కులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎదుటివారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు విడుదలయ్యే గాలి తుంపర్లు మన మొఖం మీద పడకుండా ఉండేందుకు మాస్కులు ఉపయోగపడుతాయి అనే భావనతో మాస్కును కట్టుకుంటారు.మాస్కుని సరైన పద్ధతిలో వాడకపోతే కరోన వైరస్ ని నిరోధించడం సాధ్యం కాక పోగా కరోనా వ్యాది వ్యాప్తి జరిగే అవకాశమే ఎక్కువ.  మాస్కులను సరైన పద్ధతిలో వాడలేకపోతే మాస్కు లను వాడకపోవడం మంచిది. గంటకోసారి చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం ద్వారా  కూడా కరోనా వ్యాప్తిని నిరోధించగలం. డాక్టర్ యం. వి. రమణయ్య ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు 9490300431

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

గూడూరు లో మరో షహీన్ బాగ్..

ఢిల్లీ షహీన్ బాగ్ ( పున్నమి ప్రతినిధి గూడూరు) రగిలించిన స్ఫూర్తి భారతదేశమంతటా విస్తరిస్తోంది. మతోన్మాదుల ఆశయాలను అడియాశలు చేస్తూ దేశమంతటా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ నిరసనలను దీక్షల రూపంలో తెలియజేస్తున్నారు. పాలకుల మనసులు మారాలని తద్వారా హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి సమైక్యతను కాపాడుకోవాలని దీనికి రాజ్యాంగ రక్షణే శిరోధార్యమని ప్రజలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా గూడూరు  పట్టణంలో గత 27 రోజులుగా స్థానిక పెద్ద మసీదునందు కులమతాలకతీతంగా ప్రజలు తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నేడు గూడూరు మహిళలు కూడా దీక్షలో పాల్గొనడం ఈ ఉద్యమానికి మరింత వూతం లభించినట్లయింది. గూడూరు పట్టణ చరిత్రలో అప్పుడెప్పుడో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలు తిరిగి అదే మసీదు నందు తమ దీక్షను ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కౌన్సిలర్ షంషేర్ మాట్లాడుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను తెచ్చింది కనుక ప్రజలందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈమె కోరారు. దేశంలోని ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఈమె వాపోయారు. NPR చట్టాలకు వ్యతిరేకంగా వైయస్ జగన్ గారు అసెంబ్లీలో తీర్మానం చేస్తామనడం మంచి పరిణామమని షంషేర్ చెప్పారు. స్వాతంత్రం కోసం ఎందరో ముస్లిములు ప్రాణత్యాగం చేశారు అలాంటి ముస్లింలను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని, అలాగే నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని బిజెపి నాయకులను హెచ్చరించారు. హాషిం..ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు హాషిం మాట్లాడుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ చట్టాలపై పూర్తి అవగాహన ఉందని కనుకనే మహిళలు ఈ నల్లచట్టాలకు  వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే గూడూరు పట్టణంలో మహిళలు సైతం దీక్షలో పాల్గొనడం కేంద్ర ప్రభుత్వాలకు చెంప పెట్టు లాంటిదని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని తల్లితో పేర్కొనే మోడీ, అమిత్షాలు భారతదేశంలోని తల్లులను వీధుల్లోకి లాగటం ఎంతవరకు సమంజమని పేర్కొన్నారు. ఇది బీజేపీ నాయకుల కుటిలత్వాన్ని సూచిస్తుందని ఈయన స్పష్టం చేశారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

విద్యతోనే అభివృద్ధి సాధ్యం

విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రతిఒక్కరు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని దీనికి తమ వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని మిత్ర ఫౌండేషన్ చైర్మన్ షేక్. షబ్బీర్ భరోసానిచ్చారు. గూడూరులోని విందూరు మిత్ర ఎస్టీ కాలనిలో 5వ తేది సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  పేదవారి బిడ్డల చదువు మధ్యలో ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని అయిన కొంతమంది ఏవో కారణాలతో డ్రాపౌట్స్ గా మిగిలిపోతున్నారని ఆవేదన చెందారు. అలాంటి వారికోసం తమ సంస్థ అన్నిరకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ సందర్బంగా అక్కడి పేద విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, పలకలు, ఛార్ట్స్, పరీక్షలకు అవసరమగు మెటీరియల్స్ తదితర సామాగ్రిని అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ మరియు పట్టుదలతో చదవాలని, అలాగే ఎవరైనా క్రీడాకారులు వుంటే వారిని గుర్తించి తగిన క్రీడా వస్తుసామాగ్రిని అందిస్తామని షబ్బీర్  పేర్కొన్నారు. ఆరోగ్య విషయంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని షబ్బీర్ ఉపదేశిస్తూ విద్యార్థులు మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని వారికి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం విందూరు మిత్ర ST కాలనీలో నివసిస్తున్న 30 కుటుంబాలకు మరియు చిన్న పిల్లలకు బ్రెడ్, పాలు, పాయసం, ఆపిల్ పండ్లుతో పాటు మరికొన్ని వస్తువులను  అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలని ప్రజలతోపాటు షేక్.అబ్దుల్లా, జాఫర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ

దేశంలో సహకార వ్యవస్థ పరిస్థితి బాగు

నెల్లూరు ఎంపీ ఆదాలకు కేంద్ర మంత్రి సమాధానం దేశంలోని రాష్ట్ర, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని ఆర్బీఐ ప్రశంసించి నట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్సభలో రాతపూర్వకంగా సోమవారం తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి దేశంలోని కేంద్ర సహకార బ్యాంకుల పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబు చెప్పారు. అలాగే ఈ బ్యాంకుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానం చెబుతూ సహకార వ్యవస్థను పటిష్టపరిచేందుకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు (నాబార్డు) పలు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.రుణ పంపిణీ, వసూళ్ల కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 33 రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్రాల్లో 363 సహకార బ్యాంకులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రుణ కేటాయింపు మొత్తం పెరుగుతోందని తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం బ్యాంకులు లాభాల్లో ఉన్నాయని స్పష్టం చేశారు.

Featured ఆంధ్రప్రదేశ్

జాతీయ ప్రతిభా పురస్కారాలు ఎవరికి ఇస్తున్నారు? లోక్సభలో ప్రశ్నించిన ఎంపీ ఆదాల

జాతీయ ప్రతిభా పురస్కారాలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఏ విధంగా ఉపకరిస్తున్నాయని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం లోక్సభలో ప్రశ్నించారు. ఈ ప్రతిభా పురస్కారాలు ఎంత మంది విద్యార్థులకు అందుతున్నాయని ,వాటికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించారు. దీనికి కేంద్ర మానవ వనరుల శాఖ మాత్యులు రమేష్ పాఖ్రి యల్ నిశాంక్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 2008 నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అంద జేస్తున్నామని తెలిపారు. చదువును కొనసాగించలేని వారికి ప్రోత్సాహకంగా ఈ పురస్కారం కింద లక్ష రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నామని తెలిపారు. తొమ్మిదవ తరగతిలో 12 వేల రూపాయలు మొదటిసారిగా అందజేస్తామని, ఇక అక్కడి నుంచి 12వ తరగతి వరకు ఈ పురస్కారం లభిస్తుందని పేర్కొన్నారు .ఎంపిక చేసిన విద్యార్థులు ముఖ్యంగా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు దీన్ని ప్రత్యేకిం చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్రపాలిత ప్రాంతాలను బట్టి ఈ ప్రతిభా పురస్కారాలు మొత్తం నిర్ణయమవుతుందని పేర్కొన్నారు ఈ పరీక్షను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. 18. 75 లక్షల రూపాయలను మంజూరు చేశామని, లక్షా 36 వేల 239 స్కాలర్షిప్పులు దేశవ్యాప్తంగా అందజేస్తున్నామని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ స్కాలర్షిప్పుల వల్ల ఎంతోమంది తమ చదువు కొనసాగించారనే సంఖ్య తమ వద్ద లేదని తెలిపారు. పర్యాటక కాలుష్యం వల్ల ఇబ్బంది లేదు దేశంలోని పర్యాటక ప్రాంతాల వల్ల పర్యాటకుల ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సోమవారం లోక్సభలో రాతపూర్వకంగా తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో పర్యాటక ప్రాంతాల్లో నీటి, వాయు కాలుష్యం గురించి ప్రశ్నించారు .పర్యాటక కేంద్రాల వల్ల పర్యాటకుల ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం ఉందని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి సమాధాన మిస్తూ, ఇంతవరకూ పర్యాటక ప్రాంతాల కాలుష్యం వల్ల పర్యాటకులు జబ్బున పడిన దాఖలాలు లేవని, అటువంటి విషయం తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. కేంద్ర కాలుష్య మండలి తమ శాఖల ద్వారా దేశంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పర్యాటకుల ద్వారా గత మూడేళ్లలో 85. 858 యుఎస్ మిలియన్ డాలర్లను విదేశీ మారక ద్రవ్యంగా ఆర్జించినట్లు తెలిపారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

మతసామరస్యానికి చిహ్నం శ్రీ కృష్ణదాసుమఠం

(పున్నమి ప్రతినిధి గూడూరు): అవధూత కృష్ణదాసు స్వామి మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనమని ప్రముఖ పురావస్తు శాస్త్రజ్ఞులు ఏసుబాబు గారు చెప్పారు. శుక్రవారం నాటి సాయంత్రం గూడూరులోని రాణీపేట పరిసరాల్లో ఉన్న శ్రీకృష్ణదాసు మఠాన్ని దక్షిణ భారతదేశ పురావస్తు శాఖ, చెన్నై తెలుగు శాసన అధ్యయన విభాగానికి చెందిన అధిపతి ఎం.ఏసుబాబుగారు సందర్శించారు. మఠానికి చెందిన అరుణ్ కుమార్, సాయివరప్రసాద్ల అభ్యర్ధన మేరకు వారు తమ బృంద సభ్యులైన యుగంధర్, సత్యలతో  రావడం జరిగింది. వీరు మఠంలోని శాసనాన్ని కాపీ చేసి దాని విశిష్టతను వివరించడం జరిగింది. ఈ శాసనం కలియుగ సంవత్సరం 5005 నాటిదని, ద్వాదశ గురుపాద పారంపర్యానికి చెందిన అన్నవదూత స్వామి వారి శిష్యులు మరియు హుస్సేన్ గారి శిష్యులు అయిన శ్రీకృష్ణదాసు గారు మాఘమాస బహుళ నవమి జేష్టానక్షత్రమున, గూడూరులో వారి శిష్యులు అయ్యపనేని ఆదెమ్మ గారిచే సమాధి కైంకర్యమును పొందినట్లు ఈ తెలుగు శాసనంలో పేర్కొనబడిందని ఏసుబాబు గారు చెప్పారు. కృష్ణదాసు గారు ఒక మహమ్మదీయుని శిష్యునిగా ఉండటం ఆదర్శనీయమైన అంశమని తెలిపారు. నాటి గొప్ప ఆదర్శాలు నేడు అత్యంత ఆవశ్యకమని కృష్ణదాసులాంటి మహనీయుల చెప్పిన బాటలో అందరూ నడవడం సమాజానికి శ్రేయస్కరమని చెప్పారు. మఠంలో జరుగుతున్న భక్తి కార్యక్రమాల్లో కులమత రహితంగా ప్రజలు పాల్గొనడం ఆనందదాయకమని ఏసుబాబు సెలవిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, శశి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

వెంకటగిరి కలిమిలమ్మ ఏ కాలానిది 

(పున్నమి ప్రతినిధి గూడూరు) :  నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామానికి ఓ గ్రామ దేవత ఉంది. కాలక్రమంలో  పరిస్థితులను బట్టి అనేక కొత్త దేవతలు వెలిసి పాత కొత్త మేలుకలయిక వల్ల ఎవరు ముందు ఎవరు వెనుక నిర్ణయించడం కాస్త కష్టంగా మారింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ  వెంకటిగిరిలోని కలిమిలమ్మ గ్రామదేవతే అని చెప్పవచ్చు. ఈ కలిమిలమ్మను నేడు కలివేలమ్మగా కూడా భక్తులు కొలుస్తుంటారు. పూర్వం యతిరాజు తిమ్మరాజు అనే గొబ్బూరి వంశస్థుల వారి హయాంలో కలిమిలమ్మ ప్రాచుర్యంలో ఉండేది. అప్పుడు ఈ ప్రాంతాన్ని వెంకటగిరి అని కాకుండా కలిమిలి అనేపేరుతో పిలిచేవారు. వెలుగోటివారు 1628 లో  గొబ్బూరి వంశస్తులను ఓడించి కలిమిలిని (వెంకటగిరి) ఆక్రమించి ఆప్రాంతాన్ని వెంకటగిరిగా పేరుమార్చారు. ఈగొబ్బూరి కులదైవం ఐన కలిమిలమ్మ దేవాలయం నేడు కైవల్యగా పిలవబడుతున్న గుంటిమడుగు నదికి దగ్గర్లో ఉండేది. అలాగే వెలిగొండలలో ఉన్నదుర్గంపైన కూడా కలిమిలమ్మఅనే ఆలయం ఇంకొకటి కూడా ఉండేది. ఈదేవతల పేరుతోనే ఈప్రాంతానికి కలిమిలి అని పేరు వచ్చిఉండొచ్చు. వెలుగోటి రాజు అయిన వెంకతపతి నాయుడు హయాంలో ఈ ప్రాంతము వెంకటగిరిగా మారినట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్రామదేవత ఏ కాలానికి చెందినది ఎవరి ప్రాతినిధ్యం కింద ఉండిందో తెలుసుకోవడానికి కావలసిన ఆధారాలు 205 సంవత్సరాయలు క్రితం అగ్నికి ఆహుతి అయినట్లు మెకంజీ స్థానిక చరిత్రలో (కైఫీయతుల్లో) రికార్డు అయివుంది. మెకంజీ కైఫీయతులో ఈ కలిమిలమ్మకు సంభందించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తావించబడి ఉంది. వెంకటగిరి కోటకు ఎదురుగా ఉన్న కలిమిలమ్మ దేవాలయంలో మొదట్లో దారు ప్రతిమ ఉండేదట . ఈ ప్రతిమనే  భక్తులు కొలిచేవారు. 1815 వ సంవత్సరంలో దేవాలయ పూజారికి కలలో కన్పించిన కలిమిలమ్మ తాను వెంకటగిరిని వదిలి వెళుతున్నానని  చెప్పిందట. ఆ మరుసటి రోజే కలిమిలి ఆలయంలో నిప్పంటుకుని దేవతావిగ్రహం చాలా వరకు కాలిపోయింది. దీన్ని అరిష్టంగా భావించిన ప్రజలు, జమీందార్లు పూజాదికాలు నిర్వహించి  పాత ప్రతిమ స్థానంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మెకంజీ గుమస్తా నారాయణరావు రికార్డు చేయడం జరిగింది. ఇప్పుడున్న విగ్రహం బహుశా కొత్తది కావచ్చు. మరియు ఎలాంటి పురాతన సాక్ష్యాలు అక్కడ లేకపోవడంతో  కలిమిలమ్మను గురించిన సరియైన ఆధారాలు లేకుండా పోయాయి. దీంతో కలిమిలమ్మ ఏ కాలానికి చెందిందో చెప్పడానికి వీలు లేకుండా పోయింది. రాజుల జమానాలో వైభవోపేతంగా వెలిగిన కలిమిలమ్మ కాలక్రమేణా తన వెలుగులను కోల్పోయింది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయినట్లు  కాలక్రమంలో వెంకటగిరి పోలేరమ్మకు ప్రాధాన్యం పెరగడంతో కలిమిలమ్మ దేవత వైభవం మరుగున పడిపోయింది.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 23వ రోజుకు చేరిన దీక్షలు 

  (గూడూరు పున్నమి ప్రతినిధి) :  స్థానిక పెద్ద మశీదు ఎదుట నల్ల చట్టాలకు నిరసనగా చేపట్టిన దీక్షలు ఆదివారం 23వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం దీక్షలో 20 మంది ముస్లిం, హిందూ సోదరులుకూర్ఛున్నారు. ఈ సందర్భంగా దీక్షల్లో కూర్చున్న మై ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు  షేక్ రాహుల్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజలు నల్ల చట్టాలపై ఒక అవగాహనకు వచ్చారన్నారు. కేవలంముస్లింలు మాత్రమే కాకుండా ఈ చట్టాలతో దేశంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలందరూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.లౌకిక దేశంగా గొప్ప ప్రజాస్వామ్య వ్య్వవస్థ గా  పేరుకలిగిన భారతదేశం నేడు ఈ నల్ల చట్టాల వలన తలదించుకొనే పరిస్థితి వచిందని రాహుల్  ఆవేదన వెలిబుచ్చారు.అన్నదమ్ముల వలె కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్న ప్రజలలో అభద్రతా భావంఏర్పడిందని దీన్ని తొలగించాల్సిన అవసరం ఉందని దీనికి ప్రజలందరు ఒకేతాటిపై నడిచి ఈ నల్ల చట్టాలను రూపుమాపాలని కోరారు.     మైనారిటీ నాయకులు ముజాహిద్ మాట్లాడుతూ దేశంలోపుట్టి పెరిగిన వారు దేశ పౌరులుగా నిరూపించుకునే దౌర్భాగ్యం మరే దేశంలోనూ లేదన్నారు. కేవలం హిందూత్వను అమలు చేయాలనే ఏకైక లక్ష్యంతో నల్ల చట్టాలు తీసుకువచ్చారని బీజేపీప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ఆర్సీ సీఏఏ,  ఎన్పిఆర్ లను రద్దుచేసేంత వరకు  శాంతియుత నిరసన పోరాటాలను ఆపేది లేదన్నారు. ఈ దీక్షలో మన్సూర్, కలీం, హరీ, శ్రీకాంత్, సాధిక్, ఈశ్వర్, షాహిద్, ఫారూఖ్, జునేద్, యశ్వంత్, దావూద్, సాయి, ఇనాముల్, షఫీ మౌలానా, మాబాష, జవాద్ తో పాటు  భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

గోడ కట్టారు గేటు మరిచారు

గోడ కట్టారు గేటు మరిచారు అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైన పాఠశాల ఆవరణం పట్టించుకోని అధికారులు గూడూరు పున్నమి ప్రతినిధి. గూడూరు పట్టణంలోని 7 వార్డు మునిసిపల్ ప్రాధమిక పాఠశాలకు సంబంధించి కొన్ని దశాబ్దాల  తర్వాత ఇటీవల గోడను కట్టడం జరిగింది. తర్వాత .ఏమైందో తెలియదు కాని గోడకు సంబంధించి సిమెంటు పూతను వేయలేదు సరికదా గేటును కూడా  పెట్టకుండా వదిలివేశారు. దీంతో అక్కడ రోజూ మందుబాబులు రాత్రుళ్ళు జల్సా చేయడం కొంతమంది దీన్ని బహిర్భూమిగా వాడుకోవటం పరిపాటి అయింది. చీకటి  కార్యకలాపాలకు నిలయంగా మారడంతో పాఠశాల ఆవరణాన్ని ప్రతిరోజూ విద్యార్థులు, టీచర్లు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మునిసిపల్ ఆఫీసుకు కూతవేటు దూరంలో, శివాలయంకు పక్కనే ఉన్న ఈ పాఠశాల వెంబడి కొన్ని వందలమంది రాకపోకలు చేస్తుంటారు.ఎవరూ పట్టించుకొనే పాపాన పోరు. ఇక అధికారులు సైతం ఈ దారినే వెళుతూ కూడా పట్టించుకోకపోవడం దారుణమని  స్థానికులు వాపోయారు. ఇకనైనా మునిసిపాలిటీ కమీషనర్ గారు కలుగ చేసుకొని సదరు పాఠశాలకు గేటును మంజూరు చేయవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.