Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీసిటీ టీఐఎల్ హెల్త్‌కేర్‌లో బాయిలర్ పేలి పెను విషాదం ఐదుగురు కార్మికులు మృతి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీసిటీ టీఐఎల్ హెల్త్‌కేర్‌లో బాయిలర్ పేలి పెను విషాదం ఐదుగురు కార్మికులు మృతి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీసిటీ, అక్టోబర్ 3 శ్రీసిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో శనివారం ఉదయం జరిగిన బాయిలర్ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
  • ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు.
  • షిఫ్ట్ మార్పు సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

శ్రీసిటీ, అక్టోబర్ 3
శ్రీసిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో శనివారం ఉదయం జరిగిన బాయిలర్ పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. షిఫ్ట్ మార్పు సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. గాంధీ జయంతి సందర్భంగా ముందు రోజు సెలవు ఉండటంతో ఆ సమయంలో పరిశ్రమలో తక్కువ సంఖ్యలో సిబ్బంది విధుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌరబ్ రాయ్, సత్యవేడు మండలం చెరివికి చెందిన చిన్న మస్తాన్, తడకు చెందిన వాసు, మాదరపాక్కానికి చెందిన రమేష్, నాయుడుకుప్పానికి చెందిన మోహన్ మృతి చెందారు. వీరిలో నలుగురు ప్రమాద స్థలంలోనే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన వాసు చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర స్పందన బృందాలు, స్థానిక అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు సహాయక చర్యలు చేపట్టారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాద పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదంపై ప్రాథమికంగా కేసు నమోదు చేసి, వివిధ కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని వెల్లడించారు. అంత్యక్రియలు, వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.

కుటుంబాలకు అండగా ఉంటాం: టీఐఎల్ హెల్త్‌కేర్

టీఐఎల్ హెల్త్‌కేర్ డైరెక్టర్ అజయ్ కుమార్ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత 17 ఏళ్లుగా శ్రీసిటీలో సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని, భద్రతా ప్రమాణాలు, నిబంధనలకు సంస్థ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో నిర్ధారించేందుకు ప్రభుత్వం, సంబంధిత విభాగాలు చేపట్టే దర్యాప్తుకు సంస్థ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని విధాలా సహాయం అందించడం తమ తక్షణ ప్రాధాన్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ అత్యున్నత భద్రతా ప్రమాణాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

శ్రీసిటీ సమాజానికి తీరని విషాదం

శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటన శ్రీసిటీ సమాజం మొత్తానికి ఎంతో బాధాకరమని అన్నారు. శ్రీసిటీ 18 ఏళ్ల ప్రస్థానంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి అని తెలిపారు.

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన బాయిలర్ ప్రమాదం నేపథ్యంలో శ్రీసిటీలోని పరిశ్రమల్లో సమగ్ర భద్రతా ఆడిట్లు నిర్వహించడంతో పాటు భద్రతా ప్రమాణాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు. అయినప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందేలా కంపెనీ, అధికారులతో కలిసి శ్రీసిటీ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *